కూల్ కూల్‌గా ప్రయాణం.. ఆర్టీసీలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
టీఎస్ఆర్టీసీ హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ అంతటా ప్రజలకు క్లీనర్, మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు పనులు మొదలు పెట్టింది. వచ్చే నెల నుండి హైటెక్ ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ బస్సులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు జరుగుతున్నాయి. సోమవారం బస్‌భవన్‌లో టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ బస్‌భవన్‌లో ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల తొలి నమూనాలను పరిశీలించి, ప్రయాణికులకు అందించే సౌకర్యాలపై అధికారులతో సవివరంగా చర్చించారు. విజయవాడ రూట్‌లో తొలిసారిగా మొత్తం 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కార్పొరేషన్ ఇప్పటికే ప్రకటించింది. హైదరాబాద్, జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులు పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులను ఆదరిస్తారని ఆర్టీసీ ఎండీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్ర్టిక్ బస్సులను అందిస్తున్న ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ప్రతినిధులకు ఆర్టీసీ ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. 12 మీటర్ల పొడవైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు 41 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటాయి మరియు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించవచ్చు. ప్రయాణీకుల భద్రత కోసం, ప్రతి సీటు వద్ద వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌తో పాటు పానిక్ బటన్‌ను అందించారు. అన్ని ఎలక్ట్రిక్ బస్సులు, కనీసం మూడు CCTV కెమెరాలతో ఒక నెల బ్యాకప్ డేటాను కలిగి ఉంటాయి, ఇవి TSRTC కంట్రోల్ రూమ్‌కు కనెక్ట్ చేయబడతాయి.
అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ.. సీబీఐ ముందుకు వెళ్తారా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కే సులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది.. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సోమవారం రోజు విచారణ జరగగా.. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది కోర్టు.. మధ్యాహ్నం లోపు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.. ఇక, సోమవారం రోజు అవినాష్‌రెడ్డిని విచారణకు పిలవొద్దని స్పష్టం చేసిన హైకోర్టు.. మంగళవారం నాడు సాయంత్రం 4 గంటలకు విచారించాలని సీబీఐని ఆదేశించింది. అలాగే సునీత ఇంప్లీడ్ పిటిషన్ ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం ఉదయం పిటిషన్ పై విచారణ చేపడుతామని వెల్లడించింది. కాగా, సీబీఐ నోటీసుల మేరకు సోమవారం విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి అవినాష్‌రెడ్డి హాజరయ్యే క్రమంలో విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు.. దీంతో, ఈ మేరకు అవినాష్‌రెడ్డికి సీబీఐ మరో నోటీసు ఇచ్చింది. మరి, అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ఎలా సాగనున్నాయి.. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది.. ఈరోజు సీబీఐ అవినాష్‌రెడ్డిని ప్రశ్నిస్తుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం ఆకస్మిక మృతి.. నడుస్తూనే కుప్పకూలి..!
విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం టీవీవీ ప్రసాద్ ఆకస్మికంగా మృతిచెందారు.. ప్లాంటు ప్రొడక్షన్ మానటరింగ్ విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం)గా పనిచేస్తున్న వెంకట వరప్రసాద్.. నిన్న జనరల్ షిఫ్ట్‌లో విధులకు హాజరయ్యారు.. అయితే, ఈడీ (వర్క్స్) ఆఫీస్ మూడో ఫ్లోర్‌లో లిఫ్ట్ దిగి తన రూమ్‌కు నడుస్తూ వెళ్తున్న ఆయన.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.. ఇది గమనించిన ఉద్యోగులు వెంటనే ఆయన్ను ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత ఉక్కు జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ, అప్పటికే ఆయన మృతిచెందినట్టు ధృవీకరించారు స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ వైద్యులు.. తీవ్రమైన గుండెపోటు కారణంగానే ఆయన మరణించినట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో, ప్రసాద్ కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు..
ప్రఖ్యాత చిత్రకారులు బాలి కన్నుమూత
తెలుగు పత్రికా రంగాన్ని కొన్ని దశాబ్దాల పాటు తన బొమ్మలతో ఊపేసిన ప్రముఖ చిత్రకారులు బాలి సోమవారం అర్థరాత్రి అనారోగ్యంతో విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు మేడిశెట్టి శంకరరావు. 1942 సెప్టెంబర్ 29న అనకాపల్లిలో అన్నపూర్ణ, లక్ష్మణరావు దంపతులకు జన్మించిన బాలి విద్యాబ్యాసం అంతా అక్కడే జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో చేరారు. కానీ చిత్రలేఖనం పట్ల ఉన్న మక్కువతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1974లో ఈనాడు దిన పత్రిక విశాఖపట్నం ఎడిషన్ లో పొలిటికల్ కార్టూనిస్టుగా చేరారు. 1976లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో సాఫ్ట్ కార్టూనిస్టుగా చేరినప్పటి నుండి బాలి చిత్రలేఖన విశ్వరూపం మొదలైంది. ఆ పత్రిక సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ… మేడిశెట్టి శంకరరావు పేరును ‘బాలి’గా మార్చారు. ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న సమయంలోనే వేలాది కథలకు బొమ్మలు గీశారు. నవలలకు ముఖచిత్రాలను వేశారు. బాపు బాటలో సాగుతూ, వందల గ్రీటింగ్ కార్టూన్స్ ను రూపొందించారు. బాపు తర్వాత ఆ స్థాయిలో విరివిగా తెలుగు పత్రికలకు దశాబ్దాల పాటు బొమ్మలు గీసింది బాలి నే! 1984లో ఆంధ్ర జ్యోతి సంస్థ నుండి బయటకు వచ్చిన బాలి… ఫ్రీలాన్సర్ గా కెరీర్ కొనసాగించారు. కొంతకాలం హైదరాబాద్ లోని కలర్ చిప్స్ లో యానిమేటర్ గా సేవలు అందించారు.
స్వలింగ వివాహాలపై నేడు సుప్రీంకోర్టు విచారణ..
స్వలింగ వివాహాలలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ వచ్చిన పిటిషన్లను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించనుంది. ఇలాంటి వివాహాలను కేంద్ర వ్యతిరేకించి తర్వాతి రోజే ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారించనుంది. ఇప్పటికే దీనిపై కేంద్రం తన స్పష్టమైన వాదనని తెలియజేసింది. చట్టపరమైన అనుమతిని పార్లమెంట్ కు వదిలేయాలని, ఇది కోర్టుల పరిధిలోని అంశం కాదని వెల్లడించింది. ఇది కుటుంబ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని తెలిపింది. హిందూ, ముస్లిం వివాహాల్లో, వివాహం అంటే కేవలం పురుషుడు మరియు స్త్రీల మధ్య జరిగేదిగా కేంద్ర పేర్కొంది. స్వలింగ వివాహాలు అనేవి కేవలం పట్టణాల్లోని ఉన్నత వర్గాల అభిప్రాయం అని, ఇది విస్తృత ప్రజలు అభిప్రాయం కాదని పేర్కొంది. గ్రామీణ, పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలు అభిప్రాయాలు, మతాలు, విశ్వాసాలను పరిగణలోకి తీసుకుని ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఓ అంశానికి చట్టబద్ధత కల్పించడం ప్రజాప్రతినిధులతో కూడిన పార్లమెంట్ విధిగా తెలిపింది. ఇలాంటి చర్యలు ప్రజలు ప్రయోజనాలకు భంగం కలిగిస్తాయని పేర్కొంది. ఈ విషయంతో కోర్టు జోక్యం తగదని సుతిమెత్తగా చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కె కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పిఎస్ నరసింహలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్వలింగ వివాహాల చట్టబద్ధత కేసును విచారించనుంది.
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ధరలు ఇలా..
బంగారం ధరలు క్రమంగా పెరిగి రూ.61 వేల మార్క్‌ను కూడా దాటేశాయి.. అయితే, రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి.. అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయ డిమాండ్ నేపథ్యంలో బంగారం రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.50 మేర దిగివచ్చింది.. ఇక, పసిడి దారిలోనే వెండి కూడా తగ్గింది.. కిలో వెండి ధర రూ.200 వరకు కిందికి దిగింది.. దేశంలోని పలు సిటీలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,090గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,180గా ఉంది.. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,940గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,030గా కొనసాగుతోంది.. ఇక, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,640గా ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,990గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,080గా కొనసాగుతోంది.. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,940గా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.61,030గా ట్రేడ్ అవుతోంది.. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,940గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,030గా కొనసాగుతోంది.
రోజుకు రూ.150కడితే రూ.7లక్షలు మీవే
పోస్టాఫీసు, ఎల్‌ఐసిపై సామాన్యులకు నమ్మకం ఎక్కువ. అందుకే మంచి రాబడి రావాలని పోస్టాఫీసు పథకాలు, జీవిత బీమా కార్పొరేషన్లు మొదలైన వాటిలో డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారు. LIC దేశంలోని ప్రతి ప్రాంతంలోని సాధారణ ప్రజల కోసం అనేక రకాల పథకాలను తీసుకువస్తూనే ఉంది. అందులో కొన్ని పథకాలు పిల్లల కోసం మాత్రమే రూపొందించినవి. భవిష్యత్ లో పిల్లల చదువుకోసం ఆర్థిక భారాన్ని తప్పించుటలో సహకారం అందించే అద్భుతమైన పాలసీ గురించి తెలుసుకుందాం. ఈ పథకాన్ని LIC జీవన్ తరుణ్ పాలసీ అంటారు. కాబట్టి ఈ LIC పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. దేశంలో లక్షలాది మంది ప్రజలు పోస్టాఫీసు, LIC పథకాల పెట్టుబడిపై ఆధారపడుతున్నారు. LIC దేశవ్యాప్తంగా లక్షల మంది కస్టమర్లతో దేశంలోనే అతిపెద్ద, పురాతన బీమా కంపెనీ. LIC జీవన్ తరుణ్ ప్లాన్ నాన్-లింక్డ్ లిమిటెడ్ ప్రీమియం చెల్లింపు ప్లాన్. ఈ LIC మనీ-బ్యాక్ ప్లాన్ పిల్లలకు రక్షణ, పొదుపు రెండింటి ప్రయోజనాన్ని అందిస్తుంది. ఎల్‌ఐసి జీవన్ తరుణ్ ప్లాన్ పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. వారు పెరుగుతున్న సందర్భంలో వారికి ఆర్థిక, విద్యా అవసరాలను తీర్చుతుంది.
ఎన్నాళ్ళో…మరి ఈ బంధం!?
కన్నెపిల్లలపైనే మొన్నటి దాకా మోజు పడిన లియోనార్డో డికాప్రియో ఇప్పుడు ముదురు భామతో సరసాలు సాగిస్తున్నాడట! అదే ప్రస్తుతం హాలీవుడ్ జనాల్లో చర్చనీయాంశమయింది. టీనేజ్ గర్ల్స్ తోనే రొమాన్స్ చేయడానికి ఆసక్తి చూపించే లియోనార్డో ఉన్నట్టుండి సూపర్ మోడల్ ఇరినా షేక్ తో దొరికిపోయాడు. లియోనార్డో, ఇరినా ఇద్దరూ ఇటీవల నియాన్ కార్నివాల్ ఆఫ్టర్ పార్టీలో మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరా కళ్ళకు చిక్కారు. వారిద్దరి తీరు చూస్తోంటే, డేటింగ్ చేస్తున్నట్టే ఉందని ఫోటోలు చూసిన వారు చెబుతున్నారు. విశేషమేంటంటే లియోనార్డో, ఇరినా ఇద్దరూ ఇద్దరే! అయ్యగారు ఇప్పటికే ఎంతోమంది భామలతో రొమాన్స్ సాగించాడు. ఇక ఇరినా ఏమైనా తక్కువ తిందా? ఆమె సైతం ఇప్పటికి ఇద్దరు సెలబ్రిటీ లవర్స్ ను మార్చేసింది. లియోనార్డో గురించి చెప్పక్కర్లేదు. అతగాడి విపరీత శృంగార చేష్టలు హాలీవుడ్ లో అందరికీ తెలుసు. ఇక ఇరినా షేక్ అంటారా? మనసుకు నచ్చినవారితో ఎంచక్కా అనుబంధం కొనసాగిస్తూ ఉంటుంది. మొదట్లో ప్రపంచ ప్రఖ్యాత సాకర్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోతో ప్రేమయాత్రలు చేసింది. వీరిద్దరూ కలసి 2010 నుండి 2015 దాకా చెట్టాపట్టాలేసుకు తిరిగారు. ఆ తరువాత హాలీవుడ్ నటుడు బ్రాడ్లే కూపర్ తో 2015 నుండి 2019 దాకా రిలేషన్ షిప్ మెయింటైన్ చేసింది ఇరినా. ఈ నాలుగేళ్ళ కాలంలో ఎవరితోనూ ఇరినా ఇట్టే కలసి పోయింది లేదు. కానీ, ఇప్పుడు మాత్రం లియోనార్డోతో కలసి కనిపించి, కనువిందు చేసింది. మరి లియోనార్డో, ఇరినా ఇద్దరి వ్యవహారం ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలి అంటున్నారు హాలీవుడ్ జనం.