గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్.. జనవరి 1వ తేదీ నుంచి పెరగనున్న పెన్షన్.. జీవో జారీ..
పెన్షనర్లకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్.. ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల పేరుతో ఇచ్చిన పథకాల్లో 98 శాతం నెరవేర్చారని పలు సందర్భాల్లో మంత్రులు, వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు.. మెనిఫెస్టోలో లేకపోయిన కొన్ని కొత్త పథకాలను కూడా అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నారని చెబుతారు.. ఇక, సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కూడా ఉకటి.. ఈ పథకం కింద వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, ట్రాన్స్ జెండర్స్, వితంతువులకు పెన్షన్ అందిస్తూ వస్తున్నారు.. అంతేకాదు పెన్షన్ ను క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తోంది జగన్ సర్కార్..ఇప్పటి వరకు వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక కింద నెలకు రూ.2750 నగదును ఇస్తూ వస్తున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఇప్పుడు ఆ పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. వైఎస్సార్ పెన్షన్ కానుక 3 వేల రూపాయలకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆ ఉత్తర్వుల ప్రకారం 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది రూ.3 వేల పెన్షన్.. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా సీఎం జగన్ వచ్చే జనవరి 2024 నుంచి వృద్ధాప్య పెన్షన్ ను కొత్త ఏడాది కానుకగా రూ. 3 వేలకు పెంచుతామని ప్రకటించారు. ఆ తర్వాతే రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తామని తెలిపారు.. ఇక, దానికి అనుగుణంగానే తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో పెన్షన్ పెంపునకు ఆమోదముద్ర వేశారు.. ఇప్పుడు జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.
సీఎం జగన్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. అవి ఎప్పుడూ చేయని నేత..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అవసరాల కోసం మభ్యపెట్టడం, మోసం చేయడం, అబద్దాలు చెప్పడం.. దైవభక్తి ఉన్న వైఎస్ జగన్ ఎన్నడూ చేయలేదన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో విక్టరీ బాప్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు నాని.. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.. ఇక, పలు చర్చిల అభివృద్ధికి నగదు, చెక్కులు అందజేసిన ఆయన.. పాస్టర్లకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఇక, ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అవసరాల కోసం ప్రజలను మభ్యపెట్టడం గానీ, మోసం చేయడం గానీ, అబద్దాలు చెప్పడం గానీ.. దైవభక్తి ఉన్న జగన్ ఎన్నడూ చేయలేదన్నారు.. ఇద్దరు (చంద్రబాబు, పవన్ కల్యాణ్) కలిసి వచ్చినా దేవ బలం, ప్రజల ఆశీస్సులు ఉన్న వైఎస్ జగన్ ను ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. కుల, మతాలకతీతంగా పేదల కోసం సీఎం వైఎస్ జగన్ పనిచేస్తుంటే.. ఓట్ల కోసం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలతో కలిసి వైఎస్ జగన్ యుద్ధం చేస్తున్నాడు.. కానీ, పవన్ కల్యాణ్, పెత్తందార్లతో కలిసి, చంద్రబాబు యుద్ధం మొదలెట్టాడు అంటూ విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.
అక్రమాలపై పోరాడితే చంపేస్తామని బెదిరిస్తారా..? ఆయనకు ఏ హాని కలిగినా ప్రభుత్వానిదే బాధ్యత..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలపై పోరాడితే చంపేస్తామని బెదిరిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జీవీఎంసీ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కి అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.. విశాఖపట్నం కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలుపై మూర్తి యాదవ్ పోరాడుతున్నారు.. చట్ట ఉల్లంఘనలపై న్యాయ పోరాటం చేస్తున్నారు.. మా పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ని చంపేస్తామని బెదిరించడం అధికార పక్షం వైఖరిని తెలియచేస్తోందని దుయ్యబట్టారు. ప్రశ్నించడం, చట్ట ఉల్లంఘనలపై పోరాడటం ప్రజాస్వామ్యంలో భాగం అని గుర్తుచేశారు పవన్ కల్యాణ్.. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేని పాలకులు, వారి అనుయాయులు న్యాయ పోరాటాలను తట్టుకోలేకపోతున్నారన్న ఆయన.. మూర్తి యాదవ్ కు ప్రాణ హాని తలపెట్టారని మండిపడ్డారు. విశాఖపట్నంలో రుషికొండను తొలిచేసి ప్యాలెస్ నిర్మించడంపై, దసపల్లా భూముల వ్యవహారం, టీడీఆర్ స్కామ్, టైకూన్ కూడలి మూసివేత, క్రైస్తవ ఆస్తులను కొల్లగొట్టి భారీ భవనాలు నిర్మించడం లాంటి అనేక వైసీపీ నేతల అక్రమాలపై మూర్తి యాదవ్ పోరాడుతున్నారని.. జీవీఎంసీలో చోటు చేసుకుంటున్న అవినీతి చర్యలు, తప్పుడు ర్యాటిఫికేషన్లపై కౌన్సిల్ సమావేశాల్లో బలంగా మాట్లాడుతున్నారని తెలిపారు. దీంతో.. అధికార పక్షం జీర్ణించుకోలేక బెదిరింపులకు దిగుతున్నారు.. మూర్తి యాదన్ కు ఏ చిన్నపాటి హాని కలిగినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
వేతనం పెంచేందుకు ఇది సమయం కాదు.. అంగన్వాడీలు సమ్మె విరమించాలి..
అంగన్వాడీల సమస్యలపై సచివాయలంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అంగన్వాడీలు సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని లక్షకు పెంచామని గుర్తుచేశారు. ఉద్యోగ విరమణ వయసును కూడా 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశామన్న ఆమె.. గతంలో తెలంగాణ కు సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరిన వెంటనే వేతనాలను రూ.11,500కు పెంచాం.. పదోన్నతి వయస్సును కూడా పెంచామన్నారు. అయితే, అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి ఉషశ్రీ చరణ్.. అర్హతను బట్టి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని తెలిపారు. కానీ, అంగన్వాడీలకు గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదని స్పష్టం చేశారు. ఇక, అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టారంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పందిస్తూ.. ఎవరూ అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టలేదని క్లారిటీ ఇచ్చారు. ఆయా జిల్లా కలెక్టర్ లు కేంద్రాలను నడిపేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు మంత్రి ఉషశ్రీ చరణ్..
కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం.. సీఎం మాట్లాడుతుండగా సభలో బీఆర్ఎస్ రచ్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. గురువారం ఆరో రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం అన్నట్టుగా సభ నడింది. సీఎం రేవంత్ రెడ్డికి ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ మధ్య మాటల యుద్దం నడిచింది. కాగా సభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. తాము ఎవరికి భయపడేది లేదని, కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ అక్బరుద్దీన్ ఎంత సేపు మాట్లాడినా తమకు ఇబ్బంది లేదంటూ ధీటుగా సమాధానం ఇచ్చారు. అనంతరం అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ.. ‘అక్బరుద్దీన్ ఆరు సార్లు గెలిచారు. ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసుకున్నాం. సభలో సభ్యులందరికి ఒకే విధమైన హక్కులు ఉంటాయి. Brs.. mim మిత్రులమని కేసీఆర్ చెప్పారు. ఓల్డ్ సిటీ.. న్యూ సిటీ అనే తేడా మాకు లేదు. Mim నేత అక్బరుద్దీన్ ముస్లింలకు మాత్రమే నాయకుడా? హిందువులు ఆయనకు ఓట్లు వేయలేదా. మేము జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ కి టికెట్ ఇస్తే ఓడించే ప్రయత్నం చేసింది ఎంఐఎం. కామారెడ్డి లో షబ్బీర్ అలీని ఓడించడానికి అక్బర్ దోస్తు కేసీఆర్ కలిసి పని చేశారు. కవ్వం పల్లి లాంటి దళిత ఎమ్మెల్యేను అవమానించడం ఎంఐఎంకి తగదు’ అని అన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా ఎంఐఎం పార్టీ సభ్యులు స్పీకర్ వెల్‌లోకి వెళ్లి గందరగోళం సృష్టించారు. అనంతరం బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు సభలో రచ్చ రచ్చ చేశారు. అలా ఎంఐఎం సభ్యుల ఆందోళన మధ్య సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం సాగింది.
బీఆర్ఎస్‌లో ముదిరిన వార్.. మాజీ మేయర్‌పై మేయర్ ఫైర్
కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల పేరుతో అక్రమాలంటూ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మేయర్ సునీల్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ మంజూరు చేసిన 130 కోట్ల స్మార్ట్ సిటీ నిధులలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అంజేశారు. ఆయన వినతి పత్రాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ గతంలోని బిల్లులు జరగబోయే బిల్లులను ఆఫ్‌లైన్ ద్వారా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలపై స్పందించిన మాజీ మాజీ మేయర్ ధన్యవాదాలు తెలుపుతూ కమిషనర్ ఆదేశానలు స్వాగతిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ పనులలో నాణ్యత పై ప్రభుత్వ అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలని కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశానన్నారు. నేను పార్టీకి వ్యతిరేకం కాదు అవినీతికి మాత్రమే వ్యతిరేకం. అవినీతికి పాల్పడిన వారిపై పోరాటం చేసేందుకు ముందుంటా అని వ్యాఖ్యానించారు. మరోవైపు మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆరోపణలను మేయర్ సునీల్ రావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ పనులపై అవినీతి ఆరోపణలు చేసిన రవీందర్ సింగ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘కాంట్రాక్టర్లను బెదిరించడం, ఇబ్బంది పెట్టడం, ఏళ్ల తరబడి స్మార్ట్ సిటీ పనులను పెండింగ్ పెట్టడం రవీందర్ సింగ్‌కు వెన్నతో పెట్టిన విద్య. రవీందర్ సింగ్ కు కనీస ఇంగిత జ్ఞానం లేదు.
మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్.. 146కి చేరిన సంఖ్య..
పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ల పరంపరం కొనసాగుతోంది. ఈ రోజు మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీలు దీపక్ బైజ్, నకుల్ నాథ్, డీకే సురేష్‌లపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది. డిసెంబర్ 13న పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన చోటు చేసుకుంది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ.. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తూ సభకు అంతరాయం కలిగిస్తు్న్నారు. దీంతో స్పీకర్లు వీరిని సస్పెండ్ చేస్తున్నారు. డిసెంబర్ 4న ప్రారంభమైన పార్లమెంట్ సెషన్‌లో డిసెంబర్ 14న 14 మంది ఎంపీలు, సోమవారం మరో 78 మంది, మంగళవారం 49 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. మరోవైపు ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌కి నిరసనగా గురువారం ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు పాదయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ సభలో భద్రతా ఉల్లంఘన గురించి మాట్లాడకుండా.. పార్లమెంటరీ హక్కుల్ని ఉల్లంఘించారని మండిపడ్డారు.
ముంబైపై 40 డ్రోన్లతో ఉగ్రదాడికి ప్లాన్.. భగ్నం చేసిన ఎన్ఐఏ.. కీలక ఉగ్రవాది అరెస్ట్..
దేశ వాణిజ్య రాజధాని ముంబైపై మరోసారి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఏకంగా 40 డోన్లను ఉపయోగించి ముంబైపై భారీ ఉగ్రదాడి చేయాలనుకున్న టెర్రరిస్టుల ప్లాన్‌ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) భగ్నం చేసింది. ముంబైకి ఉత్తరాన 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్ఘా అనే గ్రామాన్ని షెల్టర్‌గా నిందితులు ఉపయోగించుకుంటున్నారు. ఈ కుట్రకు పాల్పడిన ఐఎస్ మాడ్యుల్ కీలక నిందితులు సాకిబ్ నాచన్‌ని అరెస్ట్ చేశారు. ఉగ్రవాది సాకిబ్ నాన్ ఐఎస్ ఖలీఫాకు విధేయత ప్రకటించుకున్నాడు. అతని కుమారుడు షామిల్‌కి కూడా పేలుడు పదార్థాల తయారీ, శిక్షణ, పరీక్షల్లో ప్రయేయం ఉన్నట్లు తేలింది. అతడిని కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ నిర్వహించిన దాడుల్లో భారీగా ఆయుధాలు, 51 హమాస్ జెండాలు, 68 లక్షల నగదు, 38 మొబైల్స్, 3 హార్డ్ డిస్కులు పట్టుబడ్డాయి. నాచన్ తో పాటు అతని బంధువులు రజిల్ అబ్దుల్ లతీఫ్, రఫిల్ నాచన్‌లను కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ముంబైకి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్ఘా గ్రామం పేరును అల్-షామ్‌గా మార్చారు. దీని అర్థం ‘‘గ్రేట్ సిరియా’’. నిందితులు ఈ గ్రామాన్ని స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించుకోవడమే కాకుండా.. అక్కడ ఐసిస్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
కేసుల పెరుగుదలకు కారణమవుతున్న కొత్త కోవిడ్ వేరియంట్.. ఈ లక్షణాలపై అప్రమత్తంగా ఉండండి..
కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 మరోసారి ప్రజల్ని భయపెడుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 358 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కేరళలోనే 300 కేసులు ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం 2669 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే JN.1 వేరియంట్ పెద్దగా ప్రమాదాన్ని కలిగించని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ దీనికి వేగం వ్యాప్తించే గుణం ఉందని హెచ్చరించారు.
కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే:
* జ్వరం
* కారుతున్న ముక్కు
* గొంతు మంట
* తలనొప్పులు
* కొన్ని సందర్భాల్లో జీర్ణశయాంతర సమస్యలు
* విపరీతమైన అలసట
* అలసట మరియు కండరాల బలహీనత
కావ్య భలే సైలెంటుగా కానిచ్చేస్తుందే!
“ఏక్ మినీ కథ” ఆ తరువాత “బిచ్చగాడు 2” సినిమాలు చేసిన నటి కావ్య థాపర్ అనుకోకుండా టాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. నిజానికి ఈ భామ “ఏక్ మినీ కథ” సినిమాలో మెరిసినప్పుడు మంచి ఫ్యూచర్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ తరువాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. “బిచ్చగాడు 2” సినిమా అనుకున్నంత బాగా రాలేదు, దీంతో ఆమె కనుమరుగు అయిపోతుందేమో అన్న అంచనాల నేపథ్యంలో ఆమె అనూహ్యంగా బిజీ అయింది. అసలు విషయం ఏమిటంటే ఆమె ఈ మధ్య ఆమె ఇటీవల అనేక సినిమా ఒప్పందాలపై సంతకం చేసింది. అవన్నీ 2024 ప్రథమార్థంలో థియేటర్లలో విడుదల కానున్నాయి. కావ్య థాపర్ రవితేజ భార్యగా నటించిన “ఈగిల్” జనవరి 13, 2024న థియేటర్లలో విడుదల కానుంది. ఇది ఆమె మొదటి భారీ బడ్జెట్ మూవీ. ఇక ఆమె తదుపరి సినిమా పూరి జగన్నాధ్ “డబుల్ ఇస్మార్ట్”. ఈ సినిమాలో ఆమె రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా నటించనుంది. “ఇస్మార్ట్ శంకర్”కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. షూట్ కూడా శరవేగంగా జరుగుతోన్న ఈ సినిమా మార్చి 2024లో విడుదల కానుంది. ఇక మరో పక్క ఆమె ఇటీవలే గోపీచంద్ నటించిన దర్శకుడు శ్రీను వైట్ల సినిమాకి కూడా సంతకం చేసింది. అసలు ఏమాత్రం టాలీవుడ్ లో ఉందా? లేదా? అని అనుమానం కలిగించేలా ఉన్న ఆమె ఇలా వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్లడం గమనార్హం.
ఆకట్టుకుంటోన్న ‘రాఘవ రెడ్డి’ ట్రైలర్
శివ కంఠమనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా ‘రాఘవ రెడ్డి’ అనే సినిమా తెరకెక్కింది. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో K.S. శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం మేకర్స్ విడుదల చేయగా ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఫార్మేట్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిందని అర్ధం అవుతోంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన హీరో తప్పులను సహించని వ్యక్తిత్వం కారణంగా మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి, అయితే ఆ సమస్యలేంటి? నిజాయితీగా ఉండటం వల్ల తను ఏం పోగొట్టుకున్నాడు? డ్యూటీలో తనెంత సిన్సియర్‌గా ఉంటాడు? విలన్స్‌ని హీరో ఎలా కట్టడి చేశాడు లాంటి అంశాలతో రాఘవరెడ్డి సినిమాను తెరకెక్కించారని అర్థమవుతుంది. శివ కంఠమనేని, రాశి, నందితా శ్వేత, పోసాని, అజయ్ ఘోష్, అజయ్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి వంటి స్టార్స్ నటించిన ఈ సినిమాకి సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో సంగీత సారథ్యం వహించగా ఎస్.ఎన్.హరీష్ సినిమాటోగ్రఫీ అందించారు. కె.వి.రమణ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అజయ్, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, BHEL ప్రసాద్, మీనా వాసు, విజయ్ భాస్కర్, తేలు రాధాకృష్ణ, రాఘవరెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.