తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో 2290 మంది.. అత్యధికంగా ఎక్కడంటే
నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. తర్వాత రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఎల్బీనగర్ లో 48 మంది, గజ్వేల్ లో 44, కామారెడ్డి 39, మేడ్చల్ 39, నారాయణపేట 7, బాన్సువాడ 7 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా 48 మంది ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానానికి పోటీపడుతున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 608 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నారాయణపేట నియోజకవర్గానికి రాష్ట్రంలోనే అత్యల్పంగా ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అత్యధికంగా నామినేషన్లు దాఖలైన గజ్వేల్‌లో 70 మంది ఇండిపెండెంట్లు ఉపసంహరించుకోవడంతో 44 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డివిజన్ అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తులను కేటాయించింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఆయా పార్టీల ఎన్నికల గుర్తులను కేటాయించారు. రిజిస్టర్డ్ పార్టీలకు వారి అభ్యర్థన మేరకు ఉమ్మడి గుర్తును కేటాయించగా, స్వతంత్ర అభ్యర్థులకు వారి ఎంపిక మేరకు గుర్తులను కేటాయించారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది ఒకే గుర్తు కావాలని లాటరీ తగిలింది. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల క్రమం కూడా ఖరారైంది. దీంతో పాటు గురు, శుక్రవారాల్లో అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లను ముద్రించనున్నారు. ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో 16 మంది కంటే తక్కువ అభ్యర్థులు ఉన్నందున, ఒకే బ్యాలెట్ యూనిట్ ద్వారా ఓటింగ్ నిర్వహించబడుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో మూడు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఎన్నికల అధికారులు ఓటింగ్ స్లిప్పుల పంపిణీ ప్రారంభించారు. కొన్ని జిల్లాల్లో బుధవారం నుంచి, మరికొన్ని జిల్లాల్లో గురువారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 25లోగా ఓటింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తవుతుంది.
అన్నవరం దేవస్థానం ఈవో ఆకస్మిక బదిలీ
అన్నవరం దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్‌ను ఆకస్మికంగా బదిలీ చేశారు ఉన్నతాధికారులు.. చంద్రశేఖర్ ఆజాద్‌ను.. శ్రీకాళహస్తికి ఆకస్మికంగా బదిలీ చేశారు.. గత కొంతకాలంగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈవో ఆజాద్‌పై ఆరోపణలు ఉన్నాయి.. గత నెలలోనే పూర్తిస్థాయి ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు.. ఆజాద్ కు మంత్రి కొట్టు సత్యనారాయణ ఆశీస్సులు ఉన్నాయని చెబుతుంటారు.. కానీ, వివాదాస్పద నిర్ణయాలే ఆయన బదిలీకి కారణం అంటున్నారు.. మరోవైపు.. 2017లో ఆజాద్ పై ఏసీబీ కేసులు కూడా ఉన్నాయి.. కేసులు ఉన్న నిబంధనలకు విరుద్ధంగా పదోన్నత కల్పించారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్‌గా మారిపోయాయి.. ఉద్యోగులు , ఆలయం సమీపంలో పనిచేసే ప్రతి ఒక్కరూ.. కార్తీక మాసంలో కచ్చితంగా సత్య దీక్షలు స్వీకరించాలని ఆదేశాలు ఇచ్చారు చంద్రశేఖర్ ఆజాద్.. అయితే, దీనిపై కొందరు ఉద్యోగులు, సిబ్బంది నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినట్టు సమాచారం.. ఇక, చంద్రశేఖర్ ఆజాద్‌ను అన్నవరం నుంచి శ్రీకాళహస్తికి ఆకస్మికంగా బదిలీ చేయడంతో.. అన్నవరం దేవస్థానం ఈవోగా రామచంద్ర మోహన్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
విశాఖ రాజధాని పేరుతో టోకరా..! లక్షలు పెడితే కోట్లు వస్తాయంటూ మోసం..
‘కాదేదీ కవితకు అనర్హం’ అని చెప్పారు మహాకవి శ్రీశ్రీ.. కానీ, నేడు కాదేదీ అవినీతికి అనర్హం అంటున్నారు కేటుగాళ్లు.. మోసం చేయడానికి ఉన్న ఏ ఒక్క అవకాశం వదలడంలేదుగా.. అనే విధంగా.. ఇప్పుడు విశాఖ రాజధానిని కూడా వాడేస్తున్నారు.. విశాఖ ఏపీకి పరిపాలన రాజధానిగా మారబోతోన్న విషయం విదితమే.. త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.. దాని కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే, రాజధాని పేరుతో ఓ వ్యక్తికి రూ.7.80 లక్షలు టోకరా వేశారు కేటుగాళ్లు.. నిందితులు విశాఖ పరిసర ప్రాంత వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖ రాజధాని అవుతుందని లక్షల్లో పెట్టుబడి పెడితే.. కోట్ల రూపాయలు లాభం వస్తుందని ఆశ చూపించి ఓ వ్యక్తిని నిండా ముంచారు.. దీనిపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.. బాధితుడు కృష్ణా జిల్లా అవనిగడ్డ నివాసి, అతడి తండ్రి పోతురాజు పంచాయతీరాజ్ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు.. రిటైర్డ్ అయ్యాక ప్రభుత్వం నుంచి రూ. 25 లక్షలు అందాయి.. అయితే, రాజధాని ప్రాంతంలో మంచి స్థలం ఇప్పిస్తామని నకిలీ డాక్యుమెంట్లు చూపించి మోసం చేశారు కేటుగాళ్లు.. ఇప్పుడు లక్షలు పెడితే చాలు.. త్వరలోనే అది కోట్లు పలుకుతుందని.. నమ్మబలికారు.. వారి మాటల్లో పడిపోయిన బాధితులు.. రూ.7.80 లక్షలు ఇచ్చారు.. అయితే, తమకు ఇచ్చినవి నకిలీ డాక్యుమెంట్లు అని గుర్తించిన బాధితులు.. లబోధిమోమంటూ పోలీసులను ఆశ్రయించారు.. ఫిర్యాదు అందుకుని కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య సారూప్యత ఉంది..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఈ రోజు జరిగిన టీడీపీ – జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య సారూప్యత ఉందన్నారు.. నేను , పవన్ కల్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడుతాం అన్నారు. ప్రజా ఉద్యమంలో పాల్గొనడానికి నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు.. టీడీపీ-జనసేన కలయిక కొత్త శకానికి నాంది పలికుతుందన్న ఆయన.. రాష్ట్ర మొత్తం ఇన్ని సీట్లు అన్ని సీట్లు కాదు.. మొత్తంగా టీడీపీ , జనసేన గెలవాలని పిలుపునిచ్చారు.. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు బాలకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అని మండిపడ్డారు.. రాష్ట్రంలో పరిపాలన మొత్తం నేరస్తులు, హంతకుల చేతిలో ఉందన్నారు. ప్రజాస్వామ్య సంరక్షణ అందరూ కలిసి పోరాటం చేయాలి.. పరిపాలన ఇష్టరాజ్యంగా సాగుతుంది.. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేయడం లేదు.. ఒక హిందూపురంలో తప్ప అని.. ప్రతిపక్షంలో ఉండే అభివృద్ధి పనులు చేస్తున్నాం అని వెల్లడించారు. ఒక సిమెంట్ రోడ్డు గానీ, ఒక గొయ్యికి తట్టెడు మట్టడు కానీ పోయలేదు, తట్టేడు మట్టికాని తీయలేదని విమర్శించారు. పరిపాలన చేతకాక మూడు రాజధానులు అంటూ కాలయాపన చేస్తున్నారు.. పెయిడ్ ఆర్టిస్టులతో పారిశ్రామిక సదస్సులు నిర్వహించారు. కానీ, రాష్ట్రానికి ఒక పరిశ్రమ రాలేదు అని ఆరోపించారు. ఆరోగ్య ఆస్పుత్రులకు బకాయి పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి.. డబ్బులు ఇచ్చి సలహాదారులను పెట్టుకున్నాడు అని విమర్శించారు.. గడపగడపలో పార్టీలకు అతీతకంగా ప్రజలు నిలదీస్తున్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.
శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. కాసేపట్లో టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి భక్తులు అప్రమత్తం అయ్యే సమయం వచ్చింది.. ఎందుకంటే.. ఈ నెల 23వ తేదీ నుంచి అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యనుగ్రహ విశేష హోమాన్ని తలపెట్టింది టీటీడీ.. ఇందుకోసం కాసేపట్లో అంటే.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు టికెట్లు విడుదల చేయనుంది. టికెట్ ధర ఇప్పటికే రూ. 1000గా నిర్ణయించింది టీటీడీ.. ఆన్‌లైన్‌లో మధ్యా్హ్నం 2 గంటలకు అందుబాటులో ఉంచనుంది.. ఇక, అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం ఏర్పాట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు.. ఈ నెల 23 నుండి అలిపిరి వద్దనున్న గోశాలలో శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం నిర్వహిస్తామని తెలిపిన ఆయన.. టికెట్ ధర 1000 రూపాయలుగా నిర్ణయించామని.. ప్రతి రోజు వంద టికెట్లను కేటాయిస్తాం.. ఆన్‌లైన్‌లో 50 టికెట్లు ఇస్తే.. ఆఫ్‌లైన్‌లో మరో 50 టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. వెయ్యి రూపాయిలు ఇచ్చి హోమంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి దర్శన సౌకర్యం ఉండదు అని స్పష్టం చేశారు. హోమంలో దంపతులు ఇద్దరూ మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుందని.. టికెట్ తీసుకున్నాం కదా అని.. కుటుంబ సభ్యులు మొత్తం వస్తే కుదరదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.. ఇక, బుధవారం రోజు శ్రీవారిని 71,123 మంది భక్తులు దర్శించుకున్నారు.. అందులో 26,689 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.
ఇది క్షమించరాని నేరం.. ఫైర్ అయిన పురంధేశ్వరి
మరోసారి ఏపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి.. గుంటూరు పర్యటనలో ఉన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన 1600 కోట్ల రూపాయలతో మంగళగిరి ప్రాంతంలో ఎయిడ్స్ హాస్పిటల్ నిర్మాణం చేశారు.. పది రూపాయల ఖర్చుతో అత్యంత నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది.. కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అడ్డంగా ఉన్న విద్యుత్ తీగలు కూడా పక్కకు తొలగించలేదు, కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేకపోయింది.. పేదవాళ్లకు సేవ చేసే సంస్థకు, మౌలిక వసతులు కల్పించకపోవడం క్షమించరాని నేరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి రహిత, సమర్థవంత పాలన అందిస్తున్నారు.. బీజేపీ పాలనలో ఒక స్కాం కూడా లేదన్నారు పురంధేశ్వరి.. అణగారిన వర్గాల వారికి మేలు చేయాలన్న భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.. కరోనా లేక పోయిన పేదలకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమం అమలు చేస్తున్నాం.. పేదలకు భరోసా కల్పిస్తూ, ఇన్సూరెన్స్ పాలసీ, పేదలకు పక్కా గృహాలు అందిస్తున్నాం అన్నారు. ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది… ఏపీకి భారీ స్థాయిలో నిధులు కేటాయించారు.. ఏపీలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కేంద్రమే నిధులు ఇస్తుందన్నారు.
ఎస్పీకి మంత్రి మేరుగ ఫిర్యాదు.. కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం..!
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ బాపట్ల ఎస్పీకి ఫిర్యాదు చేశారు రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున.. బాపట్ల జిల్లాలో ఓ స్థల వివాదంలో గోవింద్ అనే వ్యక్తి కారును సీజ్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు చుండూరు పోలీసులు.. అయితే, ఈ కారు విడిచిపెట్టాలంటే కొంత సొమ్ము కావాలని పోలీసులు అడిగారని, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు గోవింద్.. ఈ నేపథ్యంలో కొంత సొమ్మును తీసుకుంటున్న కానిస్టేబుళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అంతటితో ఆగకుండా.. గోవింద్ అనే వ్యక్తి సంచలన కామెంట్లు చేశాడు.. తన దగ్గర లంచం డిమాండ్ చేసిన విషయంలో పోలీసులతో పాటు, మంత్రి నాగార్జున ప్రమేయం కూడా ఉందని, మంత్రి మేరుగ నాగార్జున డబ్బు తీసుకోమని చుండూరు ఎస్సై తో ఫోన్‌లో మాట్లాడటం, లౌడ్ స్పీకర్ లో తాను విన్నానంటూ రికార్డు చేసి.. ఓ వీడియో రిలీజ్ చేశాడు.. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఇదే వ్యవహారంపై ప్రస్తుతం మంత్రి మేరుగ నాగార్జున మండిపడుతున్నారు.. చుండూరులో జరిగిన ఏసీబీ కేసు విషయంలో, తనను ఏసీబీ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, దీని వెనక ఉన్న కుట్రను దర్యాప్తులో తేల్చాలంటూ పోలీసులను ఆశ్రయించారు.. బాపట్ల జిల్లా ఎస్పీని కలిసిన ఆయన.. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.. ఈ కేసులో ఉన్న కుట్ర కోణాన్ని తేల్చాలని పేర్కొన్నారు. ఇక, తనకు ఈ కేసు ఎటువంటి సంబంధం లేదని గోవింద్ అనే వ్యక్తి ఎందుకు ఆరోపణ చేస్తున్నాడు? దీని వెనక ఎవరు ఉన్నారు? అనే విషయాలను నిగ్గు తెల్చాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రి మేరుగ నాగార్జున.
చావడానికైనా చంపడానికైనా భయపడను.. రాజాసింగ్ వార్నింగ్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అలా చేస్తే వదిలే ప్రసక్తే లేదని సొంత పార్టీ నేతలకు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో మన పార్టీ వారు ఎవరు కోవర్ట్ లుగా పని చేశారో ప్రేమ్ సింగ్ రాథోడ్ నాకు చెప్పారని అన్నారు. ఈ సారి అలా చేస్తే వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారు. ఇక్కడి నుండి అక్కడకు సమాచారం ఇస్తే అక్కడ వారు ఇక్కడకి సమాచారం ఇస్తారు మరిచిపోకండి అంటూ హెచ్చరించారు. ఈ ఎన్నిక నాకు జీవన్మరణ సమస్య అని రాజాసింగ్ తెలిపారు. చావడానికి భయపడను చంపడానికి భయపడను అని రాజాసింగ్ సొంత పార్టీనేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సొంత వాళ్లే తన వ్యూహాలను ప్రత్యర్థులకు అప్పగిస్తున్నారని రాజ్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం మోసగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. 2018లో తనను ఓడించేందుకు ప్రయత్నించిన వారి జాబితా తన వద్ద ఉందని పేర్కొన్నారు. తన ప్రత్యర్థులతో ఎవరు టచ్‌లో ఉంటారో తనకు బాగా తెలుసని పేర్కొన్నాడు. తనకు ఎరవైనా నమ్మకద్రోహం చేయాలనుకుంటే ఆలోచించుకోండి అంటూ సీరియస్ అయ్యారు. నమ్మక ద్రోహం చేస్తే వారికి ఎన్నికల తర్వాత ప్రతీకారం తీర్చుకుంటా అన్నారు. ఇక రాజాసింగ్ గతంలో గోషామహల్‌సెగ్మెంట్ లో రిగ్గింగ్ జరిగిందని, ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఈవో వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ తో ప్రయాణం చేసి టీడీపీ, కాంగ్రెస్ లోకి మారారు..
ఖమ్మం జిల్లాలో హోం మంత్రి మహమ్మూద్ అలీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మైనారిటీలు బాగా అభివధ్ధి చెందారు.. కాంగ్రెస్ 50 ఏళ్లు పరిపాలించి కూడా మైనారిటీల విద్య కోసం నిధులు కేటాయించలేదు అని ఆయన ఆరోపించారు. విద్య పేదవారికి అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి మంచి విద్యను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని అని హోం మంత్రి మహమ్మూద్ అలీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అని హోం మంత్రి మహమ్మూద్ అలీ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క మత కల్లోలం కూడా జరుగలేదు.. కాంగ్రెస్- టీడీపీ ప్రభుత్వాలు మత వివాదాలపై ఎందుకు దృష్టి పెట్టలేదు అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం రంజాన్ పండగకు రెండు రోజులు సెలవు ఇస్తున్నారు అని మహమ్మూద్ అలీ వ్యాఖ్యనించారు.
రేపు మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.
రేపు మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇక్కడి పార్టీల భవిష్యత్తును ఓటర్లు తేల్చనున్నారు. ఎవరు గెలుస్తారన్న సర్వేలు చెప్పిన.. ఓటర్లు మాత్రం ఎవ్వరి వైపు మొగ్గుచూపుతారు అనేది తెలియాల్సి ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ పలు పార్టీలు ఎన్నికల పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యనే తీవ్రమైన పోటీ కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ లో బీఎస్పీ, సమాజ్ వాద్ పార్టీ, కమ్యూనిస్టులు కూడా బరిలో నిలిచారు. ఇక, మధ్యప్రదేశ్ లో 5.6 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 22.36 మంది తొలిసారి తమ ఓటు హక్కును వేయనున్నారు. ఇక్కడ మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని దాదాపు ఎన్నికల సర్వేలు వెల్లడించాయి. 20 ఏళ్ళుగా మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే ప్రస్తుతం బీజేపీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరికేత ఉన్నట్టు సమాచారం. దానికి తోడు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి హస్తం పార్టీ ఎమ్మెల్యేల్ని లాక్కోవడంతో కాషాయ పార్టీకి ప్రతికూలంగా మారింది. ఇక, ఈసారి ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ గట్టి పట్టుదలతో కనబడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లను నమ్ముకుని ఎన్నికల బరిలోకి దిగుతోంది. అయితే, ఎస్సీ, ఎస్టీలు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉంటున్నారు. కులాల సర్వే హామీతో ఓబీసీ ఓట్లు తమకు పడతాయని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది.
రైలు ప్రయాణికులు సంఖ్య 41 కోట్ల పెరిగింది.. రైల్వేశాఖ
మనలో చాలా మంది దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు రైలు మార్గాన్నే ఎన్నుకుంటారు. ఎందుకంటే బస్సు టికెట్ కంటే రైలు టికెట్ ధర తక్కువ.. అలానే అన్ని సౌకర్యాలు ఉంటాయి. అందుకే మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. నిత్యం ఎంతో మంది రైలులో ప్రయాణిస్తుంటారు. తాజాగా బుధవారం ఓ ప్రకటనలో పాల్గొన్న రైల్వేశాఖ.. రైలు ప్రయాణికుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 41 కోట్ల పెరిగినట్లు వెల్లడించింది. రైల్వేశాఖ వివరాల ప్రకారం.. ఏప్రిల్-అక్టోబరు మధ్య రైల్లో సాధారణ, స్లీపర్‌క్లాస్ లో ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య 38 కోట్లు కాగా ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారి సంఖ్య 3 కోట్ల మేర పెరిగింది. అనగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో సాధారణ, స్లీపర్ తరగతుల్లో 372 కోట్ల మంది, ఏసీ తరగతుల్లో 18.2 కోట్ల మంది ప్రయాణించినట్లు రైల్వేశాఖ తెలిపింది. కాగా మొత్తం ప్రయాణికుల్లో 95.3% మంది సాధారణ, స్లీపర్ క్లాస్‌లలో ప్రయాణించగా.. 4.7% మంది ఏసీ కోచ్‌లలో ప్రయాణం చేసినట్లు తెలిపింది. అయితే గత ఏడాది ఇదే సమయానికి సాధారణ తరగతుల్లో 334 కోట్లమంది.. ఏసీ తరగతుల్లో 15.1 కోట్లమంది రాకపోకలు సాగించారు. కాగా ఈ సంవత్సరం మొత్తం 41.1 కోట్ల మంది ప్రయాణికులు పెరగ్గా అందులో 92.5% మంది సాధారణ తరగతుల్లో ప్రయాణించిన వారే ఉన్నారు. అయితే కొవిడ్ ముందు వరకు 10,186 రైళ్లు ఉండేవి. ప్రస్తుతం ఆ రైళ్ల సంఖ్య 10,748 పెరిగింది. వాటిలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు 20.02% కాగా సబర్బన్ రైళ్లు 2.6% అలానే ప్యాసింజర్ రైళ్లు 2.1% పెరిగాయి.
జిన్ పింగ్ ఓ నియంత అంటూ జో బైడెన్ కామెంట్
శాన్‌ఫ్రాన్సిస్కోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. అయితే, ఆరేళ్ల తర్వాత జీ జిన్‌పింగ్ అమెరికాకు వెళ్లారు. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) నేతల సమావేశంలో కూడా జీ జిన్‌పింగ్ పాల్గొన్నారు. ఇరు దేశాలు కూడా తమ సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి, అక్రమ ఫెంటానిల్‌ను పరిష్కరించడానికి అంగీకరించాయి. అదే సమయంలో, సైనిక కమ్యూనికేషన్లను తిరిగి స్థాపించడానికి అమెరికా- చైనా అంగీకరించింది. ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, తైవాన్, చైనా గూఢచారి బెలూన్లు సహా పలు అంశాలపై జిన్ పింగ్- జో బైడెన్ మధ్య చర్చ జరిగింది. అయితే, షీ జిన్‌పింగ్ చైనాను ‘నియంత’గా నడుపుతున్నారని అమెరికా ఎప్పటినుంచో ఆరోపిస్తుంది. (జి జిన్‌పింగ్‌ను నియంత అని జో బిడెన్ పిలుస్తారు). చైనా నియంత పోకడలపై అమెరికా ఇప్పటికి అలాంటి కామెంట్స్ చేస్తునే ఉంది. ఇక, చైనా అధ్యక్షుడిని కలిసిన తర్వాత జో బిడెన్ మాట్లాడుతూ.. జిన్‌పింగ్ నియంతలా వ్యవహరిస్తున్నారని తాను ఇప్పటికీ భావిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
వామ్మో.. కొడుకు బ్లడ్ ఎక్కించుకుంటే తండ్రి వయసు తగ్గిందా..?
బాల్యం, యవ్వనం, వృద్దాప్యం పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ఈ మూడు దశలు కచ్చితంగా ఉంటాయి. అతిలోక సుందరి అయిన, అందాల చంద్రుడైనా ఎవరైన ఒక వయసు వచ్చాక యవ్వనంలో ఉన్న అందాన్ని కోల్పోవడం సహజం. అయితే ఆ అందాన్ని కాపాడుకోవడానికి మనలో చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే 4 పదుల వయసులో నవ యువకుడిలా కనపడేందుకు వివిధ రకాల మాత్రలు,ఇంజెక్షన్లు తీసుకుంటూ తనపై తానే ప్రయోగాలు చేసుకుంటూ వార్తల్లో నిలిచాడు టెక్ బిలియనీర్ బ్ర్యాన్ జాన్సన్ (45). అయితే అతను చేసిన ట్వీట్ ఆయన్ని మరోసారి వార్తల్లో నిలిపింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటా అనుకుంటున్నారా..? తన రక్తం ఎక్కించుకోవడం వల్ల తన తండ్రి వయసు తగ్గిందని ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. X (ట్విట్టర్)వేదికగా జాన్సన్ ఓ ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ లో సాధారణంగా మన వయసు పెరిగే పరిక్రియ యవ్వనంలో తక్కువగాను 40 ధాటిన తరువాత వేగంగాను ఉంటుంది. ఈ నేపథ్యంలో 70 ఏళ్ల వయసున్న మా తండ్రిపై ప్రయోగాన్ని చేసాను. నేను రోజు 30 మంది వైద్యుల పర్యవేక్షణలో వారు చెప్పిన ఆహారమే తింటూ, రకరకాల వ్యాయామాలు చేస్తూ అలానే మాత్రలు మింగుతూ, నిత్యం వైద్య పరీక్షలు చేయించుకుంటూ అత్యంత ఆరోగ్యంతో ఉన్నాను. దీనితో నా ప్లాస్మాను ఒక లీటరు మేర మా తండ్రికి ఎక్కించాను. ఇలా చేసిన తర్వాత మా తండ్రి శరీరంలో వయసు పెరుగుదల వేగం 46 ఏళ్ల వ్యక్తిలో వయసు పెరుగుదల వేగంతో సమానంగా ఉంది. ఈ ప్రయోగం చేసిన ఆరు నెలల తర్వాత కూడా ఆయనలో వయసు పెరుగుదల వేగం అదేస్థాయిలో ఉంది.
అప్పుడు తెలియదు.. రాత్రంతా మేల్కొని ఉన్నా: సత్య నాదెళ్ల
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బుధవారం ముంబై వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌ను కోట్లాది మంది వీక్షించారు. ఓ దశలో మ్యాచ్ రసవత్తరంగా సాగడంతో సెమీ ఫైనల్‌ను యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకించింది. బుధవారం మధ్యాహ్నం నుంచే మిలియన్ల మంది క్రికెట్ అభిమానులు టీవీ స్క్రీన్‌లకు అతుక్కుపోయారు. ఇందులో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.సియాటెల్‌లో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో కీలక ఉపన్యాసం చేసిన తర్వాత భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించినట్లు సత్య నాదెళ్ల తెలిపారు. మ్యాచ్ కోసం తాను రాత్రంతా మేల్కొని ఉన్నట్లు చెప్పారు. ‘వన్డే ప్రపంచకప్ 2023 సెమీ ఫైనల్ జరిగే రోజునే మేము ఇగ్నైట్ (కాన్ఫరెన్స్ పేరు) షెడ్యూల్ చేశామని తెలియదు. మ్యాచ్ కోసం నేను రాత్రంతా మేల్కొని ఉన్నాను. ఐదు నిమిషాల క్రితం మ్యాచ్ పూర్తయింది. భారత్ విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.
వైరల్ అవుతున్న హీరోయిన్ కాజోల్ న్యూడ్ వీడియో
హీరోయిన్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో షాక్ నుంచి తేరుకోకముందే మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ఫేక్ వీడియో దేశాన్ని ఆందోళనకు గురిచేసింది. కాజోల్ దుస్తులు మార్చుకున్న డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియాలో కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆగస్ట్ 2, 2023న నెటిజన్ సుహానా షేర్ చేసిన వీడియో ట్విటర్లో ఇప్పటికే లక్ష మంది కంటే ఎక్కువ మంది వీక్షించారు. వీడియోలో కాజోల్ ఒక గదిలో కొత్త దుస్తులను మార్చుకుంటూ కనిపించింది. కాజోల్ న్యూడ్ వీడియో పేరుతో గ్లామరస్‌క్యూబ్ ఖాతా ద్వారా 11 సెకన్ల నిడివి గల వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడింది. కాజోల్ బికినీ వీడియో పేరుతో 1మింట్ ఆర్ట్ ఖాతా ద్వారా యూట్యూబ్‌లో కూడా ఇలాంటి వీడియో షేర్ చేయబడింది. చాలా మంది యూజర్లు ఈ వీడియోను కాజోల్‌దే అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాజోల్ వీడియోగా సర్క్యులేట్ అవుతున్న వీడియో వాస్తవాన్ని పరిశీలించగా, అది డీప్ ఫేక్ అని స్పష్టమైంది. ఈ వీడియో కోసం వెతికితే వాస్తవ తనిఖీ వెబ్‌సైట్ BoomLive ప్రచురించిన వార్తా కథనం కనుగొనబడింది. BoomLive TikTokలో ఈ వీడియో అసలైనదాన్ని కనుగొంది. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ న్యూడ్ వీడియో ఫేక్ అని తేలిపోయింది. ఇటీవల సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు ప్రమాదకరంగా మారాయి.