*భక్తులకు రేపటి నుంచి బాలరాముడి దర్శనం..
రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి సామాన్య భక్తులకు బాలరాముడు దర్శనం ఇవ్వనున్నారు. బాలరాముడి దర్శించుకునేందుకు ఆలయ ట్రస్ట్ రెండు స్లాట్స్ ఖరారు చేసింది. ఉదయం 7 గంటల నుంచి 11: 30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకునేందుకు అనుమతించనున్నారు. కాగా.. అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రారంభమైన ప్రాణప్రతిష్ఠ క్రతువు.. ప్రధాని మోడీ బాలరాముడి పట్టు పీతాంబరాలు, ఛత్రం, పాదకలు సమర్పించారు. రామ్‌లల్లా విగ్రహం దగ్గర పూజలు చేశారు. 12: 29: 03 నుంచి 12: 30: 35 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కొనసాగింది. గణేశ్వర శాస్త్రీ ద్రావిడ నేతృత్వంలో మహాగంభీరంగా క్రతువు జరిగింది. అయోధ్య బాలరాముడి దర్శనంతో భారతీయుల హృదయాలు పులకరించిపోయారు. ఎడమచేతిలో విల్లు, కుడిచేతిలో బాణంతో బంగారు ఆభరణాలు ధరించి చిరు దరహాసం, ప్రసన్నవదనంతో బాలరాముడు దర్శనం ఇచ్చారు. అయితే, ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆకాశ వీధుల్లో నుంచి రామ మందిరంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఈ క్రతువుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ పాల్గొన్నారు.
*రామ్లల్లా ఇప్పటి నుంచి టెంట్లో ఉండడు.. దివ్యమందిరంలో ఉంటాడు
అయోధ్యలో 500 వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం నేడు ఆవిష్కృతమైంది. అయోధ్య నగరంలో రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. ఈ రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా కొనసాగింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం రామనామ స్మరణతో ఉప్పొంగిపోయింది. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ ప్రధాని ప్రసంగం ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా నిరిక్షిస్తున్న రాముడు వచ్చేశాడు.. ఈ క్షణం ఎంతో ప్రత్యేకమన్నారు. మన రామ్లల్లా ఇప్పటి నుంచి టెంట్ లో ఉండడు.. దివ్యమందిరంలో ఉంటాడు.. మీ అందరి ఆశీస్సుల వల్లే జరిగిందని మోడీ తెలిపారు. ఎన్నో ఏళ్ల పోరాటాలు, బలిదానాలు, నిష్ట తర్వాత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని తెలిపారు. ఇది సామాన్యమైన సమయం కాదు.. కాలచక్రంలో ఎప్పటికి నిలిచిపోయే అద్భుత సమయమని పేర్కొన్నారు. ఎక్కడ రాముడి కార్యక్రమం జరుగుతుందో.. అక్కడ హనుమంతుడు ఉంటాడు.. సరయూ నది, అయోధ్యపురికి నా ప్రణామాలు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రామ మందిరాన్ని న్యాయబద్దమైన ప్రక్రియ ద్వారా నిర్మించాం.. దేశం మొత్తం ఇవాళ దీపావళి జరుపుకుంటుందని ప్రధాని మోడీ తెలిపారు. శ్రీ రాముడు భారతదేశ ఆత్మ అని చెప్పారు.. ఈ 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టా.. అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాముడి ప్రధాన ఆలయాలను దర్శించా.. అన్ని భాషల్లోనూ రామాయణాన్ని విన్నాను.. రాముడు లోకానికి ఆదర్శమని మోడీ అన్నారు. రాముడే శాశ్వతం, రాముడే విశ్వం.. రాముడి రాక కోసం ఎదురు చూసిన శబరి నిరీక్షణ ఫలించిందని ప్రధాని పేర్కొన్నారు. ఈ క్షణాలు కాలచక్రంలో శాశ్వతంగా నిలిచిపోతాయి.. రామభక్తులందరికీ తన ప్రణామాలు తెలిపారు మోదీ. మన రాముడొచ్చేశాడు.. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్టకు హాజరు కావడం నా అదష్టం.. ఎంతో అలౌకిక ఆనందాన్ని ఇస్తోందని మోడీ చెప్పారు.
*500 ఏళ్ల చరిత్ర.. 1528 నుంచి 2024 వరకు కీలక ఘట్టాలు
దాదాపు 500 ఏళ్ల కల సాకారమైంది. అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా దేశంలోని అతిరథులు, లక్షల మంది ప్రజలు హాజరవ్వగా.. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. దాదాపుగా 400 స్తంభాలు, 44 తలుపులతో అయోధ్య రామ మందిరం నిర్మితమైంది. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ, స్పోర్స్ట్ సెలబ్రెటీలు, ఇతర రంగాల్లో ప్రముఖులు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే 500 ఏళ్ల కాలంలో రామమందిర విషయంలో జరిగిన ప్రముఖ ఘట్టాలు ఇవే..
*1528: బాబ్రీ మసీదు ప్రారంభం
*1751: మరాఠాల వాదన
*1858: నిహాంగ్ సిక్కుల డిమాండ్.
*1885: మొదటి లీగల్ పిటిషన్
*1949: బాబ్రీ మసీదు లోపల ‘రామ్ లల్లా’ విగ్రహాలు
*1950-1959: చట్టపరమైన పిటిషన్లు మొదలు
*1986-1989: రాజీవ్ గాంధీ హయాంలో బాబ్రీ మసీదు తాళాలు తెరవడం, హిందువుల పూజలు
*1990: రథయాత్ర, బాబ్రీ కూల్చివేతకు విఫలయత్నం
*1992: బాబ్రీ కూల్చివేత
*1993-1994: కూల్చివేత అనంతరం అల్లర్లు
*2002-2003: ASI తవ్వకం, అలహాబాద్ హైకోర్టు విచారణ
*2009-10: లిబర్‌హాన్ నివేదిక
*2019: సుప్రీంకోర్టు తీర్పు
*2020: రామమందిర శంకుస్థాపన
*2024 జనవరి 22: ఆలయ ప్రారంభం
*రాముడు వివాదం కాదు, పరిష్కారం.. ప్రధాని మోడీ ప్రసంగంలో 10 కీలక వ్యాఖ్యలు..
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కన్నులపండుగగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా “రామ్ లల్లా” విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వీవీఐపీలు, సాధువులు, సాధారణ భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చారు. రామ మందిర ప్రారంభం తర్వాత ప్రధాని నరేంద్రమోడీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఇకపై రామ్ లల్లా టెంట్‌లో ఉండరని, గొప్ప ఆలయంలో ఉంటారని అన్నారు.
ప్రధాని మోడీ ప్రసంగంలోని కీలక వ్యాఖ్యలు:
1) రామ మందిర జాప్యానికి తాను రాముడికి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. శతాబ్ధాల పాటు మనం చూపిన సహనం, మనం చేసిన త్యాగాల తర్వాత మా రామ్ లల్లా వచ్చారు.
2) జనవరి 22, 2024 కేవలం తేదీ మాత్రమే కాదు, కొత్త శకానికి నాంది. రామమందిర నిర్మాణం ప్రజల్లో కొత్త శక్తిని నింపింది.
3) రామ మందిర నిర్మాణం చేపడితే అగ్ని జ్వాలలు చెలరేగుతుందని అన్నారు, రాముడు అగ్ని కాదు శక్తి. రాముడు వివాదం కాదు, పరిష్కారం.
4) మనం ఇప్పుడు రాబోయే 1000 ఏళ్ల భారతదేశానికి పునాది వేయాలి. ఈ క్షణం నుంచి సమర్థవంతమైన, గొప్ప, దైవిక భారతదేశానన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.
5) రామ మందిరం నిర్మాణం భారతీయ సమాజ పరిపక్వతకు ప్రతిబింబం. ఇది కేవలం విజయానికి మాత్రమే కాదు, వినయానికి కూడా ఒక సందర్భం.
6) రాముడి ఉనికి ప్రశ్నార్థంగా మారింది. న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. చట్టానికి అనుగుణంగా ఆలయాన్ని నిర్మించారు.
7) రామ్ లల్లా ఇప్పుడు టెంట్‌లో ఉండరు.. గ్రాండ్ టెంపుల్‌లో ఉంటారు.
8) సాగర్ నుంచి సరయు వరకు ప్రయాణించే అవకాశం నాకు లభించింది. సాగరం నుంచి సరయు వరకు రామనామ వినిపిస్తోంది. పండగ స్పూర్తి కనిపిస్తోంది.
9) జనవరి 22, 2024 క్యాలెండర్లో తేదీ మాత్రమే కాదు, ఇది కొత్త కాలచక్రానికి మూలం
10) రామ మందిరం ఇంత ఆలస్యంపై రాముడికి క్షమాపణలు చెబుతున్నా. ఇన్ని రోజులు రాముడికి, ప్రజలకు మధ్య దూరం, ఈ రోజుతో ముగిసింది.
*మేము గాంధీ రాముడిని పూజిస్తాం, బీజేపీ రాముడిని కాదు.. కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు
అయోధ్యలోని రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి వేలాది మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. “మేము గాంధీ రాముడిని పూజిస్తాము, బీజేపీకి చెందిన రాముడిని కాదు” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడిని సీత, లక్ష్మణ్‌ల నుంచి వేరు చేసేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని సిద్ధరామయ్య బీజేపీపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. లక్ష్మణుడు, సీత లేకుండా రాముడు లేడని.. రాముడు సర్వవ్యాపి అని అన్నారు. రాముడు కేవలం అయోధ్యకే పరిమితం కాలేదని తెలిపారు. అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది.. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు..
*అయోధ్యకు పూర్వ వైభవం వచ్చింది..
500 సంవత్సరాల హిందువుల కల నెరవేరిందని అన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అన్ని దారులూ రామ మందిరం వైపే చూపిస్తున్నాయని తెలిపారు. మనం త్రేతాయుగంలోకి వచ్చినట్లుంది.. ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా ఎదురు చూశామని ఆయన చెప్పారు. ప్రాణ ప్రాతిష్ఠకు హాజరైన వారి జీవితం ధన్యమైందని పేర్కొన్నారు. అనుకున్న చోటే రామాలయం నిర్మించాం.. అయోధ్యకు పూర్వ వైభవం వచ్చిందని సీఎం యోగి తెలిపారు. బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైందని అన్నారు. అయోధ్య ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టి, అంకిత భావంతో ఇదంతా సాధ్యమైందన్నారు. అయోధ్యకు పూర్వవైభవం తెచ్చేందుకు వందల కోట్లు కేటాయించిన విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. తన ఆలయం కోసం సాక్షాత్తూ శ్రీరాముడే పోరాడాల్సి వచ్చిందన్నారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట రామ రాజ్యాన్ని సాకారం చేస్తుందని తెలిపారు. రాముడు మనకు ఎంతో ఓర్పును నేర్పించారని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
*వారికి గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. రేపే ఖాతాల్లో సొమ్ము జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు.. వరుసగా సంక్షేమ పథకాల నిధులను విడుదల చేస్తూ వస్తున్న ఆయన.. రేపు ఉరవకొండ వేదికగా.. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.. ఉరవకొండలో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు సీఎం వైఎస్ జగన్.. ఇక, ఈ పర్యటన కోసం.. రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద వర్చువల్ గా డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు.. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం వైఎస్ జగన్.
సీఎం జగన్ పర్యటనకు సంబంధిచిన వివరాల్లోకి వెళ్తే..
* 23న ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో బయల్దేరి ఉదయం 9.45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు.
* ఉదయం 10 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 10.30కు ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు సీఎం జగన్.
* హెలిప్యాడ్ వద్ద ఉదయం 10.30 నుంచి 10.40 గంటల వరకు ప్రజాప్రతిధులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు ఏపీ సీఎం.
* 10.40 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయల్దేరి 10.50 గంటలకు బహిరంగ సభావేదికకు చేరుకుంటారు..
* 10.55 నుంచి మధ్యాహ్నం 12.35 గంటల వరకు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడతారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
* బహిరంగలో ఉపన్యాసం తర్వాత వైఎస్సార్ ఆసరా నాల్గో విడత కింద కంప్యూటర్ బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
* మధ్యాహ్నం 12.35 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.. సభ వేదిక నుంచి బయల్దేరి హెలిప్యాడ్ వద్దకు 12.45 గంటలకు చేరుకుంటారు. 1.45 గంటల వరకు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడనున్నారు.
* మధ్యాహ్నం 1.50 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20కు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30కు అక్కడి నుంచి విమానంలో గన్నవరం చేరుకోనున్న సీఎం జగన్.. రోడ్డు మార్గంలోని తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటా
*జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జిల్లాల వారీగా 2024 తుది ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిట్లు పేర్కొంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం అప్‌లోడ్ చేసింది. ఓటర్ల జాబితాలను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా.. గత 6 నెలలుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, అధికారులను నియమించి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేశారు. ఓటు ప్రాధాన్యతపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించారు. అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాక సోమవారం అధికారికంగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు.
*అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన తేదీ వచ్చేసింది.. ప్రకటించిన ముస్లిం పక్షం
రామాలయంలో రాంలాలా జీవితాభిషేకంతో అయోధ్య మొత్తం వెలిగిపోతోంది. ఇదిలా ఉండగా అక్కడ నిర్మించనున్న మసీదుకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సీనియర్ అధికారి మాట్లాడుతూ, అయోధ్యలో గ్రాండ్ మసీదు నిర్మాణం ఈ సంవత్సరం మే నుండి ప్రారంభమవుతుందని.. అది పూర్తి చేయడానికి మూడు-నాలుగు సంవత్సరాలు పట్టవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మసీదు ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసిఎఫ్) డెవలప్‌మెంట్ కమిటీ హెడ్ హాజీ అరాఫత్ షేక్ ఈ సమాచారాన్ని తెలియజేశారు. మసీదు కోసం డబ్బును సేకరించేందుకు క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనితో పాటు ఈ మసీదుకు మహమ్మద్ ప్రవక్త పేరు మీద ‘మసీదు ముహమ్మద్ బిన్ అబ్దుల్లా’ అని పేరు పెట్టనున్నట్లు తెలిపారు. అరాఫత్ షేక్ మాట్లాడుతూ, ‘ప్రజల మధ్య శత్రుత్వం, ద్వేషం తొలగించి, ఒకరిపై ఒకరు ప్రేమగా మార్చడమే మా ప్రయత్నం.. మీరు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా… మన పిల్లలకు, ప్రజలకు మంచి విషయాలు నేర్పితే ఈ తగాదాలన్నీ ఆగిపోతాయి.’ అన్నారు. ఐఐసిఎఫ్ సెక్రటరీ అథర్ హుస్సేన్ మాట్లాడుతూ మసీదు నిర్మాణంలో ఆలస్యమవుతోందని, డిజైన్‌లో మరిన్ని సంప్రదాయ అంశాలను జోడించాలని కోరుతున్నామని చెప్పారు. 2019లో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ హిందూ పక్షానికి అప్పగించాలని ఆదేశించింది. వివాదాస్పద స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని, మసీదు నిర్మాణానికి ముస్లిం పక్షం భూమిని ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
*పాకిస్తాన్‌లో భయం భయం.. వర్సిటీల మూసివేత..
దాయాది దేశం పాకిస్తాన్ భయంతో వణికిపోతోంది. ఇటీవల ఇరాన్ పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌పై దాడులు చేసింది, దీనికి ప్రతిగా పాకిస్తాన్ కూడా ఇరాన్‌పై వైమానిక దాడులు చేసింది. దీని తర్వాత ఇరాన్ పెద్ద ఎత్తున మిలిటరీ విన్యాసాలు చేయడంతో పాటు పాక్ సరిహద్దు వైపు కదులుతుందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్‌లో అంతర్గతంగా రాజకీయ, ఆర్థిక, భద్రతా సంక్షోభాలతో సతమతమవుతోంది. ఇన్ని సమస్యల మద్య పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భద్రతా పరమైన బెదిరింపుల కారణంగా పాక్ సైన్యానికి అనుబంధంగా ఉన్న మూడు యూనివర్సిటీలను సోమవారం అక్కడి పోలీసులు మూసేశారు. మరో రెండు వారాల్లో పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. పోలీసులు, సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం భయపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లోని నేషనల్ డిఫెన్స్ యూనివర్శిటీ, బహ్రియా యూనివర్శిటీ మరియు ఎయిర్ యూనివర్శిటీలను మూసేశారు. ఈ కాలేజీలకు పాక్ సైన్యం, నౌకాదళం, వైమానిక దళంతో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల కాలంలో పాక్ తాలిబాన్లు అక్కడి సైన్యం, పోలీసులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తున్నారు. మరోవైపు బలూచ్ లిబరేషన్ సంస్థలు, పాకిస్తాన్‌కి సవాల్ విసురుతున్నాయి. తాజాగా ఇరాన్ దాడులు పాకిస్తాన్‌ని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఏ క్షణానికి ఏం జరుగుతుందో అని భయపడుతోంది.