మాజీ ఎమ్మెల్యే బోల్డ్ కామెంట్స్:
వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రజలు ఈ ప్రభుత్వ పాలనపై విసుగుతో ఉన్నారని, మాటలతో మోసగిస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రాప్తాడు సిద్ధం సభకు వచ్చిన ప్రజల సంఖ్యను చూసిన తర్వాత కూడా కొందరు టీడీపీ మహానాడు సమావేశంతో పోల్చడం హాస్యాస్పదం. మేము నిర్వహించిన సభకు జనాలు స్వచ్ఛందంగా వచ్చారు. కానీ టీడీపీ మహానాడుకు మాత్రం బయటపెట్టి, బెదిరించి తరలించారు. ఇది ప్రజాస్వామ్యమా? అంటూ ప్రశ్నించారు.
టీడీపీ పైశాచిక ఆనందం పొందుతోంది:
కడప జిల్లాలో మహానాడు అంటూ టీడీపీ పైశాచిక ఆనందం పొందుతుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మీ స్థానంతో సహా అన్ని స్థానాల్లో ఓటమి తప్పదని ఆయన జోష్యం చెప్పారు. పులివెందులలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాల చుట్టూ జెండాలు, తోరణాలు కట్టడంపై ఆయన మండిపడ్డారు. ఈ ప్రాంతం ప్రజల ఎమోషన్ వైయస్సార్ అని, ఆయన విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టడం సభ్యతా అంటూ ప్రశ్నించారు. తాము కక్ష సాధింపు రాజకీయం చేసి ఉండి ఉంటే.. మీ పరిస్థితి వేరేగా ఉండేదని, మాకు తగిలిన దెబ్బ మర్చిపోమన్నారని అన్నారు. దీనిపై పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి ఘాటుగా స్పందించారు. టీడీపీ తోరణాలు తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజమైన వైయస్సార్ అభిమానులు ఒక్కసారి ఆలోచించాలి అన్నారు. వై ఎస్ విజయమ్మ పై కేసు నమోదు చేసింది ఎవరు? కార్యకర్త ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు.
యూట్యూబ్ భయ్యా సన్నీ యాదవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు:
యూట్యూబ్ భయ్యా సన్నీ యాదవ్ ను ఎన్ఐఏ అధికారులు చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే సన్నీ యాదవ్ బైక్‌పై పాకిస్థాన్ వెళ్లి వచ్చాడు. దీంతో పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్నీ యాదవ్ తండ్రి రవీందర్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. భయ్యా సన్నీ యాదవ్ ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సన్నీ యాదవ్ స్నేహితుడు చెర్రీని ఇంట్లో 29న గుర్తుతెలియని వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు మా ఇంటికి కూడా వచ్చారన్నారు.
అలా జరిగితే పాకిస్తాన్ 4 భాగాలుగా విడిపోయేది:
1971 భారత్-పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘1971లో మన భారత నేవీ పాకిస్తాన్ రెండుగా విభజించింది, ఆపరేషన్ సిందూర్‌లో నావికాదళం తన పూర్తి బలాన్ని ప్రదర్శించి ఉంటే, పాకిస్తాన్ ఇప్పటికే రెండు కాదు, నాలుగు భాగాలుగా విడిపోయేది’’ అని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్ సిందూర్ కేవలం వార్మ్-అప్ మాత్రమే అని పాకిస్తాన్‌ని హెచ్చరించారు. పాక్ ఏదైనా మళ్లీ దుశ్చర్యకు పాల్పడితే, ఈసారి నేవీ కూడా రంగంలోకి దిగుతుందని, అప్పుడు పాకిస్తాన్‌కి ఏం జరుగుతుందో దేవుడికే తెలుసని ఆయన అన్నారు.
పాకిస్తాన్ వైమానిక స్థావరాలను నిమిషాల్లో నాశనం చేశాం:
ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాలు నిమిషాల్లోనే పాకిస్తాన్ లోని వైమానిక స్థావరాలను నాశనం చేశామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఇది న్యూ ఇండియా అని, భారత్ తన బలాన్ని ప్రదర్శించిందని ప్రధాని శుక్రవారం బీహార్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ అన్నారు. ఉగ్రవాద దాడి మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో తాను హామీ ఇచ్చానని, ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని చెప్పారు.
సంచలన కేసులో నేడు తీర్పు:
2022లో రాజకీయంగా సంచలనం సృష్టించిన అంకితా భండారీ హత్య కేసులో ఈ రోజు తీర్పు వెలువడనుంది. పౌరి జిల్లా యమకేశ్వర్‌లో ఉన్న వనాంతర రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న 19 ఏళ్ల అంకిత హత్యకు గురికావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నిరసన తెలిపారు. ఈ రిసార్ట్ బీజేపీ నేత కుమారుడి కావడంతో ఈ కేసు జాతీయ వార్తల్లో ప్రధానాంశంగా నిలిచింది. ఈ హత్యలో బీజేపీ నేత వినోదర్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య కీలక నిందితుడిగా ఉన్నారు. 19 ఏళ్ల అంకితా భండారీ మరణం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ కేసులో పుల్కిత్‌తో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను సహ నిందితులుగా ఉన్నారు.
సింధు జలాలపై పాక్ ఆర్మీ చీఫ్ హెచ్చరిక:
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధూ జలాలను ప్రస్తావిస్తూ, పాకిస్తాన్ నీటి సమస్యపై ఎప్పుడూ రాజీపడదని అన్నారు. ఎందుకంటే, దేశంలో 24 కోట్ల మంది ప్రజల ప్రాథమిక హక్కులతో ఇది ముడిపడి ఉందని చెప్పారు. గురువారం, పాకిస్తాన్‌లోని పలు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్, ప్రిన్సిపాల్స్, ఇతర ఉపాధ్యాయులు, విద్యావేత్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఎప్పటికీ భారత ఆధిపత్యాన్ని అంగీకరించదని చెప్పారు. ‘‘పాకిస్తాన్‌కి నీరు అనేది రెడ్ లైన్ అని, 240 మిలియన్ల పాకిస్థానీల ప్రాథమిక హక్కుపై మేము ఎలాంటి రాజీని అనుమతించము’’ అని అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బలూచిస్తాన్‌లోని ఉగ్రవాదులకు భారతదేశం మద్దతు ఇస్తుందని, ప్రావిన్స్‌లో అశాంతిలో పాల్గొన్న ఉగ్రవాదులకు బలూచ్‌లతో సంబంధం ఉందని మునీర్ పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 రద్దును ప్రశంసించిన కాంగ్రెస్ నేత:
కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని ప్రశంసించారు. జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్, భారతదేశంలోని మిగతా ప్రాంతాల నుంచి వేరుగా ఉందనే భావనను చాలా కాలం సృష్టించిందని, ప్రభుత్వం ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఈ భావన ముగిసిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత, పలు దేశాలకు భారత దౌత్య బృందాలు వెళ్లాయి. పాక్ ఉగ్రవాదం గురించి ఆయా దేశాలకు ఈ బృందాలు వివరించనున్నాయి. ఇండోనేషియాకు వెళ్లిన బృందంలో సల్మాన్ ఖుర్షీద్ కూడా ఉన్నారు. ఇండోనేషియా ప్రతినిధి బృందంతో సంభాషిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈసారి కప్పు ఆర్‌సీబీదే:
ఐపీఎల్ 2025 తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఎన్నో రోజులుగా వేచిచూస్తున్న ఐపీఎల్ టైటిల్‌కు ఆర్‌సీబీ అడుగు దూరంలో నిలిచింది. అయితే ఈసారి కప్పు ఆర్‌సీబీదే అని చరిత్ర చెబుతోంది. క్వాలిఫయర్ 1లో విజేతగా నిలిచిన జట్టే అత్యధిక సార్లు ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2011లో ప్లేఆఫ్స్ పద్ధతి ప్రారంభం కాగా.. అప్పటి నుంచి 14 ఎడిషన్లలో 11 సార్లు క్వాలిఫయర్ 1 గెలిచిన జట్టే ఛాంపియన్‌గా నిలిచింది. గత సీజన్‌లో కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ క్వాలిఫయర్ 1 గెలిచి.. ఆ తర్వాత టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ట్రెండ్ ప్రకారం.. ఐపీఎల్ 2025 విజేతగా ఆర్‌సీబీ నిలిచే అవకాశాలు ఉన్నాయి. చరిత్రతో పాటు ఆర్‌సీబీ ఈ సీజన్ అంతటా అత్యుత్తమ క్రికెట్ ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది. ఒకరిద్దరిపై ఆధారపడకుండా.. జట్టుగా ఆడింది.
ఆర్‌సిబి గెలవకపోతే.. నేను నా భర్తకు విడాకులిస్తా:
ఐపీఎల్ టైటిల్ కు అడుగు దూరంలో ఉంది ఆర్సీబీ. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ లో బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సారి కప్పు మాదే అంటూ సంబరపడిపోతున్నారు. అయితే నిన్న మ్యాచ్ సందర్భంగా ఓ మహిళ చేతిలో పెద్ద బ్యానర్ పట్టుకుని కనిపించింది. దానిపై బోల్డ్ అక్షరాలతో ఆర్‌సిబి ఫైనల్ గెలవకపోతే, నేను నా భర్తకు విడాకులు ఇస్తాను అని రాసి ఉంది. ఈ ఫన్నీ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆయన కొడుకొచ్చాడని చెప్పు:
మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న భైరవం మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసింది. మూవీకి పాజిటివ్ టాక్ వస్తున్న సందర్భంగా మనోజ్ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. తన తండ్రి మోహన్ బాబు పెద్ద రాయుడు ఫొటో పక్కన భైరవంలోని తన గజపతి పాత్ర ఫొటోను ఎడిట్ చేసి పెట్టాడు. దీనికి ‘ఆయన కొడుకు వచ్చాడని చెప్పు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టు కాస్త క్షణాల్లోనే వైరల్ అవుతోంది. మనోజ్ కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ కనకమేడల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను తమిళంలో హిట్ అయిన గరుడన్ కు రీమేక్ గా చేశారు. ఈ మూవీలో మూడు కీలక పాత్రల్లో రోహిత్, మనోజ్, సాయి శ్రీనివాస్ బాగా చేశారంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి.
2014 నుంచి 2023వరకు ఉత్తమ సినిమాలు ఇవే:
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను అందిస్తోంది. ఇప్పటికే 2024కు గాను అన్ని కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు. అయితే తాజాగా 2014 జూన్ 2 నుంచి 2023 వరకు సెన్సార్ పూర్తయి విడుదలైన సినిమాలో ఉత్తమ సినిమా అవార్డులను జ్యురీ చైర్మన్ మురళీ మోహన్, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కలిసి ప్రకటించారు. 2014లో బెస్ట్ ఫిలిం అవార్డు రన్ రాజా రన్ కు దక్కింది. సెకండ్ బెస్ట్ ఫిలిమ్ పాఠశాల, మూడో బెస్ట్ ఫిలిమ్ అల్లు డు శీను అవార్డులు దక్కించుకున్నాయి.
అరె ఏంట్రా ఇది.. సినిమా హాలులోకి పామును పట్టుకొచ్చిన మహేష్ అభిమాని:
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ రీ-రిలీజ్ సందర్భంగా విజయవాడలో ఓ థియేటర్‌లో భయానకర సంఘటన చోటుచేసుకుంది. ఈ రిలీజ్ సందర్బంగా అభిమానుల ఉత్సాహం అందరినీ అలరించినప్పటికీ, ఓ అభిమాని చేసిన అనూహ్య చర్య మాత్రం థియేటర్ లో కలకలం సృష్టించింది. ‘ఖలేజా’లో మహేష్ బాబు ఎంట్రీ సీన్ ఓ పాముతో నడిచే గెటప్‌లో ఉండగా, అదే సన్నివేశాన్ని రీ క్రియేట్ చేయాలని విజయవాడలోని బెజవాడ థియేటర్‌కు ఓ అభిమాని నిజమైన పాముతో వచ్చాడు. మొదట అది రబ్బర్ పామని భావించిన అభిమానులు, పాము కదులుతూ ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.