విరిగిపడుతున్న కొండచరియలు.. అరకులోయ ఘాట్ రోడ్డు మూసివేత
ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్ తుఫాన్ విధ్వంసం సృష్టించింది.. భారీ ఎత్తున పంట నష్టం జరగడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.. పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్ విజృంభణతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది.. మరోవైపు.. ఇంకా వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి.. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఘాట్ రోడ్డు మూసివేశారు అధికారులు.. అల్లూరి ఏజెన్సీలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండగా.. కొండచరియలు విరిగిపడుతున్నాయి.. దీంతో.. ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారింది.. అప్రమత్తమైన అధికారులు అరకులోయ వెళ్లేందుకు వాహనాల అనుమతులు నిలిపివేశారు.. చిలకల గడ్డ దగ్గర అరకులోయ వెళ్లే వాహనాల నిలిపివేస్తున్నారు.. దీంతో.. పర్యాటకులు, ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తుంది.. ఇక, వర్షాలకు ఘాట్ రోడ్ కొండచరియలు విరిగిపడుతుండడంతో.. అప్రమత్తమైన అధికారులు.. వాహనాల రాకపోకలు నిలిపివేశారు.. బోర్డర్ చెక్ పోస్టు వద్దే వాహనాలను నిలిపివేస్తున్నారు సిబ్బంది.. దీంతో.. ఎస్ కోట, అరకు రోడ్డులో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి..
తెలంగాణలో ఓటు వేసినవారిని ఏపీలో ఆపండి..! ఈసీకి వైసీపి ఫిర్యాదు
తెలంగాణలో ఓటు వేసినవారిని ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు.. ఈ రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాను కలిశారు మంత్రులు, వైసీపీ నేతలు.. సీఈవోను కలిసిన టీమ్‌లో మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఇతర నేతలు ఉన్నారు.. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఏపీకి చెందిన వారికి 4 లక్షల 30 వేల 264 ఓట్లు ఉన్నాయి. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు అందించాం. డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవో ను కోరాం అన్నారు. దేశంలో ఒకే చోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానం.. ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరాం అన్నారు మంత్రి జోగి రమేష్. ఇక, ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష.. కానీ, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట.. మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా అంటూ మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయన్న ఆయన.. డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు తాను చేసిన తప్పులు ఇతరులపైకి నెడతారని దుయ్యబట్టారు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్ధాలు చెప్పాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.
విశాఖ హయగ్రీవ భూముల కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
విశాఖ హయగ్రీవ భూములపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.. జిల్లా కలెక్టర్ భూ కేటాయింపు రద్దు పై ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో రెండు నెలలలో తెలియజేయాలని ఆదేశించింది న్యాయస్థానం.. అప్పటి వరకు హయగ్రీవ భూముల మీద ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు జరపకూడదని ఆదేశించింది హైకోర్టు.. విశాఖ ఎండాడలో అనాథులు, వృద్ధులకి కేటాయించిన 12.51 ఎకరాల హయగ్రీవ భూముల వివాదం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది.. దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.. ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్.. విచారణ జరిపిన హైకోర్టు.. ఇప్పుడు కీలక ఆదేశాలు జారీ చేసింది.. కాగా, విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి విశాఖ భూముల ధరలు పెరిగిపోయాయి.. ఇదే సమయంలో, వివాదస్పద భూముల సెటిల్మెంట్లు ఎక్కువయ్యాయని.. కొందరు నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తూ వుస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే హయగ్రీవ భూములపై వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లిన విషయం విదితమే.
రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద సంఖ్యలో రానున్న ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు..
రేపు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు, ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి.. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలను ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో.. రేపు మధ్యహ్నం 1. 04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై సౌందర్యరజన్ ప్రమాణం చేయించనున్నారు. ఇకపోతే.. రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మంది మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో మూడు స్టేజీలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై సీఎం, ఎమ్మెల్యేలు, పీఏసీ, పీఈసీ సభ్యులు ఉండేలా.. రెండో స్టేజీలో ఏఐసీసీ నేతలు.. మూడో స్టేజీపై డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఎల్బీ స్టేడియం బయట ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియం ప్రధాన ద్వారం దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 500 మంది కళాకారులచే అతిధులకు స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
“కాశ్మీర్ సమస్యకు నెహ్రూ తప్పిదాలే కారణం”.. పార్లమెంట్‌లో అమిత్ షా..
లోక్‌సభలో కాశ్మీర్ సమస్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్ల్-2023ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జమ్మూకాశ్మీర్ సమస్యకు భారత తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని మరోసారి నిందించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) సమస్యకు మాజీ ప్రధాని బాధ్యత వహించాలని అమిత్ షా అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ మూలంగానే పీఓకే సమస్య ఏర్పడిందని లేకపోతే అది భారతదేశంలో భూభాగం ఉండేదని ఆయన చెప్పారు. ఇది తన తప్పే అని నెహ్రూ కూడా చెప్పారని అమిత్ షా గుర్తు చేశారు. ఒక్క తప్పిదం వల్ల ఈ దేశం చాలా భూమిని కోల్పోయిందని అన్నారు. నెహ్రూ చేసిన రెండు తప్పుల కారణంగా జమ్మూ కాశ్మీర్ నష్టపోయింది. ఆనాడు యుద్ధ సమయంలో కాల్పుల విరమణ ప్రకటించడం, కాశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితిలో పెట్టడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని షా అన్నారు. జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, 2023 & జమ్మూ మరియు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, 2023పై చర్చ సందర్భంగా షా ఈ వ్యాఖ్యలు చేశారు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన సంఘటన.. ‘హ్యాండిల్డ్ ది బాల్’ కారణంతో ఔట్..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్ ‘హ్యాండిల్డ్ ది బాల్’ కారణంగా ఔట్ అయ్యాడు. దీంతో.. టెస్టు క్రికెట్‌లో ఈ విధంగా ఔటైన తొలి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. క్రికెట్‌లో అతి తక్కువగా కనిపించే ఘటనల్లో ఇదొకటి. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్‌లో రెండో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదటి రోజు బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. జట్టు స్కోరు 104 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది. దీంతో జట్టు కష్టాల్లో పడి ఉంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన ముష్ఫాకర్ రహీమ్ పైనే ఆశలు పెట్టుకున్న జట్టు.. అనవసరమైన ప్రయత్నంతో పెవిలియన్ బాట పట్టాడు. న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ బౌలింగ్ లో నాల్గో బంతిని రహీం డిఫెన్స్ ఆడాడు. అయితే బంతి బ్యాట్ కు తగిలి వికెట్లకు కొంచెం దూరం పక్కకు వెళ్లింది. దీంతో.. తన వికెట్‌ను కాపాడుకోవడానికి, అతను నేరుగా చేతితో బంతిని దూరంగా నెట్టాడు. దీనిపై న్యూజిలాండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. మైదానంలోని అంపైర్ దానిని థర్డ్ అంపైర్‌కు సూచించాడు. రివ్యూ అనంతరం ముష్ఫాకర్ రహీమ్‌ను థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. ఫీల్డింగ్‌కు ఆటంకం కలిగించినందుకు ఔట్ అయిన తొలి బ్యాట్స్‌మెన్‌గా ముష్ఫాకర్ రహీమ్ నిలిచాడు. అయితే.. అప్పటికే బంతి వికెట్‌కు దూరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బంతిని చేత్తో ఎందుకు తాకాడు అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది. కాగా.. 2017లో బ్యాట్స్‌మెన్ తన చేతితో బంతిని తాకితే ఔట్ చేయాలనే నిబంధన ఉండేది.
ఐసీసీ T20 ర్యాంకింగ్స్ లో ఇండియన్ ప్లేయర్స్ హవా
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఇండియన్ ప్లేయర్స్ హవా కొనసాగుతుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో.. టీ20 నెంబర్ వన్ బౌలర్ గా స్పిన్నర్ రవి బిష్ణోయ్ చోటు దక్కించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ ని వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానంలోకి ఎగబాకాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో రవి బిష్ణోయ్ 9 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇదిలా ఉంటే.. టీ20 నెంబర్ వన్ బ్యాట్సమెన్ గా టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు.
అదిరిపోయే బిజినెస్ ఐడియా.. పాస్ట్ ఫుడ్ బిజినెస్ తో కళ్లు చెదిరే లాభాలు…
బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే ఇదిగో మీకోసం అదిరిపోయే బిజినెస్ బిజినెస్ ఐడియా.. ఈ బిజినెస్ ఐడియా ని అనుసరించడం వలన లక్షల్లో సంపాదించొచ్చు. పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. మంచి బిజినెస్ ని మొదలు పెట్టాలని అనుకునే వాళ్ళు ఈ ఐడియా ని అనుసరించొచ్చు.. మన చేతుల్లో పని.. లాభాలను కూడా బాగానే పొందవచ్చు.. ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ముఖ్యమైన నగరాల్లో ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ కి ఎటువంటి తిరుగులేదు. చక్కగా మీ వ్యాపారం సాగుతుంది. పైగా ఎక్కువ మంది ఈ మధ్య నగరంలోనే జీవిస్తున్నారు ఉద్యోగాల వలన సమయం కూడా ఉండకపోవడంతో బయట ఫుడ్ ని తీసుకుంటున్నారు ఇది మీరు క్యాష్ చేసుకోవచ్చు. అదిరిపోయే ఫుడ్ బిజినెస్ ని స్టార్ట్ చేసి లక్షల్లో లాభాలని పొందవచ్చు. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ద్వారా మంచిగా లాభాలను పొందొచ్చు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఇప్పుడు ఫుడ్ ని కొనాలని ఆసక్తి చూపుతున్నారు. ప్రతి రోజూ మీరు ఈ బిజినెస్ ద్వారా 5000 నుండి 10000 రూపాయల వరకు సంపాదించొచ్చు. సగం ఖర్చులకు పోయిన సగం మిగులుతుంది..ఫుడ్ స్టాల్ కోసం మీరు మొదట ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. డిమాండ్ పెరిగే కొద్దీ మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్లొచ్చు. మీ ఫుడ్ స్టాల్స్ లో పని చేయడానికి స్టాఫ్ ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ ను తయారు చేయడానికి కావలసిన సామాన్లని కొనుగోలు చేయాలి. సీటింగ్ ఏర్పాటు కూడా చేయాల్సి ఉంటుంది ఇలా మీరు వ్యాపారానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటే వ్యాపారం బాగా సాగుతుంది. లాభాలు వస్తాయి…టేస్ట్ బాగుంటే అందరు తినడానికి ఇష్టపడతారు.. అందుకు మొదట తక్కువ ఖర్చుతో పెట్టి ఆ తర్వాత మెల్లగా విస్తరించుకోవచ్చు..
నేను ప్రేమలో పడ్డాను.. పవన్ మాజీ భార్య పోస్ట్ వైరల్
నటి, హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయ వాక్యాలు అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె .. ఆ తరువాత పవన్ తో ప్రేమ, పెళ్లి అంటూ సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఆ తరువాత పిల్లలను చూసుకుంటూ ఉండిపోయిన రేణు.. ఈ ఏడాది టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేదు కానీ, రేణు కు మాత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. రేణు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. తన పిల్లలతో ఎంజాయ్ చేసి క్షణాలను, సమాజంలో ఆమెను కదిలించే అంశాల గురించి మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. ఇక తాజాగా రేణు యానిమల్ సినిమా రివ్యూ ఇచ్చి షాక్ ఇచ్చింది. అంత వైలెన్స్, న్యూడిటీ ఉన్న సినిమాకు రివ్యూ ఇస్తే నెటిజన్స్ ఎక్కడ ట్రోల్ చేస్తారో అని చాలామంది సినిమా గురించి చెప్పడం కూడా మానేశారు. కానీ, రేణు ఈ సినిమాతో ప్రేమలో పడిపోయాను అని చెప్పడం షాకింగ్ కు గురిచేస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో యానిమల్ పోస్టర్ ను షేర్ చేస్తూ.. “ఎట్టకేలకు నిన్ననే సినిమా చూడాల్సి వచ్చింది. నిస్సందేహంగా దానితో ప్రేమలో పడ్డాను… క్రేజీ, బ్లడీ యాక్షన్ సీక్వెన్స్‌ల కారణంగా బలహీన హృదయం ఉన్నవారి కోసం కాదు, కానీ మీరు ఏదైనా ప్రత్యేకమైన అనుభూతిని పొందాలనుకుంటే, ఖచ్చితంగా థియేటర్‌లో చూడటం మిస్ అవ్వకండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
చెప్పులు కుట్టేవాడికి చెప్పులు ఉంటాయా.. పెళ్లిళ్లు చేసేవాడికి పెళ్లిళ్లు అవుతాయా
బేబి చిత్రంతో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న యూత్‌ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్. ఈ సినిమా తరువాత విరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం జోరుగా హుషారుగా. అను ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విరాజ్ సరసన పూజిత పొన్నాడ కథానాయికగా నటిస్తుంది. యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబరు 15న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను పాపులర్ దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ తో ట్రైలర్ కట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. బ్రహ్మజీ కామెడీ డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ విడుదల అనంతరం బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. “బేబి సినిమాతో విరాజ్ అశ్విన్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. విరాజ్, పూజిత కలిసి నటించిన ఈ ‘జోరుగా హుషారుగా’ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. మంచి కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా అర్థమవుతుంది. చిత్రయూనిట్ మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తూ.. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని” అన్నారు.