మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.. కోడుమూరు పర్యటనలో ఉన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుభరోసా నిధులలో కేంద్ర వాటాను కూడా తన వాటాగా వైఎస్ జగన్ ప్రచారం చేసుకుంటున్నారు అని దుయ్యబట్టారు.. సిల్వర్ జూబ్లీ, ట్రిపుల్ ఐటీ కళాశాలలకు కేంద్రం నిధులు మంజూరు చేస్తే .. ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు. ఇక, శ్రీశైలం డ్యాం మరమ్మత్తులకు కేంద్రం విడుదల చేసిన 720 కోట్ల రూపాయలలో ఎంతమేర పనులు చేశారో చెప్పాలి..? అంటూ సవాల్ చేశారు. జిల్లాలో వలసల నివారణలో జగన్ ప్రభుత్వం విఫలం అయ్యిందని దుయ్యబట్టారు. వలస నివారణకు ఉపాధి హామీ నిధులను సీఎం వైఎస్ జగన్ పక్కదారి పట్టించడం వాస్తవం కాదా? అని నిలదీశారు. ఇక, ఎన్నికలపుడు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర స్ధిరీకరణ కోసం ఫండ్ ఏర్పాటు చేస్తానని హామి ఇచ్చ్చారు.. కానీ, జగన్ తర్వాత మాటతప్పడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఏటా కేంద్రం ఇచ్చిన 350 కోట్ల రూపాయల నిధులు జగన్ జేబులోకి వెళ్తున్నాయి.. జిల్లాలో సాగు, తాగు, నీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ వివమర్లు గుప్పించారు దగ్గుబాటి పురంధేశ్వరి..
సీఎం, సీఎం కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు.. వారి ఆస్తులు అటాచ్..!
సీఎం, సీఎం కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టేవారిపై నిఘా పెట్టాం.. త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్.. .. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించాం.. వీరి ఆస్తులను కూడా అటాచ్ చేసే దిశగా చర్యలు ఉంటాయంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపైనే కాకుండా.. ప్రతిపక్ష నేతలపై వస్తున్న సోషల్ మీడియా పోస్టులపై కూడా చర్యలు తీసుకుని పోస్టులు తొలగించాం అని తెలిపారు సంజయ్.. ఇటీవల న్యాయ వ్యవస్థని కించ పరిచే విధంగా కూడా పోస్టులు పెట్టారని గుర్తుచేశారు. వీరిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.. సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెడుతున్న వారిలో టీడీపీ కార్తీక్ రెడ్డి, సమర సింహా రెడ్డి, చిత్రళహరి, వైసీపీ మొగుడు అనే అకౌంట్స్ గుర్తించాం.. ఇతర దేశాల నుంచి అసభ్య పోస్టులు వారిని ఎంబసీ వాళ్లతో మాట్లాడిచర్యలు చేపట్టాం అన్నారు. ఇప్పటి వరకు ఇలా చేసిన నలుగురిపై చర్యలు తీసుకున్నాం.. సోషల్ మీడియా నుంచి అసభ్య పోస్టులు పెట్టే వారు నగరం నుంచి గ్రామ స్థాయికి చేరిందన్నారు. 202 సోషల్ మీడియా అకౌంట్స్ ను మోనటరింగ్ చేస్తున్నాం.. 2 నెలల్లో కొత్తగా 31 కొత్త సోషల్ మీడియా అకౌంట్స్ ను గుర్తించాం.. అసభ్య పోస్టులను షేర్, లైక్ చేస్తున్న వారిపై 2972 సైబర్ బుల్లయింగ్ షీట్స్ ఓపెన్ చేశామని వెల్లడించారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్.
ఏపీలో బఫెలో స్కామ్..? సీబీఐ విచారణకు డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలవెల్లువపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. ఏపీలోని బఫెలో స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక, నవంబర్ 14వ తేదీ నుంచి రోజుకో స్కామ్‌ను ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు.. నా అక్కలు.. చెల్లమ్మలంటూనే జగన్ ప్రభుత్వం మోసం చేస్తోంది. జగనన్న పాల వెల్లువ కాదు.. పాపాల వెల్లువ అని స్పష్టంగా చెప్పాం. జగనన్న పాల వెల్లువ పేరుతో దోపిడీ జరిగింది. జగన్ పాల వెల్లువ.. జగనన్న చేయూత చక్కగా అమలైతే రూ. 14500 కోట్లు మహిళలకు చేరేవి. మా విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు.. కానీ, పార్టీ పరంగా వైసీపీ మాత్రం కౌంటర్ ఇచ్చిందని మండిపడ్డారు. బ్యాంకులు రుణాలిస్తాయి.. మేం సబ్సిడీ ఇవ్వడం లేదనేది వైసీపీ వాదన. 3.94 లక్షల పాడి పశువుల కోసం రూ. 2350 కోట్లు ఖర్చు పెట్టామని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. పశువుల కొనుగోళ్ల నిమిత్తం బ్యాంకులు లోన్లు ఇస్తే.. ఆ వివరాలు వెల్లడించాలి కదా? అని నిలదీశారు నాదెండ్ల.. పాడి పశువులను రీ-సైకిలింగ్ చేశారని ఎస్ఎల్బీసీ సమావేశంలో ప్రభుత్వమే చెప్పింది. 8 వేల పాడి పశువులను మాత్రమే కొనుగోలు చేసి.. వాటినే రీ-సైక్లింగ్ చేస్తూ లక్షల సంఖ్యలో కొనుగోళ్లు చేసినట్టు చూపారు. 3.94 లక్షల పశువులు కొనుగోలు చేసి ఉంటే ప్రభుత్వం ఆ లబ్ధిదారుల వివరాలు ఇవ్వగలదా..? అని సవాల్ చేశారు.
చంద్రబాబుపై కేసులు.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వరుసగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు.. ఇలా వివిధ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లపై విచారణ సాగుతూనే ఉంది.. అయితే, తాజాగా చంద్రబాబుపై ఉచిత ఇసుక విధానంలో విషయంలోనూ కేసు నమోదు అయిన విషయం విదితమే.. ఇక, ఆ పాలసీ ద్వారా రాష్ట్ర ఖజానాకు చంద్రబాబు నష్టం కలిగించాడని సీఐడీ అభియోగాలు మోపింది.. అయితే, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు.. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ పిటిషన్ పై విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. పీటీ వారెంట్ పై విచారణ ను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఈ నెల 28 వరకు హైకోర్టుకు పొడించటంతో ఈ నెల 29వ తేదీ వరకు తదుపరి విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కాగా, గత ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కానీ, రాజకీయ కార్యకలాపాలకు తనను దూరంగా ఉంచాలని, న్యాయవిచారణ ప్రక్రియలో మునిగిపోయేలా చేయాలని, వేధించాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ కేసు నమోదు చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 20వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.. ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించలేదని పేర్కొంది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను సీఐడీ చేర్చిన విషయం విదితమే.
మీరు చూసింది ట్రైలర్ మాత్రమే.. ఇంకా చాలా ఉంది..
ది పార్క్ హోటల్ తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సోమాజిగూడలో ఇంటరాక్టివ్ మీటింగ్‌కు మంత్రి కేటీఆర్ హాజరై ఎన్నికల్లో పారిశ్రామికవేత్తల మద్దతు కోరారు. తాను ఇక్కడికి పూర్తి రాజకీయ నాయకుడుగానే వచ్చానని, మీ మద్దతు కావాలని పారిశ్రామిక వేత్తలను ఆయన కోరారు. పారిశ్రామికవేత్తలాగా కాకుండా ఒక్క పౌరుడిగా ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ వచ్చిన తరవాత కేసీఆర్‌ను ఎంత మంది ఎన్ని మాటలు అన్నారో గుర్తు చేసుకోవాలన్నారు. పరిపాలన రాదు, కరెంట్ ఉండదు ఆంధ్ర వాళ్ళను వెల్లగొడతారు అని, గొడవలు జరుగుతాయి అని అన్నారని.. భూములు విలువ పడిపోతుంది అని కొంత మందికి అనుమానాలు, అపోహలు ఉండేవన్నారు. పరిశ్రమలకు టైం బౌండ్ పర్మిషన్స్ ఇస్తున్నారా అని ఆనాడు సీఎం కేసీఆర్ అధికారులను అడిగితే సరైన సమాధానం రాలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. రెండు రోజులు పాటు పవర్ హాలిడే ఉంటే కార్మికులు ఎలా బ్రతుకుతారు అని అన్నారని.. పవర్ సమస్య ఎంత తీవ్రంగా ఉండే తెలంగాణలో ఆనాడు అని మంత్రి గుర్తు చేశారు. 10 నిమిషాలు కరెంట్ పోతే ఇప్పుడు తట్టుకోలేపోతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం వచ్చారు, పాపం ఆయనకు కరెక్ట్ స్క్రిప్ట్ ఇవ్వలేదు, కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం అంటే కింద ఉన్న వారు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం 3లక్షల 17 వేలు దాకా ఉందన్నారు. 2014కు ముందు నగర శివార్లలో 14 రోజులకు ఒక్కసారి నీరు వచ్చేవి.. ఇప్పుడు రోజూ వస్తున్నాయని మంత్రి చెప్పారు.
కాంగ్రెస్ ప్రభంజనం మొదలైంది.. ప్రజలు డిసైడ్ అయ్యారు..
ఎక్కడ పోయినా కాంగ్రెస్ అంటున్నారని, కాంగ్రెస్ ప్రభంజనం మొదలైందని ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలు డిసైడ్ అయ్యారని.. అందరూ డిసెంబర్ 3 కోసం వెయిటింగ్ అంటూ పేర్కొన్నారు. ఎవరు ఏం ఇచ్చినా.. కాంగ్రెస్‌కి ఓటేస్తారని ఆయన అన్నారు. రేవంత్ నాయకత్వంలో, సోనియాగాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ దూసుకుపోతుందన్నారు. బుల్లెట్‌లా రేవంత్ దూసుకుపోతున్నారని బండ్ల గణేష్ పేర్కొన్నారు. దేశం కోసం రాజీవ్ గాంధీ బాడీ ముక్కలైందని.. రాజీవ్ బాడీ ముక్కలు ఏరుకుని.. స్మశానానికి రాహుల్ వెళ్లారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కల కోసం కాంగ్రెస్‌ని గెలిపించాలని ప్రజలకు సూచించారు. రాహుల్ గాంధీపై కూడా విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్ ఎప్పుడూ హద్దు దాటలేదన్నారు. ఎప్పుడైనా ఏకవచనంతో మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎవడు అని అడుగుతున్నారని.. అహంకారంతో మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నా శ్వాస కాంగ్రెస్.. నా మాట కాంగ్రెస్ అంటూ బండ్ల గణేష్ అన్నారు. అయ్యప్ప మాలతో చెప్తున్నా.. కాంగ్రెస్ తెలంగాణను ఏలాలన్నారు. తాను కాంగ్రెస్ వ్యక్తిగా గర్వపడుతానని బండ్ల గణేష్ స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట మేము.. డబుల్ బెడ్రూం ఇచ్చిన చోట మీరు..
జోగు రామన్న నీతిమంతుడైతే కేసీఆర్ ఎందుకు ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మిమ్మల్ని మోసం చేసిన జోగు రామన్నను ఓడించాలని ప్రజలకు ఆయన సూచించారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా అని.. తెలంగాణ వచ్చినా ఇక్కడి ప్రజలకు నీళ్లు రాలేదు.. నిధులు రాలేదు.. నియామకాలు జరగలేదన్నారు. కమీషన్ల కక్కుర్తితోనే మేడిగడ్డ కుంగిపోయిందని, అన్నారం పగిలిపోయిందని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో లక్ష కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్ అంటూ రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఇస్తే.. పదేళ్లయినా యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానించారు. జోగు రామన్నకు.. జోకుడు రామన్నకు తేడా లేదన్నారు. రాష్ట్రంలో జోగు రామన్నలాంటి పిల్ల రాక్షసులకు గురువు బ్రహ్మరాక్షసుడు కేసీఆర్ అని ఆయన అన్నారు. ఆ బ్రహ్మరాక్షసుడిని ఓడించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ప్రజలకు ఏమీ చేయని బీఆర్‌ఎస్‌కు ఓటెందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. దొరల తెలంగాణ కావాలో, ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాలన్నారు.బీజేపీకి ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్టేనని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని రేవంత్ చెప్పారు. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎం అని గతంలో మాట్లాడిన మోడీ… నిన్న మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా…మోదీ తెలంగాణకు వచ్చి తొండను కూడా పట్టలేకపోయారన్నారు.
“సిగ్గులేదు, మీరు ఇంకెంత దిగజారుతారు”.. నితీష్ కుమార్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ..
జనాభా నియంత్రణ గురించి బీహార్ అసెంబ్లీలో నిన్న సీఎం నితీష్ కుమార్ మాట్లాడటం వివాదాస్పదం అయ్యాయి. మహిళ గౌరవాన్ని దెబ్బతీసేలా నితీష్ వ్యవహరించడంపై పలువురు మహిళా ప్రజాప్రతినిధులతో పాటు విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీంతో తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని ఈ రోజు సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు. ఇదిలా ఉంటే ఈ వివాదంపై ప్రధాని నరేంద్రమోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు, వారి కూటమి ఇండియాను విమర్శించారు. మధ్యప్రదేశ్ లోని గుణాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశాన్ని అవమానించడమే అని ఆయన అన్నారు. ‘‘ ఇండియా కూటమిలో ఒక పెద్ద నాయకుడు (నితీష్ కుమార్) అసెంబ్లలో అసభ్య పదజాలం ఉపయోగించాడదు. వారికి సిగ్గులేదు. ఇండియా కూటమిలోని ఏ నాయకుడు కూడా దీన్ని వ్యతిరేకించలేదు. మహిళల గురించి ఆలోచించే పద్దతి ఇదేనా..? వారు మీకు మంచి చేయగలారా..?’’ అంటూ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్ల పట్ల ఇలాంటి దుర్మార్గపు వైఖరి ఉన్నవారు మన దేశాన్ని అవమానిస్తున్నారు. మీరు ఎంత దిగజారిపోతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మహువా మోయిత్రాపై సీబీఐ విచారణ.? “క్యాష్ ఫర్ క్వేరీ” కేసులో కీలక మలుపు
పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా డబ్బులు తీసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆమెను పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. ఇదిలా ఉంటే మహువా మోయిత్రాపై సీబీఐ విచారణ చేయాలని యాంటీ-కరప్షన్ ప్యానెల్ ఆదేశించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ మహువా మోయిత్రాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక సంస్థ లోక్‌పాల్ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినట్లు బీజేపీకి చెందిన ఎంపీ నిషికాంత్ దూబే ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘‘ నా ఫిర్యాదు ఆధారంగా జాతీయ భద్రత విషయంలో రాజీ పడిన మహువా మోయిత్రా అవినీతిపై లోక్‌పాల్ సీబీఐ విచారణకు ఆదేశించింది.’’ అంటూ ట్వీట్ చేశారు. ఇదే నిజమైతే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు అవుతుంది. పార్లమెంట్‌లో అదానీకి వ్యతిరేకంగా ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని మహువా మోయిత్రా ప్రశ్నలు అడిగిందని, అందుకు గానూ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు, గిఫ్టులు తీసుకుందని నిషికాంత్ దూబే ఆరోపించారు. దీనిపై లోక్ సభ స్పీకర్‌కి లేఖ రాశారు. మరోవైపు మహువా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరే వారితో పంచుకోవడమే కాకుండా, దుబాయ్ నుంచి లాగిన్ అయిందని దీనిపై విచారణ జరపాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేఖ రాశారు.
టచింగ్.. టచింగ్ వీడియో సాంగ్.. యూట్యూబ్ లో కుమ్మేస్తోంది
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అను ఇమ్మాన్యుయేల్ జంటగా జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం జపాన్. ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జపాన్ దీపావళి కానుకగా నవంబర్ 10 గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టచింగ్ టచింగ్ సాంగ్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక టచింగ్.. టచింగ్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ ను కార్తీ పాడడం విశేషం. ఇక ఇందులో కార్తీ, అను రొమాన్స్ అదిరిపోయింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్ షేక్ చేస్తోంది. జపాన్ లో కార్తీ లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పాలి. ఈ చిత్రంలో కార్తీ కరుడుగట్టిన దొంగగా కనిపించనున్నాడు. ఇక ఈ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు అన్ని డబ్బింగ్ సినిమాలే. అందులో కొద్దోగొప్పో హైప్ తెచ్చుకున్న సినిమా అంటే జపాన్ అనే చెప్పాలి. దీంతో ఫ్యాన్స్ అందరూ.. జపాన్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో కార్తీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
ఈ వారమంతా డబ్బింగ్ సినిమాలదే హవా.. ఏమేం రిలీజ్ అవుతున్నాయంటే?
ఇక నవంబర్ 12న దీపావళి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి అనే విషయానికి వస్తే ఈ సారి డైరెక్ట్ తెలుగు సినిమాలు తక్కువగానే ఉన్నాయి. వాటి కంటే డబ్బింగ్ సినిమాలదే హవా కనిపిస్తోంది. ఇక తమిళ హీరో కార్తీ తాజాగా నటించిన జపాన్ నవంబర్ 10న రిలీజ్ అవుతోంది. .ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహించగా అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నవంబర్ 10న దీపావళి పండుగ కానుకగా విడుదల చేయనున్నారు. రాఘవ లారెన్స్, ఎస్. జె.సూర్య కీలక పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్న జిగర్ తండా డబుల్ ఎక్స్ ని కూడా మూవీ దీపావళి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక తెలుగు సినిమా విషయానికి వస్తే దినేశ్ తేజ్ హీరోగా నటించిన అలా నిన్ను చేరిలో హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్ గా నటించారు.ఈ మూవీకి మారేష్ శివన్ దర్శకత్వం వహించగా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో జనం అనే మరో చిన్న సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇక ఇవి కాక ది మార్వెల్స్ అమెరికన్ సూపర్ హీరో సినిమానవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళ భాషల్లో విడుదల కానుంది. మార్వెల్ కామిక్స్ ఆధారంగా రానున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటి బ్రీ లార్సన్ కెప్టెన్ మార్వెల్ పాత్రలో కనిపించనుంది. నియా డకోస్టా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక తమిళ రాము వెంకట్, దీపన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దీపావళి. రా వెంకట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా దీపావళి సందర్భంగా నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క మనీష్ శర్మ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం టైగర్3లో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ దీపావళి సందర్భంగా నవంబరు 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.