పాకిస్థాన్ తో చర్చలపై భారత్ కీలక వ్యాఖ్యలు..
భారత్ పై పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తున్నంత కాలం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడవు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుకోవడం లేదు అని ఆయన చెప్పారు. చర్చల కోసం భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్థాన్ చాలా కాలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోందని ఆరోపించారు. అయితే, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్నంత కాలం రెండు దేశాల మధ్య చర్చలు జరిగే ప్రసక్తి లేదన్నారు.
సీఎం జగన్‌పై విరుచుకుపడ్డ వైసీపీ ఎమ్మెల్యే.. మీరు చెప్పిందే చేశా.. నా తప్పంటే ఎలా?
ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మార్పులు, చేర్పులపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ఇక, తమకు సీటు దక్కడం ఖాయమని భావించిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలు.. పక్క పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతుండగా.. మరికొందరు పార్టీ అధినేతపై కూడా ఫైర్ అవుతున్నారు.. ఇప్పుడు చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. నేను చేసినా తప్పు ఎంటో జగన్ చెప్పాలి? అని నిలదీశారు. ఐదేళ్లుగా ఎప్పుడైనా వైఎస్ జగన్ ఒక్కసారి అయినా మమ్మల్ని పిలిచి మాట్లాడారా..? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ చెప్పకముందే నేను నియోజకవర్గంలో గడపగడపకు తిరిగానన్న ఆయన.. దళితులకు జగన్ ఏమి న్యాయం చేశారు..? దళిత ఎమ్మెల్యేలు అంటే చిన్నాచూపా..? అంటూ మండిపడ్డారు.
సీఎం మీకు చిత్త శుద్ది ఉందా? సీబీఐ విచారణకు లేఖ రాస్తారా లేదా…
సీఎం మీకు చిత్త శుద్ది ఉందా లేదా…..సీబీఐ విచారణ కు లేఖ రాస్తారా లేదా? అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తె కేసీఆర్ హయాంలో జరిగిన కుంభకోణాలు, అవినీతి ప్రాజెక్ట్ ల మీద విచారణ జరుపుతామని చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం అని 15 ఈఫిల్ టవర్ లకు వాడినంత ఉక్కు, 7 బుర్జు ఖలీఫా లకు వాదినంట కాంక్రీట్ వాడామని గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు. డిస్కవరీ ఛానల్ లో ప్రచారం చేసుకున్నారు… గిన్నిస్ రికార్డ్ అన్నారని తెలిపారు. కాళేశ్వరం భవిష్యత్ ఏంటి? లక్ష కోట్ల ఖర్చు పరిస్థితి ఏంటన్నారు. ఎన్నికలకి ముందు ఇప్పటి సీఎం మాట్లాడింది ఏంటి ఆలోచించాలన్నారు. రీ ఇంజనీరింగ్ రివర్స్ ఇంజనీరింగ్ అయిందన్నారు. కాళేశ్వరం వల్ల తెలంగాణ ఇమేజ్ ను గోదావరిలో కలిపేశారని అన్నారు. మేడి గడ్డ కుంగిన ఘటనపై వెంటనే కేంద్రానికి పిర్యాదు చేసామన్నారు. కేంద్రం డ్యాంసేఫ్టీ అథారిటీ విజీట్ చేసిందన్నారు. అధికారులతో సమీక్ష చేసిందని అన్నారు. మరిన్ని వివరాలు కావాలని లిఖిత పూర్వకంగా అడిగిందని తెలిపారు. ఇప్పటివరకు వివరాలు ఇవ్వక పోవడం దురదృష్టం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాటలు కాదు.. చేతల్లో చూపించాలనే నిబద్ధతో పనిచేస్తున్నాం
మాటలు కాదు చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి మంత్రివర్గ సమావేశంలో ఆరు హామీలకు ఆమోదం తెలిపిందన్నారు. ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఖమ్మం రూరల్ మండలం మంగళదూడెంలో జరిగిన ప్రజాపాలన సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు 16 గంటల పాటు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని వెల్లడించారు.
ప్రెస్ మీట్లో ఉండగానే ప్రతిపక్ష నేతపై దాడి… మెడపై కత్తిపోట్లు
దక్షిణ కొరియా ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ ప్రముఖ నేత లీ జే-మ్యూంగ్‌పై దాడి జరిగింది. ఇందులో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బుసాన్ పర్యటన సందర్భంగా లీ జే-మ్యూంగ్ జర్నలిస్టులతో మాట్లాడుతున్నప్పుడు ఈ దాడి జరిగింది. అదే సమయంలో ఆయన దుండగుడు మెడపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి నేలపై పడిపోయాడు. ఈ ఘటన చుట్టుపక్కల కలకలం సృష్టించింది. ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మొత్తం సంఘటన వీడియో కూడా బయటపడింది. ఇందులో లీ జే-మ్యుంగ్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఎలా దాడి చేశాడో స్పష్టంగా చూడవచ్చు. దాడి చేసిన వ్యక్తి లీ జే-మ్యుంగ్ ముందు నిలబడి ఉన్నాడు. జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిస్తుండగా తన మెడపై కత్తితో పొడిచాడు.
మా ప్రభుత్వం మీరు చెప్పునట్లు చేసింది, మీ అవసరాలు తిర్చింది..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు చెప్పునట్లు చేసింది , మీ అవసరాలు తిర్చిందన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మాట ఇచ్చినట్లే పెన్షన్ పెంచి మూడు వేల రూపాయలు అందిస్తున్నాం అన్నారు. నిస్పృహాలో బ్రతుకుతున్న పేలకు తమ ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు.. ప్రతి రోజూ వైసీపీ విధానాలు తప్పబడుతూ మాట్లాడిన నేతలే నేడు అవే పథకాలను కొనసాగిస్తామని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికలు వస్తున్నాయి కనుక తాము అన్ని ఇస్తామంటారు.. ప్రజలు ఆలోచించుకోవాలి.. ప్రతిపక్షనేతల మర్మాలను గుర్తించాలని సూచించారు.
26 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్, బ్లాక్‌మెయిల్..
దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాలకు కేరాఫ్‌గా మారుతోంది. ఒంటరిగా ఆడవాళ్లు కనబడితే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. నోయిడాలోని ఓ షాపింగ్ మాల్ సమీపంలో 26 ఏళ్ల యువతిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు, స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తితో పాటు మరో కీలక నిందితుడు ఇద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే, ఈ గ్యాంగ్ రేప్ కొన్ని రోజుల క్రితం జరిగింది. నిందితులంతా స్థానికంగా బలమైన వ్యక్తుల కావడంతో యువతి ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఇదే అలసుగా బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధిస్తుండటంతో యువతి ధైర్యం చేసి డిసెంబర్ 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సెక్టార్ 39 పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పట్టుబడిన ముగ్గురు నిందితులను రాజ్‌కుమార్, ఆజాద్, వికాస్‌లుగా గుర్తించారు. మరో ఇద్దరు నిందితులు రవి, మెహ్మీ పరారీలో ఉన్నారని, వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. స్థానిక కోర్టు పట్టుబడిన వారికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
ఎస్సైలకు కలిసిరానీ చింతపల్లి పోలీస్ స్టేషన్..
నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ కు వాస్తు మార్పులు చేపట్టారు అధికారులు. స్టేషన్ కు వాస్తు దోషం ఉండడం వల్లే కొన్ని సంవత్సరాలుగా వరుసగా ఎస్సైలు వివాదాలతో బదిలీనో లేక సస్పెన్షన్ కో గురవుతున్నారని భావించిన అధికారులు.. వాస్తు మార్పులు చేపట్టారు. వాస్తు మార్పుల్లో భాగంగా స్టేషన్ ముందు భాగం లో ఉన్న స్టోర్ రూమ్ ను గత నెల 29న కూల్చివేశారు పోలీస్ అధికారులు… హైదరాబాద్ నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి వెంట, హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్ కావడంతో ఇక్కడ అన్ని పైరవీ పోస్టింగులే.. హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న మండలం కావడంతో పోలీసు స్టేషన్ కు భూవివాదంతో కూడిన పంచాయతీలు కూడా ఎక్కువే….
ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంగన్వాడీలకు కలెక్టర్ల నోటీసులు..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంగన్వాడీలకు కలెక్టర్లు నోటీసులు ఇచ్చారు. గత 22 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనను నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేశారు. అంగన్వాడీల ఆందోళనతో పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడుతుందని వారు తెలిపారు. గతంలో అనేక సందర్భాల్లో అంగన్వాడీల కోరికలను ప్రభుత్వం పరిష్కరించిందని అన్నారు. అంగన్వాడీల సమ్మెతో పిల్లలు, గర్భిణీ స్త్రీలు వంటి వారికి పౌష్టికాహారం అందించేందుకు ఇబ్బందులు వస్తున్నాని చెప్పారు. ఈ క్రమంలో.. అంగన్వాడీలు జనవరి ఐదు లోపు విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ లు నోటీసులు జారీ చేశారు. జనవరి ఐదు లోపు సమ్మె విరమించకపోతే ప్రభుత్వ నిబంధనల మేరకు శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చేసిన అప్పులకు పెంచిన సంపదకు సంబంధమే లేదు…
ఈనెల 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లో మీ భాగస్వామ్యం కూడా ఉందన్నారు. మీ సలహాలు, సూచనల పాటించాం….గెలిచామని, సఖ్యతగా పనిచేస్తే గెలిచె అవకాశం ఉన్నదని మీరు చెప్పారు, మేం కలిసి గెలిచామన్నారు. ఏమైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో ఖచ్చితంగా అమలు చేస్తామని, తెల్లకాగితలను నల్లగా మార్చే జి ఓ లు కాకుండా అమలు చేసే దిశగా అడుగులు వేశామన్నారు. 48 గంటల్లోనే రెండు హామీలు అమలు చేసామని, ప్రధాన ప్రతిపక్షం తీరు ఎలా ఉందో మీరే చూస్తున్నారన్నారు. ధనిక రాష్ట్రం అంటూ ప్రగల్బాలు పలుకుతూనే అప్పుల కుప్పగా మార్చారని, ఎదో చిన్న చిన్న అప్పులు సహజం అనుకున్నాం… ఛార్జ్ తీసుకున్నాక తెలిసింది రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు అని ఆయన వ్యాఖ్యానించారు. శ్వేత పత్రం విడుదల ద్వారా రాష్ట్ర ఆర్ధిక స్థితి ప్రజలకు తెలియ జేశామని, గడచిన 9న్నర ఏళ్లలో 6 లక్షల కోట్ల పైన అప్పులు చేసారన్నారు. చేసిన అప్పులకు పెంచిన సంపదకు సంబంధమే లేదని, అప్పులు చేసి ఓ మంచి ప్యాలెస్ కట్టారన్నారు. సచివాలయం ఎంతో అద్భుతంగా ఉంది…చార్మినార్ లాగా ఉందని, పేదల బాధలు పట్టించుకోకుండా అప్పులు చేసి మరీ భవనాలు కట్టారన్నారు.
సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గా సాగుతోంది. సీఎంవో నుంచి నేతలకు ఫోన్‌లు వెళ్లడం.. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆశావహులు ఇలా నేతలు సీఎంవోకు క్యూ కడుతున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇంచార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు.
నేను డబ్బులు ఇచ్చి ఓటు అడగని వ్యక్తిని..
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ముద్దిగుప్పం పంచాయతీలో జగనన్న స్వేచ్ఛ ఆరోగ్య కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. త్వరలో ఏపీలో ఎన్నికల నేపథ్యంలో నారాయణస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాను డబ్బులు ఇచ్చి ఓటు అడగని వ్యక్తిని అని అన్నారు. అంతేకాకుండా.. ఎలక్షన్ లో నిలబడి ఎవరి దగ్గర తాను ఒక రూపాయి తీసుకోలేదని చెప్పారు. ఏ పోస్టు అడిగిన తాను ఫ్రీగా చేశానన్నారు. కాంట్రాక్టర్ల దగ్గర తాను డబ్బు తీసుకోలేదని చెప్పారు. నియోజకవర్గంలో ఉన్న లీడర్ల అందరికీ పాదాభివందనం చేస్తున్నట్లు నారాణస్వామి తెలిపారు. తన నియోజకవర్గంలో డబ్బులు ఇస్తేనే మీకు ఓటు వేస్తామని ఎవరు అడిగింది లేదని చెప్పారు. ఇప్పుడు కొత్త సిస్టం వచ్చి తెలుగుదేశం వాళ్ళు ముందుగానే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారని దుయ్యబట్టారు. దళితవాడలోనే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు.