*శ్వేతపత్రాలను అందరితో చర్చించిన తర్వాత విడుదల చేస్తాం..
సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని అవసరాల కోసం వినియోగించుకుంటామని తెలిపారు. ప్రజాభవన్ లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని ఉపయోగించుకుంటాను.. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోం.. శాసన సభ భవనాలను సమర్థంగా వాడుకుంటామని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వవం విద్యుత్ ను కేవలం 12, 13 గంటలకు మించి ఇవ్వలేదు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శ్వేత పత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని వెల్లడించారు. రేపు బీఏసీ సమావేశం ఉంటుంది.. శాసన సభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటాం.. కొత్త వాహనాలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారుల నియామకంలో పైరవీలు లేవు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సీపీలు ఎవరు కూడా పోస్టింగ్ ల కోసం నన్ను అడగలేదు అని తెలిపారు. అధికారుల హంటింగ్ ఉండదు.. అధికారుల బదిలీలు ఉంటాయి కానీ వెంటపడం అని సీఎం పేర్కొన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు కలిసి ఉండాలి అనేది మా ఆలోచన.. జూబ్లీహాల్ కి మరిన్ని హంగులు దిద్దుతాం.. మీడియా ఆధారాలతో వార్తలు ప్రసారం చేస్తే మాకు కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో తెలిపారు.
*బర్రెలక్కకు పడినన్ని ఓట్లు కూడా రాలేదు.. పవన్‌పై సీఎం జగన్ సెటైర్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తన పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అయితే, జనసేన పోటీ చేసిన ఎనిమిది స్థానాలకు గాను కూకట్‌పల్లిలో చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు తప్పితే.. ఎక్కడా ప్రభావాన్ని చూపలేకపోయింది.. చెప్పుకోదగిన ఓట్లు కూడా సాధించలేకపోయింది.. ఇదే, సమయంలో.. చివరి నిమిషంలో ఎన్నికల్లో పోటీ చేసిన యూట్యూబర్ బరెలక్క 5 వేలకు పైగా ఓట్లు సాధించారు.. దీంతో.. అప్పటి నుంచి పవన్ కల్యాణ్.. ప్రత్యర్థులకు టార్గెట్‌గా మారిపోయాడు.. పవన్ కంటే బర్రెలక్క బెటర్ అంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ కామెంట్ చేయగా.. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. పలాసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. బర్రెలక్క, పవన్ కల్యాణ్ పేర్లను ప్రస్తావించారు. మాట ఇస్తే మాట మీద నిలబెట్టుకునే చరిత్రలేదు చంద్రబాబుకు అంటూ ఫైర్ అయ్యారు సీఎం జగన్.. ఎన్నికలు వచ్చేసరికి తన ఆధారపడేది.. పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయక్తులే అంటూ ఆరోపించారు.. ఒక దత్తపుత్రుడుని పెట్టుకొని డ్రామాలు కూడా ఆడతారు.. ఈ దత్తపుత్రుడు తెలంగాణాలో పుట్టనందుకు బాధపడతానని తెలంగాణలో మాట్లాడతాడు.. నాన్‌లోకల్ ప్యాకేజీ స్టార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ప్యాకేజీ స్టార్ చాలా డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడాడు.. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్కకు పడినన్ని ఓట్లు కూడా జనసేన పార్టీ అభ్యర్థులకు రాలేదు, అసలు డిపాజిట్ కూడా రాలేదు అంటూ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు సీఎం వైఎస్ జగన్. ఇక, విశాఖ పరిపాలన రాజధాని పెడదామంటే ప్రతిపక్ష నేతలు అడ్టుకుంటున్నారు. ఈ ఉత్తరాంధ్రలో పోర్ట్, ఎయిర్‌పోర్ట్ వస్తాదంటే ఏడుస్తారు అని మండిపడ్డారు సీఎం జగన్.. ఇక్కడ నివాసం ఉంటానంటే ఏడుస్తారు. వేరే రాష్ట్రంలో నివాసం ఉంటూ , ఓ దొంగల ముఠాగా తయారై మనమీద పడి ఏడుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నాన్ లోకల్స్ ఏం చేయాలో మనకు చెబుతారు. ఈ నాన్ లోకల్స్ చెప్పినట్లు మనం చేయాలా..? అని ప్రశ్నించారు. గ్రామ, వార్డు సచివాయాలు తీసుకువచ్చి, వాలంటీర్లను ఏర్పాటు చేస్తే ఏడుపే నంటూ విపక్షాలపై ఫైర్ అయ్యారు సీఎం వైఎస్ జగన్.
*ఉద్దానం కిడ్నీ బాధితుల కష్టాలకు చెక్.. ఆస్పత్రి, తాగునీటి ప్రాజెక్టు ప్రారంభం
తరతరాలుగా ఉద్దానం కిడ్నీ బాధుతులు తీవ్రమైన సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు.. ఓవైపు సురక్షితమైన తాగునీరు లేక.. మరోవైపు.. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక దశాబ్దాల తరబడి నిరీక్షిస్తున్నారు.. అయితే, వాళ్ల కష్టాలకు శాశ్వతంగా రూపుమాపేందుకు ముందడుగు వేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇప్పుడు వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్.. ఈరోజు కంచిలి మండలం మకరాంపురంలో వైఎస్సార్ సుజలధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును ప్రారంభించారు… రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు ఏపీ ముఖ్యమంత్రి.. ఇక, మకరాంపురం నుంచి పలాస చేరుకున్న సీఎం జగన్.. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌తో పాటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు.. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో పాటు అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. గతంలో ఆస్పత్రికి, డయాలసిస్‌కు సుధూర ప్రాంతాలకు వెళ్లే దుస్థితి ఉండగా.. ఇప్పుడు మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం చేశారు. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్ ఇలా అన్నింటికీ ప్రత్యేక వార్డులు కేటాయించారు.. మరోవైపు.. ఈ ఆస్పత్రి, రీసెర్చ్ కు కావాల్సిన వైద్యులు, సిబ్బంది పోలీసులను కూడా ప్రభుత్వం భర్తీ చేసింది. ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందించేందుకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.74.24 కోట్లు వెచ్చించింది. 200 పడకల ఆసుపత్రిలో రోగులకు డయాలసిస్ మరియు ఇతర వైద్య సదుపాయాలు ఉన్నాయి.. ఇప్పటి వరకు చికిత్స కోసం విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ICMR) ఈ ప్రాంతంలోని దాదాపు 700 గ్రామాలలో ప్రబలంగా ఉన్న దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిపై పరిశోధనకు మద్దతు ఇస్తుంది. ఈ సందర్భంగా.. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ఉద్దానం ప్రాంత వాసుల ఎన్నో ఏళ్లనాటి కల నేటితో సాకారం అయింది. సీఎం వైయస్ జగన్ ఉద్దానం ప్రజల కష్టాలను చూశారు.. ఇప్పుడు శాశ్వత పరిష్కారం చూపారు. పలాస ప్రాంత ప్రజలకు జగనన్న దేవుడి స్వరూపం అంటూ అభివర్ణించారు మంత్రి సీదిరి అప్పలరాజు.
*కరాచీ బేకరీలో పేలిన సిలిండర్.. ఆరుగురి పరిస్థితి విషమం!
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బేకరీ క్యాంటీన్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో బేకరీలోని కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఎవరైనా కస్టమర్స్ ఉన్నారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన వారికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల్లో ఎక్కువగా యూపీకి చెందిన వారు ఉన్నారని సీఎంకు అధికారులు తెలిపారు.
*మిచౌంగ్ తుఫాను వల్ల రైతులకు చాలా నష్టం కలిగింది..
మిచౌంగ్ తుఫాను వల్ల ఏపీలో రైతులకు చాలా నష్టం సంభవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. 15 జిల్లాల్లో 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. తుఫాను హెచ్చరికలు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుంటే పంట నష్టం, ప్రాణ నష్టం తగ్గించొచ్చన్నారు. పంట నష్టాన్ని నివారించే పరిస్థితులున్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. పట్టిసీమ నీటిని విడుదల చేసి ఉంటే పంట ముందుగానే చేతికి వచ్చేదన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుఫానుల బారి నుంచి పంటలు కాపాడుకునేవాళ్లమని.. నేను పట్టిసీమ కట్టానని జగన్ నీటిని విడుదల చేయలేదన్నారు. రైతులు ప్రభుత్వాన్ని తంతారని భయంతో విధిలేని పరిస్థితుల్లో పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేశారు.. కానీ అప్పటికే ఆలస్యమైందన్నారు. పంటలు తుఫాను బారిన పడ్డాయని.. ప్రాజెక్టుల మెయింటెనెన్స్‌ను పట్టించుకోవడం లేదన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకెళ్లిందని.. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయని ఆయన అన్నారు. గేట్ల రిపేర్లు చేయడం లేదు.. నిర్వహణ కూడా అధ్వాన్నంగా ఉందన్నారు. రిపేర్లు చేయడానికి కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొందన్నారు. పంట కాల్వల నిర్వహణ కూడా సరిగా చేయడం లేదన్నారు. సీఎం కానీ.. మంత్రులు కానీ కనీస చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టం ఎంతొచ్చిందో కూడా ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. పంట నష్టంపై ఎన్యూమరేషన్ చేయడం లేదని.. ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పంట నష్టం, ఆస్తి నష్టంపై కేంద్రానికి నివేదిక అందించాలి కదా అంటూ టీడీపీ అధినేత పేర్కొన్నారు. మిచౌంగ్ తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరామని ఆయన తెలిపారు. ఇంత భారీ నష్టం జరిగితే కేవలం రూ. 700 కోట్లు పంట నష్టం జరిగిందని కేంద్రానికి నివేదిస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. రూ. 700 కోట్లు పంట నష్టం అంటే కేంద్రం ఓ రూ. 100 కోట్లు మాత్రమే ఇస్తుందన్నారు. 26 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నివేదించిందని.. కరవు వల్ల 26 లక్షల ఎకరాల్లో పంటలు వేయకుంటే కేంద్రానికి కరవు నివేదిక అనేది ఇవ్వలేదన్నారు. నష్టపోయిన పంటలకు ఎంత ధర చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పాలి కదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
*ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
2023-24 ఇంటర్, పదవ తరగతి పరీక్షలు మార్చి నెలలో నిర్వహించనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ వల్ల పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను అవసరమైతే భవిష్యత్‌లో విడుదల చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు ఇంటర్, పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని మంత్రి చెప్పారు. పదవ తరగతి విద్యార్థులు 6 లక్షల మంది, రెండేళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు 10 లక్షల మందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు.మార్చి 1 నుంచి మార్చి 15 వరకు ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల తేదీలను విద్యా శాఖ ఖరారు చేసింది ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఉంటే.. రెండో రోజు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 18 నుంచి మార్చి 31 వరకు 12 రోజుల పాటు పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 9.30 నుంచి 12.45 నిమిషాలకు వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో దురదృష్టకరమైన వాతావరణం ఉందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ విద్య కావాలో వద్దో తల్లిదండ్రులు చెప్పాలన్నారు. ట్యాబుల్లో పాఠాల కంటెంట్ కాకుండా వేరే వీడియోలు రాకుండా లాకింగ్ సిస్టం పెట్టామన్నారు. వాటీజ్ దిస్ నాన్సెన్స్ ఇంగ్లీష్ మీడియం పెడితే పేద పిల్లల మీద ఎందుకు ఇంత అక్కసు అంటూ ఆయన మండిపడ్డారు.
*కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ ఎంపీలు.. టీడీపీపై ఫిర్యాదు
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఏపీలో 40,76,580 దొంగ ఓట్లు ఓటర్ జాబితాలో చేర్పించారని ఫిర్యాదు చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాలలో ఓటరులుగా టీడీపీ సానుభూతిపరుల పేర్లు నమోదయ్యాయని ఎంపీలు ఆరోపించారు. హైదరాబాద్ , కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో నివసిస్తున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఏపీలో కూడా టీడీపీ నేతలు నమోదు చేయించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేసి దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్ లెవల్ అధికారులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఎంపీలు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుల ఓటర్లు తొలగించేందుకు ఫారం -7 దరఖాస్తులు బీఎల్వోలకు టీడీపీ నేతలు సమర్పిస్తున్నారని తెలిపారు. విచారణ సమయంలో నిజాలు వెలుగు చూస్తుండడంతో బీఎల్ఓలను టీడీపీ బ్లాక్ మెయిల్ చేస్తోందని వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
*పార్లమెంట్ నుంచి 15 మంది ఎంపీల సస్పెండ్.. జాబితాలో మాణికం ఠాగూర్, కనిమొళిలు
పార్లమెంట్లో వికృతంగా ప్రవర్తించినందుకు 15 మంది ఎంపీలు సస్పెన్షన్‌కి గురయ్యారు. సస్పెండ్ అయిన వారిలో ఒక రాజ్యసభ ఎంపీతో పాటు 14 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. సస్పెండ్ అయిన సభ్యుల్లో మాణికం ఠాగూర్, కనిమొళి, పీఆర్ నటరాజన్, వీకే శ్రీకాంతం, బేణి బహన్, కే సుబ్రమణ్యం, ఎస్ఆర్ ప్రతిబన్, ఎస్ వెంకటేషన్, మహ్మద్ జావేద్ ఉన్నారు. ఎంపీల్లో 9 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. సీపీఎంకు చెందిన ఇద్దరు, డీఎంకేకి చెందిన ఇద్దరు, సీపీఐ నుంచి ఒక ఎంపీ ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. బుధవారం పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై చర్చ నిర్వహించాలని ప్రతిపక్ష ఎంపీలు సభలో డిమాండ్ చేస్తున్నారు. బుధవారం పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది కూడా 2001, డిసెంబర్13 పార్లమెంట్ ఉగ్రదాడి జరిగిన రోజే ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు విజిటర్ పాసులతో పార్లమెంట్ లోకి ప్రవేశించి, పొగ డబ్బాలతో హల్చల్ చేశారు. మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల ఇదే విధంగా ప్రవర్తించారు. ఈ కుట్రలో మొత్తం ఆరుగురు ప్రమేయం ఉంది. ప్రస్తుతం నలుగురితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆరో వ్యక్తి పరారీలో ఉన్నారు.
*మథుర శ్రీకృష్ణ జన్మభూమి సర్వేకు కోర్టు అనుమతి..
ఉత్తర్‌ప్రదేశ్ మథుర శ్రీకృష్ణ జన్మభూమి భూవివాదానికి సంబంధించి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 17 వ శతాబ్ధానికి చెందిన షాహీ ఈద్గా సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతించింది. సర్వే చేసేందుకు కోర్టు పర్యవేక్షణలో అడ్వకేట్ కమిషనర్‌ని నియమించేందుకు కోర్టు పచ్చజెండా ఊపింది. షాహీ ఈద్గా మసీదుపై అడ్వకేట్ కమీషనర్ సర్వే చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని, డిసెంబర్ 18న విధివిధానాలు నిర్ణయించబడుతాయని హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. విచారణ సమయంలో షాహీ ఈద్గా మసీదు వాదనల్ని కోర్టు తోసిపుచ్చింది. షాహీ ఈద్గా మసీదు హిందూ దేవాలయానికి సంబంధించ అనేక చిహ్నాలను కలిగి ఉందని, వాస్తవ స్థితిని నిర్ధారించడానికి సర్వే అవసమని డిమాండ్ చేశామని, అందుకు కోర్టు కీలక తీర్పు ఇచ్చిందని విష్ణు జైన్ అన్నారు. హైకోర్టు తీర్పుపై ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోంది. ఈద్గా మసీదుని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నిర్మించారు. శ్రీకృష్ణ ఆలయంలోని 13.37 ఎకరాల్లోని ఆలయాన్ని కూల్చి కట్టాడని హిందువులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు జరిగిన వాదనల్లో హిందూ పక్షం సాక్ష్యంగా, మసీదు యొక్క కొన్ని గోడలపై తామరపువ్వుల చెక్కడం, అలాగే హిందూ పురాణాల్లోని ‘శేషనాగ్’ని పోలి ఉండే ఆకారాలు ఉన్నాయని పేర్కొంది. ఇది ఆలయంపై మసీదు నిర్మించబడిందని వారు వాదించారు. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉటంకిస్తూ ముస్లిం పక్షం పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. 1968లో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ మరియు షాహీ మసీదు ఈద్గా ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది, దాని కింద కృష్ణ జన్మభూమి కోసం 10.9 ఎకరాల భూమి మరియు మిగిలిన 2.5 ఎకరాల భూమిని మసీదుకు ఇచ్చారు. కృష్ణా జన్మభూమి-షాహి మసీదు వివాదంపై హైకోర్టులో మొత్తం 18 కేసులు ఉన్నాయి.
*కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యార్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 సీజన్‌కు ఇంకా మూడు నెలలుకు పైగా టైం ఉంది. అయితే, ఇప్పటి నుంచే ఐపీఎల్ గురించి ఫ్యాన్స్‌లో తెగ చర్చ కొనసాగుతుంది. అందులోనూ డిసెంబర్ 19న ఐపీఎల్ ఆక్షన్ ఉండడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. చెన్నై, ముంబై జట్ల ఫ్యాన్స్ కు కెప్టెన్ ఎవరనేది అందరికి తెలుసు.. కెప్టెన్సీ విషయంలో ఈ రెండు జట్ల గురించి పెద్దగా చర్చ జరగదు.. కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల సారథులు ఎవరు అనే దాన్నిపై క్రికెట్ అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే ఈ రెండు జట్లకు కెప్టెన్సీ మార్పు చాలా అవసరం.. ఇదే టైంలో కేకేఆర్ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యరే కొనసాగుతాడని కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ వెల్లడించారు. శ్రేయాస్ గాయం కారణంగా గత సీజన్ లో ఐపీఎల్‌లో ఆడలేదు.. దీంతో ఆ సీజన్‌లో నైట్ రైడర్స్ టీమ్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం ఆరు మ్యాచ్‌లే గెలిచింది. ఇక, ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకోని వరల్డ్‌కప్‌లోనూ అదరగొట్టడంతో వచ్చే ఐపీఎల్ సీజన్‌లో అయ్యర్‌కి కెప్టెన్సీ బాధ్యతలను కేకేఆర్ యాజమాన్యం అప్పగించింది. ఇక, వైస్ కెప్టెన్‌గా నితీశ్‌రాణాను ఎంపిక చేసింది.