ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో మరో సారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, తూర్పూగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయవ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. తెలంగాణలోనూ వచ్చే నాలుగు రోజులు విస్తారంగా వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం తేలికపాటినుంచి మోస్తరు వర్షం చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. సోమవారం కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే చాన్సుందని ఐఎండీ తెలిపింది. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం వరకు వానలు తెరిపివ్వకపోవచ్చని హెచ్చరించింది.
మున్నేరుకు మరో వరద ముప్పు..! 16 అడుగులకు నీటిమట్టం..
రాష్ట్రంలో వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మున్నేరు నదికి మరో వరద ముప్పు పొంచి ఉంది. మున్నేరు నది పొంగి పొర్లే అవకాశం ఉండడంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హడావుడిగా ఖమ్మం బయలుదేరి వెళ్లారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఖమ్మం నగర కార్పోరేషన్ లోని దంసలాపురం న్యూ కాలనీలో మున్నేరు వరద ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్వయంగా తరలించారు. నిన్న కురిసిన భారీ వర్షాల వల్ల ఒకసారిగా మళ్ళీ మున్నేరుకు వరద పెరిగింది. గత వారం 30, 31 తేదీల్లో 36 అడుగులకు పైగా వరద వచ్చి చేరిన విషయం తెలిసింది. దీనివల్ల ఖమ్మం నగరంలోని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఉన్న కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 18 వార్డుల్లో ముంపు గురయ్యాయి .వారు ఇంకా బురద నుంచి కోలుకోక ముందే మళ్ళీ మున్నేరుకి వరద వచ్చింది గత రాత్రి మహబూబాబాద్ జిల్లా ఖమ్మం ప్రాంతాల్లో కురిసిన వరదంతా కూడా మున్నేరు వైపు వచ్చింది. దీంతో మున్నేరు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వచ్చింది 16 అడుగుల దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
నేడు ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటన..
నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్ దంసాలపురంలో పర్యటిస్తారు. అనంతరం పాలేరు నియోజకవర్గం తిరుమాలాయ పాలెం, రాకాసి తాండాలో పర్యటించనున్నారు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడతారు నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తారు. ముంపు ప్రాంతాల్లో నిర్వహణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున చేపట్టిన పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. నిన్న సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి ఖమ్మంకి పార్టీ తరపున నిత్యావసర వస్తువులు, ఇతర సామాగ్రిని పరిశీలించారు కిషన్ రెడ్డి. ఇవాళ ఖమ్మం పాలేరు నియోజకవర్గం వరద ముంపు బాధితులకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ తోపాటు ఈటెల రాజేందర్ , కొండా విశ్వేశ్వర్ రెడ్డి ల పర్యటించి వరద బాధితులకు నిత్యవసరం సరుకులను పంపిణీ చేయనున్నారు.
లగ్జరీ బంగ్లా, రెండు ఫ్లాట్లు, కొత్త కారు… మాజీ ఆర్జీ కర్ ప్రిన్సిపాల్ ఆస్తులు మామూలుగా లేవు
కోల్‌కతా రేప్ కేసులో ఆరోపణలతో చుట్టుముట్టిన ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ గురించి ప్రతిరోజూ కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మాజీ ప్రిన్సిపాల్‌కు చెందిన పలు ప్రాంతాల్లో సోదాలు చేసింది. అందులో సందీప్ ఘోష్‌కి చెందిన సౌత్ 24 పరగణాస్ జిల్లా కేనింగ్‌లో విలాసవంతమైన బంగ్లా బయటపడింది. రెండు ఫ్లాట్ల సమాచారం లభించింది. ఇది కాకుండా, సందీప్ ఘోష్‌కు కోల్‌కతాలోని బెలేఘాటాలో నాలుగు అంతస్తుల ఇల్లు కూడా ఉంది. ఈ నివాసంలోని గ్యారేజీలో ఈడీ అధికారులు కొత్త ఎస్ యూవీని కూడా కనుగొన్నారు. కోల్‌కతా అత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపాల్ పాత్రపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అదే సమయంలో ఆర్‌జీకార్ కేసులో ఆర్థిక అవకతవకల కేసును సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారిస్తోంది. బెలేఘాటా ఐడి హాస్పిటల్‌కు ఆనుకుని ఉన్న భవనం కేర్‌టేకర్ ప్రకారం.. కొత్తగా గుర్తించిన రెండు ఫ్లాట్‌లు సందీప్ ఘోష్‌కు చెందినవి. సందీప్ ఘోష్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక ఫ్లాట్‌ను కార్యాలయంగా, మూడవ అంతస్తులో మరొక ఫ్లాట్‌ను ఉపయోగించుకున్నట్లు కేర్‌టేకర్ సూచించాడు. ఈ ఫ్లాట్లను సందీప్ ఘోష్ అప్పుడప్పుడు సందర్శిస్తుండేవాడని సమాచారం. పార్కింగ్ ఏరియాలో కొత్త ఎస్ యూవీని పార్క్ చేశారు. ఇది 3-4 నెలల క్రితం కొనుగోలు చేశారని తెలుస్తోంది. సందీప్ ఘోష్ కొన్నిసార్లు ఈ వాహనాన్ని ఉపయోగించడం కనిపించింది. అయితే ఈ ఫ్లాట్లపై ఎలాంటి గుర్తింపు నేమ్‌ప్లేట్లు లేవు. సందీప్ ఘోష్ తన గుర్తింపును దాచడానికి ఉద్దేశపూర్వకంగా ఈ ఫ్లాట్లలో తన పేరు నమోదు చేయకుండా తప్పించుకున్నాడని ఈడీ అధికారులు చెబుతున్నారు. కొత్తగా కనుగొనబడిన ఆస్తులు సందీప్ ఘోష్ ప్రధాన నివాసం, బాలాజీ నివాస్‌కు కూతవేటు దూరంలో ఉన్నాయి. సందీప్ ఘోష్ సామీప్యత, ఆస్తుల సంఖ్యను చూసి కేంద్ర ఏజెన్సీ ఆశ్చర్యపోయింది. అదనంగా, సందీప్ ఘోష్‌కి కానింగ్‌లో విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. ఇందులో పెద్ద తోట, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. సెప్టెంబర్ 2న, ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురిని సిబిఐ అరెస్టు చేసింది. గత నెలలో ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన తర్వాత ఈ విచారణ జరిగింది. పశ్చిమ బెంగాల్ అంతటా ఘోష్‌తో సంబంధం ఉన్న అనేక ప్రదేశాలపై ఈడీ శుక్రవారం దాడులు చేసి దర్యాప్తు ప్రారంభించింది. కోల్‌కతా, దాని శివారు ప్రాంతాల్లో తొమ్మిది చోట్ల దాడులు నిర్వహించారు. సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరుగుతోంది. ఆగస్టు 9న ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తర్వాత సీబీఐ, ఈడీ నేతృత్వంలో ఈ ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు ప్రారంభమైంది.
15సెకన్ల పాటు కంపనాలు.. 15నిమిషాల త్వరాత కూలిన మూడంతస్తుల భవనం..8మంది మృతి
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని షహీద్‌పాత్‌కు ఆనుకుని ఉన్న ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా కేకలు వినిపించాయి. ఇక్కడ, పాత మూడంతస్తుల భవనం, అందులో ఔషధాల గోదాము నిర్వహిస్తున్నారు. అందులో మూడు డజన్ల మందికి పైగా పని చేస్తున్నారు. అది ఉన్నట్లుండి అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ భవనం కూలిపోవడానికి ముందు, భూకంపం సంభవించినట్లు లోపల పనిచేస్తున్న వ్యక్తులు భావించారు. దాదాపు 15 సెకన్ల పాటు భవనంలో ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు ఏదైనా ఆలోచించి బయటకు రావడానికి ప్రయత్నించకముందే, పైకప్పు నుండి కొన్ని వింత శబ్దాలు రావడం ప్రారంభించాయి. సీలింగ్ పడిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మొత్తం భవనం కుప్పకూలింది. భవనంలో పనిచేస్తున్న వారంతా అందులోనే సమాధి అయ్యారు. భవనం బయట ఉన్న వ్యక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు, అగ్నిమాపక దళం, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ బృందాలు అర్థరాత్రి వరకు భవనంలో చిక్కుకున్న 28 మందిని రక్షించాయి. వీరంతా తీవ్రంగా గాయపడ్డారు. 8 మంది మృతదేహాలను కూడా బయటకు తీశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మరణించిన 8 మందిని మంజీత్ సింగ్ సాహ్ని, ధీరజ్, పంకజ్, అరుణ్, రామ్ కిషోర్, రాజేష్ కుమార్, రుద్ర యాదవ్ మరియు జగ్రూప్ సింగ్‌లుగా గుర్తించారు. 28 మంది క్షతగాత్రులను సురక్షిత ప్రాంతాలకు తరలించినా.. చాలా మంది గల్లంతైనట్లు సమాచారం. ఇప్పుడు శిథిలాల లోపల తప్పిపోయిన ఈ వ్యక్తుల కోసం పోలీసులు మరియు విపత్తు సహాయక బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇందుకోసం జేసీబీ సాయంతో శిథిలాలను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా మొదటి అంతస్తులో మందుల గోదాము ఉండేది. అదేవిధంగా రెండో అంతస్తులో కూడా ఏదో ఒక కంపెనీకి చెందిన గోదాము ఉంది.
ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ‘ఐఫోన్’.. చేసింది అతడే!
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ‘ఐఫోన్’లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిఒక్కరు తమ జేబులో ఐఫోన్ ఉండాలని కోరుకుంటారు. సోమవారం (సెప్టెంబర్ 9)న ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుంది. ప్రస్తుతానికి అయితే ‘ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్’ టాప్ ఎండ్ మోడల్. దీని స్క్రీన్ 6.7 అంగుళాలు. అయితే ఈ ఫోన్ కంటే బిగ్గెస్ట్ ఐఫోన్ ఉంది. బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ మైనీ బిగ్గెస్ట్ ఐఫోన్‌ను రూపొందించాడు. 6.74 అడుగుల పొడవైన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రతిరూపాన్ని అరుణ్ మైనీ రూపొందించాడు. ‘మాథ్యూ పెర్క్స్’ అనే గ్యాడ్జెట్ స్పెషలిస్ట్‌తో కలిసి ఈ భారీ ఐఫోన్ రూపాన్ని అతడు తయారు చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ప్రతిరూపంగా ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ‘మిస్టర్ హూజ్‌ద బాస్’ పేరిట టెక్నాలజీకి సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ యూట్యూబ్‌లో అరుణ్ పేరుపొందాడు. బిగ్గెస్ట్ ఐఫోన్‌ను స్టాండ్‌పై అమర్చి స్థానిక బ్రిటన్ వీధుల్లోకి అరుణ్ మైనీ తీసుకెళ్లగా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు దగ్గరకు వచ్చి చూశారు. బిగ్గెస్ట్ ఐఫోన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఐఫోన్‌లో సులభంగా స్క్రోల్ చేయగలగడం, టెక్స్ట్‌లు మరియు ఇమెయిల్‌లను పంపడం చేయొచ్చు. సాధారణ ఫోన్‌లో ఉండే అన్ని యాప్‌లను ఉపయోగించొచ్చు. గతంలో అమెరికాకు చెందిన మాథ్యూ బీమ్, జెడ్‌హెచ్‌సీ అనే యూట్యూబర్లు భారీ ఐఫోన్‌లను రూపొందించారు.
భారత్ ఖాతాలోకి అనూహ్యంగా గోల్డ్ మెడల్.. నవదీప్ అరుదైన ఘనత!
పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ ఖాతాలోకి అనూహ్యంగా గోల్డ్ మెడల్ చేరింది. శనివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 ఫైనల్లో ఇరాన్ అథ్లెట్ సదేగ్ బీత్ సయా స్వర్ణం గెలుచుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన భారత అథ్లెట్ నవదీప్ సింగ్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్ సదేగ్‌పై అనర్హత వేటు పడడంతో.. గోల్డ్ మెడల్ నవదీప్ సొంతమైంది. దీంతో జావెలిన్ త్రో ఎఫ్-41లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా నవదీప్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ చివరి రౌండ్ ఐదో ప్రయత్నంలో సదేగ్ బీత్ 47.64 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ప్రపంచ పారా అథ్లెటిక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ (కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ ఎథిక్స్) నియమం 8.1ని ఉల్లంఘించిన కారణంగా ఇరాన్ జావెలిన్ త్రోయర్ సదేగ్‌పై అనర్హత వేటు పడింది. పారిస్ పారాలింపిక్స్ కమిటీ సదేగ్ అనర్హతకు గల కారణాన్ని వెల్లడించలేదు. అయితే పోటీ సమయంలో ఎరుపు రంగులో అరబిక్ టెక్స్ట్‌తో కూడిన నల్ల జెండాను ప్రదర్శించిన కారణంగా అతడిపై వేటు పడిందని తెలుస్తోంది. అంతకుముందు మహిళల 200 మీటర్ల టీ12లో సిమ్రాన్ శర్మకు కాంస్యం దక్కింది. 24.75 సెకండ్లలో సిమ్రాన్ లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో భారత్ పతకాల సంఖ్య 29కి చేరుకుంది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. పారాలింపిక్స్‌లో ఇదే రికార్డు పతకాలు అన్న విషయం తెలిసిందే. టోక్యోలో అత్యధికంగా 19 పతకాలు భారత్ గెలుచుకుంది.
యూఎస్ ఓపెన్ ఛాంపియన్ అరీనా సబలెంక!
యూఎస్ ఓపెన్ 2024 మహిళల ఛాంపియన్‌గా బెలారస్ భామ అరీనా సబలెంక నిలిచింది. శనివారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై 7-5, 7-5 తేడాతో సబలెంకా గెలుపొందింది. దీంతో కెరీర్‌లో తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సబలెంక సొంతం చేసుకుంది. ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకకు ఇది మూడవ గ్రాండ్ స్లామ్. అరీనా సబలెంక 2023 యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్‌ను తృటిలో కోల్పోయింది. అమెరికా సంచలనం కోకో గాఫ్ చేతిలో ఓటమిపాలైంది. 2022లో సెమీ-ఫైనలిస్ట్ అయిన సబలెంక ఈసారి యూఎస్ ఓపెన్‌ను గెలిచింది. ‘గతంలో ఓటములన్నీ నాకు గుర్తున్నాయి. కలను ఎప్పటికీ వదులుకోవద్దు. ప్రయత్నిస్తూనే ఉండాలి. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. ప్రస్తుతం నాకు మాటలు రావడం లేదు. యుఎస్ ఓపెన్ టైటిల్‌ను అందుకోవడానికి నేను చాలా దగ్గరగా ఉన్నానని ఎన్నోసార్లు అనుకున్నాను. ఇది నా కల. చివరకు ట్రోఫీని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని సబలెంక తెలిపింది.