అప్పుడు యువగళం… ఇప్పుడు దండయాత్ర..!
అప్పుడు యువగళం… ఇప్పుడు దండయాత్ర.. అని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.. యువగళం 100 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించడం సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరువలేను అన్నారు.. యువగళాన్ని అడ్డుకునేందుకు ఆరోజున ఇదే బంగారుపాళ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులు ఎంత అరాచకం సృష్టించారో మీరంతా కళ్లారా చూశారు. నా పాదయాత్రను అడ్డుకునేందుకు జీవో 1 విడుదలచేసి, ఇదే బంగారుపాళ్యంలో నా ప్రచారరథాన్ని నాటి పోలీసులు అడ్డుకుని నా గొంతునొక్కాలని విఫలప్రయత్నం చేశారు. కానీ, వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి.. యువగళం దిగ్విజయం అయ్యిందన్నారు.. యువగళం అన్నది నా ఒక్కడి గొంతు కాదు… 5 కోట్ల మంది ప్రజల గొంతుక అని వారికి తర్వాత అర్థమైంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళాన్ని ఆపడం వారి తరం కాలేదని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొలిసారి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్..
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. బీజేపీ మోర్చ ఘాటు విమర్శలు..
దేశ రాజ్యాంగాన్ని అవమాన పరిచే విధంగా రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద మాట్లాడారని బీజేపీ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండీ దళిత గిరిజన బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ వర్గాలను ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తుందన్నారు. రాహుల్ గాంధీ రిజర్వేషన్ లు తొలగిస్తా మని అంటున్నారని తెలిపారు. గతంలో నెహ్రూ, రాజీవ్ గాంధీ లు కూడా రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. అంబేద్కర్ ను చట్ట సభల్లో అడుగుపెట్టనీయోద్దని చూసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. అంబేద్కర్ తో రాజ్యాంగం రాయించడం నెహ్రూ కి ఇష్టం లేదన్నారు. రాజీవ్ గాంధీ దృష్టిలో రిజర్వేషన్ లు పొందుతున్న వారు మూర్ఖులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇది అని తెలిపారు. రిజర్వేషన్ లు ఎత్తి వేస్తుందని బీజేపీ పై అసత్య ప్రచారం చేస్తుందన్నారు.
జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు!
ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాకు ఉప్పరపల్లిలోని ఫోక్సో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు అతడికి కోర్టు రిమాండ్ విధించింది. జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టు నుండి చర్లపల్లి జైలుకు తరలించారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (21)పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు అనంతరం గత 4-5 రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను గోవాలోని ఓ లాడ్జిలో గురువారం హైదరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈరోజు తెల్లవారుజామున జానీ మాస్టర్‌ను ఓ రహస్య ప్రదేశంలో విచారించారు. నగర శివారులోని ఓ ఫాంహౌజ్‌లో అతడిని విచారించినట్లు సమాచారం. విచారణలో భాగంగా పలు కీలక అంశాలపై పోలీసులు ఆరా తీశారు. అనంతరం హైదర్‌గూడలోని ఓ ఆస్పత్రిలో వైద్యపరీక్షల అనంతరం.. మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
సీబీఐ విచారణ జరిపించండి.. ఏపీ సీఎంకు బండి సంజయ్ లేఖ..
ఏపీ సీఎంకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన గురి చేసిందన్నారు. శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తోందన్నారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా గత పాలకులు పట్టించుకోలేదన్నారు. ఎర్రచందనం కొల్లగొడుతూ ఏడు కొండలవాడిని రెండు కొండలకే పరిమితం చేశారని చెప్పినా స్పందించలేదని తెలిపారు. ‘జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించారని మీరు (చంద్రబాబు) చేసిన వ్యాఖ్యలతో లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమేనని యావత్ హిందూ సమాజం భావిస్తోందన్నారు.
శ్రీవారి లడ్డూ వివాదంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష.. టీటీడీ ఈవోకు కీలక ఆదేశాలు..
టీటీడీ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశంలో దీనిపై హాట్ కామెంట్లు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ రోజు.. మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. సమగ్ర వివరాలతో ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు ముఖ్యమంత్రి.. శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించినవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు..
చవకబారు విమర్శలు మానుకోండి.. దామోదర రాజనర్సింహ ట్విట్
బీఆర్ఎస్ నేతలు ఇకనైనా ఇలాంటి చవకబారు విమర్శలు మానుకోవాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ స్కీమ్లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్, ఇప్పుడు నీతులు చెప్పేందుకు ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు. హాస్పిటళ్లకు బకాయిలు విడుదల చేయకుండా, ప్యాకేజీల రేట్లు రివైజ్ చేయకుండా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం అందకుండా చేశారన్నారు. ఈహెచ్ఎస్ కింద ట్రీట్మెంట్ కోసం పోయిన ఉద్యోగులు, పెన్షనర్లను కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు అవమానిస్తుంటే చోద్యం చూశారన్నారు. మా వేతనాల్లో నుంచి కంట్రిబ్యూషన్ ఇస్తాం, స్కీమ్ను సమర్థవంతంగా అమలు చేయండని ఉద్యోగులు, పెన్షనర్లు కోరినా పట్టించుకోలేదని తెలిపారు.
లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో స్పందన
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ టీటీడీ ఈవో శ్వామలరావు ఆ వివాదంపై స్పందించారు. తిరుమలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని, శ్రీవారి లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. జంతు కొవ్వు వాడుతున్నారని ఫిర్యాదులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నెయ్యి నాణ్యత బాగా లేదని చాలా మంది భక్తులు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. లడ్డూ క్వాలిటీ బాగుండాలంటే నెయ్యి నాణ్యత బాగుండాలన్నారు. లడ్డూ తయారీ నాణ్యమైన ఆవు నెయ్యి వాడాలన్నారు. నెయ్యి నూనెలా ఉందని, నాసిరకంగా ఉందని గుత్తేదారుకు చెప్పామన్నారు. నెయ్యిలో నాణ్యతా లోపాన్ని తాను కూడా గమనించానని టీటీడీ ఈవో వెల్లడించారు.
శ్రీవారి లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ రియాక్షన్
శ్రీవారి లడ్డూ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. లడ్డూ తయారీ చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఓ కట్టు కథ అని ఆయన పేర్కొన్నారు. ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని ప్రశ్నించారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది అంటూ తీవ్రంగా విమర్శించారు. ఒక సీఎం ఇలా అబద్ధాలు ఆడడం ధర్మమేనా?, భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అంటూ ప్రశ్నించారు. ప్రతి 6 నెలలకు ఓ సారి నెయ్యి సరఫరా కోసం టెండర్లను పిలుస్తారని జగన్ వివరించారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్ష విధానాలను ఎవరూ మార్చలేదన్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమల లడ్డూ తయారీ జరుగుతోందన్నారు.
ఇక నుండి ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కోసం క్యూఆర్ కోడ్ పేమెంట్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) ఇకపై బస్ టిక్కెట్‌లకు క్యూఆర్ కోడ్ చెల్లింపులను ఆమోదించనున్నట్లు ప్రకటించింది. ఈ చర్య ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచడం , చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. నివేదికల ప్రకారం, PhonePe, Google Pay , క్రెడిట్ , డెబిట్ కార్డ్‌లతో సహా వివిధ డిజిటల్ చెల్లింపు పద్ధతులను అనుమతించే వ్యవస్థను అమలు చేయాలని TSRTC మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశించారు. ప్రయాణీకులు వారి మొబైల్ పరికరాల నుండి నేరుగా చెల్లింపులు చేయడానికి QR కోడ్‌లను స్కాన్ చేయగలరు, ఇది త్వరిత , సమర్థవంతమైన టికెటింగ్ అనుభవాన్ని నిర్ధారిస్తుంది.
ఒకేసారి రూ.2000 పెన్షన్ పెంచింది టీడీపీ ప్రభుత్వమే..
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చాలా మంది ముఖ్యమంత్రులను చూశానని. 2019, 2024 మధ్య పనిచేసిన ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని చూడలేదు.. చూడబోనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే దారి వెంట చెట్లు మొత్తం కొట్టేసేవారని ఆయన విమర్శించారు. ఆయన పరదాలు కట్టుకుని పైన వస్తుంటే కింద చెట్లు కూడా కొట్టేవారని అన్నారు. రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఆగిపోయేదన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పరిపాలనలో ఎలా ఉందో మీరే చూడొచ్చని ప్రజలకు ముఖ్యమంత్రి సూచించారు.