వైఎస్ జగన్ మాట ఇచ్చారు.. అది రద్దు చేశారు..
ఉద్యోగుల పట్ల ఇలాంటి సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం గతంలో లేదు అంటూ సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు మాజీ మంత్రి పేర్నినాని.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారన్న ఆయన.. సీపీఎస్ విధానంలో ఉద్యోగికి రూ. 400 పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని మచిలీపట్నంలో పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.. ఇప్పుడు సీపీఎస్ ను రద్దు చేసి జీపీఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలిపారు. పే కమిషన్ వేసేందుకు గతంలో ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండేది.. కానీ, రోడ్డెక్కి ఉద్యమం చేయకుండా గతంలో ఏ ప్రభుత్వమూ పీఆర్సీ కమిటీ నియామకం చేయలేదని.. ఏ ఉద్యోగీ రోడ్డెక్కకుండానే 12వ పీఆర్సీని సీఎం జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు పేర్నినాని.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్ చేస్తున్నారన్న ఆయన.. ఉద్యోగుల పట్ల ఇంతగా సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం గతంలో ఏదీ లేదన్నారు.. రాజకీయం కోసం తెలంగాణలో ఎవరో సీఎం చేశారని ఇక్కడ చేయడం లేదని స్పష్టం చేశారు.. వైద్య విధాన పరిషత్ లో పనిచేసే ఉద్యోగులు గతంలో చాలా కష్టాలు పడేవారు.. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు పెన్షన్ రావాలంటేనే నరకం చూసేవారన్నారు.. రాష్ట్రంలో 13 వేల మంది వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపారని వెల్లడించారు..
టీలో తల్లికి మత్తు మందు.. బాలుడి కిడ్నాప్..
తల్లికి టీలో మత్తు ఇచ్చి.. బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది.. తెలంగాణలోని భువనగిరి జిల్లాకు చెందిన ఓ తల్లికి విశాఖ రైల్వేస్టేషన్‌లో టీ ఇచ్చిన ఓ జంట.. ఆ తర్వాత ఆమె ఏడాదిన్నర కొడుకును ఎత్తుకెళ్లారు.. విశాఖ రైల్వే స్టేషన్ లో గురువారం జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.. యాదాద్రి జిల్లా నుండి నిన్న రాత్రి రైల్లో ఏడాదిన్నర కుమారుడుని తీసుకుని ఓ గర్భిణీ విశాఖకు చేరుకుంది. రాత్రి నుండి విశాఖ రైల్వే స్టేషన్‌లోనే ఉండిపోయింది.. అయితే, ఏడాదిన్నర బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. తనతో పాటు స్టేషన్ లోనే ఉన్న ఒడిశాకు చెందిన ఓ జంట తన కొడుకుని కిడ్నాప్ చేసి ఉంటారని ఆ గర్భిణీ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేపట్టారు.. ఇక, ఈ ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కిడ్నాప్‌నకు గురైన బాలుడు తల్లి భవాని.. నాది తెలంగాణలోని భువనగిరి జిల్లా.. నా భర్త నన్ను హింసించి నా కొడుకుని చంపేస్తా అని బెదిరించాడు.. దీంతో, నాకు భయం వేసి ట్రైన్ ఎక్కి విశాఖకు వచ్చాను.. విశాఖ రైల్వేస్టేషన్‌లో నేను రైలు దిగిన తరువాత ఫ్లాట్ నంబర్ 8 వద్ద.. నేను, నా కొడుకు ఉన్నాం.. అయితే, ఓ జంట నా దగ్గర కి వచ్చి మాటలు కలిపారు.. నాకు తాగడానికి టీ ఇచ్చారని తెలిపింది.. ఇక, టీ తాగిన తర్వాత ఏం జరిగిందో తెలియదు నాకు నిద్ర వచ్చింది.. మత్తులో ఏం జరుగుతుందో తెలియకుండా పోయింది.. మెలుకువ వచ్చే సరికి నా వద్ద నా బాబు లేడని గొల్లుమంది.. ఆ జంట తనతో ఒడియాలో మాట్లాడరని తెలిపిన మహిళ.. పోలీసులు నా బాబుని నాకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
రాయలసీమ డిక్లరేషన్ పేరుతో మళ్లీ మోసం.. మూడు సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారు..?
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రపై ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హాట్ కామెంట్లు చేశారు.. మిడి మిడి జ్ఞానంతో లోకేష్ మాట్లాడుతున్నాడన్న ఆయన.. రాయించిన స్క్రిప్ట్ చదువుతూ వెళ్తున్నాడని సెటైర్లు వేశారు.. సీఎం జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు.. మిషన్ రాయలసీమ పేరుతో లోకేష్ నిర్వహించి కార్యక్రమం ప్రైవేట్ ఈవెంట్‌గా ఉందని ఎద్దేవా చేశారు.. రాయలసీమలో అభివృద్ధి అంటే వైఎస్‌ఆర్‌కు ముందు.. తర్వాత అని చూసుకోవాలని సూచించిన ఆయన.. టీడీపీ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గండి కోట, హంద్రీ నీవా, గాలేరు నగరి అలాగే పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు.. రాయలసీమ ప్రాజెక్ట్ ల గురించి మాట్లాడితే హక్కు టీడీపీకి లేదన్న గడికోట.. రాయలసీమకు అన్యాయం చేసిన వ్యక్తులుగా ముక్కు నేలకు రాసి ఇక్కడి ప్రజలకు తండ్రీ కొడుకులు క్షమాపణ చెప్పాలని సూచించారు. రెండు రోజుల్లో రాయలసీమను వదిలి వెళుతున్న సందర్భంలో ఈ ప్రాంతానికి చేసిన మోసానికి, అన్యాయానికి మేమే బాధ్యత అంటూ చంద్రబాబును పిలిపించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు శ్రీకాంత్‌రెడ్డి.. పోతిరెడ్డి పాడు రాకుండా, సాగునీటి ప్రాజెక్టులకు చేసిన అన్యాయం, ఇక్కడి ప్రజలకు వ్యతిరేకంగా సినిమాలు తీయించి కించ పరిచి నందుకు క్షమాపణ చెప్పాలన్నారు.. ఇప్పుడు స్పోర్ట్స్ హబ్ చేస్తామంటున్నారు.. కానీ, వైఎస్ఆర్ కడపలో స్పోర్ట్స్ స్కూల్ తెచ్చారని గుర్తుచేశారు.. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ లను 94లో పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ట్రిబ్యునల్ లో నీటి కేటాయింపులు జరిగి ఉండేవి? కదా అని నిలదీశారు. పోతిరెడ్డిపాడు వెడల్పు చేస్తూంటే కోస్తా నాయకులతో లేఖలు రాయించారు.. ఇటీవల ప్రాజెక్టు పనులు చేపడిటే అడ్డుపడింది టీడీపీ కాదా? అని ప్రశ్నించారు.. అసలు, గతంలో మూడు సార్లు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రానికి ఏం చేశారు అని ఫైర్ అయ్యారు..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాం..
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతవరణం వేడెక్కుతోంది. ఇప్పటికే అధికార పార్టీ తమ వ్యూహాలకు పదునుపెట్టగా.. ప్రతిపక్షాలు తమదైన శైలిలోకి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని పావులు కదుపుతోంది. ఇప్పటికే పాదయాత్రలు, బహిరంగసభల పేరుతో జనంలోకి వెళ్తోంది. తాజాగా హైదరాబాద్ సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ నేతలంతా కష్టపడాలన్నారు. ధరణి పోర్టల్ గడీల పాలన కోసం తెచ్చారని ఆయన ఆరోపించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసింది భూమి కోసమేనని.. ఆ భూముల మీద దొరల పెత్తనం ఆగకపోతే నక్సల్ బరి ఉద్యమం వచ్చిందని రేవంత్ చెప్పారు. పట్టణ బాట పట్టిన దొరల కోసం ధరణి కేసీఆర్ ధరణి తెచ్చారని రేవంత్ విమర్శలు గుప్పించారు. కొత్త భూస్వాములను తయారుచేసేందుకే.. ధరణి. రూ.వందల కోట్లు కొల్లగొట్టేందుకే ధరణి పోర్టల్ తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ నిర్వహణ ప్రభుత్వం చేతుల్లో లేదని ఆయన విమర్శించారు. ధరణి పోర్టల్ నిర్వహణ దళారుల చేతుల్లో ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని రేవంత్ ఈ సందర్భంగా ప్రకటించారు. ధరణి ద్వారా హైదరాబాద్ చుట్టూ భూములు దోచుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. దోచుకున్న భూములను బినామీ పేర్లపై ఉంచారని రేవంత్ అన్నారు. దేశాన్ని దోచుకోవడమే డబుల్ ఇంజిన్ పని అంటూ రేవంత్ మండిపడ్డారు. వన్ నేషన్.. వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అని విమర్శించారు. సెప్టెంబర్ 17 న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలంతా కలసికట్టుగా కష్టపడాలని రేవంత్ సూచించారు.
బీఆర్‌ఎస్ ఖేల్ ఖతం.. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ రాజ్యం వస్తుంది..
తెలంగాణ రాష్ట్రంలో కాషాయ రాజ్యం వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీఆర్‌ఎస్ ఖేల్ ఖతం అయిందని ఆయన అన్నారు. బీజేపీ మహా జన సంపర్క్ అభియాన్ సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం బీజేపీ అడ్డా అని.. ఈ నెల 15న ఖమ్మంలో జరిగే బీజేపీ సభతో కేసీఆర్‌కు దడ పుడుతుందని బండి సంజయ్ అన్నారు. అవసరం అయితే మోడీ సభను కొత్తగూడెంలో పెడతామన్నారు. దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ఎక్కడా బలమే లేదన్నారు. దేశంలో కాంగ్రెస్‌కు జాకీ పెట్టినా లేవదని.. సర్వేలు అన్నీ బీజేపీకి మద్దతుగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ను లేపడానికి బీఆర్‌ఎస్ నేత కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొంతమంది పోలీసు అధికారులకు మాత్రమే బీజేపీ వ్యతిరేకమని.. బీజేపీ కార్యకర్తల్లో భయపడే వాళ్లు లేరన్నారు. సాయి గణేష్ త్యాగాన్ని విడిచి పెట్టమన్నారు. తెలంగాణలో మోడీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. బీఆర్‌ఎస్ భయపడేది ఒక్క బీజేపీకి మాత్రమేనన్నారు. జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల ఆగడాలు జిల్లాలో ప్రజలు సహించలేకపోతున్నారన్నారు. రాముల వారిని కేసీఆర్ అవమానిస్తున్నారన్న బండి సంజయ్.. రాముల వారి కళ్యాణానికి రావడానికి కేసీఆర్‌కు సమయం లేదంటూ మండిపడ్డారు. కర సేవకుల త్యాగాలను మోడీ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ సింగిల్‌గా అధికారంలోకి వస్తోందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
“ఔరంగజేబు” వ్యాఖ్యలపై స్పందించిన ఓవైసీ.. “గాడ్సే” సంతానం ఎవరంటూ ప్రశ్న
ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ లపై ఓ వర్గం అనుకూల సోషల్ మీడియా పోస్టులు మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. దీంతో హిందూ సంఘాలు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘర్షణలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఔరంగజేబు సంతానం ఎక్కడ నుంచి వచ్చారు..? దీని వెనక ఎవరున్నారు..? దీనిని మేము కనుగొని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔరంగజేబు సంతానం అని ఫడ్నవీస్ సంబోధించడాన్ని తప్పుపట్టారు. నాథురామ్ గాడ్సే, వామన శిమరామ్ ఆప్టే సంతానం ఎవరో తెలుసా..? అంటూ ఫడ్నవీస్ పై ఎదురుదాడి ప్రారంభించారు.
ఔటయ్యాక తినడం తప్పేనా..? కోహ్లీపై నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్స్..!
డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఇండియా కష్టాల్లో ముందుకు వెళ్తుంది. ఆసీస్ నెలకొల్పిన భారీ స్కోరును చేధించడంలో భారత బ్యా్ట్స్ మెన్స్ విఫలమవుతున్నారు. ముఖ్యంగా కింగ్ కోహ్లీపైనే ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు. భారత్ బ్యాటింగ్ తరుఫున ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ తక్కువ పరుగులకే ఔటయ్యాక.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఐపీఎల్ లో మంచి ఫాంలో ఉన్న కోహ్లీ.. డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా అదే ఫాంను కనబరుస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతికి కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఇదిలా ఉంచితే.. కోహ్లీ ప్రదర్శనపై క్రికెట్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ ఔటైన వెంటనే తన జట్టు సభ్యులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో భోజనం చేస్తున్న ఫోటోను షేర్ చేసుకోవడం అభిమానులకు అస్సలు నిద్రపట్టడం లేదు. టెస్టుల్లో అతని కమ్ బ్యాక్ గురించి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్.. అతని పేలవ ప్రదర్శనతో షాక్ అయ్యారు. ఈ వెంటనే ఆయనను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందే, లేకపోతే.. ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్..
కోవిడ్ మహమ్మారి పుణ్యామా అని ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు దొరికింది. అయితే కోవిడ్ ప్రస్తుతం పోయినా కూడా కొందరు మాత్రం ఆఫీసులకు వెళ్లం, ఇంటి దగ్గర నుంచే పని చేస్తామని చెబుతున్నారు. అలాంటి వారికి పలు సాఫ్ట్వేర్ కంపెనీలు వార్నింగ్ ఇస్తున్నాయి. గతంలో ఉద్యోగులు చెప్పినట్లు సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోంకు తలొగ్గాయి. అయితే ఇప్పుడు ఆర్థికమాంద్యం పరిస్థితుల కారణంగా ఐటీ జాబులు ఎప్పుడు పోతాయో తెలియదు. దీంతో కంపెనీలు కూడా ఉద్యోగులకు తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిందే అని ఆదేశిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ కూడా తన ఉద్యోగుల కీలక సందేశాన్ని పంపింది. వారంలో కనీసం 3 రోజలు ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందే అని ఆదేశించింది. ఎవరైనా ఈ నిబంధన పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది. ఉద్యోగుల పనితీరు సమీక్షల్లో తక్కవ గ్రేడింగ్ ఉంటుందని తెలిపింది. తాజాగా గూగుల్ తన వర్క్ పాలసీని అప్డేట్ చేసింది. ఆఫీస్ బ్యాడ్జ్‌ల ద్వారా హాజరును ట్రాక్ చేయడంతో పాటు పనితీరు సమీక్షల సమయంలో వారికి తదనుగుణంగా రేటింగ్ చేస్తామని కంపెనీ తెలిపింది.
అస్సలు.. మహేష్ అన్నా.. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయం గుర్తుందా.. ?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మహేష్ ఒక సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క యాడ్స్ కూడా చేస్తూ ఉంటాడన్న విషయం తెల్సిందే. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఎప్పటికప్పుడు ఆ యాడ్స్ షూట్ లో ఫోటోషూట్స్ తో అభిమానులకు షాక్ ఇస్తూ ఉంటాడు. తాజాగా ఒక యాడ్ షూట్ కోసం మహేష్ దిగిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. బ్లాక్ జీన్స్ పై వైట్ టీ షర్ట్.. దానిపై డెనిమ్ షర్ట్.. కర్లీ హెయిర్.. బ్లాక్ గాగుల్స్ తో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గుంటూరు కారం కన్నా మహేష్ హాట్ గా ఉన్నాడు అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మహేష్ వయస్సు 47. ఆయనకు పెళ్లి అయ్యి.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు కూడా రేపో మాపో ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారు. కానీ, మహేష్ ను ఇలా చూస్తే .. వారికి నాన్న కాదు అన్న అనుకుంటారు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. టాలీవుడ్ లో ఈ రేంజ్ అందాన్ని మెయింటైన్ చేయడం నాటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఈ అందం వెనుక మహేష్ నిరంతర శ్రమ ఉంది. ఆయన తినే తిండి, చేసే వర్క్ అవుట్స్ .. ఎవరు చేయలేరు. వయస్సు పెరిగేకొద్దీ ఎవరికై నా అందం తగ్గుతుంది. కానీ, మహేష్ విషయంలో మాత్రం అది రివర్స్ అని అంటున్నారు అభిమానులు.. వయస్సు పెరిగేకొద్దీ అందం తగ్గుతూ వస్తుంది.. ఈ ఫోటోలను చూసిన అభిమానులు.. అన్నా.. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయం గుర్తుందా.. ?.. ఏంటి అన్న ఈ అందం అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.