*రామ మందిర నిర్మాణ ఖర్చు, దర్శనం-హారతి సమయం.. పూర్తి వివరాలు మీ కోసం..
రామ మందిర ప్రారంభోత్సవ వేడుక కోసం దేశం మొత్తం సిద్ధమైంది. జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. దేశంలోని ప్రముఖులు 7000 మందికి పైగా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. లక్షల్లో ప్రజలు ఇప్పటికే అయోధ్యకు వెళ్లే మార్గాల్లో ఉన్నారు. జనవరి 22న మధ్యాహ్నం గంట పాటు ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది.
అయోధ్య రామ మందిర ప్రాముఖ్యత:
అయోధ్య రామ మందిరం హిందువులకు ఎంతో పవిత్రమైంది. గత 500 ఏళ్లుగా హిందువులు దీని కోసం పోరాడుతున్నారు. రాముడు ఇక్కడే జన్మించారని నమ్ముతారు.
రామ మందిర శంకుస్థాపన, నిర్వహణ:
రామ మందిరానికి 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ఆలయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రప్రభుత్వం రూపొందించిన ట్రస్ట్ 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించారు.
దర్శనం-హారతి సమయాలు:
అయోధ్య రామ మందిరం ఉదయం 7.00 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.00 నుంచి రాత్రి 7.00 వరకు భక్తులకు దర్శనమిస్తారు. రామ్ లల్లా ఆరతి రోజుకు మూడు సార్లు నిర్వహించబడుతుంది, భక్తులు ఉదయం 6:30 గంటలకు జాగరణ్ లేదా శృంగార్ ఆరతికి, మధ్యాహ్నం 12:00 గంటలకు భోగ్ ఆరతికి మరియు రాత్రి 7:30 గంటలకు సంధ్యా ఆరతికి అనుమతిస్తారు. ఆరతికి హాజరు కావడానికి, వ్యక్తులు ట్రస్ట్ జారీ చేసిన పాస్ అవసరం, దాని కోసం చెల్లుబాటు అయ్యే ID రుజువు తప్పనిసరిగా సమర్పించాలి.
రాముడి దర్శనానికి డబ్బు చెల్లించాలా..?
ఆలయ ప్రవేశం సాధారణంగా అందరికి ఉచితం. ఆలయంలో మూడ రకాల హారుతులు నిర్వహిస్తారు. దీనికి పాస్‌లు ఉచితంగా జారీ చేస్తారు. పాసులు ఉన్న వారిని మాత్రమే హారతికి అనుమతిస్తారు. ఒక్కో హారతికి ఒకే సారి ముప్పై మంది మాత్రమే హాజరుకాగలరు.
రామ మందిర విగ్రహం:
రామ మందిరంలో రామ్ లల్లా(బాల రాముడి) విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. మైసూర్ శిల్పి అరుణ్ యోగి రాజ్ ఈ విగ్రహాన్ని చెక్కారు. నల్లరాయితో చేయబడిన ఈ విగ్రహం 150-200 కిలోల బరువు ఉంటుంది.
రామ మందిరానికి అయిన ఖర్చు:
రామ మందిర నిర్మాణానికి రూ. 1800 కోట్లు అయినట్లు అంచనా. ఈ అంచనా నిర్మాణ వ్యయంలో మెటీరియల్ ఖర్చులు, యంత్రాలు, కార్మికులు, ఇతర పరిపాలన ఖర్చులు ఉన్నాయి. ఫిబ్రవరి 5, 2020, మార్చి 31, 2023 మధ్య అయోధ్య మందిర నిర్మాణానికి రూ.900 కోట్లు ఖర్చు అయినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
*రామమందిర నిర్మాణంలో ఇనుము, ఉక్కు ఉపయోగించలేదు.. ఎందుకో తెలుసా..?
అయోధ్య భవ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం యావత్ దేశంతో పాటు ప్రపంచంలోని హిందువులు, రామ భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, 7000 మందికి పైగా అతిథులు, లక్షల మంది ప్రజల మధ్య రామ్ లల్లా(బాల రాముడి) విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోంది. ఈ మేరకు యూపీ సర్కార్‌తో పాటు సెంట్రల్ భద్రతా ఏజెన్సీలు అన్నీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉంటే రామ మందిర నిర్మాణంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా ఉండేలా నిర్మించినట్లు ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ శ్రీ నృపేంద్ర మిశ్రా చెప్పారు. శతాబ్ధాల పాటు ఈ నిర్మాణం నిలిచేలా సాంప్రదాయ భారతీయ నిర్మాణ శైలిని, సైన్స్‌ని జోడించి నిర్మించినట్లు తెలిపారు. ఈ నిర్మాణంలో భారతీయ సైంటిస్టులు, ఇస్రో టెక్నాలజీని కూడా వాడారు. నాగర్ శైలిలో చంద్రకాంత్ సోంపురా ఈ ఆలయ డిజైన్ రూపొందించారు. వాస్తు శాస్త్రాన్ని మిళితం చేసి రూపకల్పన చేశారు. మొత్తం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు. దాదాపుగా 57,000 చదరపు అడుగుల్లో మూడు అంతస్తుల్లో నిర్మాణం జరిగింది. ఆలయం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. ఇనుము, ఉక్కును ఆలయ నిర్మాణంలో వాడలేదు. ఇనుము జీవితకాలం కేవలం 80-90 ఏళ్లు ఉంటుందని అందుకే ఉపయోగించలేదని నృపేంద్ర మిశ్రా చెప్పారు. నాణ్యమైన గ్రానైట్, ఇసుక రాయి, పాలరాయి ఉపయోగించి, జాయింట్లలో సిమెంట్, సున్నపు మోర్టార్లను కూడా వాడకుండా.. లాక్ అండ్ కీ మెకానిజం వాడామని రూర్కీ లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ రామంచర్ల చెప్పారు. 2500 ఏళ్ల కాలానికి వచ్చే భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు. ప్రాచీన కాలంలో ఆలయ ప్రాంతం సమీపంలో సరయు నది ప్రవహించిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో ఆలయ నిర్మిత ప్రాంతం దిగువన ఇసుక అస్థిరంగా ఉన్నట్లు విశ్లేషణల్లో తెలిసింది. దీంతో ఆలయ ప్రాంతంలో మట్టిని 15 మీటర్ల లోతు వరకు తవ్వి, ఆ ప్రాంతంలో 12-14 మీటర్ల లోతు వరకు ఇంజనీరింగ్ మట్టిని వేశారు. స్టీల్ రీ బార్లు ఉపయోగించలేదు. 47 లేయర్ల బేస్ వరకు దృఢమైన రాతిలాగా ఉండేలా పునాదిని వేశారు. దీనిపై 1.5 మీటర్ల మందంతో M-35 గ్రేడ్ మెటల్ లేని కాంక్రీట్‌ని పటిష్టంగా వేశారు. దక్షిణ భారత దేశం నుంచి వచ్చిన గ్రానైట్ రాయిని 6.3 మీటర్ల మేర పరిచారు. ఇక పునాదిపై సందర్శకులకు కనిపించే భాగాన్ని రాజస్థాన్ నుండి సేకరించిన ‘బన్సి పహర్‌పూర్’ అనే పింక్ ఇసుకరాయితో రూపొందించబడింది. CBRI ప్రకారం, గ్రౌండ్ ఫ్లోర్‌లో మొత్తం 160 కాలమ్స్, మొదటి అంతస్తు 132 మరియు రెండవ అంతస్తు 74 ఉన్నాయి. ఇవన్నీ ఇసుకరాయితో తయారు చేశారు. గర్భగుడిలో రాజస్థాన్ మక్రానా మార్బుల్ అమర్చారు. తాజ్ మహల్‌ని కూడా ఇదే రాయితో నిర్మించారు. 2500 ఏళ్లు రిటర్న్ పిరియడ్ భూకంపాలను తట్టుకునేలా.. ఇంటర్ లాక్ టెక్నాలజీతో 1000 ఏళ్లు ఈ రామ మందిరం నిలవబోతోంది. బెంగుళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌లో పనిచేస్తున్న హెరిటేజ్ లోహాల ప్రత్యేకత కలిగిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ శారదా శ్రీనివాసన్ మాట్లాడుతూ..పూర్వ కాలాల్లో ఆలయ నిర్మాణ సంప్రదాయ శైలి పొడి రాతితో తయారు చేయబడింది, ఇనుము, ఉక్కు ఉపయోగించలేదు, ఆ తరువాత 12వ శతాబ్ధం నుంచి ఇనుము ఉపయోగం కనిపిస్తుందని చెప్పారు.
*అయోధ్య రామ మందిరానికి ‘‘జైషే మహ్మద్’’ బెదిరింపు..
అయోధ్యతో జనవరి 22న భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. రామ్ లల్లా విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మరోవైపు దేశంలోని పలు రంగాలకు చెందిన ముఖ్యులతో సహా సాధువులు 7000 పైగా అతిథులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు, యూపీ పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే కొన్ని ఉగ్రసంస్థలు అయోధ్య వేడుక నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తామని నిషేధిత సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించారు. తాజాగా పాకిస్తాన్‌కి చెందిన ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ కూడా ఇలాంటి బెదిరింపులకే పాల్పడింది. బాబ్రీ మసీదు ఘటనను ఉద్దేశిస్తూ భారత్‌ని బెదిరించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంతో రామ మందిర వేడుకలు, రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం అయింది. వీవీఐపీలు అయోధ్య వస్తుండటంతో యూపీ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) ఉగ్రవాదుల కదలికలపై కన్నేసింది. ఇటీవల ముగ్గురు ఖలిస్తానీ సానుభూతిపరుల్ని అరెస్ట్ చేసింది. శుక్రవారం ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూ మాట్లాడుతూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని హత్య చేస్తామని బెదిరించాడు.
*కళాకారులకు అండగా నిలబడాలని సీఎం జగన్ భావించారు..
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నేతలు, కళాకారులు పాల్గొన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులను మంత్రి రోజా అందజేశారు. అనంతరం కళాకారులతో కలిసి మంత్రి రోజా డప్పు వాయించారు. రాష్ట్రం విడిపోయాక కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని.. గుర్తింపు కార్డులు లేక కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారని మంత్రి రోజా వెల్లడించారు. కళాకారుల డేటా తీసుకోకపోవడం వల్ల కళాకారులకు న్యాయం జరగలేదన్నారు. కళాకారులు గుర్తింపు కోసం తాపత్రయ పడతారని.. కళాకారులకు అండగా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి భావించారని మంత్రి తెలిపారు. అందుకే తనకు మంత్రిగా అవకాశం కల్పించారని.. సాంస్కృతిక సంబరాల ద్వారా కళాకారులను గుర్తించామన్నారు. ధైర్యంగా మేం కార్డుల ప్రదానోత్సవం చేయగలుగుతున్నామన్నారు. సాంస్కృతిక సంబరాల్లో గుర్తించిన కళాకారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. మారుమూల కళాకారులను సైతం గుర్తించి వారికి గుర్తింపు కార్డులు అందజేస్తున్నామన్నారు. గతంలో కళాకారులను ఎవరూ పట్టించుకోలేదని.. జగనన్న మాత్రమే కళాకారులను పట్టించుకున్నారన్నారు. కళాకారులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ఎన్నికల సమయంలో దొంగలంతా ఒకటవుతున్నారని.. పందుల్లా గుంపులుగా వస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. దొంగలకు, ఆ పందులకు బుద్ధి చెప్పాలంటే కళాకారుల ఆట…మాట..పాట కావాలన్నారు. ట్వంటీ ట్వంటీ ఫోర్ (2024) …జగనన్న వన్స్ మోర్ అంటూ మంత్రి రోజా నినాదం చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి పోయాడని.. జనాన్ని దోచుకుని హైదరాబాద్‌లో ఆస్తులు దాచుకున్నాడని మంత్రి రోజా విమర్శించారు. మళ్లీ ఆ దొంగలొస్తే ప్రజలకు విద్య,వైద్యం,కళాకారులకు అన్నం దొరకదన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి విషం చిమ్మి పోతున్నారని.. నాన్ లోకల్ పొలిటీషయన్ల గురించి పట్టించుకోవద్దని మంత్రి రోజా అన్నారు.
*చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం..! రాంగ్ రూట్‌లోకి వెళ్లి..!
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం రేగింది.. సాంకేతిక కారణాలతో చంద్రబాబు హెలికాప్టర్ అరకు ప్రయాణంలో గందరగోళం ఏర్పడింది.. ఏటీసీ క్లియరెన్స్ లభించకపోవడంతో హెలికాప్టర్‌ను వెనక్కి రప్పించారు అధికారులు.. అయితే, చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ పైలట్ కు – ఏటీసీకి సమాచార లోపం ఏర్పడడంతో ఈ పరిస్థితి వచ్చింది.. నిర్దేశించిన మార్గం కాకుండా మరో మార్గంలో అరకుకు బయల్దేరి వెళ్లింది చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్.. అయితే, రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) హెచ్చరించింది.. దీంతో, హెలికాప్టర్‌ను వెనక్కి పిలిపించింది ఏటీసీ.. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు ఏటీసీ అధికారులు. అయితే, ఏటీసీ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత హెలికాప్టర్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ చేరుకున్నారు చంద్రబాబు నాయుడు. రా కదలిరా కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొనేందుకు అరకు వెళ్లారు.. హెలికాప్టర్ దిగి కారులో సభా ప్రాంగణానికి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి . ఈ బహిరంగ సభకు టీడీపీ, జనసేన నేయకులు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కాగా, రా.. కదలిరా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగసభలు నిర్వహిస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ స ఈఎం జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. అందులో భాగంగా నేడు అరకు, అమలాపురం లోక్‌సభ నియోజకవర్గాల్లో ‘రా.. కదలిరా’ సభలు నిర్వహించనున్నారు. అరకు, మండపేటల్లో జరిగే బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ రా.. కదలి రా.. బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది టీడీపీ నాయకత్వం.
*వైసీపీ, ప్రభుత్వంపై ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథికి పెనమలూరు టికెట్ ఇవ్వకుండా.. ఇంఛార్జ్‌గా మంత్రి జోగి రమేష్‌ని నియమించింది వైసీపీ అధిష్టానం.. ఈ పరిణామాలతో టీడీపీతో టచ్‌లోకి వెళ్లిన పార్థసారథి.. త్వరలోనే సైకిల్ ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ, ప్రభుత్వంపై ఎమ్మెల్యే పార్థసారధి విమర్శలు మొదలుపెట్టారు.
వైసీపీ వీడాలని నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు బూతులు తిట్టడానికి మాత్రమే కాదు, రైతుల సమస్యలు పరిష్కారం కోసం కూడా సమీక్షలు పెట్టాలని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. ఆర్‌బీకే నుంచి మిల్లర్లకు తరలించిన ధాన్యం రోజుల తరబడి దిగుమతి చేసుకోకుండా తేమ శాతం పేరుతో బస్తాపై 300 నుంచి 400 రూపాయలు తగ్గించి ఇస్తున్నారన్నారు. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తేమశాతం పేరుతో మిల్లర్లు రైతులను మోసగిస్తున్నా అధికారులు, మంత్రులు స్పందించడం లేదన్నారు. ఇక్కడ ధాన్యాన్ని కడప, కర్నూలు, నెల్లూరు మిల్లులకు తరలించి ఇక్కడ మిల్లర్లకు సైతం ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఎమ్మెల్యే పార్థసారథి వెల్లడించారు.
*జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దు.. కేటీఆర్ పిలుపు
ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందామన్నారు. కానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను టిఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలామందిని చూసిందన్నారు. రేవంత్ రెడ్డి లాంటి నాయకులను వేల మందిని బీఆర్ఎస్ పార్టీ చూసిందన్నారు. మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అని మీలాంటోళ్లు చాలామంది నీలీగిన్రు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా రెండున్నర దశాబ్దాలు పార్టీ నిలబడి, నీలాంటి వాళ్ళను మట్టికరిపించిందన్నారు. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్… తెలంగాణ తెచ్చినందుకా… తెలంగాణను డెవలప్ చేసినందుకా… మిమ్మలను, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తునందుకా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వతా కలిసిపోతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతాడన్నారు. రేవంత్ రక్తం అంత బీజేపీదే… ఇక్కడ చోటా మోడీగా రేవంత్ రెడ్డి మారిండన్నారు. గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆదాని కోసం వెంటపడుతున్నాడని అన్నారు. స్విట్జర్లాండ్ లో రేవంత్ రెడ్డి అదానితో అలైబలై చేసుకున్నాడని అన్నారు. అదాని రేవంత్ రెడ్డి ఒప్పందాల అసలు, లొగుట్టు బయటపెట్టాలన్నారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిండన్నారు. ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దని అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దన్నారు.
*రష్మిక మందన్న “డీప్‌ఫేక్” వీడియో నిందితుడి అరెస్ట్..
నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా వివాదం సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), డీప్‌ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కఠిన చట్టాలు తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఐటీ చట్టంలో కఠిన నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే రష్మికా మందన్నా వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాజాగా ఈ వీడియోను సృష్టించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. శనివారం ప్రధాన నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లో పట్టుకున్నారు. గతేడాది నవంబర్ 2023లో రష్మికా మందన్నా డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న బ్రిటీష్-ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్సర్ జరాపటేల్ వీడియోకి రష్మికా ముఖంతో మార్ఫింగ్ చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్, 1860లోని సెక్షన్లు 465 (ఫోర్జరీ) మరియు 469 (పరువుకు హాని కలిగించడం) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సెక్షన్లు 66C (ఐడెంటిటీ థెఫ్ట్) మరియు 66E (గోప్యతా ఉల్లంఘన) కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత కత్రినాకైఫ్, కాజోల్ వంటి వారి డీప్‌ఫేక్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ యొక్క డీప్‌ఫేక్ వీడియో ఈ వారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తాజాగా ఈ రోజు సోనూసూద్ వీడియో కూడా నెట్టింట ప్రత్యక్షమైంది.