మాతృభాష కోసం నా ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను..
న్యూజిలాండ్ 170 ఏళ్ల పార్లమెంట్ చరిత్రలో అతి పిన్న వయస్కురాలు అయిన సాల్ ఎంపీ హనా-రౌహితి-మాపి-క్లార్క్ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజిలాండ్‌లోని తెగలలో మావోరీ భాష దాదాపు అంతరించిపోయింది. న్యూజిలాండ్ హెరాల్డ్ ప్రకారం.. మావోరీ ప్రజల భాషతో పాటు హక్కులను రక్షించడానికి ఈ యువ ఎంపీ పోరాడుతుంది. అయితే, కొన్ని రోజుల క్రితం ఎంపీ హనా రౌహితి పార్లమెంటులో ప్రసంగం చేస్తూ.. మావోరీ భాషలో “మీ కోసం నా ప్రాణాలను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడంతో పాటు మీ ప్రాణాలను రక్షించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను” అని పేర్కొనింది.
వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గా సాగుతోంది.. ఈ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తాను సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన మాట వాస్తవమేనన్నారు.. అయితే, ఈసారి నరసరావుపేట నుండి కాదు గుంటూరు నుంచి పోటీ చేయమని అధిష్టానం చెప్పిందన్నారు. కానీ, తనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని ఎంపీ స్పష్టం చేశారు.. పల్నాడులో చాలా పనులు సగం సగం మిగిలిపోయాయని.. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉందని అంటున్నారు ఎంపీ.. అధిష్టానం లెక్కలు అధిష్టానానికి ఉంటే, నా ఆలోచనలు వేరుగా ఉన్నాయని అంటున్నారు ఎంపీ కృష్ణదేవరాయలు. మొత్తంగా వేరే ప్రాంతంలో పోటీ చేసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు.. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తానంటూనే.. ఆసక్తికర వ్యాఖ్యలుచేసిన నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
భారత దేశంలో 774 కోవిడ్ కేసులు నమోదు.. పెరిగిన మరణాలు..
భారతదేశంలో ఒకే రోజు 774 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, అయితే క్రియాశీల కేసుల సంఖ్య 4,187 గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.. ఉదయం 8 గంటలకు అప్‌డేట్ చేసిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 24 గంటల వ్యవధిలో ఇద్దరు మరణాలు తమిళనాడు మరియు గుజరాత్‌ల నుండి ఒక్కొక్కటి నమోదయ్యాయి.
డిసెంబరు 5 వరకు రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలలో ఉంది, అయితే ఇది చల్లని వాతావరణ పరిస్థితుల మధ్య మరియు కొత్త కోవిడ్-19 వేరియంట్ JN.1 ఆవిర్భావం తర్వాత మళ్లీ పెరగడం ప్రారంభమైంది. డిసెంబర్ 5 తర్వాత, డిసెంబర్ 31, 2023న అత్యధికంగా 841 కేసులు నమోదయ్యాయి, ఇది మే 2021లో నమోదైన గరిష్ట కేసుల్లో 0.2 శాతం అని అధికారిక వర్గాలు తెలిపాయి..
దావూద్ ఇబ్రహీం ఇంట్లో సనాతన ధర్మ పాఠశాల
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తికి వేలంలో ఊహించని రేటు వచ్చింది. కనీస ధర 15 వేల రూపాయలుగా నిర్ణయించగా.. ఏకంగా 2 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. దావూద్ ఇబ్రహీంకు వారసత్వంగా వచ్చిన నాలుగు ఆస్తులో రెండు పొలాలు, ఇంటిని ఓ లాయర్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాడు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ముంబాకే గ్రామంలో దావూద్ ఇబ్రహీం పూర్వీకులు నివాసం ఉండేవారు. ఆ గ్రామంలో ఓ ప్లాట్ తో పాటు ఆయనకు నాలుగు రకాల ఆస్తులు వారసత్వంగా వచ్చాయి. ముంబైలో వివిధ నేరాలకు పాల్పడిన దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగోను విడుదల చేసిన ఖర్గే
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ జనవరి 14న మణిపూర్ నుంచి ప్రారంభం కానుంది. దేశంలోని ప్రాథమిక సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై దృష్టి సారిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఈ సందర్భంగా భారత్ జోడో న్యాయ్ యాత్ర “న్యాయ్ కా హక్ మిల్నే తక్” లోగోతో పాటు ట్యాగ్‌లైన్‌ను ఆవిష్కరించారు. ఇక, జనవరి 14 నుంచి భారత్ జోడో న్యాయ యాత్రను రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రారంభించబోతున్నామన్నారు. ఈ యాత్ర మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి ప్రారంభమయ్యే ముంబయిలో ముగియనుంది. దాదాపు దేశంలోని 15 రాష్ట్రాల గుండా యాత్ర కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. 110 జిల్లాలోని 100 లోక్‌సభ స్థానాలతో పాటు 337 అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనుంది.
ఎస్మా ప్రయోగంపై అంగన్వాడీల తీవ్ర అభ్యంతరం.. బెదిరించి ఉద్యమాన్ని ఆపలేరు..!
ఆంధ్రప్రదేశ్‌లో తమ డిమాండ్ల సాధన కోసం 26 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు అంగన్వాడీలు.. వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో.. ప్రభుత్వం జరిపిన చర్చలు కూడా విఫలం అయ్యాయి.. దీంతో, అంగన్వాడీలపై సీరియస్ యాక్షన్‌కు దిగింది ఏపీ ప్రభుత్వం.. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెం.2 తీసుకొచ్చింది.. అయితే, ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్వాడీల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. తమను అదిరించి, బెదిరించి ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేస్తున్నారు. తమకు కనీస వేతనం 26,000 ఇచ్చి తీరాలని లేదంటే అప్పటివరకు సమ్మె చేసి తీరతాం అంటున్నారు. అత్యవసర విధులు అనుకుంటే, తమకు అందాల్సిన హక్కుల్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని గుర్తు చేస్తున్నారు అంగన్వాడీలు. తాము హక్కుల సాధన కోసం ఎంతవరకైనా పోరాడుతామని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేసే వరకు సమ్మె విరమించబోమని తేల్చేశారు అంగన్వాడీలు.
డబ్ల్యూటీసీ పట్టికలో టాప్‌కు ఆస్ట్రేలియా!
సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాదు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా టాప్‌కు దూసుకొచ్చింది. డబ్ల్యూటీసీ 2023-25 పట్టికలో భారత్‌ను వెనక్కినెట్టి మరీ.. తొలి స్థానాన్ని (56.25) దక్కించుకుంది. నాలుగో స్ధానం నుంచి ఏకంగా టాప్ ప్లేస్‌కు ఎగబాకింది. పట్టికలో భారత్ రెండో స్థానంలో ఉంది.
విధుల్లో ఉన్న పోలీస్‌పై చేయి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే..
విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారిపై ఎమ్మెల్యే చేయి చేసుకోవడం వివాదాస్పదం అయింది. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. పూణేలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై బీజేపీ ఎమ్యెల్యే చేయి చేసుకున్నారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఈ రోజు తెలిపారు. పూణే కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు సునీల్ కాంబ్లే పూణేలోని సాసూన్ జనరల్ హాస్పిటల్‌లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను కొట్టిన సంఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుంది..
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. అంతేకాకుండా.. క్యాడర్ ను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరీ ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.. ఆమే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చేసి వాడుకుంటున్నారని, కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలు ప్రచారం చేసుకుంటున్నారని పురందేశ్వరీ అన్నారు.
కేసీఆర్ త్వరలో ప్రజల మధ్యకు వస్తారు
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు త్వరలో ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు శనివారం అన్నారు. తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ శస్త్రచికిత్స తర్వాత చంద్రశేఖర్‌రావు కోలుకుంటున్నారని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మనముందుకు వస్తారన్నారు. ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్‌లో చంద్రశేఖర్‌రావు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. రోజు వారీగా పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో మమేకమవుతారు. జిల్లాల్లోనూ పర్యటిస్తానని హరీష్ రావు తెలిపారు.