ఏపీ కేబినెట్ నిర్ణయాలివే..
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి మంత్రి కొలుసు పార్థసారధి మీడియా సమావేశంలో వెల్లడించారు. మావోయిస్టు పార్టీలపై మరో ఏడాది నిషేధం పొడిగించినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం జారీ చేసిన 217, 144 జీవోలను రద్దు చేశామన్నారు. మత్స్యకారులకు నష్టం చేసేలా గత ప్రభుత్వం జీవో జారీలు చేసిందని.. గ్రామాల్లో చెరువులను.. కుంటలను బహిరంగ వేలం వేయాలని అప్పటి సర్కారు నిర్ణయించిందని.. మత్స్యకారుల సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచడం, మత్స్య సంపద పెంచే అంశంపై అధ్యయనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఏపీలో జనాభా సంఖ్యా రోజు రోజుకూ తగ్గుతోందని.. జాతీయ సగటుతో పోల్చినా ఏపీలో జనాభా సంఖ్య తక్కువగానే ఉందని.. యువత తగ్గిపోతోందన్న సర్వేలు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఇద్దరి పిల్లలకంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేయకూడదని స్థానిక సంస్థల్లో నిబంధన ఉందని.. ఇలాంటి నిబంధనలను రద్దు చేస్తూ బిల్లుకు ఆమోదం తెలిపామని వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా పెరుగదల అవసరమన్నారు. పిల్లల సంఖ్యపై నిషేధాలు ఉండకూడదని కేబినెట్ భావిస్తోందన్నారు. కొత్త వైద్య కళాశాలల్లో అదనంగా 380 పోస్టులకు ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. సున్నిపెంట పంచాయతీకి ఇచ్చిన 208.74 ఎకరాల భూమిని రద్దు చేశామన్నారు. ఆ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని.. శ్రీశైలం దేవస్థానం మాస్టర్ ప్లాన్ కోసం వినియోగించుకుంటామన్నారు. ఎక్సైజ్ శాఖపై చర్చించామన్న మంత్రి పార్థసారధి.. ఎక్సైజ్ శాఖను ఏకీకృత పర్యవేక్షణకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మెరుగైన ఎక్సైజ్ పాలసీని రూపొందిస్తామన్నారు. గత ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని.. ఇకపై ప్రముఖ బ్రాండ్లను ఏపీ మార్కెట్టులోకి తెస్తామని చెప్పారు. అక్టోబర్ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులోకి వస్తుందని.. మద్యం ధరలు తగ్గిస్తామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ మద్యం విధానాల వల్ల రూ. 18 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. మద్యం ఉత్పత్తి నుంచి అమ్మకాల వరకు గత ప్రభుత్వం గుత్తాధిపత్యం ఉండేలా విధానాన్ని రూపొందించిందని మంత్రి వర్గం అభిప్రాయపడిందన్నారు. 22-ఏ ఫ్రీ హోల్డ్ చేసి గత ప్రభుత్వం దోపిడీ చేసిందని మంత్రి విమర్శించారు. భూ సమస్యల పరిష్కారానికి త్వరలో రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వివాదంలో ఉన్న రిజిస్ట్రేషన్ల పునః పరిశీలన చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 25 వేల ఎకరాలు రిజిస్ట్రేషన్లు చేశారని.. మూడు నెలల పాటు అసైన్డ్, 22-ఏ రిజిస్ట్రేషన్లు విచారణ చేపడతామని మంత్రి వెల్లడించారు. మూడు నెలల పాటు విచారణ పూర్తయ్యేంత వరకు 22-ఏ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపేస్తామని ప్రకటించారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాసులు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. సర్వే రాళ్లపై వేసిన జగన్ బొమ్మలను చెరిపేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
అందుకే నేత వస్త్రాలను ధరిస్తున్నాను.. కీలక ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్
చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన విడుదల చేశారు. చేనేతకు జీవం పోయాలని ఆయన సూచించారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత ఒకటి అని.. చేనేత ఒక కళాత్మకమైన పరిశ్రమ అంటూ చెప్పుకొచ్చారు. ఏపీలో ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి చేనేత వస్త్రాలకు ప్రతీకలు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రంగంపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత వస్త్రాలు అనే మాట ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని నింపాయన్నారు. అలాంటి చేనేత రంగానికి జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వం కచ్చితంగా చేనేత పరిశ్రమకు, ఈ రంగంపై ఆధారపడ్డ నేతన్నలకు భరోసా ఇస్తుందని హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రజలు సైతం ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని సంవత్సరాల కిందటే చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని చెప్పినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆ క్రమంలోనే నేత వస్త్రాలను ధరిస్తున్నానని వెల్లడించారు. యువత, ఉద్యోగులు వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరిస్తే ఈ రంగంపై ఆధారపడ్డవారికి ధీమా కలుగుతుందని పవన్ స్పష్టం చేశారు.
భూమి కోసం సొంత చెల్లెనే హత్య చేయించేందుకు ప్లాన్ చేసిన అక్క..
రానురాను ప్రజలలో క్రూరత్వవం ఎక్కువతుంది. కొందరైతే.. ఆస్తి కోసం సొంతవారి ప్రాణాలను కూడా తీయడానికి వెనకాడడం లేదు. ఇకపోతే, తాజాగా రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం చిన్న చింతకుంటలో దారుణం చోటు చేసుకుంది. భూమి కోసం సొంత చెల్లెనే హత్య చేయించేందుకు ప్లాన్ వేసింది తన రెండో అక్క. మంగళవారం రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మహిళపై పెట్రోల్ పోసి అక్క అల్లుళ్ళు, అక్క కొడుకు హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె అదృష్టం కొద్దీ పెట్రోల్ వాసన రావడంతో గమనించి బయటకు పరుగులు తీసింది లక్ష్మీ. అయితే ఈ ఘటనలో ఆమె కప్పుకున్నదుప్పటి కాలిపోయింది. ఇకపోతే., బాధితురాలు లక్ష్మీ భర్త చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తుంది. తల్లిదండ్రుల ఎకరం భూమిలో వాటా కోసం ముగ్గురూ అక్కచెల్లెళ్ల మధ్య గత కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. లక్ష్మీని చంపేస్తే భూమి తాము తీసుకోవచ్చని ప్లాన్ వేసి ఇద్దరు అల్లుళ్ళు, కొడుకుతో కలిసి స్కెచ్ వేసింది రెండో అక్క. జరిగిన సంఘటనకు సంబంధించి బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇందులూ సంబంధించి పోలీసులు కేసును నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం..
రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో 9 రాష్ట్రాల్లో.. 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇకపోతే తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యత్వానికి కే.కేశవరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలలో 12 రాజ్యసభ స్థానాల ఎన్నికకు ఈనెల 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక నామినేషన్ల దాఖలుకు ఆగష్టు 21 చివరి తేదీ. ఇక మరోవైపు బీహార్, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 27 చివరి తేదీని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక సెప్టెంబర్ 3న ఉదయం 9గం.ల నుంచి సాయంత్రం 4గం.ల వరకు పోలింగ్ జరగనుంది. ఇక ఓటింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గం.ల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది.
షేక్ హసీనా పార్టీ నేతలు, హిందువులే టార్గెట్.. 29 మంది నేతల హత్య..
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం బంగ్లాదేశ్‌లో తీవ్ర హింసకు దారి తీసింది. విద్యార్థి నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయేలా చేసింది. ప్రస్తుతం ఆర్మీ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ దేశ ఆర్మీ చీఫ్ చెప్పారు. ఇదిలా ఉంటే షేక్ హసీనా రాజీనామా చేసినా ఇప్పటికీ ఆ దేశంలో హింస చెలరేగుతూనే ఉంది. ముఖ్యంగా మైనారిటీలైన హిందువులపై ముస్లింమూకలు దాడులకు తెగబడుతున్నాయి. హిందువుల ఇళ్లు, గుడులపై దాడి చేయడమే కాకుండా మహిళలపై అకృత్యాలకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఒక్క హిందువులనే కాకుండా షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ విధ్వంసానికి తెగబడుతున్నారు. అవామీ లీగ్ కార్యకర్తలు, నేతల ఇళ్లను చుట్టుముట్టి నిప్పుపెడుతున్నారు. అందులో ఉన్న వారిని హత్య చేస్తున్నారు. రాజధాని ఢాకాకు 100 కి.మీ దూరంలోని కోమిల్లా నగరంలో మాజీ కౌన్సిలర్ ఎండీ షా ఆలం ఇంటికి నిప్పుపెట్టారు. మంగళవారం ఎంపీ షఫీకుల్ ఇస్లాం షిముల్ ఇంటికి నిప్పుపెట్టడంతో నలుగురు మరణించారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన 29 మంది నేతలు హత్య చేయబడ్డారు. ఢాకాలోని అవామీ లీగ్ ప్రధాన కార్యాలయానికి గుంపు నింపు పెట్టింది. బంగ్లాలోని హక్కుల సంఘాలు, దౌత్యవేత్తలు, హిందువులతో సహా మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశాయి. షేక్ హసీనాకు సన్నిహితంగా ఉండే కొందరు హిందువులకు చెందిన వ్యాపారాలు, ఇళ్లపై దాడి జరిగింది. సోమ, మంగళవారాల్లో కనీసం 97 చోట్ల మైనారిటీ ప్రజల ఇళ్లు, దుకాణాలపై దాడులు, ధ్వంసం, లూటీలు జరిగాయని హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యత మండలి ప్రధాన కార్యదర్శి రాణా దాస్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కనీసం 10 హిందూ ఆలయాలపై దుండగులు దాడులు చేశారు. బంగ్లాదేశ్‌లోని దక్షిణ బాగర్‌హాట్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తి కొట్టి చంపబడ్డాడు. ఖుల్నా డివిజన్‌లోని జబీర్ ఇంటర్నేషనల్ హోటల్‌కు జనం నిప్పుపెట్టిన ఘటనలో 24 మంది మృతి చెందారు. ఈ హోటల్ జషోర్ జిల్లా అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్ యాజమాన్యంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్‌లో నోబెల్ విజేత ముహ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులు, విద్యార్థి నాయకులతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
బంగ్లాదేశ్ నుంచి రాయబార అధికారులను ఖాళీ చేయించిన భారత్..
బంగ్లాదేశ్‌లో ఇంకా హింస చెలరేగుతూనే ఉంది. షేక్ హసీనా రాజీనామా చేసి, ఇండియాకి పారిపోయివచ్చినప్పటికీ అక్కడ పరిస్థితి చక్కబడటం లేదు. ముఖ్యంగా హసీనాకు చెందిన అవామీ లీడ్ పార్టీ నేతలతో పాటు హిందువులను టార్గెట్ చేస్తున్నారు. అక్కడి పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉండటంతో ఢాకాలోని భారత రాయబార కార్యాలయం నుంచి అనవసరమైన సిబ్బందిని, వారి కుటుంబాలను అక్కడ నుంచి ఖాళీ చేయించి, భారత్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కీలకమైన రాయబారులు, ఉద్యోగులు మాత్రమే హైకమిషన్‌లో ఉండనున్నారు. ఢాకాలోని భారత హైకమిషనర్‌తో సహా ప్రిన్సిపల్ అధికారులు తమ పదవుల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకరాం.. కమర్షియల్ ఫ్లైట్ ద్వారా వీరి తరలింపు జరిగినట్లు తెలుస్తోంది. హైకమిషన్ పనిచేస్తూనే ఉంది. ఈ ప్రాంతంలో అశాంతి మధ్య అవసరమైన కార్యకలాపాలను సిబ్బంది నిర్వహిస్తోంది. రాజధాని ఢాకాలోని హైకమిషన్‌తో పాటు చిట్టగాంగ్, రాజ్‌షాహీ, ఖుల్నా, సిల్హెట్‌లతో సహా అనేక ఇతర నగరాల్లో భారతదేశ సహాయక హైకమిషన్లు, కాన్సులేట్స్ ఉన్నాయి. బుధవారం ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం, ప్రయాణికులు లేకుండా ఢిల్లీ నుండి బయలుదేరి, ఢాకా నుంచి 199 మంది పెద్దలు , ఆరుగురు శిశువులతో ఢిల్లీ తిరిగి వచ్చింది. రిజర్వేషన్ కోటాపై మొదలైన విద్యార్థి ఉద్యమం తీవ్ర హింసాత్మక ఘటనలకు దారి తీసింది. చివరకు ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ ఆర్మీ కేవలం 45 నిమిషాల అల్టిమేటం ఇవ్వడంతో ఆమె రాజీనామా చేసి, ఇండియాకు వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో భారత భద్రతా పర్యవేక్షణలో ఉన్నారు. దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చెలరేగడంతో 300కి పైగా ప్రజలు మరణించారు. హసీనా రాజీనామా తర్వాత ఆర్మీ దేశాన్ని అదుపులోకి తీసుకుంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్, జనరల్ వాకర్-ఉజ్-జమాన్ మిలటరీ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. బంగ్లాదేశ్ మిలిటరీ ఢాకా దౌత్య పరిసర ప్రాంతాలను కాపాడే బాధ్యతను స్వీకరించింది. ఇంతకుముందు ఈ ప్రాంతాన్ని పోలీసులు పర్యవేక్షించే వారు.
బీఎస్పీ రాష్ట్ర చీఫ్ హత్య కేసులో కాంగ్రెస్ కార్యకర్త అరెస్ట్..
తమిళనాడులో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) చీఫ్ కే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య ఆ రాష్ట్రంలోనే కాదు దేశంలో సంచలనంగా మారింది. ముఖ్యంగా స్టాలిన్ ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించాయి. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ హత్య తర్వాత కూడా పలువురు బీజేపీ, ఏఐడీఎంకే పార్టీలకు చెందిన కార్యకర్తల హత్యలు చోటు చేసుకున్నాయి. ఇలా రాజకీయ హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో ఇప్పటి వరకు 22 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 5న చెన్నైలోని పెరంబూర్‌లో ఆర్మ్‌స్ట్రాంగ్‌ని ఆరుగురు వ్యక్తులు నరికి చంపారు. ఈ కేసులో తాజాగా మరో నిందితుడని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. విచారణలో మరో అరుల్ అనే నిందితుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అశ్వథామన్ పేరు వెల్లడించడంతో, ఇతడిని అరెస్ట్ చేశారు. అశ్వథామన్ అరెస్ట్ తర్వాత కాంగ్రెస్ అతడిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతీకారంతోనే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. జూలై 5న అతడి నివాసంలో ఉండగా ఫుడ్ డెలివరీ వ్యక్తుల వేషంలో వచ్చిన ఆరుగురు అతడిని కత్తులతో నరికి చంపారు. నిందితుల్లో ఒకరైన తిరువేంగడంని జూలై 13న చెన్నైలోని మాధవరం సమీపంలో పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. హిస్టరీ షీటర్ అయిన తిరువేంగడం హత్య చేయడానికి ముందు చాలా రోజులుగా ఆర్మ్‌స్ట్రాంగ్‌పై రెక్కీ నిర్వహించాడు.
వినేష్ ఫోగట్ అనర్హతపై కేంద్ర క్రీడల మంత్రి కీలక ప్రకటన..
ఒలింపిక్స్‌లో ఖచ్చితంగా పతకం సాధిస్తుందని యావత్ దేశం వినేష్ ఫోగట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంగా ఒలింపిక్స్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు వేయడం ఒక్కసారిగా దేశం షాక్‌కి గురైంది. దీంతో ఆమె ఒలింపిక్ పతకాన్ని కోల్పోయారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఐఓఏ చీఫ్ పీటీ ఉషను ఆదేశించారు. ప్రతిపక్షాల ఆందోళన, కుట్ర దాగుండనే అనుమానాల మధ్య కేంద్ర క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయ ఈ రోజు లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. ఫోగాట్‌కి అసవసరమైన అన్ని రకాల సహాయాలని ప్రభుత్వం అందించినపట్లు వెల్లడించారు. వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారని ప్రకటనలో తెలియజేవారు. ‘‘భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ 100 గ్రాముల అధిక బరువు కారణంగా పారిస్ ఒలింపిక్స్ నుండి అనర్హుడయ్యారు. వినేష్ 50 కిలోల విభాగంలో ఆడుతున్నాడు, పోటీకి ఆమె బరువు 50 కిలోలు ఉండాలి. UWW (యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్) నియమాలు మరియు నిబంధనల ప్రకారం, అన్ని పోటీల కోసం, సంబంధిత కేటగిరీల్లో ప్రతిరోజూ ఉదయం బరువులు నిర్వహిస్తారు’’ అని మాండవీయ అన్నారు. ‘‘ఆగస్టు 7, 2024న, 50 కిలోల మహిళల రెజ్లింగ్ పోటీకి సంబంధించి రెజ్లర్‌లకు పారిస్ టైమ్ 7:15-7:30 గంటల బరువు నిర్ణయించబడింది. వినేష్ బరువు 50 కిలోల 100 గ్రాములుగా ఉన్నట్లు గుర్తించబడ్డారు. అందువల్ల, ఆమె పోటీకి అనర్హులుగా ప్రకటించారు’’ అని ఆయన సభలో వెల్లడించారు. మంగళవారం వినేష్ ఫోగట్ ఒలింపిక్ ఫైనల్ చేరుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. మహిళల 50 కేజీల రెజ్లింగ్ ఫైనల్‌లో పాల్గొనే ముందు ఆమె బరువు నిబంధనల కన్నా 100 గ్రాములు అధికంగా ఉన్నట్లు తేలింది. దీంతో దురదృష్టవశాత్తు అనర్హత కారణంగా ఆమె ఏ పతకం గెలుచుకోలేదు.
నేపాల్‌లో హెలికాప్టర్ క్యాష్.. నలుగురు మృతి..
విమాన ప్రమాదాలకు నేపాల్ కేరాఫ్‌గా మారింది. తాజాగా బుధవారం మధ్యాహ్నం ఆ దేశంలోని నువాకోట్‌లోని శివపురి ప్రాంతంలో ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ కూలిపోయినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. హెలికాప్టర్ రాజధాని ఖాట్మాండు నుంచి రాసువాకు వెళ్తుండగా నువాకోట్ జిల్లాలోని సూర్య చౌర్-7 వద్ద కొండను ఢీకొట్టింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటన స్థలానికి రెస్క్యూ బృందాన్ని పంపింది. హెలికాప్టర్ మధ్యాహ్నం 1.54 గంటలకు ఖాట్మాండు త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. సూర్య చౌర్ చేరుకున్న తర్వాత గ్రౌండ్ కంట్రోల్‌తో హెలికాప్టర్ సంబంధాలను కోల్పోయింది. టేకాఫ్ అయిన 3 నిమిషాలకే చాపర్‌తో సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇలాగే త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మరణించారు.
వినేశ్ ఫొగాట్‌కు తీవ్ర అస్వస్థత.. పారిస్‌లోని ఆస్పత్రికి తరలింపు!
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్.. 100 గ్రాముల ఓవర్ వెయిట్ (అధిక బరువు) ఉన్న కారణంగా వేటు పడింది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కూడా ధ్రువీకరించింది. వినేష్‌కి స్వర్ణ పతకం సాధించే అవకాశం ఉండగా.. ఇప్పుడు రజత పతకాన్ని కూడా కోల్పోయారు. అయితే భారత రెజ్లర్ అస్వస్థత కారణంగా పారిస్‌లోని ఆస్పత్రిలో చేరారు. మహిళల 50 కేజీల విభాగంలో బుధవారం రాత్రి జరిగే ఫైనల్‌లో అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్డర్‌బ్రాంట్‌తో వినేశ్ ఫొగాట్ తలపడాల్సి ఉంది. అయితే మంగళవారం రాత్రే తాను ఎక్కువ బరువు ఉన్నానని వినేశ్ తెలుసుకున్నారు. బరువు తగ్గడం కోసం రాత్రంతా వర్కౌట్స్ చేశారు. నిద్రాహారాలు మానేసి.. స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ చేశారు. దాంతో రాత్రే కేజీకి పైగా బరువు తగ్గారు. అయినప్పటికీ 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో అనర్హత వేటు పడింది. రాత్రంతా వర్కౌట్స్ చేయడంతో వినేశ్ ఫొగాట్ డీహైడ్రేషన్‌కు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను భారత ఐఓఏ అధికారులు హుటాహుటిన పారిస్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని సమాచారం. డీహైడ్రేషన్ కారణంగా స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది.