రేపు కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్.. రైతులకు సాయం ప్రకటిస్తారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రామడుగు మండలంలోని రైతులకు చెందిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి సహాయానికి సంబంధించి అధికారులకు సూచనలు అందించనున్నారు. రామడుగు మండలంలోని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానతో కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలోని ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీ పూర్ గ్రామాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. మూడు రోజులు కురిసిన అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. భారీ వర్షం, ఈదురుగాలులు, వడగండ్ల వానతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. నష్టం వివరాలను తెలుసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు గ్రామాల్లో పర్యటించి నివేదికలు సిద్ధం చేసి అందజేశారు. జిల్లాలో వరి, మామిడి, మిరప, మొక్కజొన్న, టమాటో తదితర పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న కోత దశలో కిందపడిపోవడంతో యంత్రాలతో కోయలేని పరిస్థితి నెలకొంది. వడగళ్ల వానకు ఆయా రైతులు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు.
గవర్నర్‌కి రేవంత్ లేఖ.. సీబీఐ, ఈడీలను రంగంలోకి దింపాలని డిమాండ్
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సిట్ విచారణ ద్వారా ప్రవీణ్ కుమార్, రాజశేఖర రెడ్డి దోషులుగా చూపబడ్డారని.. ఇతరులతో పాటు ఆ ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు. ఆ ఇద్దరి వద్ద పోటీ పరీక్షలకు సంబంధించిన కొన్ని ప్రశ్నాపత్రాలు లభ్యమైనట్లు గుర్తించి, వాటిని అసంఖ్యాక అభ్యర్థులకు విక్రయించినట్లు తేలిందన్నారు. అయితే.. మంత్రి కేటీఆర్ ‘‘ఇది ఇద్దరు వ్యక్తుల పొరపాటు మాత్రమేనని, వ్యవస్థాగత లోపం కాదు’’ అని అనడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఈ స్కామ్‌ను ఇద్దరు వ్యక్తుల సాధారణ పొరపాటుగా కప్పిపుచ్చడానికి మంత్రి తన వంతు కృషి చేస్తున్నారని ఆరోపించారు. TSPSC గత 8 ఏళ్లుగా గణనీయమైన సంస్కరణలు చేసిందని మంత్రి పొగడడాన్ని చూస్తే.. మొత్తం ఎపిసోడ్‌ను తక్కువ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం కోసం ఏళ్ల తరబడి శ్రమిస్తున్న లక్షలాది మంది యువత స్ఫూర్తిని దెబ్బతీస్తూ.. ఇప్పటికే నిర్వహించిన కొన్ని పరీక్షలను రద్దు చేయాలని, మరికొన్ని పరీక్షలను వాయిదా వేయాలని TSPSC నిర్ణయించిందన్నారు. టీఎస్‌పీఎస్‌సీ చేసిన ఎంపికల విశ్వసనీయతపై కూడా ప్రభుత్వ తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. TSPSC ప్రభుత్వ సంస్థ విశ్వసనీయతపై యువతలో విశ్వాసం లోపించిందన్నారు.
కార్లపై భలే ఆఫర్లు.. ఇక లేట్ ఎందుకు..?
ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా , టాటా కంపెనీలు పలు మోడళ్ల కార్లపై భారీ ఆఫర్లు ప్రకటించారు.. అయితే, ఈ ఆఫర్లు కొన్నిరోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.. మార్చి నెలతో ముగిసిపోనున్నాయి.. ఇక, ఏ ఆటోమొబైల్ దిగ్గజం.. ఏఏ మోడల్స్ కార్లపై ఆఫర్లు ప్రకటించింది అనే విషయంలోకి వెళ్తే.. తన కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది మారుతి.. వివిధ మోడల్స్‌పై ఒక్కో రకమైన ఆఫర్ తీసుకొచ్చింది.. ఈ నెలలో మారుతి సుజుకి ఇగ్నిస్‌పై రూ. 52వేల తగ్గింపు.. మారుతి సియాజ్‌పై రూ. 28 వేలు.. ఆల్టోపై రూ. 38వేలు, ఆల్టో కే10, ఎస్-ప్రెస్సోపై రూ. 49వేలు , వ్యాగన్ఆర్ కారుపై రూ. 64వేలు, స్విఫ్ట్ పై రూ. 54వేలు, స్విఫ్ట్ డిజైర్ పై రూ. 10 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది మారుతి. అయితే మారుతి సుజుకి బాలెనో, బ్రెజ్జా, గ్రాండ్ విటారా వంటి మోడళ్లపై మాత్రం ఆఫర్లు ప్రకటించలేదు. మరోవైపు హ్యుందాయ్ కార్లపై ఆఫర్ విషానికి వస్తే.. ఈ నెలలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ.38 వేల వరకు, ఐ20పై రూ. 20 వేలు, హ్యుందాయ్ ఆరాపై రూ.33 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.. అయితే, క్రెటా, వెన్యూ, అల్కాజార్, టక్సన్ వంటి ఎస్‌యూవీ మోడళ్లపై ఎలాంటి ఆఫర్లు లేవు.. ఇక, టాటా కార్ల విషయానికి వస్తే.. ఈ నెలలో టాటా నెక్సాన్‌పై రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది. టాటా హారియర్, టాటా సఫారిపై రూ.45 వేల దాకా, టాటా టియాగోపై దాదాపు రూ. 28 వేల వరకు, టాటా టిగోర్‌పై రూ. 30వేల దాకా, టాటా ఆల్ట్రోజ్ రూ. 28 వేల దాకా ఆఫర్లు ఉన్నాయి.. మొత్తంగా మూడు సంస్థలు మార్చి నెలలో ఆఫర్లు ప్రకటించాయి.. మరి ఎందుకు ఆలస్యం.. కారు కొనే ప్లాన్ ఉంటే.. ఇప్పుడే చేసుకుండో.. ఆఫర్ పట్టండి.
రూ.32 వేల స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు రూ.1,999కే మీ సొంతం..!
ఇది నిజమే రూ. 32 వేల విలువైన స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం రూ. 1,999కే సొంతం చేసుకునే అవకాశం వచ్చింది.. ఈ అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కలిపిస్తోంది.. బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్(1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నమ్మశక్యం కాని ధరకు ఆఫర్ పెట్టింది.. రూ. 32,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 1,999కి అందుబాటులో ఉంచారు.. అయితే, రూ.32,999 ధర ఉన్న ఫోన్‌ను రూ.1,999కే పొందాలంటే.. ఇవి ఫాలో కావాల్సి ఉంటుంది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్8వేల తగ్గింపుతో రూ. 29,999 వద్ద నథింగ్ ఫోన్ (1) లిస్ట్ చేశారు.. ఇక, దీనికి అదనంగా, కొనుగోలుదారులు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌పై కొనుగోలు చేస్తే అదనంగా 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు.. మరోవైపు.. పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్‌గా రూ. 27 వేల వరకు తగ్గింపుతో కలిపి నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,999కే పొందే అవకాశం ఉంది. మొత్తంగా నథింగ్ ఇయర్ (2) గ్లోబల్ లాంచ్‌కు ముందు నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నమ్మశక్యం కాని ధరకు అందుబాటులో పెట్టింది.. సంస్థ నుండి వచ్చిన మొదటి ఉత్పత్తి అయిన నథింగ్ ఇయర్ (1)ని నథింగ్ ఇయర్ (2) విజయవంతం చేసింది. ఇయర్ (2) ప్రారంభానికి ముందు, నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. నథింగ్ ఫోన్ (1) కార్ల్ పీ నేతృత్వంలోని UK-ఆధారిత టెక్ స్టార్టప్ నుండి వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ మరియు ఇది దాని విభాగంలో ‘అత్యుత్తమంగా అమ్ముడవుతున్న’ ఫోన్‌గా పేర్కొంది.
దెబ్బకు దెబ్బ కొట్టిన భారత్.. బ్రిటన్ హైకమిషన్ బయట బారికేడ్లు తొలగింపు
గతవారం బ్రిటన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం దగ్గర ఖలిస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. భారత హైకమిషన్ కార్యాలయంపై ఉన్న భారత త్రివర్ణ పతాకాన్ని తొలగించారు. దీంతో మరో భారీ పతాకాన్ని అప్పటికప్పుడు తెచ్చి కమిషన్ కార్యాలయంపై ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో లండన్‌లోని భార హైకమిషన్‌పై ఖలిస్తాన్ మద్దతుదారులు చేసిన దుశ్చర్యను ఇండియా తీవ్రంగా పరిగణిస్తోంది. భారత హైకమిషన్ వద్ద భద్రతా వైఫల్యంపై భారత్ తీవ్రంగా మండిపడింది. అక్కడితో ఆగకుండా భారత్ బ్రిటన్‌కు ఇవాళ మరో షాకిచ్చింది. ఢిల్లీ చాణక్యపురిలోని శాంతిపథ్‌లో ఉన్న బ్రిటన్ హైకమిషన్ కార్యాలయం బయట బారికేడ్లను భారత్ తొలగించింది. ఇన్నాళ్లూ బ్రిటన్ హైకమిషన్ కార్యాలయానికి భద్రతగా ఉంచిన బారికేడ్లను సడన్‌గా తొలగించడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం రాత్రి 10:30 గంటలకు న్యూఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషనర్ నివాసం వెలుపల ఉన్న బారికేడ్లను తొలగించారు. భద్రతా విషయాలపై వ్యాఖ్యానించడానికి బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి నిరాకరించారు.
కీవ్‌లోని ఓ పాఠశాలపై రష్యా డ్రోన్ దాడి.. ముగ్గురు దుర్మరణం
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఓ ఉన్నత పాఠశాలపై రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. కీవ్‌లోని స్కూల్‌పై రష్యా రాత్రిపూట ఈ దాడి చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురని మరణించారని, ఇద్దరు గాయపడ్డారని, ఓవ్యక్తి రక్షించబడ్డారని, నలుగురు వ్యక్తులు శిథిలాల కింద ఉండవచ్చని రాష్ట్ర అత్యవసర సేవ టెలిగ్రామ్‌లో తెలిపింది. కీవ్‌కు దక్షిణంగా 80 కిలోమీటర్ల (50 మైళ్ళు) దూరంలో ఉన్న ఓ పాఠశాలపై ఈ డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో భవనాలు చాలా వరకు దెబ్బతిన్నాయని అత్యవసర సేవల అధికారులు తెలిపారు. ఈ దాడిలో విద్యార్థులు ఉండే రెండు అంతస్థులు, చదువుకునేందుకు ఉపయోగించే భవనం పాక్షికంగా ధ్వంసమయ్యాయని తెలిసింది. ఉదయం 7 గంటలకు పాఠశాలలో 300 చదరపు మీటర్ల (3,200 చదరపు అడుగులు) కంటే ఎక్కువ మంటలు వ్యాపించాయి. రష్యా క్రమం తప్పకుండా ఉక్రెయిన్‌పై క్షిపణులు, ఫిరంగిదళాలు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. తరచుగా విద్యుత్ కోతలకు కారణమవుతోంది. దీనివల్ల ప్రజలు తమ ఇళ్లలో వేడినీరు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
‘నాటు నాటు’కు జర్మన్ ఎంబసీ డ్యాన్స్..
ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు ఫీవర్ బారిన పడని వారు ఎవరూ ఉండరు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ గెలవడంతో ఇప్పుడు ఎక్కడ విన్న నాటు నాటు పాటే వినిపిస్తోంది. ఆపాట, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డాన్స్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇటీవల, జర్మన్ ఎంబసీ సిబ్బంది పాత ఢిల్లీ వీధుల్లో ఈ నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశారు. కొరియన్ ఎంబసీ సభ్యుల తర్వాత, భారతదేశంలోని జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకర్‌మాన్, ఎంబసీలోని ఇతర సిబ్బంది ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలో నాటు నాటుకు తమ ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్దులను చేశారు. RRRలో ప్రధాన నటులలో ఒకరైన రామ్ చరణ్ కూడా వారి డ్యాన్స్ పై స్పందించారు.అద్భుతంగా చేశారంటూ కితాబు ఇచ్చారు. జర్మన్ ఎంబసీ సభ్యులు పగటిపూట వీధుల్లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. జర్మన్‌లో ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో నాటు నాటు విజయాన్ని జరుపుకున్నామని డాక్టర్ ఫిలిప్ అకెర్‌మాన్ ట్వీట్ చేశారు. హీరో రామ్ చరణ్, RRR బృందానికి అభినందనులు తెలిపారు. అంతేకాదు నాటు నాటు ఛాలెంజ్ కోసం భారతదేశంలోని ఇతర రాయబార కార్యాలయాలను కూడా సవాలు విసిరారు డాక్టర్ ఫిలిప్ అకెర్‌మాన్. #embassychallange అంటూ ఛాలెంజ్ విసిరారు. కాగా, గత నెలలో దక్షిణ కొరియా రాయబార కార్యాలయం నాటు నాటు ట్రెండ్‌ను పవర్ ప్యాక్డ్ ప్రదర్శనతో ప్రారంభించింది. కొరియా రాయబారి చాంగ్ జే-బోక్, ఇతర రాయబార కార్యాలయ సిబ్బందితో కలిసి ట్రాక్‌కి వెళ్లారు. కాగా, నాటు నాటు చిత్రానికి సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. నాటు నాటు పాటను రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించగా, చంద్రబోస్ లిరిక్స్ రాశారు.