పోలీసుల తనిఖీలు.. భారీ “సైబర్ డెన్” గుర్తింపు..!
విశాఖ జిల్లా అచ్యుతాపురంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీ సైబర్ డెన్ ను గుర్తించారు పోలీసులు. దీనితో ఆ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతి, యువకులను తీసుకువచ్చి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొని పరవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయనగరం ఉగ్ర మూలాలతో ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ సమయంలో భారీ సైబర్ డెన్ బయటపడటంతో వివిధ కోణాలలో పరిశీలిస్తున్నారు. దీంతో సైబర్ ఎక్స్పర్ట్స్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రెండు బిల్డింగులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు బిల్డింగులలో దాదాపు 160 మంది ఉద్యోగులు ఉన్నట్లుగా సమాచారం. వారందరికీ ప్రతినెలా క్యాష్ పేమెంట్ ద్వారా జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో టెక్నికల్ ఆధారాలను సేకరించే పనిలోపడ్డారు పోలీసులు.
మెట్రోలో హిడెన్ కెమెరాలు.. మహిళల గోప్యతకు గొడ్డలిపెట్టు..?
దేశ ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా విలసిల్లుతున్న బెంగళూరులో నిత్యం లక్షలాది మంది ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి మెట్రో ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న తరుణంలో, ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన నగర ప్రజలను, ముఖ్యంగా మహిళలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అదే, “బెంగళూరు మెట్రో చిక్స్” అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ వ్యవహారం. నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు మెట్రో బోగీల్లో మహిళలు, అమ్మాయిలు ప్రయాణిస్తున్నప్పుడు వారి ప్రమేయం లేకుండా, రహస్యంగా వీడియోలు తీసి, ఫోటోలు తీసి “బెంగళూరు మెట్రో చిక్స్” అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ పేజీలో కేవలం మహిళల చిత్రాలు, వీడియోలు మాత్రమే కాకుండా, వారి శరీరాకృతి, దుస్తులు, ముఖ కవళికల గురించి అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన వివరణలు కూడా జతచేయబడ్డాయి. మొదట్లో కొద్దిమంది మాత్రమే గమనించిన ఈ పేజీ, నెమ్మదిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగరంలో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
ఢిల్లీని హడలెత్తించిన వడగండ్ల వాన.. నలుగురు మృతి
భారీ తుఫాన్ దేశ రాజధాని ఢిల్లీని హడలెత్తించింది. బుధవారం సృష్టించిన విలయానికి నగరం అతలాకుతలం అయింది. దుమ్ము, ఈదురుగాలులతో కూడిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా ఢిల్లీ, నోయిడాలో చెట్లు కూలిపోయాయి. హోర్డింగ్‌లు, కరెంట్ పోల్స్ నేలకొరిగాయి. ఇక బీభత్సమైన వడగండ్ల కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తుఫాన్ ధాటికి దేశ రాజధాని అల్లకల్లోలం అయిపోయింది. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో అకస్మాత్తుగా తీవ్రమైన వడగళ్ల వాన, తీవ్రమైన వర్షం, బలమైన ఈదురుగాలులు, దుమ్ము తుఫానుతో బెంబేలెత్తించేసింది. నగర వాసులంతా హడలెత్తిపోయారు. ఇక చెట్లు కూలిపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అంధకారంలోనే ప్రజలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. అలాగే మెట్రో సేవలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం నలుగురు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. లోధి రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి హైవోల్టేజ్ వైర్ మీద పడి మరణించాడు. గోకుల్‌పురిలో మౌజ్‌పూర్‌కు చెందిన యువకుడు (22) అజర్‌పై చెట్టు పడి చనిపోయాడు. ఘజియాబాద్‌లో బైక్‌పై వెళ్తున్న 40 ఏళ్ల ముజామిల్‌పై చెట్టు పడి మృతిచెందాడు. అలాగే పాఠశాల గోడ కూలి 38 ఏళ్ల మహిళ చనిపోయింది.
భారత్-పాక్ సమస్యను నేనే పరిష్కరించా.. ట్రంప్ మళ్లీ ప్రకటన
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలను తానే పరిష్కరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తాను పరిష్కరించినట్లు చెప్పుకొచ్చారు. మరోసారి క్రిడిట్ కొట్టే ప్రయత్నం చేశారు. వాణిజ్యం ద్వారా సమస్యను పరిష్కరించినట్లు చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడని ట్రంప్ గుర్తుచేశారు. దీనికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు కలుగజేసుకుని తాము కూడా పరస్పర స్నేహితులం అని సమాధానం ఇచ్చాడు. ఇంతలో ట్రంప్ జోక్యం పుచ్చుకుని.. మోడీ గొప్ప వ్యక్తి అని.. ఇది మంచి విషయం అన్నారు. తమకు తాముగానే సమస్యను పరిష్కరించుకున్నామని ఇరుదేశాలు చెబితే తాను ఇష్టపడనన్నారు. తమ జోక్యంతోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయన్నారు.
వాషింగ్టన్‌లో కాల్పులు.. ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది మృతి
అగ్ర రాజ్యం అమెరికాలో ఇజ్రాయెల్ లక్ష్యంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సిబ్బంది చనిపోయారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. వాష్టింగ్టన్‌లోని యూదు మ్యూజియం సమీపంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సిబ్బంది మరణించారు. బాధితులు ఎవరనేది ఇంకా బయటపెట్టలేదు. కానీ ఇద్దరు కూడా అమెరికాలోని ఇజ్రాయెల్ దౌత్య మిషన్‌తో అనుబంధంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. దీన్ని యూదు వ్యతిరేక ఉగ్రవాద దుర్మార్గపు చర్యగా పోలీసులు అభివర్ణించారు. హత్యలపై దర్యాప్తు కొనసాగుతోందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ తెలిపారు. బాధిత కుటుంబాల కోసం ప్రార్థించాలని కోరారు.
అభివృద్ధి ఎక్కడ కనిపించనేలేదు.. సంక్షేమం ఊసే లేదు..!
ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా అయన రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక నాణేనికి రెండో వైపులా.. కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మనం యుద్ధం చేస్తోంది చంద్రబాబుతోనే కాదు.. చెడిపోయిన ఎల్లో మీడియాతో అంటూ వ్యాఖ్యానించారు.
AI ప్రపంచంలో సరికొత్త రికార్డు.. గూగుల్ జెమినికి 40 కోట్ల యూజర్లు..
కృత్రిమ మేధస్సు (AI) అనేది ఇప్పుడు కేవలం సినిమాలకో, సైన్స్ ఫిక్షన్ కథలకో పరిమితం కాలేదు. అది మన రోజువారీ జీవితంలోకి వేగంగా చొచ్చుకుపోతోంది. స్మార్ట్ ఫోన్లలో, కారు డ్రైవింగ్ లో, ఆఫీసు పనుల్లో, చివరకు వంట చిట్కాలలో కూడా AI తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ AI విప్లవంలో ముందున్న వాటిలో గూగుల్ జెమిని ఒకటి. తాజాగా, ఈ జెమిని యాప్ 400 మిలియన్ల (అంటే 40 కోట్ల) మంది వినియోగదారులను దాటి, AI చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. గూగుల్ జెమిని కేవలం ఒక యాప్ కాదు. అది ఒక తెలివైన సహచరుడు. క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సృజనాత్మక ఆలోచనలు అందించడం, కోడింగ్ రాయడం, భాషలను అనువదించడం, ముఖ్యమైన సమాచారాన్ని సంగ్రహించడం… ఇలా ఎన్నో పనులను జెమిని సులభంగా చేయగలదు. ప్రారంభించిన కొద్ది కాలంలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద సంఖ్యలో ఆదరణ పొందడం వెనుక, దాని అద్భుతమైన సామర్థ్యాలు, వినియోగదారులకు అది అందించే విలువలే ముఖ్య కారణం.
కాల్పుల విరమణపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన జై శంకర్
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని పదే పదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. గతంలో ఒకసారి ఇలా చెప్పగా.. తాజాగా మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో సమావేశం సందర్భంగా అవే వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇదే అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనలను తోసిపుచ్చారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అమెరికా జోక్యం లేదని.. హాట్‌లైన్ ద్వారా ఇరు దేశాలు కాల్పుల విరమణపై చర్చించి విరమించినట్లు తెలిపారు. ఇందులో ట్రంప్ జోక్యం ఏ మాత్రం లేదని పేర్కొన్నారు.
రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు.. ప్రభుత్వంపై జగన్ ఫైర్..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పాలనా పరిస్థితులు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగన్ కౌంటర్లు హాట్ టాపిక్ గా మారాయి. అభివృద్ధి మంత్రం తన చేతిలో ఉందని ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన హామీలను గుర్తు చేసారు. మరింత సంక్షేమం చేస్తామని చెప్పారు. కానీ, 12 నెలలు పూర్తయ్యినా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదు అన్నారు. ఇక రాష్ట్ర వృద్ధి రేటు కేవలం 3.08 శాతమేనని… మరోవైపు, దేశ స్థాయిలో గ్రాస్ టాక్స్ రెవెన్యూ వృద్ధి రేటు 13.76 శాతం ఉందని అన్నారు. ఏపీ ఆదాయం మాత్రం చంద్రబాబు, ఆయన మంత్రుల జేబుల్లోకి వెళ్తోంది అని జగన్ అన్నారు. ఈ ఏడాది మాత్రమే రూ.81,597 కోట్ల అప్పులు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,32,671 కోట్ల అప్పులు తీసుకుంది. ఇందులో సగం అప్పులు ఒక్క ఏడాదిలోనే చేసి పెట్టారు. రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టడమంటే ఇదే కావచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుల్లెట్ దిగిందా?లేదా.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
‘గతంలో బీఆర్ఎస్ సహా కొన్ని పార్టీల నాయకులు రైల్వే అభివృద్ధిపై కేవలం లేఖలు రాసి బాధ్యతను దూరం చేసుకున్నారు. కానీ ఇప్పుడు అభివృద్ధి కనిపిస్తున్నాక – ఇదంతా తమ వల్లే జరిగిందని ప్రచారం చేస్తున్నారు. మాటలకే పరిమితమవ్వకుండా వాస్తవిక ఫలితాలు చూపాలన్నది ప్రధాన విషయం. బుల్లెట్ దిగిందా? లేదా? అనేది ప్రజలే తేల్చాలి,’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరించిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో కరీంనగర్ స్టేషన్ మార్పే నిదర్శనమన్నారు. అలాగే, జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను కూడా అమృత్ భారత్ పథకంలో చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
పహల్గామ్ ఉగ్ర దాడిపై మరోసారి ప్రధాని మోడీ సీరియస్ కామెంట్స్
మన మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశామని ప్రధాని మోడీ అన్నారు. మోడీ రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బికనీర్‌లో ఏర్పాటు చేసిన సభలో పహల్గామ్ గురించి మాట్లాడుతూ.. పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులను అంతం చేశామని తెలిపారు. కేంద్రం త్రివిధ దళాలకు పూర్తి స్వచ్ఛ ఇచ్చిందని గుర్తుచేశారు. మన దళాలు చక్ర వ్యూహాలు పన్ని శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయని తెలిపారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడికి జవాబుగా 22 నిమిషాల్లోనే ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు చెప్పారు. భారత్‌లో రక్తపుటేర్లు పారించిన వాళ్లను ముక్కలు.. ముక్కలు చేసినట్లు మోడీ పేర్కొన్నారు.