నా పేరుతో పద్మశ్రీ వచ్చినా.. ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవం!
వ్యక్తిగతంగా నా పేరుతో పద్మశ్రీ వచ్చినా.. ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన అభినందనలు అని తెలిపారు. 1994లో ఉద్యమం మొదలైందని, ఎమ్మార్పీఎస్‌ది ముప్పై ఏళ్ల పోరాటమన్నారు. సమాజంలో అన్ని వర్గాల అండదండలతోనే ఉద్యమం సాధ్యమయిందన్నారు. సుప్రీంకోర్టు సైతం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా మందకృష్ణ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
ఎన్డీఎస్ఏ నివేదిక కాదు.. అది ఎన్డీయే నివేదిక!
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఇచ్చిన నివేదికను ఎన్డీయే నివేదిక అనడంలో ఎలాంటి తప్పు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. నాణ్యత లేనిది కాళేశ్వరం, మేడిగడ్డలో కాదని.. కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న రాజకీయాల్లోనే అని విమర్శించారు. ఎన్ని కుట్రలు సృష్టించినా.. ఎప్పటికీ వాస్తవమే నిలుస్తుందన్నారు. అశాస్త్రీయ ఆరోపణలను ఎల్ అండ్ టీ ఖండించండం సంతోషమన్నారు. కాళేశ్వరం ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని, కేసీఆర్ గారు దూరదృష్టి గల నాయకుడు అని కేటీఆర్ చెప్ప్పుకొచ్చారు.
దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ సంచలన కామెంట్స్.. ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ అంటూ..
ఇవాళ రాజమండ్రిలో మీడియా ముందుకు జనసేన నుంచి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ అలియాస్ అనుశ్రీ ఫిలిమ్స్ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. థియేటర్ల బంద్ కు సూత్రధారి అత్తి సత్యనారాయణ అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన తన వివరణ ఇచ్చారు. దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. దురుద్దేశంతోనే దిల్ రాజు నా పేరు చెప్పారు.. పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరు ఎత్తారని అన్నారు.
లోకేష్‌కి కీలక పదవి..! మహానాడులో ప్రతిపాదన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌కి.. ఈ సారి పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగుతోంది.. ఇక, మహానాడులో ఈ రోజు కీలక పరిణామాలకు అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఎందుకంటే.. ఈ రోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణస్వీకారం అన్ని జరిగిపోనున్నాయి.. అయితే, మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ కు కీలక పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. లోకేష్‌కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని మినీ మహానాడులో తాము తీర్మానించామని.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పారు ధూళిపాళ్ల నరేంద్ర.. పార్టీ నేతలు, శ్రేణులు, అందరూ కోరుకుంటున్న విధంగా లోకేష్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు నరేంద్ర.. కాగా, ఇప్పటికే వరకు టీడీపీలో జాతీయ అధ్యక్షడు, ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో, ఏపీ, తెలంగాణకు పార్టీ అధ్యక్షులు ఇలా కీలక పదవులు ఉన్నాయి.. అయితే, నారా లోకేష్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌ను చేయాలన్న డిమాండ్ ఉండడం.. ప్రతిపాదనలు కూడా చేయడంతో.. ఇప్పుడు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది..
వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు..!
కడప వేదికగా టీడీపీ మహానాడు జరుగుతోన్న వేళ.. ఆ పసుపు పండుగపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్.. మహానాడు పెద్ద డ్రామాగా అభివర్ణించిన ఆయన.. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా..? అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారని పేర్కిన్నారు. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నాడు.. టీడీపీ తెలుగు డ్రామా పార్టీ అంటూ కొత్త నిర్వచనం చెప్పారు.. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు.. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది.. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది..? అని నిలదీశారు.
కులం వల్ల ఎవరికి సమాజంలో గుర్తింపు రాలేదు..
బంజారాహిల్స్ లోని బాబూ జగ్జీవన్ రామ్ భవన్ లో గురుకులాల విద్యార్థులకు బహుమతులను ప్రధానం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం అంటే గాలి నుంచి ఉడి పడలేదు అన్నారు. మీ మద్యలో ఉంట .. మీతోనే ఉంటానని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆశీర్వదించారు.. అట్లా అయిన నేను ముఖ్యమంత్రి.. ఇక, మొదటి 25 ఏళ్ల కష్టపడితే.. మరో 75 ఏళ్లు సంతోషంగా ఉండొచ్చు అన్నారు. అట్రాక్షన్ లో పడి లైఫ్ డివిఎట్ కాకండి అని సూచించారు. అలాగే, మీ తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి తేకండి.. నేను చదివింది అంతా ప్రభుత్వ స్కూల్ లోనే.. ప్రైవేట్ స్కూల్ లో ఎక్కువ మంది చదువుతున్నారు.. మనం విశ్లేషణ చేసుకోవాలి.. ఖాసిం మా ఊరు అతను.. ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపాల్ అయ్యాడు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం నోటీసులపై కేసీఆర్.. హరీష్‌రావు మధ్య మంతనాలు..
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మూడున్నర గంటలగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్ ఇచ్చిన నివేదిక, అందించిన నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 5న కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నట్లు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేసీఆర్, ముందు జాగ్రత్తగా కమిషన్ వద్ద ఉత్పన్నమయ్యే ప్రశ్నలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలపై హరీష్‌రావుతో తగినంత సమాలోచనలు జరిపినట్లు సమాచారం.
యోగాంధ్ర తీర్మానం ప్రవేశ పెట్టిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాంధ్ర తీర్మానం ప్రవేశ పెట్టారు. రెండు నిమిషాలు మౌనంగా మెడిటేషన్ చేసి తీర్మానాన్ని బలపరచమని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ యుగంలో ఉన్నాం.. వత్తిడితో ఉన్నాం.. గత ఐదేళ్లలో పార్టీ కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారు అని తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుని, సాధన చేయాలి అని సూచించారు. 11వ అంతర్జాతీయ యోగాను ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు.. జూన్ 27వ తేదీన విశాఖపట్నంలో జరిగే యోగా డే చారిత్రక ఘటన.. ప్రతి ఒక్కరూ యోగను తమ జీవితంలో భాగం చేసుకోవాలి అన్నారు. ఇక, వేద కాలం నుంచి యోగా శాస్త్రం ఉంది.. పతంజలి మహర్షి మనకు అద్భుతమైన యోగాను ఇచ్చారు అని సీఎం చంద్రబాబు తెలిపారు.
రైతు భరోసాపై కీలక ప్రకటన.. అకౌంట్లో డబ్బులు అప్పుడే.!
త్వరలోనే రైతులకు మంచి రోజులు రాబోతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం చిన్నదైనా, కొత్తదైనా ఆర్థికంగా ఎదురైన సమస్యలను అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. ఆర్థిక బాద్యతల మధ్యలోనే సీఎం రుణమాఫీ చేసినట్టు పేర్కొన్నారు. గత ఏడాది ఖరీఫ్ పంట కాలంలో రైతుల ఖాతాల్లో ఏకంగా రూ.33,000 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. దేశంలో అత్యధికంగా ధాన్యం సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. రైతులకు “రైతు భరోసా” నిధులు అనుకున్న సమయంలో అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, నల్గొండ జిల్లాలో పామాయిల్ పరిశ్రమ నిర్మాణం తుది దశకు చేరుకుందని, త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు.
రైతులకు గుడ్‌న్యూస్.. 51 కోట్లు విడుదల
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో పంటలకు భారీ నష్టం సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించిన సుమారు 5,528 ఎకరాల పంటలు వర్షాల కారణంగా నష్టపోయాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రూ.51.528 కోట్ల నిధులను మంజూరు చేసింది.