*స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట పండింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ఆంధ్రప్రదేశ్ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీలలో ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది. ఆల్ ఇండియా లెవెల్లో నాలుగు ర్యాంకులను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. జాతీయ స్థాయిలో గుంటూరుకి ఆలిండియా 2వ ర్యాంకు, గ్రేటర్ విశాఖ పట్నంకి ఆలిండియా 4వ ర్యాంక్ , విజయవాడకి ఆలిండియా6వ ర్యాంక్ , తిరుపతికి ఆలిండియా8వ ర్యాంకు వచ్చింది. అత్యంత పరిశుభ్రంగా నగరాలను తీర్చిదిద్దినందుకు గానూ ఏపీ ఈ అవార్డులను దక్కించుకుంది. పట్ణణాల అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషికి ఈ అవార్డులే నిదర్శనమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. “స్వచ్ఛ సర్వేక్షణ్- 2023 లో ఏపీ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీలలో ఏపీ నెంబర్ వన్ గా నిలిచింది. జాతీయ స్థాయిలో గుంటూరుకి ఆలిండియా 2వ ర్యాంకు, గ్రేటర్ విశాఖ పట్నంకి ఆలిండియా 4వ ర్యాంక్ , విజయవాడకి ఆలిండియా6వ ర్యాంక్ , తిరుపతికి ఆలిండియా8వ ర్యాంకు వచ్చింది. పులివెందుల మున్సిపాలిటీకి క్లీన్ సిటీ ఆఫ్ ఏపీ అవార్డు వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డులు చిహ్నం. సీఎం వైఎస్ జగన్ క్లీన్ ఏపీ (క్లాప్) ప్రోగ్రాం సక్సెస్ అయ్యింది. తడి, పొడి చెత్తను సమర్ధంగా నిర్వహణ జరుగుతోంది.” అని మంత్రి తెలిపారు.
*ఏపీ అప్పులకు ప్రధాన కారణం చంద్రబాబే..! అసలు లెక్కలు బయటపెట్టిన ఆర్థిక మంత్రి..
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ ఏపీని అప్పుల కుప్పగా మార్చిందంటూ విపక్షాలు చేస్తున్న కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. రాష్ట్రం అప్పుల్లో ఉండటానికి ప్రధాన కారణం చంద్రబాబేనని ఆరోపించిన ఆయన.. ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుందనే ఓపీఎస్ కేంద్రం వెనక్కి వెళ్లిందన్నారు. చంద్రబాబు.. రాష్ట్రం 13 లక్షల కోట్ల అప్పులు చేశాం అని వ్యాఖ్యలు చేశారు.. మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఆర్ధిక మంత్రి చంద్రబాబు ఏ ఆధారంతో ఈ లెక్కలు చెబుతున్నారు? ఇంకొకరు 10 లక్షల కోట్లు అంటారు.. మరోసారి ఏడు లక్షల కోట్లు అంటారు . ఈ లెక్కలు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. కోవిడ్ వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఇబ్బంది అయ్యిందన్నది వాస్తవం అన్నారు బుగ్గన.. కానీ, పెండింగ్ బిల్స్ 1,90 వేల కోట్లు ఉన్నాయని ఎవరు చెప్పారు మీకు? అని ప్రశ్నించారు. ఆర్బీఐ విడుదల చేసిన డాక్యుమెంట్ లో 15 ఏళ్ల డేటా ఉంటుంది.. టీడీపీ హయాంలో వార్షిక అప్పు 22 శాతం ఉంటే.. మా ప్రభుత్వంలో 12 శాతమే అన్నారు. ఆర్బీఐ, ఆర్ధిక శాఖ, బ్యాంకులకు తెలియకుండా అప్పులు చేయటం సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించారు. స్థూల ఉత్పత్తిపై టీడీపీ హయాంలో అప్పు 2,59,000 కోట్లు.. అంటే 7 శాతం నిష్పత్తి.. మా ప్రభుత్వంలో స్థూల ఉత్పత్తిలో 2,26,000 కోట్ల అప్పు.. నిష్పత్తిలో 5.6 శాతమే అన్నారు. మా ప్రభుత్వ హయాంలో స్థూల ఉత్పత్తి 10,84,000 కోట్లు.. టీడీపీ హయాంలో స్థూల ఉత్పత్తి 6,98,000 కోట్లు.. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు 2018-19లో రూ.44,86,000.. 2022-23లో పీఎఫ్ ఖాతాలు రూ.60,78,000.. మరి ఉద్యోగాలు పెరిగినట్లా కాదా? అని ప్రశ్నించారు. రాయలసీమ వాళ్లు అమాయకులు, కర్నూలు వాళ్లు తిక్కోళ్లు అని చంద్రబాబు అనుకుంటున్నాడు.. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు అని మండిపడ్డారు మంత్రి బుగ్గన.. ఎమ్మెల్యేలకు పేర్లు పెడుతున్నాడు చంద్రబాబు .. ఆయన వయసుకు ఇలా పేర్లు పెట్టడం పద్ధతిగా ఉంటుందా? లోకేష్ ను రేలంగి అని అనలేమా? మా ఎమ్మెల్యేలు చంద్రబాబు కు పేర్లు పెట్టలేరా? అని ప్రశ్నించారు. మాకు సంస్కారం ఉంది కనుకే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు.. రాష్ట్రంలో వైసీపీ మినహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. అధికారికం కోసం ఎన్నో వేషాలు వేశాడు చంద్రబాబు.. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబేనని ఫైర్ అయ్యారు. 2008లో తెలంగాణ ఏర్పాటుకు లేఖ రాశాడు చంద్రబాబు.. ఏపీకి స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ పోవటానికి చంద్రబాబు కారణం కాదా? హోదా వద్దు ప్యాకేజీ చాలు అని ఎందుకు అన్నారు? అని నిలదీసిన ఆయన.. ప్రత్యేక ప్యాకేజీ కూడా సాధించుకోలేక పోయారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పు జనాభా ప్రకారం, ఆస్తులు లొకేషన్ బట్టి విభజన చేస్తే చంద్రబాబు ఎందుకు మాట్లాడ లేదు? అని అసహనం వ్యక్తం చేశారు బుగ్గన.. రాష్ట్రం అప్పుల్లో ఉండటానికి ప్రధాన కారణం చంద్రబాబేనన్న ఆయన… ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుందనే ఓపీఎస్ కేంద్రం వెనక్కి వెళ్లిందన్నారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
*ఏపీలో రేపు మూడు రైళ్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో రేపు మూడు రైళ్లు ప్రారంభం కానున్నాయి. రేపు గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రైళ్లను ప్రారంభించనున్నారు. హుబ్బల్లి – నర్సాపూర్, విశాఖపట్టణం – గుంటూరు, నంద్యాల – రేణిగుంట రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ నెల 12 నుంచి ప్రయాణికులకు ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అదే విధంగా కాకినాడ టౌన్, నాందేడ్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 07487/07488 అనే నంబర్లు గల ప్రత్యేక రైలు ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 2.25కు నాందేడ్‌లో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు కాకినాడకు చేరుకుంటుందని వివరించారు. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6.30కు కాకినాడలో బయలు దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.10 నాందేడ్‌కు చేరుకుంటుదన్నారు. ఈ రైలు బాసర, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం,కొండపల్లి, రాయనపాడు, ఏలూరు. రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని వెల్లడించారు.
*కాళేశ్వరంపై ముగిసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు.. కీలక పత్రాలు సీజ్
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ముూడు రోజులుగా తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగానే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ ఇరిగేషన్ డివిజనల్ కార్యాలయంలో చేపట్టిన సోదాలు ముగిశాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ , కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్ లకు సంబందించిన కీలక పత్రాలు సీజ్ చేశారు. అంతేకాకుండా.. ఈ సోదాల్లో కీలక రికార్డులు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకొని హైదరాబాద్ కార్యాలయానికి తరలించారు. కాగా.. తదుపరి విచారణ కొనసాగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రమేష్ చారి తెలిపారు.
*ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు..
ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో కాబూల్‌కి 241 కిలోమీటర్ల ఈశాన్య ప్రాంతంలో భూకంప కేంద్ర ఉంది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతో భూకంపం సంభవించింది. దీంతో దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మన దేశంతో పాటు పాకిస్తాన్ కూడా భూమి కంపించింది. ఇస్లామాబాద్‌తో పాటు పాక్ ఉత్తర భాగంలో ప్రకంపనలు వచ్చాయి. వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్ ఫూంచ్ జిల్లాలో భూకంపం సంభవించింది. పిర్ పంజల్ ప్రాంతంలోని దక్షిణ ప్రాంతంలో కూడా ప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్ లాహోర్ నగరం, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు అక్కడి మీడియా చెబుతోంది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు.
*జనవరి 31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుండి ప్రారంభమవుతాయి. ఇది ఫిబ్రవరి 9 వరకు కొనసాగుతుంది. విశ్వసనీయ వర్గాలు ఈ సమాచారాన్ని అందించాయి. ఫిబ్రవరి 31న రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని, అనంతరం ఆర్థిక సర్వే నివేదికను సమర్పించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న జనవరి 31 నుండి జరిగే బడ్జెట్ సెషన్‌లో సమర్పిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 31న బడ్జెట్ సమావేశాల ప్రారంభంతో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీని తరువాత ఆర్థిక సర్వే నివేదిక కూడా జనవరి 31 న మాత్రమే సమర్పించబడుతుంది. మధ్యంతర బడ్జెట్‌లో రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసే ప్రతిపాదన కూడా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది మాత్రమే కాదు, మహిళలకు సంబంధించి కొన్ని పెద్ద ప్రకటనలు కూడా చేయవచ్చు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందే మధ్యంతర బడ్జెట్ రానుండడంతో అందరి చూపు ఈ సెషన్‌పైనే ఉంటుంది. థింక్ ట్యాంక్ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ విడుదల చేసిన డేటా ప్రకారం.. గత సంవత్సరం బడ్జెట్ సెషన్ రెండవ సగంలో ఉత్పాదకత 5.3 శాతంగా ఉంది. మొదటి భాగంలో ఉత్పాదకత 83.8శాతం. మిగిలిన సెషన్‌లో గందరగోళం నెలకొంది. లోక్‌సభ దాని నిర్ణీత సమయంలో 34శాతం, రాజ్యసభ 24శాతం పని చేసింది. దిగువ సభ లోక్‌సభ నిర్ణీత సమయమైన 133.6 గంటలకు వ్యతిరేకంగా దాదాపు 45 గంటలపాటు పని చేయగా, రాజ్యసభ 130 గంటలలో 31 గంటలకు పైగా పనిచేసింది.
*గల్వాన్‌తో భారత్ ఏంటో చైనాకు తెలిసొచ్చింది..
చైనాను ఉద్దేశించి భారత్ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాలో మాట్లాడుతూ.. 2020 గల్వాన్ ఘటన తర్వాత భారత్ ఏంటో చైనాకు అర్థమైందని అన్నారు. భారత్ ఇప్పుడు వ్యూహాత్మకంగా ఉందని, బలహీనమైన దేశం కాదని చెప్పారు. భారత దేశాన్ని ఎవరూ భయపెట్టి తప్పించుకోలేరని అన్నారు. ఇటీవల చైనా మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్‌లో భారత్ గురించి వచ్చిన కథనం ‘ వాట్ ఐ సీ ఎబౌట్ భారత్ నేరేటివ్ ఇన్ ఇండియా’లో దేశాభివృద్ధి గురించి ప్రశంసించారు. భారతదేశ విదేశాంగ విధానంలో మార్పులను గురించి ప్రస్తావించింది. ప్రపంచంలో కీలక శక్తిగా భారత్ ఎదుగుతోందని, ఇండియా ప్రపంచంలో కీలకంగా ఉందని చైనా అంగీకరించింది. దీని గురించి ప్రస్తావించిన రాజ్ నాథ్ సింగ్.. భారత్‌పై మారుతున్న చైనా దృక్పథాన్ని తెలియజేస్తుందని అన్నారు. గల్వాన్ వద్ద చైనా దళాలతో మన జవాన్లు చూపిన ధైర్యం భారత్‌పై బీజింగ్ దృక్ఫథాన్ని మార్చడంలో సాయపడిందని తాను నమ్ముతున్నట్లు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇప్పుడు భారత్ బలహీన దేశం కానది, ప్రపంచ వ్యాప్తంగా ఎదుగుతున్న దేశమని చెప్పారు. మేము ఎవరినీ శత్రువుగా చూడమని, కానీ భారత్-చైనా మధ్య సంబంధాలు ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాయని ప్రపంచానికి తెలుసు.. అయితే భారత్ తమ పొరుగు దేశాలతో, ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటోందని ఆయన అన్నారు.
*క్లీనెస్ట్ సిటీగా వరసగా ఏడోసారి ఇండోర్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ సిటీలకు చోటు..
దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మరోసారి ఇండోర్ నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023 అవార్డుల్లో భాగంగా ఏడోసారి ఇండోర్ మొదటిస్థానంలో నిలిచింది. ఇండోర్, సూరత్ నగరాలు దేశంలో పరిశుభ్రమైన నగరాలుగా ఎంపికయ్యాయి. అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తదితరులు పాల్గొన్నారు. ఒక లక్ష కంటే తక్కువ జనాబా ఉన్న నగరాల్లో మహరాష్ట్రకు చెందిన సస్వాద్ క్లీనెస్ట్ సిటీగా నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పటాన్, మహారాష్ట్రలోని లోనావాలా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వారణాసి బెస్ట్ క్లీనెస్ట్ గంగా పరివాహక పట్టణంగా నిలువగా.. దీని తర్వాత ప్రయాగ్ రాజ్ ఉంది. క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుల విభాగంలో మధ్యప్రదేశ్‌లోని మోవ్ కంటోన్మెంట్ బోర్డ్ టాప్ ర్యాంక్ పొందింది. ఈ ఏడాది ఇండోర్‌తో పాటు గుజరాత్ నగరం సూరత్ సంయుక్తంగా తొలిస్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో నవీ ముంబై మూడోస్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం నాలుగో స్థానంలో, విజయవాడ(6), తిరుపతి(8), హైదరాబాద్(9) నగరాలు తొలి 10 సిటీల్లో చోటు దక్కించుకున్నాయి.
*నటి నయనతారపై కేసు నమోదు.. శ్రీరాముడిని అగౌరపరిచారని ఫిర్యాదు..
నటి నయనతారపై కేసు నమోదైంది. ఇటీవల విడుదలైన సినిమా ‘అన్నపూరణి’ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో రైట్ వింగ్ సంస్థ ఫిర్యాదు మేరకు నయనతారతో పాటు దర్శకుడు నీలేష్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేథీ మరియు ఆర్ రవీంద్రన్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్‌పై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, రాముడిని అగౌరపరిచారని, సినిమా ద్వారా ‘లవ్ జిహాద్’ని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నయనతార కెరీర్లో 75వ సినిమాగా వచ్చని అన్నపూరణికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 1న ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా మెప్పించలేకోయింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా.. రాముడు కూడా మాంసం తిన్నాడని, ఇది వాల్మీకి అయోధ్య కాండలో ఉంది అని ఓ డైలాగ్ ఉంది. ఇది వివాదాస్పదం అయింది. హీరో ఓ ముస్లిం అయిఉండీ.. హీరోయిన్ ఓ బ్రహ్మణ అమ్మాయిగా ఉండటాన్ని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది లవ్ జీహాద్‌ని ప్రోత్సహించేలా ఉందని ఇప్పటికే తమిళనాడుతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ వివాదంతో నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.