రాజోలులో రాజుకుంటున్న రాజకీయం..! లోకేస్ వర్సెస్ రాపాక..!
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రాజకీయం రాజుకుంటుంది.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తాటిపాక బహిరంగ సభలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. లోకేష్ ఆలోచించకుండా, తెలియకుండా మాట్లాడటం సరికాదని హితవుపలికారు.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేపథ్యంలో తాటిపాక బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు పై అవినీతి ఆరోపణలు గుప్పించారు నారా లోకేష్.. దీనిపై స్పందించిన రాపాక.. లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలతో విమర్శనాస్త్రాలు సంధించారు. నారా లోకేష్ ఒక పప్పు నాయుడని, పోరంబోకు అని తీవ్రంగా విరుచుకుపడ్డారు రాపాక.. తాను జనసేన పార్టీని మోసం చేసి బయటకు రాలేదని, ఒకవేళ తాను తప్పు చేస్తే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించాలి.. కానీ, తనని విమర్శించడానికి నువ్వెవడవురా..? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. వెన్నుపోటు రాజకీయాలు నీ బాబుకి తెలిసినంతగా వేరెవ్వరికీ తెలియవన్న ఆయన.. ఒక దళితుడు ఇళ్లు కట్టుకుంటే ఇంతా వివక్షా..? అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఎవడో వెధవ రాసిచ్చిన కాగితం చదవడం తప్ప తన గురించి లోకేష్ కి ఏం తెలుసని దుయ్యబట్టారు. మరోవైపు, లోకేష్ వ్యాఖ్యలను దళిత సంఘాల నుండి ఎమ్మార్పీఎస్ఎస్ నాయకులు తెన్నేటి కిషోర్ మాదిగ తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు కి నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని లేకుండా అట్రాసిటీ యాక్ట్ కింద ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఎన్నికల విధులకు దూరంగా గ్రామ వాలంటీర్లు.. సుప్రీంకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని దాఖలైన పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఎన్నికల విధుల్లో గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఉపయోగించవద్దని, వారిని ఎన్నికల విధులకు దూరం పెట్టాలంటూ.. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమొక్రసీ సంస్థ.. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అక్రమాలకు తావిస్తున్న వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని కూడా సుప్రీంకోర్టులో దాఖలో చేసిన పిల్‌లో పేర్కొంది సిటిజన్ ఫర్ డెమొక్రసీ సంస్థ. వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటాను ఐప్యాక్, రామ్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ లాంటి సంస్థల ద్వారా ప్రొఫైలింగ్ చేయించడంపై పరిశీలన కోసం ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్నికి విజ్ఞప్తి చేసింది.. ఇక, గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల సంబంధ విధుల నుంచి పూర్తిగా తప్పించాలని కోరింది సిటిజన్ ఫర్ డెమొక్రసీ.. ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల సేవలను ఉపయోగించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిల్‌లో కోరింది సిటిజన్ ఫర్ డెమొక్రసీ.. ఇక, దీనిపై సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు సాగనున్నాయి.. సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఏపీలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. గ్రామ సచివాలయ వ్యవస్థ నిర్వహణకు వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని వినియోగిస్తోంది. ఈ వ్యవస్థపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి.. ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు పంచాయతీ వెళ్లడంతో ఏం జరుగుతుంది? అనేది ఉత్కంఠగా మారింది.
బాండ్ పేపర్ పేరుతో కొత్త డ్రామా.. కాంగ్రెస్ పై కవిత విమర్శ
కాంగ్రెస్ సీనియర్ నేతలు బాండ్ పేపర్ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కాంగ్రెస్ మొసలి కన్నీరు నమ్మితే ప్రజలకు కన్నీళ్లు మిగలవని ఎమ్మెల్సీ కవిత అన్నారు.137 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఈ స్థాయికి దిగజారిపోయిందని మండిపడ్డారు. జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, భట్టివిక్రమార్క్ లాంటి పెద్ద నాయకులు కూడా బాండ్ పేపర్లు రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ప్రజల్లో ఆ పార్టీ ఎంతటి నమ్మకం కోల్పోయిందో అర్థం చేసుకోవచ్చు. నిజామాబాద్‌లో పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇలాంటి డ్రామానే చేసిందన్నారు. 223 స్థానాల్లో పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థులు వాగ్దానాలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసి ఇచ్చినా ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయారన్నారు.
కర్ణాటక ప్రజల సొమ్ముతో ప్రకటనలు.. వేలం పాటలా పోటీ పడి పథకాలు
బీజేపీ మేనిఫెస్టోను ఒక పవిత్రగ్రంధంగా ప్రజలు భావిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోందని భాజపా ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మూడు రోజులుగా బీజేపీ జాతీయ నాయకత్వం మోడీ, అమిత్ షా, నడ్డా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది.. మోదీపై ప్రజలకు అపారమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు. ప్రధాని రోడ్ షోకు, సభలకు విశేష ఆదరణ లభించింది.. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఇటు కేసీఆర్ అబద్ధపు మాటలు, వాగ్ధానాలు విని విని ప్రజలు విసిగి వేసారి పోయారని తెలిపారు. బీజేపీ మేనిఫెస్టో ప్రజల మనోగతాన్ని ప్రభావితం చేసే సంకల్ప పత్రం.. ఇతర పార్టీలు వేలం పాట మాదిరిగా పోటీ పడి పథకాలను ప్రకటిస్తున్నారు. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలకు సంబంధించిన ఆమోదయోగ్యమైన హామీలనే బీజేపీ ఇచ్చిందన్నారు. అప్పుల కుప్పగా మారిన తెలంగాణ అథో: గతి పాలు కావద్దని ప్రజలకు లక్ష్మణ్ సూచించారు.
కామారెడ్డి ప్రజలకు కష్ట సుఖాల్లో తోడుంటా…
కామారెడ్డి ప్రజలకు కష్ట సుఖాల్లో తోడుంటా అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి ప్రజల తీర్పును దేశం నిశితంగా గమనిస్తోందన్నారు. పదేళ్లలో ప్రజలకు కేసీఆర్ చేసిందేం లేదని అన్నారు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా వైశ్యులను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి 10లక్షలు, పిల్లల చదువుకు సాయపడేలా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. బీడీ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. కామారెడ్డి ప్రాంతంలో భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఓటుకు పదివేలు ఇచ్చి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అన్నారు. ఆదమరచి కేసీఆర్ కు ఓటు వేస్తే… కోట్లాది రూపాయల విలువైన మీ భూములను కొల్లగొడతాడని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కామారెడ్డిలో పరిశ్రమల కారిడార్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. కామారెడ్డి రెడ్డి ప్రజలు గొప్ప తీర్పును ఇవ్వాలని కోరుతున్నా అని.. కామారెడ్డి ప్రజలకు కష్ట సుఖాల్లో తోడుంటా అని హామీ ఇచ్చారు.
కోటాలో 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 28కి చేరిన మరణాలు!
రాజస్థాన్‌లోని కోటాలో 20 ఏళ్ల విద్యార్థి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాదిలో కోటాలో ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 28కి చేరింది. మృతుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫౌరీద్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు. కోటా నగరంలోని వక్ఫ్ నగర్ ప్రాంతంలోని తన గదిలో హుస్సేన్ ఉరివేసుకుని మృతి చెందాడు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోటాలో గతేడాది 15 మంది ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం… పశ్చిమ బెంగాల్‌కు చెందిన 20 ఏళ్ల ఫౌరీద్ హుస్సేన్ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. కోటాలో నీట్ శిక్షణ తీసుకుంటూ.. గతేడాది నుంచి స్థానికంగా ఓ వసతి గృహంలో ఉంటున్నాడు. సోమవారం స్నేహితులతో కలిసి భోజనం చేసి తన గదిలోకి వెళ్లిపోయాడు. హుస్సేన్ గది నుంచి ఎంతకీ బయటకు రాలేదు. స్నేహితులు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనాస్థలానికి చేరుకొని గది తలుపులు తెరిచారు. హుస్సేన్ ఉరి వేసుకుని కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
జియోఫోన్ ప్రైమాకు ప్రత్యేక ప్లాన్‌లు.. అన్నింటిలో డేటా ప్రయోజాలు!
భారతీయ మార్కెట్ కోసం ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ నుంచి వచ్చిన తాజా ఫోన్ ‘జియోఫోన్ ప్రైమా’. ఐఎంసీ (ఇండియా మొబైల్ కాంగ్రెస్) 2023లో ప్రదర్శించబడిన ఈ ఫోన్.. నవంబర్ ప్రారంభంలో ప్రారంభించబడింది. కస్టమర్లకు డిజిటల్ వసతులకు చేరువ చేయడమే లక్ష్యంగా జియో కంపెనీ ఈ 4జీ ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. రూ.2,599 ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ను.. సాధారణ జియోఫోన్ ప్లాన్లతో రీఛార్జ్ చేయడం కుదరదు. జియోఫోన్ ప్రైమాకు ప్రత్యేక ప్లాన్‌లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. జియోఫోన్ ప్రైమా కోసం మొత్తం ఏడు ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌ల ధర రూ. 75, రూ. 91, రూ. 125, రూ. 152, రూ. 186, రూ. 223 మరియు రూ. 895గా ఉన్నాయి. ఈ ప్లాన్‌లన్నీ డేటా ప్రయోజనాలతో వస్తాయి. డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లు, సబ్‌స్క్రిప్షన్ లాంటి ప్రయోజాలను పొందవచ్చు.
అలా కన్ఫ్యూజ్ అయితే ఎలా జక్కన్న?
దర్శ ధీరుడు రాజమౌళి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అణిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు గెస్టుగా వచ్చాడు రాజమౌళి. మహేష్ అండ్ రాజమౌళి ఒకే స్టేజ్ పైన చూడాలి అంటే SSMB 29 అనౌన్స్మెంట్ బయటకి వచ్చే వరకూ వెయిట్ చేయాలేమో అనుకున్నారు కానీ అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ మహేష్ అండ్ రాజమౌళి పక్క పక్కన నిలబెట్టింది. స్టేజ్ పైన రాజమౌళ మాట్లాడుతూ తడబడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. తను అనుకున్నది క్లియర్ గా చెప్పే రాజమౌళి… ఈ మధ్య సినిమా వేదికలపై పెద్దగా కనిపించట్లేదుగా సడన్ గా అంతమంది జనం కనిపించే సరికి మాట్లాడే అప్పుడు కాస్త తడబడినట్లు ఉన్నాడు. “డిసెంబర్ 1న అనిమల్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఒక టీజర్ చూడగానే సినిమా చూడాలి అనిపించేలా చేసింది అనిమల్ మూవీ మాత్రమే. అయితే ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అవుతుంది, నేను ఒకటి-రెండు ట్రావెలింగ్ లో ఉంటాను. అందుకే అనిమల్ సినిమాని మీ అందరి కన్నా ముందే డిసెంబర్ 31నే చూస్తున్నాను. మీరు కూడా సినిమా చూడండి” అని రాజమౌళి స్పీచ్ ముగించేశాడు. ఇక్కడ రాజమౌళి చెప్పాలి అనుకున్నది నవంబర్ 30న అయ్యి ఉండొచ్చు. డిసెంబర్ 1న అనిమల్ రిలీజ్ అవుతుంది కాబట్టి అంత కన్నా ముందు రోజు అంటే నవంబర్ 30న రాజమౌళి స్పెషల్ షో చూడనున్నాడు. మరి అనిమల్ సినిమాని చూడగానే రాజమౌళి సోషల్ మీడియాలో ఎలాంటి రివ్యూ ఇస్తాడు అనేది చూడాలి. ఒకవేళ రాజమౌళికి నచ్చి అనిమల్ గురించి ఒక్క పాజిటివ్ ట్వీట్ పడితే చాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురవడం ఖాయం.
ఇంకొన్ని గంటల్లో డైనో’సలార్’ ఎంట్రీ…
ప్రభాస్ పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సంవత్సరం, నెలలు, రోజుల నుంచి గంటల వరకు వచ్చింది సలార్ కౌంట్‌డౌన్. ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాలో సలార్ సునామి రాబోతోంది. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుండగా… డిసెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. దీంతో డైనోసర్ ఎంట్రీకి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉందని ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాగే సలార్ రన్ టైం గురించి కూడా చర్చ జరుగుతోంది. సలార్ ట్రైలర్ రన్ టైం రెండున్నర నుంచి మూడు నిమిషాల వరకు ఉండే ఛాన్స్ ఉంది. టీజర్‌లో కనీసం ప్రభాస్ మొహం కూడా చూపించలేదు ప్రశాంత్ నీల్. అలాగే కథపై కూడా ఎలాంటి క్లూ ఇవ్వలేదు. దీంతో సలార్ ట్రైలర్ బయటికొస్తే… కథతో పాటు… డార్లింగ్‌ను చూసి పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు రెబల్ ఫ్యాన్స్. ఇప్పటికే హోంబలే వారు సలార్ ట్రైలర్ పై అంచనాలు పెంచేస్తున్నారు. ‘సలార్ టీ షర్ట్స్’ను కూడా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. టీషర్టులతో పాటు హుడీలు, హార్మ్ స్లీవ్‌లను కూడా అమ్మకానికి పెట్టారు. అభిమానుల క్రేజ్‌ను ఇలా క్యాష్ చేసుకుంటున్నారు మేకర్స్. మరోవైపు ప్రశాంత్ నీల్ ట్రైలర్ కట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ ట్రైలర్‌లో ప్రభాస్‌ను ఎలా చూపించాలో అంతకుమించి చూపించబోతున్నాడు. డైనోసర్‌కు ఇచ్చే ఎలివేషన్ పీక్స్‌లో ఉంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. అందుకే… ఒక్కసారి ట్రైలర్ బయటికొస్తే డిజిటల్ రికార్డ్స్ అన్ని చెల్లా చెదురు అవడం గ్యారెంటీ. మరి ఇంత హైప్ ఇస్తున్న సలార్ ట్రైలర్… ఫ్యాన్స్‌కు ఎలాంటి విజువల్ ట్రీట్ ఇస్తుందో చూడాలి.
విలన్ చెప్పేశాడు… పవన్ సినిమా లేనట్టే!
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితేంటి? అనేది ఎటు తేలకుండా ఉంది. ప్రజెంట్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ జరుపుకుంటున్నాయి ఈ సినిమాలు కానీ హరిహర వీరమల్లు మాత్రం అదిగో, ఇదిగో అనడమే తప్ప… అసలు ముందుకు కదలడం లేదు. హరిహర వీరమల్లు షూటింగ్ ఆగిపోయి చాలా రోజులు అవుతోంది. పవన్ రాజకీయంగా బిజీగా ఉండడంతో వెనక్కి వెళ్తునే ఉంది. దీని తర్వాత మొదలైన సినిమాలు షూటింగులు జరుగుతున్నాయి, రిలీజ్ కూడా అవుతున్నాయి కానీ హరిహర వీరమల్లు అప్టేట్స్ మాత్రం బయటికి రావడం లేదు. అసలు ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అనే విషయంలో ఎవ్వరు క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ మధ్య హరిహర వీరమల్లు ఆగిపోయిందనే టాక్ కూడా నడిచింది. ఇక ఇప్పుడు ఇది నిజమేనని మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ యాక్టర్ బాబీడియోల్ నటిస్తున్నాడు. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతున్న యానిమల్ సినిమాలోను విలన్‌గా నటించాడు బాబీ డియోల్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ ఈవెంట్‌కు వచ్చిన బాబీ డియోల్.. హరిహర వీరమల్లు గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఓ తెలుగు సినిమా ఒప్పుకున్నాను కానీ సగం షూటింగ్ పూర్తయిన తర్వాత ఆగిపోయిందని తెలిపాడు. దీంతో విలన్ చెప్పేశాడు కాబట్టి… హరిహర వీరమల్లు దాదాపుగా ఆగిపోయినట్టేనని అంటున్నారు. మరి ఇప్పటికైనా డైరెక్టర్ క్రిష్ హరిహర వీరమల్లు పై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.