*కేజ్రీవాల్‌కి దక్కని ఊరట..ఏప్రిల్ 1 వరకు కస్టడీ పొడగించిన కోర్టు..
ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి చుక్కెదురైంది. ఆయన కస్టడీని పొడగించాలని ఈడీ కోరుతుండటంతో రౌస్ ఎవెన్యూ కోర్టు అందుకు అంగీకరించింది. ఈడీ మరో 7 రోజులు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరగా.. కోర్టు మరో 4 రోజులు కస్టడీని పొడగించింది. ఏప్రిల్ 1 వరకు ఆయన రిమాండ్‌ని పొడగించింది. కేజ్రీవాల్ భార్యకు చెందినదిగా భావిస్తున్న ఒక ఫోన్‌లోని డాటాను వెలికితీసినట్లు, విశ్లేషిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. మార్చి 21న కేజ్రీవాల్ నివాసం నుంచి సీజ్ చేసిన 4 డిజిటల్ డివైజెస్ నుంచి ఇంకా సమాచారం సేకరించలేదని ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్ ఈ వివరాలను అందించడానికి తన న్యాయవాదులను సంప్రదించేందుకు సమయం కోరారు. మార్చి 21న కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయగా ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ రోజుతో కస్టడీ ముగుస్తుండటంతో మరో 7 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. చివరకు 4 రోజులకు కోర్టు అనుమతించింది. ఇదిలా ఉంటే ఈడీ కావాలనేే ఈ కుట్రలో ఇరికిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈడీ, సీబీఐ ఛార్జిషీట్‌లో తన పేరు ఎక్కడా లేని ప్రస్తావించారు. ఈడీ రెండు లక్ష్యాలతో పనిచేస్తోందని తనను లిక్కర్ కేసులో ఇరికించడంతో పాటు, ఆప్ పార్టీని మూసేయాలని చూస్తోందని కోర్టులో చెప్పారు. ఇది రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఈ కేసులో ఈడీ ఆరోపిస్తున్నట్లు రూ. 100 కోట్లలో డబ్బులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ఈడీ కావాల్సినన్ని రోజుల తనను కస్టడీలో ఉంచుకోవచ్చని అన్నారు.
*ముగిసిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. దీని కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎక్స్‌అఫీషియో సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1,439 మంది ఓటర్లు ఉన్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయన ఓటు వేశారు. నాగర్ కర్నూల్‌లో ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్‌రెడ్డి, ఫరూక్‌నగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఓటు వేశారు. కాగా కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి , స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్‌గౌడ్ బరిలో ఉన్నారు.
*ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని విచారిస్తున్న అధికారులు
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, గట్టుమల్లును అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో డీసీపీ విజయ్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. గట్టు మల్లు గతంలో ఎస్‌ఐబీలో సీఐగా విధులు నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్, గట్టుమల్లు కీలకంగా ఉన్నట్లు వార్తలు సమాచారం. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ప్రభాకర్‌రావు నుంచి వచ్చే ఆదేశాలను ఎప్పటికప్పుడు రాధాకిషన్ పాటించినట్లు.. ప్రభాకర్‌రావు చెప్పిన వ్యాపారులను టాస్క్‌ఫోర్స్ ఆఫీసుకు పిలిచి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో హవాలా నగదుపై నిఘాపెట్టి కొట్టేసినట్లు తెలిసింది. ప్రతిపక్ష నేతల ఇళ్లల్లో నిఘాపెట్టి అధికార పార్టీకి రాధాకిషన్ సమాచారం చేరవేసినట్లు.. ప్రతిపక్ష నేతలను అనధికారికంగా నిర్బందించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌లే ఫోన్ ట్యాపింగ్‌లో కీలక సూత్రదారులు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి, ప్రభుత్వం మారాక హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు వారిపై ఆరోపణలున్నాయి. మరో వైపు భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
*కొడాలి నాని సవాల్
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ విసిరారు. అర్హత ఉండి గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వ సహాయం అందలేదు…. ఇళ్ల స్థలాలు రాలేదని ప్రతిపక్షాలు ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయనని ఛాలెంజ్ చేశారు. 20 సంవత్సరాల పేదల ఇళ్ల స్థలాల అప్పును రూపాయి కట్టించుకొని రద్దు చేసిన చరిత్ర సీఎం జగన్‌ది అంటూ ఆయన వెల్లడించారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రుణం రద్దుచేసి.. పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో లబ్ధిదారులను రుణ విముక్తులను చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుణాలన్నీ రద్దు చేసే బాధ్యత నాది…. సీఎం జగన్‌ది అంటూ హామీలు గుప్పించారు. జగన్ ప్రభుత్వ పాలన దేశ చరిత్రలోనే రికార్డ్.. స్వర్ణ అక్షరాలతో లిఖించబడుతుందన్నారు. కులాలు, మతాలు, పార్టీలకతీతంగా ప్రభుత్వ సాయాన్ని ప్రతి ఒక్కరికి అందించడాన్ని గర్వంగా భావిస్తున్నామని కొడాలి నాని స్పష్టం చేశారు.
*గురుద్వారా దగ్గర కాల్పులు.. డేరా కరసేవ చీఫ్ తర్సేమ్ హత్య
ఉత్తరాఖండ్‌లో పట్టపగలే ఇద్దరు దుండగులు ఘాతుకానికి తెగబడ్డారు. ఉదమ్ సింగ్ నగర్‌లోని నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా ఆవరణలో డేరా కరసేవ చీఫ్ బాబా తర్సేమ్ సింగ్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. ఉదయం 6:30 గంటల సమయంలో గురుద్వారా ప్రాంగణంలో కుర్చీపై కూర్చుని ఉండగా తర్సేమ్ సింగ్‌పై కాల్పులు జరిపారు. బైక్‌పై లోపలికి ఎంట్రీ ఇచ్చిన దుండగులు.. వచ్చిరాగానే కాల్పులకు తెగబడడంతో అక్కడికక్కడే తర్సేమ్ సింగ్ కుప్పకూలిపోయాడు. అనంతరం అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అయినా కూడా అతని ప్రాణాలు నిలువలేదు. మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఈ ఆలయం ధమ్ సింగ్ నగర్ జిల్లాలో రుద్రపూర్-తనక్‌పూర్ మార్గంలోని సిక్కుల పుణ్యక్షేత్రంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఇక హత్యపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరాఖండ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని నానక్‌మట్టా ప్రాంతంలో అదనపు పోలీసు సిబ్బందిని మోహరించామని, శాంతిభద్రతలను కాపాడేందుకు సహకరించాలని సిక్కు సమాజానికి పోలీసులు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక హత్య వెనుక ఏదైనా కుట్ర ఉందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. కేసు దర్యాప్తునకు కేంద్ర బృందాల సాయం కూడా కోరతామని వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీజీపీ వెల్లడించారు.
*మరోసారి తండ్రయిన ముఖ్యమంత్రి
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య గురుప్రీత్ కౌర్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మాన్ ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. పాప ఫొటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దేవుడు కుమార్తెను బహుమతిగా ఇచ్చాడని.. తల్లి, బిడ్డ లిద్దరూ క్షేమంగా ఉన్నారని భగవంత్ మాన్ తెలిపారు. బిడ్డను దీవించాలని ఆయన కోరారు. లూథియానాలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో ప్రసవం జరిగింది. భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన గురుప్రీత్ కౌర్ అనే డాక్టర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్యతో దూరంగా ఉండడంతో గురుప్రీత్ కౌర్‌ను మరో పెళ్లి చేసుకున్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారీ మెజార్టీతో పంజాబ్ ప్రజలు పట్టంకట్టారు. అనంతరం కేజ్రీవాల్.. భగవంత్ మాన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఇదిలా ఉంటే ఆప్.. ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ పంజాబ్‌లో మాత్రం ఆమ్ ఆద్మీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. అన్ని స్థానాల్లో సింగిల్‌గానే పోటీ చేస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈడీ అధికారులు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడంపై మాన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం ఈడీని అడ్డంపెట్టుకుని కుట్ర రాజకీయాలకు చేస్తోందని ఆయన ఆరోపించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు.
*పరీక్షలో ఆన్సర్స్ చూపించలేదని కత్తితో దాడి చేసిన విద్యార్థులు..
మహారాష్ట్రలో దారుణం జరిగింది. 10 తరగతి పరీక్షల్లో సహవిద్యార్థి ఆన్సర్స్ చూపించడం లేదని, ముగ్గురు విద్యార్థులు కత్తితో పొడిచారు. ఈ ఘటన రాష్ట్రంలోని థానే జిల్లా భివాండీ పట్టణంలో చోటు చేసుకుంది. పరీక్షలో ఆన్సర్ పేపర్ చూపించడం లేదని ముగ్గురు మైనర్ స్టూడెంట్స్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గురువారం తెలిపారు. మంగళవారం పరీక్ష ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. గాయపడిన విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఎస్ఎస్‌సీ పరీక్షల్లో బాధిత విద్యార్థి, ఇతర విద్యార్థులకు సమాధానాలు చూపించడానికి నిరాకరించారు. దీంతో కోపం పెంచుకున్న ముగ్గురు విద్యార్థులు పరీక్ష హాల్ నుంచి బయటకు రాగానే సదరు విద్యార్థిని పట్టుకుని కొట్టారు, అతడిని కత్తితో పొడిచారు. దాడిలో గాయపడిన విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రాణాపాయం లేకుండా విద్యార్థి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ముగ్గురు విద్యార్థులపై ఐపీసీ సెక్షన్ 324 ప్రకారం శాంతి నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
*భారత ఆర్థిక వ్యవస్థకు 2047 వరకు తిరుగులేదు.. 8 శాతానికి పైగా వృద్ధి..
అమెరికా, జపాన్, పలు యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉండగా.. కేవలం ప్రపంచంలో ఒక్క భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఆశాజనకంగా ఉంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు భారత వృద్ధి రేటు 8 శాతం ఉంటుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) సీనియర్ అధికారి భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 వరకు తిరుగు ఉండదని చెప్పారు. గత 10 ఏళ్లుగా దేశం అమలు చేసిన మంచి విధానాలను రెట్టింపు చేసి, సంస్కరణలను వేగవంతం చేయగలిగితే, 2047 వరకు భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్ ఈ రోజు అన్నారు. 8 శాతం వృద్ధి రేటు అనేది చాలా ప్రతిష్టాత్మకమైనదని, ఎందుకంటే భారత్ ఇంతకుముందు 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందలేదు, కానీ సాధించగలిగిందని చెప్పారు. ‘‘మా ఆలోచన ఏంటంటే, గత 10 ఏళ్లలో భారత్ నమోదు చేసుకున్న వృద్ధి రకంతో, గత 10 ఏళ్ల పాటు అమలు చేసిన విధానాలను రెట్టింపు చేయగలిగితే, ఆర్థిక సంస్కరణలు వేగవంతం చేయగలిగితే అప్పుడు 2047 వరకు భారత్ 8 శాతం వద్ద వృద్ధి చెందుతుంది.’’ అని టైమ్స్ నౌ సమ్మిట్‌లో అన్నారు. 2023 చివరి మూడు నెలల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే మెరుగైన 8.4 శాతం వృద్ధిని సాధించింది, గత ఒకటిన్నర సంవత్సరాల్లో అత్యంత వేగాన్ని నమోదు చేసింది. అక్టోబర్-డిసెంబర్‌లో వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలను 7.6 శాతానికి తీసుకెళ్లింది. భారత్ 2047 వరకు 8 శాతం వృద్ధి సాధిస్తే 55 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని సుబ్రమణియన్ అన్నారు. 1991 నుంచి భారత సగటు వృద్ధి 7 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉందని ఆయన హైలెట్ చేశారు. ఎక్కువ ఉద్యోగాలను సృష్టించగలిగితే మాకు అవకాశం ఉందని, అది చాలా ఎక్కువ వినియోగానికి దారితీస్తుందని అన్నారు. ఉద్యోగ కల్పనలో మాన్యుఫాక్చర్ రంగాన్ని ప్రోత్సహించాల్సి అవసరాన్ని నొక్కి చెప్పారు. లాండ్, లేబర్, మూలధనం, లాజిస్టిక్ రంగంలో సంస్కరణలు అవసరమని ఆయన చెప్పారు. తయారీ రంగంలో సంస్కరణలు అవసరమని, అదే సమయంలో తయారీ రంగానికి క్రెడిట్ అందించడానికి బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు కూడా అవసరమని సుబ్రమణియన్ పేర్కొన్నారు.
*టుస్సాడ్స్ లో బన్నీ మైనపు విగ్రహం
మెగా కాంపౌండ్ నుండి వచ్చి హీరోగా మారిన అల్లు అర్జున్ అతి తక్కువ సమయంలోనే స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. మెగా హీరో అని ఇంకా ఎన్నాళ్లు అనిపించకుంటాం? అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఐకాన్ స్టార్ గా అవతారమెత్తి పుష్ప ది రైజ్ సినిమాతో కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక సౌత్ హీరోలలో అల్లు అర్జున్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. అందుకు నిదర్శనంగానే దుబాయ్ లో ఉన్న మేడం టుస్సాడ్స్ వ్యాక్స్ స్టాట్యూ మ్యూజియంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సౌత్ ఇండియా నుంచి ఏర్పాటు చేయబడుతున్న మొట్టమొదటి హీరో విగ్రహం ఇదేనని తెలుస్తోంది. ఇక ఈ రోజు అల్లు అర్జున్ చేతుల మీదుగా ఆ వాక్స్ స్టాట్యూ ఓపెనింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే దానితో కలిసి ఫోటో దిగాడు అల్లు అర్జున్. అయితే వెనుక నుంచి ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ రోజే వ్యాక్స్ స్టాట్యూ ఓపెనింగ్ జరిగిందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు వెనక నుంచి చూడడంతో ఆ విగ్రహంతో పాటు అల్లు అర్జున్ కూడా ఒకేలా కనిపిస్తున్నారు. ఇందులో ఒరిజినల్ అల్లు అర్జున్ ఎవరు? విగ్రహం ఎవరు? అనేది కూడా కనిపెట్టడం కాస్త కష్టంగానే ఉంది. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికి ఆయన పుష్ప సీక్వెల్ సెకండ్ పార్ట్ లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. అయితే ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా ఉంటుందే అనే విషయం మీద అధికారికంగా ప్రకటన లేదు. కానీ పలువురి దర్శకుల పేర్లే అయితే తెరమీదకి వస్తూనే ఉన్నాయి.
*సిద్ధార్థ్-అదితి సీక్రెట్ పెళ్ళిలో మరో ట్విస్టు
సినీ హీరో సిద్ధార్థ హీరోయిన్ అదితి రావు హైదరిని వివాహం చేసుకున్నారని నిన్న మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. పెబ్బేరు మండలంలో ఉన్న రంగనాయక పురం రంగనాయక స్వామి ఆలయంలో వీరు రహస్యంగా పూజలు చేయడంతో వివాహం జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి తోడు స్థానిక పూజారులను ఆలయంలోకి అనుమతించకుండా షూటింగ్ చేస్తున్నామని పర్మిషన్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. తమిళనాడు నుంచి పూజారులను తీసుకొచ్చి లోపలికి వెళ్లడంతో దాదాపుగా పెళ్లి అయిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఇదే విషయం మీద ఎట్టకేలకు అదితీ రావు హైదరి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తాను సిద్ధార్థతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి అతను ఎస్ చెప్పాడు మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాము అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో వీరిద్దరికీ వివాహం జరిగిందంటూ జరుగుతున్న ప్రచారానికి బ్రేకులు పడినట్లు అయింది. సిద్ధార్థ 2003 వ సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితురాలు అయిన మేఘనను వివాహం చేసుకున్నారు. వివాదాలు రావడంతో ఇద్దరూ 2007వ సంవత్సరంలోనే విడాకులు కూడా తీసుకున్నారు. తర్వాత సిద్ధార్థ పలువురు హీరోయిన్లతో డేట్ చేసినట్లు వార్తలు వచ్చాయి కానీ ఎవరితోనో పెళ్లి వరకు వెళ్లలేదు. తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి సంస్థాన రాజ కుటుంబానికి చెందిన అదితీరావు హైదరికి కూడా గతంలోనే ఒక వ్యక్తితో వివాహం జరగగా వారి బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. వారు కూడా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.