ఆరు గ్యారంటీల అమలుపై రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాతే రాష్ట్రంలో పర్యటించాలి
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా వెజిటేబుల్ మార్కెట్ సౌచాలయాలకు భూమి పూజ సీసీ రోడ్లు నిర్మాణాన్ని ప్రారంభించారు. అలాగే, లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇక, బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై మాట్లాడిన అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించాలని డిమాండ్ చేశారు. అలాగే, మూసి సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు.. 15 వేల కోట్ల అంచనాలతో పూర్తయ్యే మూసీ నది సుందరీకరణను రూ. 1,50,000 కోట్లతో చేస్తామనడానికి వ్యతిరేకం చెప్పుకొచ్చారు.
స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీని ఏర్పాటు చేసింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, ఈ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీలో ఇండస్ట్రీస్ కమీషనర్ మెంబర్ కన్వీనర్ గా, ఫైనాన్స్, రెవెన్యూ, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, ఇతర బాధ్యత గల డిపార్ట్మెంట్ ల స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రెటరీలను సభ్యులుగా నియమించారు.. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడిపోయింది సర్కార్.. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో పలు దిగ్గజ సంస్థలు.. ఆయా సంస్థల ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు.. ఏపీలో ఉన్న మౌలికసదుపాయాలపై వివరించారు.. ఇప్పుడు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీని నియమించింది ప్రభుత్వం.. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు.. వివిధ శాఖలపై, పాలసీల రూపకల్పనపై వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఇంకో వైపు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తోన్న విషయం విదితమే..
ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12 వేలు కాదు.. నెలకు రూ. 5 వేలు ఇవ్వండి
ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో ఆటో డ్రైవర్స్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడికి ఆటో లో వచ్చాను.. తమ జీవితాలన్ని అస్తవ్యస్తంగా అయ్యాయని నేను ఎక్కిన ఆటో డ్రైవర్ అన్నారు.. రాష్ట్రంలో ఉన్న ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇలాగే ఉంది.. ఇవాళ రాహుల్ గాంధీ వస్తున్నారు.. ఇదే రాహుల్ గాంధీ గత ఏడాది ఆటోలో జనాల దగ్గరికి వచ్చి చాలా విషయాలు చెప్పారు.. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. అలాగే,ఇంటింటికి సంక్షేమం అన్నావు.. అత్తలకు, కోడళ్ళకు పైసలు ఇస్తాన్నావు.. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా ఇస్తే మేము వ్యతిరేకం కాదు.. రైతుల ఆత్మహత్యలు మొదలైనాయి.. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు మొదలయ్యాయని కేటీఆర్ అన్నారు.
మియాపూర్లో భూముల అన్యాక్రాంతంపై హైడ్రా దృష్టి..
గ్రేటర్ హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. గ్రేటర్ పరిధిలోని చెరువుల, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలను కబ్జా చేసి నిర్మించి అక్రమ కట్టడాలను కూల్చేస్తుంది. గత మూడు నెలల్లోనే వందల నిర్మాణాలను నెలమట్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం ఆస్కారం లేకుండా సైలెంట్‌గా పని చేసుకుంటూపోతుంది. మియాపూర్ లోని సర్వే నెంబర్ 100, 101లో గల భూముల అన్యాక్రాంతంపై హైడ్రా అధికారులు దృష్టి పెట్టారు. ఇక, మియాపూర్ లో భూముల అన్యాక్రాంతంపై విచారణ చేసేందుకు రంగంలోకి ప్రత్యేక బృందం దిగింది. భూముల వాస్తవ విస్తీర్ణం, ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి సుమారు 15 ఏళ్లుగా జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం నుంచి వివరాలను అధికారులు సేకరించారు. త్వరలో చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అక్రమ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి ఆక్రమణ పైనే ప్రధాన దృష్టి సారించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.
భూములు ఇవ్వబోమన్నవారిపై పెట్రోల్ బాంబులు వేశారు..
పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. జిల్లాలోని మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలోని సరస్వతి పవర్ భూములను పవన్ కల్యాణ్ పరిశీలించారు. సరస్వతి సిమెంట్స్ కోసం భూములను రైతులకు ఇష్టం లేకుండా గత ప్రభుత్వాలు తీసుకున్నాయని మండిపడ్డారు. కేవలం ఫర్నిచర్ వాడుకున్నారని నెపంతో స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తిని వేదనకు గురి చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్‌ను వైసీపీ నేతలు వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు. 1180 ఎకరాలు సరస్వతి భూముల పేరుతో ఆక్రమించుకున్నారని అన్నారు. 24 ఎకరాల ఎస్సీల భూములను లాక్కున్నారని.. పెట్రోల్ బాంబులు వేసి బెదిరించి భూములను లాక్కున్నారని విమర్శించారు.
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫీజు చెల్లింపుల తేదీలు ఇవే..
తెలంగాణలోని జూనియర్ జాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రేపటి(నవంబర్ 6) నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశాన్ని కల్పించింది. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 4 వరకు అవకాశాన్ని కల్పించారు. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 11 వరకు ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు. రూ.2 వేల ఆలస్యం రుసుముతో డిసెంబర్ 27 వరకు బోర్డు అవకాశం కల్పించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్, సెకండ్ ఇయర్ జనరల్ ఆర్ట్స్ వారు రూ. 520 ఫీజును చెల్లించాలని అధికారులు తెలిపారు సెకండ్ ఇయర్ జనరల్ సైన్స్ విద్యార్థులు రూ.750 ఫీజును చెల్లించాలని వెల్లడించారు. మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కోర్సులకు పరీక్ష ఫీజు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి అమ్మాలి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి అమ్మాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఆయన ఈ రోజు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పత్తి సేకరణ కోసం సీసీఐ అధికారులు 105 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. అలాగే, ప్రతి జిన్నింగ్ మిల్లు నోటిఫై చేసిన విధంగా పనిచేయాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. పత్తి కొనుగోళ్లలో తేమ శాతం తగ్గించే విషయంలో సీసీఐ సీఎండీతో చర్చించామని, వ్యవసాయం సంబంధిత సమస్యలు ఉంటే రైతులు వాట్సాప్ నెంబర్ 8897281111 ద్వారా స్పందించాలని సూచించారు. మరోవైపు, పత్తి కొనుగోలు ప్రక్రియలో ఏవైనా ఇబ్బందులు వస్తే, కలెక్టర్లు , మార్కెటింగ్ అధికారులు వాటిని త్వరగా పరిష్కరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై రాహుల్ మాట్లాడాలి
రాహుల్ గాంధీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యల గురించి హైదరాబాద్ పర్యటనలో మాట్లాడాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 400 హామీలపై రాహుల్ గాంధీ అప్‌డేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం తన ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ, కాంగ్రెస్ హామీలను విస్మరించినట్లు ఆరోపించారు.
ఈనెల 9న సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన.. సీ ప్లేన్ సర్వీస్ లాంచ్
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీశైలం పాతాళగంగలోని కృష్ణానది , బెజవాడ ప్రకాశం బ్యారేజీ ల్యాండింగ్ పాయింట్లుగా సీ ప్లేన్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఆ పరిధిలో ఉన్న స్థలాలకు మహర్దశ పట్టనుంది. సీ ప్లేన్ సర్వీస్ కోసం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేసిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్‌లు పరిశీలించారు. పాతాళగంగ వద్ద సీప్లేన్ ల్యాండ్ కానున్న ప్రదేశం, రోప్ వే, ఆలయాన్ని వారు పరిశీలించారు. ఈనెల 9న విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్‌ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీప్లేన్‌లో ప్రయాణించి శ్రీశైలం జలాశయం చేరుకొని రోప్ వే ద్వారా సీఎం చంద్రబాబు మల్లన్న ఆలయానికి చేరుకోనున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీశైలం క్షేత్రాన్ని తిరుమల తరహాలో ఆధ్యాత్మికంగానూ, అటు పర్యాటకంగానూ అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేపట్టారు.
ఇక హెల్మెట్ లేకుండా బయటకు వస్తే మోతే
హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నుంచి భారీ స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించనున్నారు. హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల గత మూడు రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళతో సహా ముగ్గురు మరణించారని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) పి విశ్వ ప్రసాద్ తెలిపారు. అలాగే, ఈ మూడు కేసుల్లోనూ బాధితులు రక్షణ కవచం అంటే ఐఎస్‌ఐ స్టాండర్డ్ హెల్మెట్ ధరించలేదని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదాలలో మరణించే సాధారణ , అత్యంత దుర్బలమైన రహదారి వినియోగదారులు మోటార్‌సైకిలిస్టులు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో తలకు గాయం మాత్రమే అత్యంత సాధారణ ప్రాణాంతక గాయమని అధికారి తెలిపారు.