నెల రోజుల్లో 80 శాతం పెరిగిన కరోనా కేసులు.. జాగ్రత్త సుమీ!
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ కేసులు గత ఏడాది కాలంగా ఎక్కువగా నమోదు కాలేదు. భారత్‌లో కూడా ప్రస్తుతం కరోనా కేసులు పెద్దగా లేవు. అయితే కనుమరుగైందనుకున్న కరోనా వైరస్ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కొత్త వేరియంట్ (కొవిడ్-19 ఈజీ.5.1)లోకి రూపాంతరం చెందిన మహమ్మారి.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా గత 28 రోజుల్లో దాదాపు 1.5 మిలియన్ కొత్త కేసులు నమోదయ్యాయి.
2023 జూలై 10 నుంచి ఆగస్టు 6 వరకు దాదాపు 1.5 మిలియన్ కొత్త వైరస్ కేసులు నమోదయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఓ ప్రకటనలో తెలిపింది. అలానే 2,500 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. గత 28 రోజులతో పోలిస్తే.. 80% పెరుగుదల నమోదైంది. 6 ఆగస్టు నాటికి ప్రపంచవ్యాప్తంగా 769 మిలియన్లకు పైగా కేసులు, 6.9 మిలియన్లకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఇది 2022లో కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందిన కాలం కంటే ఎక్కువ.
వేకువ జామున మహిళపై దాడి.. సీసి కెమెరా లో చైన్ లాక్కెల్లే విజువల్స్..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ లో పిల్లి శ్రీలత కుటుంబం నివాసం ఉంటుంది. అయితే ఇవాళ తెల్లవారు జామున ఇంటి ఆవరణలో ఏదో అలికిడి వినిపించడంతో శ్రీలత తలుపు తెరచి తను పెంచుకుంటున్న కుక్కతో సహా బయటకు వచ్చింది. అయితే తన చేతిలో ఉన్న కుక్కను గోడకు కట్టింది. ఇంటి పక్కనే శబ్దం రావడంతో ఆమె తొంగి చూసింది. అయితే శ్రీలతను కనపడకుండా దాక్కుని నిలబడి వున్న దొంగను చూసింది. దీంతో దొంగ ఒక్కసారిగా శ్రీలతపై దాడి చేసాడు. ఆమె ఇంటి లోపలికి పరుగులు పెడుతున్న శ్రీలత మెడను గట్టిగా పట్టుకున్నాడు. శ్రీలత ఇంటి పరదాకున్న కడ్డితో దొంగపై దాడి చేసింది. అయినా అవన్నీ లెక్కచేయని దొంగ శ్రీలత మెల్లోవున్న బంగారు చైన్ లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. అయితే శ్రీలత అరుపులు, పెంపుడు కుక్క అరుస్తున్న ఎవరు బయటకు రాలేదు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. శ్రీలత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ టైమ్ లోనే శ్రీలత ఇంటి బయటకు వస్తుందని దొంగ ఎలా గమనించాడు అనే కోణంలో విచారణ చేపట్టారు.
పవన్ కంటే కేఏ పాల్ 100 శాతం బెటర్.. ఎంపీ ఎవీవీ ఫైర్
జనసేనాని పవన్ కళ్యాణ్ తనపై చేసిన విమర్శలకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను రాజీనామా చెయ్యమని చెప్పడానికి పవన్ ఎవరు? అని ప్రశ్నించారు. దమ్ముంటే తనపైపై ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. గాజువాకలో తుక్కు తుక్కుగా ఒడిపోయినోడివి నువ్వా నా గురించి మాట్లాడేదని మండిపడ్డారు. ఓడిపోయిన తర్వాత ఒక్క రోజు కూడా గాజువాక రాని నువ్వా నన్ను ప్రశ్నించేది అని నిలదీశారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను స్వాగతించి, అప్పుడు పవన్ వైజాగ్ గురించి మాట్లాడాలని అన్నారు. మాస్టర్ ప్లాన్స్, అనుమతులు, వ్యవస్థ మీద కనీస అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. అటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తానని చెబుతున్నాడని ఎద్దేవా చేశారు.
షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్.. పాపం చాలా దురదృష్టకరం అని క్యాప్షన్..!
ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వెనుక నుంచి వస్తున్న వాహనాలను గమనించకుండా క్రాసింగ్‌ల వద్ద అడ్డగోలుగా నడుపుతున్నారు. ఇలాంటి క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి ప్రమాదానికి సంబంధించిన వీడియోను టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఆ వీడియోలో ఎడమవైపు ప్రయాణిస్తున్న ఓ బైకర్ రోడ్డు క్రాసింగ్ వద్దకు రాగానే ఒక్కసారిగా రైట్ తీసుకుంటాడు. తన వెనకే వస్తున్న మరో బైక్‌కి డ్యాష్ ఇస్తాడు. ఈ ప్రమాదంలో రెండు బైక్‌లు కింద పడిపోయాయి. ఓ బైకర్ రోడ్డుపై 10 మీటర్ల మేర పడిపోయాడు. ప్రమాదానికి కారణమైన బైకర్ లేచి నిలబడ్డాడు. అయితే ఇంతలో వెనుక నుంచి మరో ట్రక్కు వేగంగా దూసుకొచ్చింది. స్పీడ్ కంట్రోల్ లేకపోవడంతో అతడిని ఢీకొన్నాడు. దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ షాకింగ్ వీడియోను షేర్ చేసిన సజ్జనార్, “పాపం, చాలా దురదృష్టకరం” అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రమాదం అంటే బైక్, కారు రోడ్డుపై పడిపోవడం కాదు. కొన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి. రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సజ్జనార్ హెచ్చరించారు.
ఉచితంగా చికెన్ ఇవ్వలేదని.. దళితుడిపై దాడి!
దళితులపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఇటువంటి దారుణాలకు అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటువంటి వారిలో మార్పు రావడం లేదు. తాజాగా ఉచితంగా చికెన్ ఇవ్వనందుకు ఒక దళితుడిపై కొందరు దుండగులు విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని లలిత్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
వివరాల ప్రకారం సుజన్ అహిర్వార్ అనే దళితుడు బైక్ పై తిరుగుతూ గ్రామాల్లో చికెన్ అమ్ముతూ ఉంటాడు. దాడి జరిగిన రోజు కూడా అహిర్వార్ చికెన్ అమ్ముతూ వెళుతూ ఉండగా మద్యం మత్తులో ఉన్న నిందితులు అతడిని ఆపారు. చికెన్ ఇవ్వాలని అడిగారు. అహిర్వార్ డబ్బులు అడగగా ఆవేశంతో రెచ్చిపోయిన దుండగులు అహిర్వార్ పై చెప్పులతో దాడి చేశారు. వదిలేయాలని వేడుకుంటున్నా కనికరం లేకుండా చావబాదారు. అయితే ఈ ఘటన జరుగుతున్నప్పుడు ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అది పోలీసుల కంటపడటంతో నిందుతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆసియా కప్‌కి ముందు.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం రోహిత్ తన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రోహిత్ సతీమణి రితిక సజ్దే, కూతురు సమైరా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు భారత కెప్టెన్‌కు స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
రోహిత్ శర్మ, రితిక సజ్దే తిరుమల ఆలయంలో నడుచుకుంటూ వస్తున్న వీడియోలు, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోహిత్‌తో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. అయితే భారీ సెక్యూరిటీ ఉండడంతో వారికి నిరాశ తప్పలేదు. మీడియాకు మాత్రం రోహిత్ దంపతులు ఫోజులిచ్చారు.
చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ తాపత్రయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. వారాహి ఎక్కి పవన్ పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. మంత్రి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. పవన్, చంద్రబాబు ఇద్దరిలో అసహనం కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌ల పేరుతో గత ప్రభుత్వం దోచేసిందని.. పట్టిసీమ పేరుతో కూడా దోపిడీ చేశారని మంత్రి తెలిపారు. దోపిడీ కోసమే చంద్రబాబు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారని మంత్రి ఆరోపించారు. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదని.. ప్రాజెక్ట్‌ల సందర్శన పేరుతో హడావుడి చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు ప్రాజెక్ట్‌లను సందర్శించాక వర్షాలు ఆగిపోయాయని మంత్రి సెటైర్లు వేశారు.
వైఎస్సార్ హాయాంలో వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం
గాంధీ భవన్ లో ఆదివాసీ సభ నిర్వహించారు. ఈ సభకు ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ.. వైఎస్సార్ హాయాంలో వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని, వ్యవసాయం చేసే ప్రతీ గిరిజన రైతుకు అన్ని రకాల సబ్సిడీ లు ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గిరిజనుల ఎదుగుదలకు కృషి చేసింది కాంగ్రెస్ మాత్రమేనని, కాంగ్రెస్ ను గెలిపిస్తేనే గిరిజనులకు భవిష్యత్ అని ఆయన అన్నారు. 70 నియోజకవర్గాల్లో ఎస్టీలు గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తారని, ప్రతీ ఎస్టీ కాంగ్రెస్ జెండా మోయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఏఐసీసీ ఆదివాసీ సెల్ ఛైర్మన్ శివాజీ రావ్ మోగే మాట్లాడుతూ.. ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలవడానికి ఆదివాసిలే కారణమని, బీఆర్ఎస్ ఆదివాసీలకు చేసింది ఏమి లేదన్నారు.
కమ్మ సామాజిక వర్గానికి క్షమాపణలు
కమ్మ సామాజిక వర్గంపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఇంతకుముందు కమ్మ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేయగా.. ఈ నేపథ్యంలో కమ్మ కులస్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆమంచి కృష్ణమోహన్ కమ్మ కులానికి క్షమాపణ చెప్పారు. ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. వేటపాలెం ఘటనలో తాను చేసిన వ్యాఖ్యలు కమ్మ సామాజిక వర్గంలోని కొందరు కుల రహితంగా బ్రతికే వారికి, తన శ్రేయోభిలాషులకు, స్నేహితులకు బాధించాయని.. ఈ నేపథ్యంలో అందరికీ మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని ఆయన అన్నారు. తాను చేసిన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని తెలిపారు. ఆరోజు ఆ ఘటనకు కారణమైన వ్యక్తులకు మాత్రం తన క్షమాపణలు వర్తించవని ఆయన పేర్కొన్నారు.
కేటీఆర్ షాడో సీఎం.. గ్రూప్ 2 వాయిదా వేయండి అని ట్వీట్ చేశాడు
గ్రూప్ 2 వాయిదా వేయండి అంటే.. ప్రభుత్వం టీఎస్సీఎస్సీ పరిధి లోని అంశం అన్నారని, ఆందోళన చేస్తే అరెస్టులు చేశారని మండిపడ్డారు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు. కోర్టు లో కాంగ్రెస్ పిటిషన్ వేస్తే.. పునరాలోచన చేయాలని.. సోమవారం కౌంటర్ వేయాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు ఇచ్చింది. కేటీఆర్ షాడో సీఎం .. గ్రూప్ 2 వాయిదా వేయండి అని ట్వీట్ చేశాడంటూ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. పేపర్ లీక్ అయితే మాకేం సంబంధం టీఎస్సీఎస్సీ మీద వేశాడని, కానీ కోర్టు గ్రూప్ 2 వాయిదా వేయండి అని చెప్తే… వాయిదా వేసినట్టు కేటీఆర్ ఎలా ట్వీట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు.
పేపర్ లీక్ అయితే నీకు సంబంధం లేదు అంటావు.. పరీక్ష వాయిదా అని ట్వీట్ ఎలా చేస్తారని ఆయన అన్నారు. టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు పరీక్ష వాయిదా అని ప్రకటన అయితే రాలేదని, కేటీఆర్ ట్వీట్ ఎలా నమ్ముతం అని ఆయన అన్నారు. అయితే.. ఇదిలా ఉంటే.. గ్రూప్ 2 పరీక్షా అభ్యర్థులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శనివారం టీఎస్పీఎస్సీని సంప్రదించి గ్రూప్ 2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారిని ఆదేశించారు. భవిష్యత్తులో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లు సక్రమంగా ఉండేలా చూడాలని కూడా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శికి సూచించినట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
మాయల ఫకీరు మాటలు నమ్మితే మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది
ఖమ్మం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరిలో మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మీ అందరి దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం… అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేద విద్యార్థికి ఉచిత కోచింగ్ ఇప్పిస్తామన్నారు. వైన్ షాప్ టెండర్లు వేయడానికి 15 రోజులు గడువు ఇచ్ఛిన కేసీఆర్.. గృహ లక్ష్మి పథకానికి దరఖాస్తు కు మాత్రం మూడు రోజులు గడువు ఇచ్చారని మండిపడ్డారు.
మాయల ఫకీరు మాటలు నమ్మి మీరు ఉన్న గుడిసెలు పికీసుకుంటే మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లకు రూ. 5 లక్షలు ఇస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ 2 లక్షల రుణాలు మాఫీ చేస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా.. మరో 90 రోజుల్లో కాంగ్రెస్ అదాకారంలోకి రాబోతుందని, భద్రాచలం రాముడ్ని మోసం చేసిన ఘనత కేసీఆర్‌కి మనల్ని మోసం చేయడం ఎంత పని అన్నారు.
గెలిచే సత్తా లేక తప్పుడు కూతలు కూస్తున్నారు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సన్మాన సభలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాదవులకు చట్ట సభల్లో అత్యధిక స్థానాలు ఇచ్చింది వైసీపీనేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లు యాదవులే ఉన్నారని ఆయన తెలిపారు. యాధవులను గౌరవించింది జగన్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. కష్టాల్లో తమ వెంట ఉంటా, అందరివాడిగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు.
గెలిచే సత్తా లేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు కూతలు కూస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ 23, జనసేన ఒకటి గెలుచుకున్నారని.. ఈసారి ఒకటి కూడా గెలవలేరని మంత్రి తెలిపారు. పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. చంద్రబాబు, పవన్ లకు ప్రజలే బుద్ది చెప్పుతారని మంత్రి కారుమూరి అన్నారు. మరోవైపు వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చడం పవన్ అవివేకం అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.
తండ్రి పాడె మోసిన నటి.. వీడియో వైరల్
అంకితా లోఖండే.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అదే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు అని చెప్పండి.. ఓ ఆమెనా పవిత్ర రిష్తా సీరియల్ నటి కదా అని చెప్పేస్తారు. అవును ఆమెనే అంకితా లోఖండే. సుశాంత్ చనిపోయిన తరువాత ఈమె పేరు బాగా పాపులర్ అయ్యింది. సుశాంత్ తో ఆరేళ్ళు ప్రేమలో ఉన్న అంకిత.. బ్రేకప్ చెప్పి మరొక వ్యక్తిని వివాహమాడింది. ఇక తాజాగా అంకిత ఇంత తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి శశికాంత్ లోఖండే శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతోతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. ఇక తండ్రి మరణంతో అంకిత కుంగిపోయింది. నేడు శశికాంత్ లోఖండే అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు అయిన అంకిత తండ్రి పాడేను మోస్తూ కనిపించింది.
టీటీడీ కీలక నిర్ణయం.. 15 ఏళ్ల లోపు చిన్నారులకు మధ్యాహ్నం 2 వరకే అనుమతి
తిరుమల నడకమార్గాలలో చిన్నారుల భద్రతపై టీటీడీ దృష్టి సారించింది. ఇవాళ కూడా అలిపిరి నడకమార్గంలో ఇద్దరు చిన్నారులు తప్పిపోయారు. దీంతో వారిని గుర్తించి తిరిగి కుటుంభసభ్యులుకు అప్పగించారు భధ్రతాసిబ్బంది. మరోవైపు నడకమార్గంలో చిరుతల దాడుల నేపథ్యంలో టీడీడీక కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల భధ్రత దృష్టా రేపటి నుంచి ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకే చిన్నారులను నడకమార్గంలో అనుమతించనుంది టీటీడీ. మధ్యాహ్నం 2 గంటల తరువాత 15 సంవత్సరాలు లోబడిన చిన్నారులకు నడకమార్గంలో అనుమతి నిరాకరించింది.
వన్యమృగాల సంచారం తగ్గుముఖం పట్టి తిరిగి సాధరణ పరిస్థితులు నెలకొన్న తరువాతే చిన్నారులుకు పూర్తి స్థాయిలో నడకమార్గంలో అనుమతించనున్నారు టీటీడీ అధికారులు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులపై తిరుమలకు వెళ్లే దారిలో చిరుత దాడికి పాల్పడింది. రెండు రోజుల క్రితం చిరుత దాడిలో అక్షిత అనే చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనల నేపథ్యంలో భక్తుల భద్రత విషయంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు అలిపిరి మార్గంలో వెళ్లే పిల్లలకు ట్యాగ్ లను ఏర్పాటు చేస్తుంది టీటీడీ. తిరుమల నడక మార్గంలో ఏడో మైలు నుండి నరసింహ స్వామి ఆలయం వరకు భక్తుల బృందాలను అనుమతించనున్నారు. భక్తుల ముందు, వెనుక రోప్ పార్టీలను టీటీడీ నియమించింది. ప్రతి 40 అడుగులకు సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.
రానున్న రెండు రోజుల్లో ఆ రాష్ట్రాలకు భారీ వర్షాలు
రానున్న రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం తెలిపింది. వాతావరణ సంస్థ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఆదివారం నుండి ఆగస్టు 14 వరకు, తూర్పు ఉత్తరప్రదేశ్ మీదుగా వాయువ్య భారతదేశంలో, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది, ఆదివారం నుండి ఆగస్టు 14 వరకు హిమాచల్ ప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లో ఆదివారం నుండి ఆగస్టు 17 వరకు, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో వివిక్త భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దీనికి తోడు, ఆదివారం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఆదివారం, ఆగస్టు 14 తేదీల్లో ఉత్తరాఖండ్‌లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. IMD తన సూచనలో తూర్పు భారతదేశంలో తేలికపాటి నుండి మోస్తరుగా చెల్లాచెదురుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం నుండి ఆగస్టు 15 వరకు, బీహార్‌లో ఆదివారం, గంగా పశ్చిమ బెంగాల్ మీదుగా ఆగస్టు 16, 17 తేదీల్లో, ఒడిశా, జార్ఖండ్ ఆగస్టు 15 నుండి 17 వరకు, అండమాన్-నికోబార్ దీవుల మీదుగా ఆగస్టు 14 నుండి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 7 రోజులలో ఈ ప్రాంతాల్లోని మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది.