తమ ప్రభుత్వంలో కక్ష సాదింపు చర్యలు ఉండవు
ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ విచారణ సాగుతుందని దానిలో ప్రభుత్వ ప్రమేయం ఏమి ఉండదని, విచారణ అనంతరం నివేదికల ప్రకారమే చర్యలు ఉంటాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంటున్నారు. మొన్న కాళేశ్వరం విచారణకు కేసీఆర్ వెళుతుండగా అంత హంగామాచేయడం అవసరమా.. తాజాగా కూడా కేటీఆర్ విచారణ ను ఏదో జరగబోతున్నట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా హంగామా చేస్తున్నట్లుగా దృష్టికి వచ్చిందని పొంగులేటి అంటున్నారు. విచారణ ల తరువాత నివేదికల ఆధారంగా చర్యలు ఉంటాయని, తమ ప్రభుత్వానికి ఎప్పుడు కక్ష సాధింపు చర్యలు మాత్రం ఉండవని పొంగులేటి అన్నారు. స్థానిక ఎన్నికలు త్వరలోనే ఉంటాయని, బీసీ లరిజర్వేషన్ ల విషయంలో ప్రభుత్వం కట్టు బడి ఉందని , ఇప్పటకే కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, అసెంబ్లీచేసిన బిల్లుకు అనుగుణంగానే రిజర్వేషన్ లను చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
ఇజ్రాయెల్ నిప్పుల వర్షం.. బంకర్‌లోకి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్.. ఇరాన్‌పై భీకర దాడులు మొదలు పెట్టింది. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ అగ్ర కమాండర్లు సహా 14 మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. ఇక 200లకు పైగా సామాన్య పౌరులు కూడా చనిపోయారు. ప్రస్తుతం ఇరు పక్షాలు భీకరదాడులు చేసుకుంటున్నాయి. ఇక ఇరాన్‌పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ బంకర్‌లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. టెహ్రాన్‌లో కీలక ప్రాంతాలు ధ్వంసం కావడంతో.. ముందస్తు జాగ్రత్తగా ఖమేనీని అధికారులు సురక్షితంగా ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. అండర్‌గ్రౌండ్‌లో కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
హజ్ యాత్రికుల విమానంలో మంటలు.. లక్నోలో సురక్షితంగా ల్యాండింగ్
హజ్ యాత్రికులతో ఉన్న విమాన చక్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ, నిప్పురవ్వలు రావడంతో పైలట్ అప్రమత్తమై లక్నో ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. విమానంలో ఉన్న 250 మంది హజ్ యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. హైడ్రాలిక్ లీక్ కారణంగా చక్రంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన SV 3112 విమానం శనివారం రాత్రి 10.45 గంటలకు జెడ్డా నుంచి 250 మంది హజ్ యాత్రికులతో లక్నోకు బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా పైలట్ గుర్తించాడు. పైలట్ వెంటనే విమానాన్ని ఆపి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడు. ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం విమానాన్ని వెనక్కి నెట్టి టాక్సీవేకు తరలించారు. అక్కడ ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించేశారు.
దేనికైనా సిద్ధంగా ఉన్నాం.. అరెస్ట్ కూడా చేయొచ్చు
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో మరోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులతో తనను లక్ష్యంగా చేసుకుని రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని ఆరోపించిన ఆయన, జైలుకు వెళ్ళేందుకు కూడా తాను సిద్ధమని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ వద్ద సోమవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ‘‘విచారణ పేరుతో ఆరు నెలలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఏం తేల్చారు? నాకు ముందే తెలుసు.. ఫార్ములా ఈ-రేసు కేసులో అరెస్ట్ చేస్తారనే విషయాన్ని. అయినా నాకు భయం లేదు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. జైలుకు వెళ్లడంలో ఎలాంటి భయం లేదు. నేను తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు జైలుకెళ్లాను. ఈ అంశాన్ని నాలుగు గోడల మధ్య విచారణకు పరిమితం చేయకుండా, అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు,” అని అన్నారు.
పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్న నెల రోజులకే నవ దంపతులు మృతి!
కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే నవ దంపతులు యాక్సిడెంట్‌లో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఆర్కే బీచ్‌కి వెళ్తుండగా బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరి మృతితో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సత్య హరిశ్చంద్రుడిలా కేటీఆర్ తెగ బిల్డప్ ఇస్తున్నాడు
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే క్రమంలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ వేశారు. “చట్టంపై గౌరవం ఉందని చెబుతున్న కేటీఆర్ అదే సమయంలో విచారణను డైవర్ట్ చేయడానికి నాటకాలాడుతున్నాడు” అంటూ ఆయన విమర్శించారు. ప్రజల ఎదుట తాను నిర్దోషినంటూ సత్యహరిశ్చంద్రుడిలా నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. విచారణకు హాజరయ్యేందుకు మేం ఎవరినీ బలవంతంగా పిలవలేం కానీ, ఒక వ్యక్తి చిత్తశుద్ధితో ఉంటే – విచారణకు సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. కేటీఆర్ మాత్రం విచారణపై వ్యంగ్యంగా స్పందిస్తూ బిల్డప్‌లు ఇస్తున్నాడని బల్మూర్ మండిపడ్డారు. “తనపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్న కేటీఆర్ అసలు సత్యాన్ని దాచి తనను నిర్దోషిగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు” అన్నారు.
రాజాసాబ్ టీజర్ రిలీజ్.. వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్
ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. అదిరిపోయే పాటలు, ఫైట్స్, కామెడీ, డ్యాన్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్. పైగా ఫస్ట్ హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను.. ప్రభాస్ ఓల్డ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చెప్పినట్టే మారుతి వింటేజ్ డార్లింగ్‌ను చూపించబోతున్నాడు. కాగా కొద్దీ సేపటి క్రితం రాజాసాబ్ టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. వాస్తవానికి మారుతీతో సినిమా అనగానే ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కాని ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ చూసాక ఇది కదా మేము డార్లింగ్ నుండి ఎదురుచూసేది అని మారుతీని ఓ రేంజ్ లో పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. టీజర్ లో వింటేజ్ లుక్ ప్రభాస్ అదరగొట్టాడు. ఇక తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అనే చెప్పాలి. చివర్లో డార్లింగ్ చెప్పిన డైలాగ్ నవ్వులు పూయించింది. ఏదేమైనా చాలా కాలంగా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు బ్లాక్ బస్టర్ లాంటి టీజర్ ఇచ్చాడు దర్శకుడు మారుతి. రెండు తెలుగు రాష్టాల్లోని కసెలెక్టీవ్ థియేటర్స్ లో రాజాసాబ్ టీజర్ ను అభిమానుల కోసం స్పెషల్ స్క్రీనింగ్ చేసారు మేకర్స్. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన రాజాసాబ్ ను ఓ సారి చూసేయండి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా డిసెంబరు 5న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
పేదలకు మేలు చేయడమే వికసిత్ భారత్ లక్ష్యం!
దేశంలో పేదలకు మేలు చేయడమే వికసిత్ భారత్ లక్ష్యం అని బీజేపీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. భారతదేశంలో 80 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నామన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలో పేదరికం ఐదు శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఎన్డీయే కూటమిని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో.. దానికి జవాబుదారీతనంగా పరిపాలన ఉందన్నారు. 11 సంవత్సరాల వికసిత భారతదేశపు అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి పెద్దపీట అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు. బీజేపీ ఎంపీ పురందేశ్వరి నేడు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు.
నిలకడగా సోనియాగాంధీ ఆరోగ్యం.. వైద్యుల వెల్లడి
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రి వెల్లడించింది. అనారోగ్య సమస్యలతో సోనియాగాంధీ ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా సోనియా గాంధీ ఆరోగ్యం గురించి ఆస్పత్రి ఛైర్మన్ అజయ్ స్వరూప్ కీలక సమాచారాన్ని మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని.. నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఉదర సంబంధిత సమస్య కారణంగా ఆస్పత్రి గ్యాస్ట్రోలజీ విభాగంలో సోనియాగాంధీ చేరినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. సోనియా గాంధీ గత కొన్ని సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీకి 78 ఏళ్లు. 2022 సంవత్సరంలో కూడా ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో రెండుసార్లు చేరారు. ఆ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, వైరల్ జ్వరం, కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరారు.