*ఐదో జాబితాపై వైసీపీలో ఉత్కంఠ
వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పులు చేర్పులపై కసరత్తు జరుగుతూనే ఉంది. ఇప్పటికే నాలుగు లిస్ట్‌లను విడుదల చేసిన వైసీపీ అధిష్ఠానం ఐదో జాబితా కోసం కసరత్తు మొదలుపెట్టేసింది. నాలుగు లిస్టుల్లో ఊహించని వారి పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐదో జాబితాపై వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఐదో లిస్ట్‌లో కొందరు ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు ఉండే అవకాశం ఉంది. ఐదో జాబితాపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్ఠానం కొందరు నేతలను క్యాంపు ఆఫీస్‌కు పిలిపించుకుంటోంది. దీంతో సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. అలాగే మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, బియ్యపు మధుసూధన్, కె. శ్రీనివాసులు కూడా సీఎం క్యాంపు ఆఫీస్‌కు వచ్చారు. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఐదు లిస్ట్ కసరత్తు నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయానికి నేతల తాకిడి తగ్గలేదు. ఉదయం నుంచి పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్, అదీప్ రాజ్, సింహాద్రి రమేష్, అనంత వెంకట్రామిరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎస్.కోట ఎమ్మెల్యే కడిబండి శ్రీనివాసరావులు సీఎంఓకు వచ్చారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తికి టీడీపీలో చేరతారు అనే ప్రచారం నేపథ్యంలో కాసు మహేష్ సీఎంఓకు వచ్చినట్లు సమాచారం. క్యాంపు కార్యాలయానికి పేర్ని కృష్ణమూర్తి కూడా వచ్చారు. మచిలీపట్నం అసెంబ్లీ ఇంఛార్జ్‌గా పేర్ని కృష్ణ మూర్తిని ఇప్పటికే పార్టీ ప్రకటించింది. ఇప్పటివరకు వచ్చిన లిస్టులలో 58 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీ స్థానాలను మార్చింది పార్టీ హైకమాండ్. దాదాపు 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో ఐదుగురు జడ్పీటీసీలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఐదో లిస్ట్‌లో ఇంకెంత మంది సీట్లు ఊడతాయోనని టెన్షన్ నెలకొంది.
*ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి దర్శనం
అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్య రూపం దర్శనమిచ్చింది. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ రాముడి దివ్య రూపాన్ని విడుదల చేసింది. జనవరి 22న ఆలయ గర్భగుడిలో ఇదే విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. కాగా.. ఈ విగ్రహం కృష్ణ శిలతో తయారైంది. విగ్రహం పొడవు 51 అంగుళాలు.. బరువు 150 కేజీలు. అయితే.. బాలరాముడి విగ్రహం గురువారం గర్భాలయానికి చేరుకుంది. ప్రస్తుతం బాలరాముడి విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ లల్లా విగ్రహాన్ని చూసిన భక్తులు.. ‘జై శ్రీరాం, జైశ్రీరాం’ అంటూ పులకించిపోతున్నారు. కాశీకి చెందిన జ్ఞానేశ్వర్ శాస్త్రీ ఆధ్వర్యంలో ఈరోజు, రేపు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అభిజిత్ ముహుర్తంలో పుష్య, శుక్ర, ద్వాదశి 12 గంటల 20 నిమిషాల నుంచి ఒంటి గంట మధ్యలో ఈనెల 22న ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. సూర్య తిలకం ఆకారంలో సూర్య కిరణాలు గర్భగుడిలో పడేలా అద్దాలు రూపొందించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగనుంది. ఈ మహోత్సవానికి దాదాపు ఏడు వేల మంది హాజరవుతారు. సరయూ నదీ తీరంలో నిర్మించిన రామమందిరం.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయం. మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపంగా నిలుస్తోంది. భవ్యరామ మందిరం అత్యంత ఖరీదైన మతపర నిర్మాణాల్లో ఒకటిగా నిలిచిపోనుంది.
*నిఘా నీడలో అయోధ్య.. భారీగా భద్రతా ఏర్పాట్లు
జనవరి 22న రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా.. అయోధ్యలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానించిన వీవీఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలు గస్తీ కాస్తోంది. ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు రాక సందర్భంగా ముందే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అయోధ్య చేరుకుంది. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం నుంచి ఆలయంలోకి సామాన్య భక్తులను ఎవరిని అనుమతించరు. ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు నుంచి భక్తులకు రాముడి దర్శనం ఉంటుందని ఆలయ ట్రస్ట్ తెలిపింది. మరోవైపు.. విద్రోహశక్తుల ముప్పు నేపథ్యంలో యూపీ ఏటీఎస్, కమెండో బలగాల మోహరించాయి. అంతేకాకుండా.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐఏ, ఇతర ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిస్ట్ యూనిట్లు కూడా ఉన్నాయి. వారితో పాటు సైబర్ సెక్యూరిటీకి చెందిన విభాగాలు కూడా అయోధ్యలో మోహరించాయి. అంతేకాకుండా.. అయోధ్యలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు. జపాన్, అమెరికా దేశాల్లో ఉపయోగిస్తున్న ఆధునిక భద్రత వ్యవస్థను అయోధ్యలో నెలకొల్పింది యూపీ ప్రభుత్వం. రామాలయ ప్రాంగణం పరిసరాల్లో 250 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాల ఏర్పాటు చేశారు. వీటితోపాటు మరో 319 ఫేషియల్ రికగ్నిషన్ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేశారు. కాగా.. శత్రుదుర్భేద్యంగా ఆలయ పరిక్రమ ప్రాంతం, యెల్లో జోన్ గా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. నిన్న ముగ్గురు ఉగ్రవాద అనుమానితులను యూపీ ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది.
*22న సెలవు ప్రకటించండి.. రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ వినతి
ఈనెల 22న అయోధ్యలో జరగబోయే రామ మందిర పున:ప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న తరుణంలో ఆరోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. పవిత్రమైన దైవ కార్యాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు. ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటకు విచ్చేసిన బండి సంజయ్ కుమార్ ప్రసిద్దిగాంచిన సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పండితులు బండి సంజయ్ కు ఆశీస్సులు అందించారు. అనంతరం బండి సంజయ్ చీపురు, పార బట్టి సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ….ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు దేవాలయాల శుద్ది చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయ పరిసరాలను శుద్ది చేయడం సంతోషంగా వుందన్నారు. అయోధ్యలో ఈనెల 22న జరగబోయే అందాల రాముడు, అయోధ్య రాముడు, ఆదర్శ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తోందన్నారు. తెలంగాణ ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సిద్ధమైన నేపథ్యంలో 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు దేవుడి అక్షింతల కార్యక్రమంలో స్వచ్చందంగ పాల్గొంటున్నారని చెప్పారు. రామ మందిర నిర్మాణ నిధి సేకరణ లో తెలంగాణ అగ్రభాగాన వుందన్నారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను మీడియా ప్రస్తావించగా.. అక్షింతల్లో రేషన్ బియ్యం, బాసుమతి బియ్యం, జై శ్రీరాం బియ్యం అనే రకాలు వుండవు. పవిత్రమైన దేవుడి అక్షింతలను రేషన్ బియ్యం అంటూ కాంగ్రెస్ నేతలు వక్రీకరించడం తగదన్నారు. కాంగ్రెస్ నేతలు కోరితే బాసుమతి బియ్యాన్ని పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రమంతా జై శ్రీరాం అనే నినాదాలతో మారుమోగుతోందన్నారు. అందులో భాగంగా కరీంనగర్ లో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల ముందు స్వచ్ఛందంగా ‘‘జై శ్రీరాం’’అనే వాల్ రైటింగ్ రాయించుకుంటున్నారని తెలిపారు. ఈనేపథ్యంలో బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం తన నివాసం ఆవరణలో స్వయంగా ‘‘జై శ్రీరాం’’అని వాల్ రైటింగ్ చేయడం గమనార్హం. మరోవైపు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున కాషాయ సైనికులకు ఫోన్లు చేసి తమ ఇంటికి జై శ్రీరాం వాల్ రైటింగ్ రాయాలంటూ ఫోన్లు చేస్తుండటం విశేషమన్నారు.
*సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ వాయిదా..
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసు విచారణ జరిగింది. చంద్రబాబుకు స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీం కోర్టులో సవాలు చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో విచారణ చేపట్టగా, ధర్మాసనం ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. అంతేకాకుండా.. కౌంటర్ దాఖలు చేసేందుకు బాబు తరపు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో కేసును వాయిదా వేశారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో జస్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
*”ఇలాగే జరుగుతూ ఉంటుంది”.. సీఎం సిద్ధరామయ్యతో పీఎం మోడీ..
ప్రధాని నరేంద్రమోడీ బెంగళూర్‌లో నెలకొల్పుతున్న కొత్త కొత్త బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ (BIETC) క్యాంపస్ ప్రారంభోత్సవంలో శుక్రవారం పాల్గొన్నారు. 43 ఎకరాల స్థలంలో రూ. 1,600 కోట్లతో నిర్మించిన అత్యాధునిక ఫెసిలిటీని ప్రధాని ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ ప్రసంగం చేస్తున్న సమయంలో ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. పీఎం తన ప్రభుత్వ విజయాలను వివరిస్తున్న సందర్భంగా సభకు హాజరైన వారు ‘మోడీ మోడీ’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేదిక పంచుకున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను చూస్తూ..‘‘ ముఖ్యమంత్రి గారు ఇది జరుగుతూనే ఉంటుంది’’ అంటూ చమత్కరించారు. దీంతో సీఎం సిద్ధరామయ్య నవ్వారు. 43 ఎకరాల స్థలంలో రూ. 1,600 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్, అమెరికా వెలుపల బోయింగ్ అత్యధిక పెట్టుబడిగా ఉంది. బెంగళూర్ శివార్లలోని దేవనహళ్లిలోని హైటెక్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ పార్క్‌లో ఉన్న ఈ క్యాంపస్ డైనమిక్ స్టార్టప్‌లతో పాటు భారతదేశంలోని ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాల కీలకమైన భాగస్వామ్య కేంద్రంగా ఉంది. గ్లోబల్ ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమ కోసం నెక్ట్స్ జనరేషన్ ఉత్పత్తులు, సేవలకు ఇది కేంద్రంగా దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రధాని ‘బోయింగ్ సుకన్య ప్రోగ్రాం’ని కూడా ప్రారంభించబోతున్నారు. ఇది దేశంలో అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలోకి భారతదేశం అంతటా ఎక్కువ మంది ఆడపిల్లల ప్రవేశానికి తోడ్పడటం లక్ష్యంగా పెట్టుకుంది అని అధికారులు చెప్పారు.
*రామ మందిర వేడుక వేళ రూల్స్ ఉల్లంఘించారో AI పట్టేస్తుంది..
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని 7000 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్ అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. భద్రతా ఉల్లంఘనలపై ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది. తాజా బెదిరింపుల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు దాదాపు 12,000 మంది సిబ్బందిని అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించింది. అయితే నేరస్తుల ఆటకట్టించేందుకు పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని కూడా ఉపయోగిస్తున్నారు. ప్రాణప్రతిష్ట వేడుక ముందు సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ అయోధ్యకు ఉన్నతస్థాయి సైబర్ నిపుణుల బృందాన్ని పంపింది. అయోధ్య భద్రతను పర్యవేక్షించేందుకు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం చేశారు. ఇక్కడ నుంచే వివిధ భద్రతా ఏజెన్సీలు రియల్‌టైంలో సెక్యూరిటీని పర్యవేక్షిస్తాయి. ముఖ్యంగా అనుమానిత కార్యకలాపాలను గుర్తించేందుకు, నేరస్తులు, దుర్మార్గులను గుర్తించేందుకు భద్రతా ఏజెన్సీలు తొలిసారిగా AI నిఘా వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. అయోధ్య చుట్టుపక్కల 10,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో సుమారుగా ఎల్లోజోన్ పరిధిలో ఉన్నాయి. ఎల్లో జోన్‌లో మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ కోసం AIని ఉపయోగిస్తున్నామని యూపీ పోలీస్ లా అండ్ ఆర్డర్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ అన్నారు. నేరస్తులను గుర్తించడంలో, సరిపోల్చడంలో సాయం చేయడానికి ఏఐకి ఉత్తర్ ప్రదేశ్ క్రిమినల్ డేటా బేస్ పోర్టల్‌ని అప్‌లోడ్ చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన AI- ఆధారిత CCTV నిఘా వ్యవస్థ వ్యక్తులు లేదా ఏదైనా సమూహాలు అసాధారణంగా ప్రవర్తించడాన్ని గుర్తించేందుకు సాయపడుతుంది.
*శ్రీ రాముడు పుట్టింది ఎప్పుడో తెలుసా..?
ఇప్పుడు ఎవరి నోట విన్న అయోధ్య మాటే. అందరి చూపు అయోధ్య వైపు. జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుకను ప్రధాని మోదీ నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. ఈ వేడుకలో దేశ, విదేశాల ప్రముఖులు పాల్గొననున్నారు. మరుసటి రోజు అంటే జనవరి 23 నుంచి భక్తులు ‘అయోధ్య రాముడు’ని దర్శించుకోవచ్చు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 11,000 మంది అతిథులను ఆలయ ట్రస్ట్ ఆహ్వానించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. శ్రీ రాముడు పుట్టిన తేదీని ఓ సంస్థ తెలిపింది. పురాణాలన్నీ రాముడు త్రేతాయుగంలోనే జన్మించాడని చెబుతూఉంటాయి. వాల్మీకి రామాయణం కూడా.. రామాయణమంతా త్రేతాయుగంలో జరిగిందేనని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ.. మనందరికీ అర్థమయ్యేలా స్పష్టమైన తేదీలేవీ చెప్పలేదు. వాల్మీకి రామాయణంలో.. శ్రీరాముడు వనవాసానికి వెళ్లే సమయానికి ఆయన వయస్సు 25 ఏళ్లుగా తెలిపారు. కాగా.. శ్రీరాముడు పుట్టిన తేదీ క్రీస్తుపూర్వం 5114వ సంవత్సరం, జనవరి 10న మధ్యాహ్నం 12.05 నిమిషాలకు అని ఇనిస్ట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ గణాంకాలతో నిర్ధారించింది. మహాభారతం, రామాయణాలు, పౌరాణిక ఇతిహాసాలు.. కేవలం కల్పిత కావ్యాలు కావని, అవి చారిత్రక గ్రంధాలని సంస్థ తెలిపింది. అంతేకాకుండా.. లంకలోని అశోకవనంలో సీతాతల్లిని కలిసిన సంవత్సరం 5076 సెప్టెంబర్ 12న కలిశాడని ఆ సంస్థ తెలిపింది. మరోవైపు.. మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3,139, అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైందని పేర్కొంది.