పోలీసుల ఎదుట లొంగిపోయిన 86 మంది మావోయిస్టు దళ సభ్యులు..
భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టులు బీజాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లా సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు అపాలని పోలీసులు నిర్ణయించారు.. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారారు. దీంతో పోలీసులు స్పేషల్ ఆపరేషన్ తలపెట్టారు. ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు.
పిఠాపురంలో హై టెన్షన్.. నాగబాబు పర్యటనలో జై వర్మ నినాదాలు
జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు నాగబాబు ఈ రోజు (ఏప్రిల్ 5న) పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో తెలుగు దేశం, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటిస్తుండగా జై వర్మ, జై టీడీపీ అంటూ పసుపు జెండాలతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక, దీనికి జనసేన కార్యకర్తలు అడ్డుపడ్డు పడటంతో ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే, పిఠాపురంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎస్పీఎస్‌ఎన్ వర్మ తన సీటు త్యాగం చేసి మరీ పవన్ కళ్యాణ్ ను గెలిపించారని.. అలాంటి వ్యక్తిని జనసేన ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు తక్కువ చేసి మాట్లాడారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానికంగా వర్మకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోవడం వెనక కూడా నాగబాబు కుట్ర ఉందని టీడీపీ నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గొల్లప్రోలులోనూ అన్నా క్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలోనూ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తాజాగా కుమారపురంలోనూ ఎస్పీఎస్‌ఎన్ వర్మకు సపోర్టుగా నినాదాలు చేస్తూ నాగబాబు పర్యటనను అడ్డుకునేందుకు ట్రై చేశారు తెలుగు తమ్ముళ్లు.
రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేశాం..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ముప్పాళ్లలో డాక్టర్ జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తోంది అన్నారు. ఇక, 30 ఏళ్ల క్రితమే మహిళల కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేశాం.. సెకండ్ జనరేషన్ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అయితే, ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం చేపడితే అందరూ సహకరించారు.. ఇప్పుడు P4 అనే వినూత్న కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ..
వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో రాహుల్ గాంధీ వెన్నుచూపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూయిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసి కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరు కాకపోవడం అత్యంత దారుణమని విమర్శించారు.
30 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయడమే లక్ష్యంగా మెప్మా ప్రణాళిక..
విజయవాడలో మెప్మా వన్ డే వర్క్ షాప్ నిర్వహించారు. మహిళాకాశం పేరిట మెప్మా వెబ్ సైట్, మెప్మా మొబైల్ యాప్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు. మహిళా వ్యాపారుల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక లక్ష్యంతో వర్క్ షాప్ నిర్వహించారు. వన్ డే వర్క్ షాప్ కి మెప్మా డైరెక్టర్ తేజ భరత్, మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 30 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయడమే లక్ష్యంగా మెప్మా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఉన్న పదివేల జీవనోపాధి యూనిట్లతో పాటు కొత్తగా 20 వేల జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేసేందుకు మెప్మా ప్రణాళిక రూపొందించింది. తొమ్మిది రకాల జీవనోపాధి యూనిట్లను రూపొందించింది.
తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై దేశవ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతోందని, ఆయన నాయకత్వంపై ప్రజలు మరింత ఆకర్షితులవుతుండటంతో, కొన్ని పార్టీలు మోడీ గారిపై తప్పుడు ప్రచారానికి తెగబడుతున్నాయని ఆరోపించారు. ‘ఉత్తర–దక్షిణ’ అనే వాదనను ప్రొత్సహించి మోడీ పై విమర్శలు చేస్తుండటం రాజ్యాంగ ఉల్లంఘనగా అభివర్ణించారు.
నా భార్యను ఎన్‌కౌంటర్ చేయండి.. అదే సరైన న్యాయం
కొన్ని రోజుల క్రితం ముగ్గురు పిల్లలను కన్న తల్లే కర్కశంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యా్ప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అమీన్ పూర్ లో రజిత, చెన్నయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరి సంసారంలో గెట్ టు గెదర్ పార్టీ చిచ్చుపెట్టింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లిన రజిత టెన్త్ క్లాస్ లో తనతోపాటు చదువుకున్న శివతో పాత పరిచయానికి బీజం పడింది. ఇంకేముంది.. భర్త అంటే ఇష్టం లేని రజిత శివతో చనువు పెంచుకుంది. కొంత కాలం నుంచి అక్రమ సంబంధం కొనసాగుతోంది.
మోడీ బియ్యంపై గ్రామ గ్రామాన ప్రచారం చేస్తాం
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దళితులను అవమానించే పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ లాంటి గొప్ప దళిత నాయకులను అడుగడుగునా అవమానించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఇందిరా గాంధీ నేతృత్వంలో దళితుడు ప్రధాని అవతాడన్న పరిస్థితి ఏర్పడుతుందని భయపడి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారని బండి సంజయ్ ఆరోపించారు. “దళితులకు నిజంగా అండగా నిలిచే పార్టీ ఏదో ప్రజలు ఆలోచించాలి,” అని పిలుపునిచ్చారు.
మోడీ బియ్యం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ బియ్యం పంపిణీకి ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలకు అది సక్రమంగా అందించడంలో విఫలమవుతోందని వ్యాఖ్యానించారు. “మోడీ బియ్యం కోసం ప్రజలు బారులు తీరాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పెళ్లికి వెళ్లి మంగళహారతులు పెట్టినట్టు వ్యవహరిస్తోంది,” అంటూ ఎద్దేవా చేశారు.
కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో రెండు కార్లు. రెండు ఆటోలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదానికి గురైన కార్లు ఆటో లు పోలీస్ స్టేషన్ వెనకాల ఖాళీ స్థలంలో ఉంచారు. ఖాళీ స్థలానికి ఆనుకొని ఉన్న ప్రహరీ గోడ అవతలి భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు మంటను ఏర్పాటు చేశారు ఆ మంటలు చెలరేగి కార్లపై పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు అక్కడికి చేరుకునే లోపే మంటలు వ్యాపి చెందడం తో ఏమి చేయలేక ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. అక్కడికిచేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ రెండు కార్లు, రెండు ఆటోలు పూర్తిగా దగ్ధమయ్యాయి మంటలు వ్యాపిస్తున్న సమయంలో పక్కనే పోలీస్ స్టేషన్ పెట్రోల్ బంక్ కూడా ఉండటం తో పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమయానికి ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.
రూ. 6 వేల అప్పు తిరిగివ్వలేదని.. ప్రియుడితో కలిసి మహిళను హత్య చేసిన మరో మహిళ..
అప్పు నిప్పుతో సమానం.. నిలువునా కాల్చేస్తది అనడంలో సందేహం లేదు. తీరని అప్పు ఎప్పటికైనా ముప్పే. తీసుకున్న అప్పు తీర్చనందుకు ప్రాణాలు తీసిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాజా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. 6 వేల అప్పు తిరిగివ్వలేదని.. ప్రియుడితో కలిసి మహిళను హత్య చేసింది మరో మహిళ. వికారాబాద్ జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ లో వీడిన హత్య మిస్టరీ… నిందితులను పట్టుకున్న పోలీసులు.. బొంరాస్పేట్ మండలం చౌదర్పల్లికి చెందిన ఈర్లపల్లి యశోద హత్య కేసును పోలీసులు చేధించారు.