రాజధానికి రండి.. కిషన్ రెడ్డి, ఈటల, రాజగోపాల్‌కు హైకమాండ్ పిలుపు
తెలంగాణ బీజేపీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ నాయకత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రమంత్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో నేటి కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు పార్టీ హైకమాండ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాత్రం ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారని విశ్వసనీయ సమాచారం.
ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డిలతో పార్టీ హైకమాండ్ సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. హైకమాండ్ పిలుపు మేరకు ఈటల, రాజగోపాల్ ఢిల్లీకి రావడంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా.. రాష్ట్రంలో బీజేపీ తమను కలుపుకుని పోవడం లేదని, కార్యక్రమాలు అనుకున్న రీతిలో జరగడం లేదని ఈ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వర్గం, ఈటల వర్గం మధ్యవర్తిత్వం కోసం కిషన్ రెడ్డిని అధిష్టానం పిలిచినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కిషన్ రెడ్డిని ఉపయోగించుకోవాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రేపు తెలంగాణకు జేపీ నడ్డా.. మినిట్ టు మినిట్ షెడ్యూల్
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు తెలంగాణకు రానున్నారు. ఈ క్రమంలోనే కాషాయ పార్టీ హైక మాండ్ పార్టీ వ్యవహారాలను సెట్ చేసే పనిలో పడింది. రేపు (ఆదివారం) ఉదయం పార్టీ నేతలతో నడ్డా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పెద్దఎత్తున జన సమీకరణకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. నడ్డా మినిట్ టు మినిట్ ప్రతిపాదన షెడ్యూల్ ఖరారైంది. నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 12:45 గంటలకు నడ్డా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
సంపర్క్ సే అభియాన్‌లో భాగంగా మధ్యాహ్నం 1:15 నుండి 2:30 గంటల వరకు నడ్డా ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశమవుతారు.నడ్డా మధ్యాహ్నం 3:00 గంటలకు నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. నడ్డా సాయంత్రం 4:00 గంటల వరకు నోవాటెల్ హోటల్‌లో ఉంటారు.సాయంత్రం 4:15 గంటలకు నడ్డా హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి నాగర్ కర్నూల్ సభకు బయలుదేరి వెళతారు. సాయంత్రం 4:45 గంటలకు నాగర్ కర్నూల్ చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నాగర్ కర్నూల్ జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభకు నడ్డా హాజరుకానున్నారు. జాతీయ అధ్యక్షుడు నాగర్ కర్నూల్ నుంచి సాయంత్రం 6:10 గంటలకు బయలుదేరుతారు. నడ్డా సాయంత్రం 6:40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. నడ్డా రాత్రి 7:40 గంటలకు విమానాశ్రయం నుంచి తిరువనంతపురం వెళ్లనున్నారు.
ప్రస్తుత ఏపీ రాజకీయాలను వేడెక్కించేలా వ్యూహం టీజర్..
ప్రస్తుత ఏపీ రాజకీయాలను వేడెక్కించే విధంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అయింది.సినిమా టీజర్ వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంతో మొదలైంది.టీజర్ తోనే తను తీస్తున్న సినిమా పై బాగా హైప్ ను పెంచేశారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. వ్యూహం సినిమా ఎవరి బయోపిక్ అయితే కాదూ.సీక్వెల్ అస్సలు కాదు అంటూ పొలిటికల్ కుట్రల విషం ఉంటుందని కథను కొంత బయటపెట్టారు.. అస్సలు కుట్రలు ఎవరు చేశారు.ఆ కుట్రలకు ఎవరు బలయ్యారనేది మాత్రం వెయిట్ అండ్ సీ అంటూ పెద్ద ట్విస్ట్ ను ఇచ్చారు ఆర్జీవి.అంతలోనే సీఎం జగన్‌ను రెండోసారి ఆర్జీవీ కలవడం హాట్ టాపిక్‌గా అయితే మారింది. ఇక వ్యూహం స్టిల్స్ తో ఏపీ రాజకీయాలను వేడెక్కించారు ఆర్జీవీ..ఈ సినిమా ఎలాంటి వివాదాలు సృష్టిస్తుందో చూడాలి.
తిరుగుబాటు నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న పుతిన్..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు రష్యా తరుపున పోరాడిని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ ఏకంగా రష్యా ప్రభుత్వం, సైన్యంపైనే తిరుగుబాటు చేసింది. తాము చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే తమ చావు రష్యా ప్రజల కోసమే అంటూ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ అన్నారు. రష్యాలో మిలిటరీ నాయకత్వాన్ని కూలుస్తామని, అధ్యక్షుడు పుతిన్ కే వార్నింగ్ ఇచ్చాడు. అన్యాయంగా తమ సైనికులను రష్యన్ ఆర్మీ చంపేస్తోందని ఆరోపించారు. రష్యా దాడుల్లో తమ సైన్యం వేలల్లో చనిపోతోందని దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే రష్యాలో సాయుధ తిరుగుబాటు నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో బలగాలను పెంచింది. తిరుగుబాటు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. తిరుగుబాటును ఎదుర్కొనేందుకు త్వరలోనే దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యన్ వార్తా సంస్థలకు తెలియజేశారు.
గెట్ రెడీ.. ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్ వచ్చేస్తోంది!
మాస్ మహరాజ్ రవితేజ చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర రావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వర రావు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో గ్రాండ్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అదిరిపోయింది. ఇందులో రవితేజ స్టువర్టుపురం గజ దొంగగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా రవితేజ కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ అండ్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్‌గా రాబోతోంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చినట్టు తెలుస్తోంది. రెండు పాటలు మినహాయిస్తే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందట.
షాకింగ్… ‘పవన్’ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదట?
ఓజి అంటే.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే పవన్ ఓజి సినిమా పై ఎక్కడా లేని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు పవర్ స్టార్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదనే న్యూస్ షాకింగ్‌గా మారింది. మరి ఓజి అంటే ఏంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగా తమ తమ హీరోలని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటూ హైప్ క్రియేట్ చేస్తుంటారు అభిమానులు. ముఖ్యంగా మెగాభిమానులు రామ్ చరణ్‌ను ఓజి అంటుంటారు. అదే టైటిల్‌తో బాబాయ్ పవన్ కళ్యాణ్ ఓజి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో.. మెగాభిమానులకు ఫుల్ కిక్ ఎక్కింది. అప్పటి నుంచి ఓజి పై రోజు రోజుకి హైప్ క్రియేట్ అవుతునే ఉంది. ఈ మధ్య ఈ సినిమాకు వస్తున్నంత హై మరో సినిమాకు రావడం లేదు. సుజీత్ దర్శకత్వంలో… డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు ఓజి నెక్స్ట్ లెవల్ అనేలా ప్లాన్ చేస్తున్నారు. కిక్ ఇచ్చే అప్డేట్‌తో ఓజి పై అంచనాలు పెంచేస్తున్నారు. ప్రస్తుతం ఓజి షూటింగ్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి కాదనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాను ఓజి వర్కింగ్ టైటిల్‌తో మొదలు పెట్టారు కానీ దీన్నే టైటిల్‌గా ఫిక్స్ అయిపోయారు అభిమానులు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఓజి అంటే ‘ఓజాస్ గంభీర’ అని తెలుస్తోంది. దాన్నే షార్ట్‌గా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్‌గా మార్చారని సమాచారం. అయితే ‘ఓజాస్ గంభీర’ అనేది.. సినిమాలో పవన్ క్యారెక్టర్ పేరు అని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఓజి అనే టైటిల్ మాత్రం పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.
అయోధ్య రామయ్య కోసం 108 అడుగుల పొడవు అగరుబత్తీ…
భారతీయుల ఆత్మ బంధువు రామయ్య కు అయోధ్య గుడి నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. ఈ మందిరాన్ని చూడటానికి యావత్ ప్రజానీకం ఎదురు చూస్తున్నారు.. ప్రజలందరి విరాళాల తో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.. ఇప్పటికే ఆలయ నిర్మాణం పూర్తి కావొస్తుంది.. అయితే రామయ్య భక్తులు ఒక్కొక్కరు ఒక్కోక్క వస్తువును, పూజకు సంబందించిన వస్తువులను విరాళంగా ఇస్తున్నారు.. ఈ మేరకు ఓ భక్తుడు రామయ్య కోసం ప్రత్యేకంగా సువాసనలు వెదజల్లేలా 108 అడుగుల పొడవు గల అగరబత్తిని తయారు చేసి స్వామి వారికి కానుకగా ఇవ్వబోతున్నాడు.. ఈ అగరబత్తి పొడవు అందరిని ఆకట్టుకుంటుంది.. అతను చాలా కష్టపడినట్లు తెలుస్తుంది..
ఈ ఏడాది అక్టోబరు నాటికి మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తవుతుందవుతుండగా అతను తయారు చేసిన అగరుబత్తిని రామమందిరానికి విరాళంగా ఇవ్వబోతున్నాడు. అగరుబత్తిని తయారు చేసేటప్పుడు బ్రహ్మచర్యాన్ని అనుసరించాడు.. ఆ ఇతరులను తాకడానికి అనుమతించలేదు. అగరుబత్తీతయారు చేయడానికి రామభక్తులు తనకు సహకరించారని చెప్పాడు. ప్రస్తుతం వర్షం కారణంగా పనులు నిలిపివేసినప్పటి కీ వర్షం కురిసిన తర్వాత మళ్లీ అగరబత్తి తయారీ పనులు చేపట్టనున్నారు. అగరుబత్తీల తయారీలో 3వేల 4 వందల కిలోల మెటీరియల్‌ను ఉపయోగించారు.
ముంబైలో భారీ వర్షం .. ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
ముంబైలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండటంతో భారత వాతావరణ శాఖ (IMD) శనివారం ముంబైకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 4-5 రోజుల్లో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం నైరుతి రుతుపవనాలు ఈ రోజు(శనివారం) నగరానికి చేరుకునే అవకాశం ఉంది. రాబోయే 4-5 రోజులలో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో వర్షపాతం తీవ్రత క్రమంగా పెరుగుతుంది. రాబోయే 5 రోజుల్లో తీవ్రమైన వాతావరణాన్ని అంచనా వేస్తున్నట్టు ముంబైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఒక ట్వీట్‌లో పేర్కొంది. పసుపు హెచ్చరిక అంటే నివాసితులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలని అధికారులు సూచిస్తున్నారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్ర, శనివారాల్లో మహారాష్ట్రలోని ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. భారత వాతావరణ శాఖ జూన్ 26-27 తేదీలలో నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇది కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతాన్ని సూచిస్తుంది. రాయ్‌గఢ్, థానే, పాల్ఘర్ మరియు ముంబై జిల్లాల్లో శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బిపార్జోయ్ తుఫాను కారణంగా దాదాపు 10 రోజుల ఆలస్యం తర్వాత జూన్ 23-25 మధ్య రుతుపవనాలు ముంబైకి వస్తాయని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది. ముంబైకి చెందిన వాతావరణ అధికారి మాట్లాడుతూ, జూన్ 11న రుతుపవనాలు తీరప్రాంత రత్నగిరికి చేరుకున్నప్పటికీ, బిపార్జోయ్ తుఫాను కారణంగా ఎటువంటి పురోగతి సాధించలేకపోయిందని తెలిపారు.
కిలో వర్జీనియా పొగాకు రూ.280
ఏపీలో వర్జీనియా పొగాకు ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సాగు మొదలుపెట్టిన 75 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక ధరలు నమోదవుతున్నాయి. ఇటీవల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వేలం కేంద్రంలో అత్యధికంగా రూ.254 పలకగా, నిన్న దేవరపల్లిలో రూ.280 ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. గోపాలపురంలో రూ.279, కొయ్యలగూడెంలో రూ.277 ధర పలికింది. ఎగుమతులకు డిమాండ్ ఉండటంతో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.
పెరిగిన పెట్టుబడుల దృష్ట్యా అత్యధిక ధర కన్నా సగటు ధర అనుకున్న స్థాయిలో వస్తేనే లాభపడతామనే ఆశతో రైతులు ఉన్నారు. సగటు ధర రూ.200 పైబడి వస్తే గిట్టుబాటు అవుతుందని ఆశించారు. గతంలో సగటు ధర కిలోకు రూ.170, రూ.180, రూ.190గా ఉండేది. అయితే కొద్దిరోజులుగా గ్రేడ్-1 పొగాకుకు ధర పెరగడంతో సగటు ధర కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో ఎన్ఎల్ఎస్ పరిధిలో సగటు ధర రూ.200 మార్కును దాటి ప్రస్తుతం ఇది రూ.209గా కొనసాగుతోంది. ఇదే పంథా కొనసాగితే సగటు ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశిస్తున్నారు.