రేపు వారణాసిలో మోడీ పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన
ప్రధాని మోడీ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి రానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 4,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఇక బహిరంగ సభలో 50 వేల మందికి పైగా జనం పాల్గొనే అవకాశం ఉంది. వేసవి కాలం కాబట్టి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
మీరు పడగొట్టిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి నిలబెట్టిండు..
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంపీ చామల మాట్లాడుతూ.. “మీరు పడగొట్టిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి నిలబెట్టిండు.. తెలంగాణలో మీకుటుంబమే నిలబడింది.. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ పరిస్థితి ఏంటో ఆయనకే తెలియదు.. మామకు వారసుడు అని పగటి కలలు కంటుండు.. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ సందర్భంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన పోస్టర్లలో హరీష్ రావు ఫొటో లేదు.. 2009 లోనే హరీష్ రావు కన్న కల చెదిరిపోయింది..
కలెక్షన్స్ లేకపోతే ఏమీ చేయలేం.. మున్సిపల్ కమిషనర్లు రెవెన్యూపై ఫోకస్ పెట్టాలి..!
ఏపీ మున్సిపల్ కమిషనర్ల ఒకరోజు వర్క్ షాపు విజయవాడలో జరుగుతోంది.. వర్క్ షాప్ కు హాజరైన మంత్రి నారాయణ మాట్లాడుతూ మునిసిపల్ కమిషనర్లు రెవెన్యూ పై దృష్టిపెట్టాలని అన్నారు.. అలాగే కలెక్షన్లు లేకపోతే ఏమీ చేయలేం అన్నారు.. ఏ మునిసిపాలిటీ కలెక్షన్ ఆ మునిసిపాలిటీలోనే వినియోగించుకునేలా అవకాశం ఇచ్చారు.. వచ్చే మార్చి నాటికి 80 శాతానికి పైగా కలెక్షన్లు జరిగిపోవాలన్నారు.. కుక్కల స్టెరిలైజేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. మునిసిపాలిటీలు స్వయం పరిపాలన చేయాలి.. కలెక్షన్లు లేనిదే మనం ఏమీ చేయలేం.. 2014-19 మధ్యలో అండర్ అసెస్మెంట్లు రెగ్యులరైజ్ చేయలేదు.. అప్పట్లో రాష్ట ఖజానా బాగానే ఉండేది… ప్రతీ వారం కలెక్షన్ గురించి నేను అడుగుతూనే ఉంటాను.. ట్యాక్స్‌లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తామని స్పష్టం చే శారు..
విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం.. ఈ సిద్ధాంతాన్ని నేను గట్టిగా నమ్ముతా..
విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం.. ఈ సిద్ధాంతాన్ని నేను గట్టిగా నమ్ముతాను అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు జగన్.. ఈ సమావేశానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, శిల్పా రవి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సహా పలువురు నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. వైసీపీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్లకాలువలోనే పడింది. కేవలం ఇచ్చిన మాటకోసం.. ఎందాకైనా వెళ్లాం.. ఆ ప్రస్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. బలమైన పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. ఆరోజు నుంచి నాతోనే మీరంతా అడుగులు వేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ నాతోనే ఉన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం. విలువలకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు.. ఈ రెండు పదాలే పార్టీని నడిపించాయి. గట్టిగా ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. నాలో ఈరెండింటిని చూసి నాతోపాటుగా అడుగులో అడుగు వేశారని గుర్తుచేసుకున్నారు..
తీ చర్యకు.. ప్రతిచర్య ఉంటుంది.. జగన్ వార్నింగ్
ప్రతీ చర్యకు.. ప్రతిచర్య ఉంటుంది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతాడే, అంతే వేగంతో అదిపైకి లేస్తుందన్నారు.. ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం. అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారని.. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారని హెచ్చరించారు.. ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన వైఎస్ జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ, తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చే తీర్పులు చూశాం. ఈ పక్కన ప్రజలు తంతే.. ఆ పక్కన పడతారు. చంద్రబాబు భయపెట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు. మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
మారుమూల ప్రాంతాల ఇంటర్నెట్ కనెక్టివిటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తాజాగా T-ఫైబర్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల ప్రజలందరికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. శ్రీధర్ బాబు పేర్కొన్నదానినిబట్టి, ఇప్పటికే దాదాపు 20 జిల్లాల్లో ఫైబర్ కనెక్టివిటీ కార్యక్రమం తుది దశలో ఉంది. త్వరలోనే ఆ ప్రాంతాలకు సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
“ఇంటర్నెట్, టెలిఫోన్, టెలివిజన్ కనెక్టివిటీలను ఒకే చాట్లో కలిపి అందించడం T-ఫైబర్ ప్రత్యేకత. దేశవ్యాప్తంగా ఇదే తరహా సేవలు అందించే తొలి ప్రాజెక్టుగా T-ఫైబర్ నిలుస్తుంది,” అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 43,000 కిలోమీటర్లకు పైగా ఫైబర్ కేబుల్ విస్తరించబడిందని, ఇది నిజంగా గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. అయితే, అటవీ ప్రాంతాల్లో పని చేపట్టేందుకు కేంద్ర అటవీ శాఖ నుండి కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు.
వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే.. యుగాంతం అయిపోవాలి..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి రావాలంటే… యుగాంతం అయిపోవాలి అంటూ ఎద్దేవా చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.. ఓ మాజీ సీఎం.. పోలీసుల బట్టలు ఊడదీస్తాననడం ఎంతవరకు కరెక్ట్? అని నిలదీశారు.. జగన్ సభ్యత సంస్కారం లేని వారిలా మాట్లాడుతున్నారు అని ఫైర్ అయ్యారు.. గొడ్డలి పోటుకు.. గుండె పోటుకి తేడా తెలియని వారు.. కోడి కొత్తి డ్రామాలు చేసినవారు.. పదవులు కోసం.. సొంత తల్లినే ఇంటి నుండి గెంటశారు.. ఆస్థి కోసం చెల్లిని బయటకు నెట్టేసినవారు అంటూ కామెంట్ చేశారు.
ఆ వ్యవహారంలో ప్రభుత్వం తీరుపై కేంద్ర కమిటీకి నివేదిక ఇచ్చాం
కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ మాజీ మంత్రి టీ. హరీష్ రావు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న విధానంపై ప్రశ్నలెత్తుతూ, కేంద్ర కమిటీకి అవసరమైన డాక్యుమెంట్లు అందించామని తెలిపారు. “ఎవరైనా చెట్టు నరకాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. వాల్టా చట్టం ప్రకారం కూడా చెట్లు రక్షించాల్సిందే,” అని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం స్వయంగా చెట్లు నరికిందని ఆరోపించారు. ఈ విషయంలో TGIIC స్వయంగా పోలీసులను సంప్రదించి రక్షణ కోరిన విషయాన్ని గుర్తుచేశారు. “చెట్లు నరుకడమే కాకుండా, ఆ చర్యల వల్ల మూడు జింకలు మృతి చెందాయి. ఇది వైల్డ్ లైఫ్ ఆక్ట్ సెక్షన్ 29 ప్రకారం ఏడు సంవత్సరాల జైలు శిక్షకు దారితీయవచ్చు,” అని తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన RS ప్రవీణ్ అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
మూడు కోట్ల మందికి నాణ్యమైన సన్న బియ్యం.. దేశంలోనే మొదటి సారి
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం దేశవ్యాప్తంగా మరెక్కడా లేని విధంగా విస్తృతంగా కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ పథకాన్ని పూర్తి పర్యవేక్షణతో నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. “ఇది సామాన్య ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచే గొప్ప కార్యక్రమం. మూడు కోట్ల మందికి ప్రతి నెలా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణే. దేశంలో ఎక్కడా ఇటువంటి పథకం అమలులో లేదు,” అని మంత్రి తెలిపారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నట్లు, గతంలో సరఫరా చేస్తున్న దొడ్డు బియ్యం పేదలకు చేరకపోవడం వల్లనే ప్రభుత్వం సన్న బియ్యాన్ని ఎంపిక చేసిందని తెలిపారు. “అది మధ్యలోనే దారి మళ్లి, అసలు లబ్దిదారులకు చేరకుండా తేడా వచ్చింది. అందుకే ఈసారి సన్న బియ్యాన్ని తీసుకువచ్చాం,” అని వివరించారు. ఈ పథకం విజయవంతం కావాలంటే, ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పథకం అమలును దగ్గర నుండి పర్యవేక్షించాల్సిందే అని మంత్రి స్పష్టం చేశారు. “సన్న బియ్యం పేదలకు న్యాయంగా అందేలా చూసే బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిదే,” అని అన్నారు.
బడిబాట తరహాలో పిల్లలను గుర్తించి అంగన్‌వాడీల్లో చేర్పించాలి
తెలంగాణ సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఇతర అధికారులు, జిల్లా సంక్షేమ అధికారులు (DWOs) పాల్గొన్నారు. సీతక్క పేర్కొన్నట్టుగా, “పోషకాహార తెలంగాణే మన లక్ష్యం. అందుకు అంగన్‌వాడీ సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలి.” రాష్ట్రంలో 313 అంగన్‌వాడీ కేంద్రాలు ఇంకా తెరుచుకోకపోవడాన్ని తప్పుపడుతూ, చిన్నారులు లేరనే సాకుతో వ్యవస్థను నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు.
సిబ్బందిని ఉత్తేజపరిచేందుకు త్వరలో గ్రేడింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి తెలిపారు. మంచి గ్రేడింగ్ పొందిన సెంటర్ల సిబ్బందికి మరియు సంబంధిత జిల్లా అధికారులకు అవార్డులు అందిస్తామని చెప్పారు. అలాగే సరఫరా సామాగ్రిలో నాణ్యత లోపించినట్టయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెరగాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. “బడిబాట తరహాలో పిల్లలను గుర్తించి అంగన్‌వాడీల్లో చేర్పించాలి” అని సూచించారు. ప్రస్తుతం 30 కేంద్రాల్లో ఒక్క చిన్నారి కూడా లేకపోవడం, 198 కేంద్రాల్లో 5 మంది లోపే ఉండటం, 586 కేంద్రాల్లో 10 మంది లోపే ఉండటం ఆందోళన కలిగించే విషయం అని మంత్రి వ్యాఖ్యానించారు.