విజయవాడలో మెగా వికసిత్ జాబ్ మేళా
విజయవాడ నగరంలో మెగా వికసిత్ జాబ్ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, ఇతర టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో 60 ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు అందించాయి. జాబ్ మేళా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, మన రాష్ట్రం కొన్ని కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ, మన అదృష్టం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారన్నారు. ఆయనకు ఉన్న విజన్ 2020ను ఎవరూ నమ్మలేదు, కానీ.. అదే విజన్ ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్తుంది. హైదరాబాద్, అమరావతి నగరాలను నిర్మించిన ఘనత చంద్రబాబుదే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ జాబ్ మేళా ద్వారా యువతకు మాత్రమే కాకుండా, పదో తరగతి చదివిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. జనవరి 5న MSME అవగాహన సదస్సు నిర్వహించి, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అవగాహన కల్పిస్తామని, ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి జాబ్ మేళాలను నిర్వహించడానికి కృషి చేస్తాం అని ఆయన అన్నారు.
ముగిసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఆయన అంతిమ యాత్రకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. భారత దేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కు వయసు 92 ఏళ్లు. ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం తెల్లవారుజామున మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇతర నేతలు, బంధువులు ఆయనకు నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో సిక్కు సంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఫార్ములా ఈ రేసింగ్ కేసులో వివరాలను ఈడీకి అందజేసిన ఏసీబీ..
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో వివరాలను ఏసీబీ శనివారం ఈడీకి అందజేసింది. ఆర్థిక శాఖ రికార్డ్స్, HMDA చెల్లింపుల వివరాలు, HMDA చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు FIR ఈడీకి అందజేసింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయగా.. కౌంటర్‌లో ఏసీబీ కీలక అంశాలను ప్రస్తావన చేసింది. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగించడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డారని కౌంటర్‌లో ఏసీబీ పేర్కొంది. క్యాబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేశారని తెలిపింది. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారని తెలిపింది. దీనివలన హెచ్ఎండిఏ కు 8 కోట్లు అదనపు భారం పడిందని పేర్కొంది. అసంబద్ధమైన కారణాలు చూపి కేసును కొట్టివేయాలని అడగడం దర్యాప్తును అడ్డుకోవడమే అని ఏసీబీ తెలిపింది. కేటీఆర్ వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. అధికారుల నుండి అనుమతి పొందిన తర్వాతనే కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏసీబీ పేర్కొంది.
అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదు..
కడప జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవహర్ బాబును ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఆధిపత్యం అహంకారంతో అధికారులపై దాడులు చేస్తున్నారు.. ఇష్టారీతిన చేస్తామంటే చూస్తూ ఊరుకోం.. తాట తీస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదు.. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారు.. ఎంపీడీవో జవహర్ బాబును అమానుషంగా కొట్టారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
సీనియర్లు మాటలు వినే పరిస్థితి లేదు.. కుర్ర హీరోలకు కోటరీలు ఉంటున్నాయి
సినిమా వాళ్లకు సామాజిక బాధ్యత అవసరమని ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. చిత్రపరిశ్రమలో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై ఆయన మీడియాతో ముచ్చటించారు. ప్రభుత్వం చేపట్టే అవగాహన కార్యక్రమాల గురించి నటీనటులందరూ వీడియోలు చేయాలని సూచించారు. తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల తో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి తాను వెళ్లలేదని, అయితే ఆ సమావేశం బాగా జరిగిందన్నారు. మంచి సమావేశమని వెళ్లిన వాళ్లు చెప్పారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంతో సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న అపోహలు తొలగిపోయినట్లేనన్నారు. ప్రభుత్వం చేపట్టే సామాజిక చైతన్య కార్యక్రమాలపై నటీనటులు అంతా వీడియోలు చేయాలన్నారు.
మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు..
రాష్ట్రంలో సైబర్ క్రైమ్ 34 శాతం పెరిగింది.. గంజా కేసులు 3 శాతం పెరిగాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. 97,760 గత సంవత్సరం రిపోర్ట్ అయిన క్రైమ్స్.. ఈ సంవత్సరం 92,094 క్రైం రిపోర్ట్ అయ్యాయి.. ఓవరాల్ క్రైం రేటు 5.2 శాతం తగ్గిందన్నారు. ఇక, దొంగతనం, దోపిడీ కేసులు 0.2 శాతం పెరిగాయి.. మహిళల పట్ల జరిగిన క్రైంలు 10 శాతం తగ్గాయని ఆయన సూచించారు. మహిళల హత్యలు మాత్రమే 20 శతాం పెరిగాయన్నారు. ఎస్సీ, ఎస్టీల పట్ల నేరాలు కూడా 4.9 శాతం తగ్గాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
బీసీలతో కవితకు ఏం సంబంధం..? తెగ హడావిడి చేస్తున్నారు..
బీసీ రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత తెగ హడావిడి చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బీసీలతో అసలు కవితకు ఏం సంబంధం..? అని ప్రశ్నించారు. బీసీలపైన ముసలి కన్నీరు, కపట ప్రేమ కవిత చూపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడే శక్తి బీసీలకు ఉందన్నారు. బీసీల గురించి ఆమె పోరాడాల్సిన అవసరం ఏముంది..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకత్వంలో సమస్యలను పరిష్కరించుకుంటామని అన్నారు.
కొద్ది రోజులుగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..
డిసెంబర్ 10వ తేదీ నుంచి నా భార్య జయసుధ పేరు మీద మచిలీపట్నంలో ఉన్న గోడౌన్ ఆఫర్ లెటర్ ఇచ్చి అద్దెకు తీసుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అక్రమార్కుడిగా నేనేదో ఉద్దేశ్య పూర్వకంగా తప్పుడు పనులు చేసానని అత్యుత్సాహంతో ఆరోపణలు చేశారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు.. మా అత్తమామలు నిర్మాణం చేసి గోడౌన్ మాకు ఇచ్చారు.. 60 ఏళ్లు వచ్చాయి.. పనులు చేసుకోలేక పోతే అద్దెలు వస్తాయని నిర్మాణం చేశాం.. నేను, కానీ నా భార్య కానీ రోజు వెళ్లి చూసేదేమీ ఉండదు.. మా దగ్గర ఉన్న మేనేజర్ అక్కడ స్టాక్ లో తేడాలు ఉన్నాయని చెప్పారు.. స్టాకులో లోపం ఉందని తెలిశాక 26 నవంబరున జాయింట్ కలెక్టర్ కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం.. మా వల్ల తప్పు లేకపోయినా స్టాక్ తగ్గిందనికి నైతిక బాధ్యత వహించి లేఖ ఇచ్చాం.. అధికారులు ఫిజికల్ గా స్టాక్ వెరిఫై చేసి సివిల్ సప్లయిస్ ఎండీకి లెటర్ రాశారు.. ఈనెల 10వ తేదీన వారు క్రింది స్థాయి అధికారులకు డబ్బులు కట్టించుకుని క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశించారని పేర్నినాని చెప్పుకొచ్చారు.
30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..
ఈనెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి సభ సంతాపం తెలపనుంది. ఈ క్రమంలో సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శాసన సభ నివాళులు అర్పించనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.. భారత దేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు వయసు 92 ఏళ్లు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇతర నేతలు, బంధువులు ఆయనకు నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో సిక్కు సంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు..
సిద్ధిపేట నాసరపుర కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్‌లో మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చలికాలంలో విద్యార్థులు వేడినీళ్లు రాక, దుప్పటి రాక ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. గత నాలుగు నెలల నుండి మెస్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ పెట్టి రాష్ట్రంలో ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేదు అని అన్నారు కానీ.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని హరీష్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని హరీష్ రావు విమర్శించారు.