మాచర్లలో సీఎం జగన్ పర్యటన.. వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
పల్నాడు రూపురేఖలను మార్చే దిశగా అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి పల్నాడు జిల్లా మాచర్లకు చేరుకున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు జిల్లా ఉన్నతాధకారులు, ప్రజా ప్రతినిధులు.. ఆ తర్వాత వరికిపూడిసెల ప్రాజెక్ట్ నమూనా పరిశీలించిన సీఎం జగన్.. అనంతరం రూ.340.26 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వరికిపూడిసెల ఎత్తి పోతల పథకం మొదటి విడత పనులను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.. ఆ తర్వాత చెన్నకేశవ కాలనీ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.. కాగా, పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెవరేర్చేందుకు పూనుకున్నారు సీఎం జగన్.. వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం’ కింద రూ.340.26 కోట్ల వ్యయంతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.. ఇప్పటికే ఈ ఎత్తిపోతల పథకానికి కీలకమైన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతోపాటు అన్ని అనుమతులు లభించడంతో.. ఈ రోజు పనులను ప్రారంభించారు.. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలోని 24,900 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.. అంతేకాకుండా 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది.. ఇక, ఏపీలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ కూడా ఇదే కావడం మరో విశేషంగా చెప్పుకోవాలి.
జగన్ నిర్ణయంతో 21 బీసీ కులాలకు తీవ్ర అన్యాయం.. బీసీల ద్రోహి జగన్ రెడ్డి..!
21 బీసీ కులాల భౌగోళిక పరిమితులు రద్దు చేసిన బీసీల ద్రోహి జగన్ రెడ్డి అంటూ సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఒక కులాన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేసే కుట్ర జరుగుతోంది.. బీసీలకు విద్య, వైద్యం, ఉపాధి అందకుండా చేయడమే జగన్ ఆలోచనగా ఉందని విమర్శించారు. జగన్ రెడ్డి బీసీల ద్రోహి అని మొదటి నుండి టీడీపీ చెబుతూనే ఉందన్న ఆయన.. రాష్ట్రంలోని 21 బీసీ కులాలకు భౌగోళిక పరిమితులు రద్దు చేయడమంటే వారి వెన్నెముక విరిచినట్లే అన్నారు. జీవనోపాధి కోసం పక్క ప్రాంతాలకు వెళ్లేవారి పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో 21 బీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని ఆరోపించారు అచ్చెన్నాయుడు.. కులాలకు ఉన్న పరిమితులు రద్దు చేయడం వల్ల విద్య, వైద్యం, రాజకీయంతో పాటు అన్ని విధాలా నష్టపోయే ప్రమాదం ఉందన్న ఆయన.. విద్యార్థులు రిజర్వేషన్లు కోల్పోతారు. విద్య పరంగా తీవ్రంగా నష్టపోతారు. ప్రస్తుతం ఉన్న విధానంతో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి..? ఒక కులాన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలు చేస్తుంది ఇందుకేనా.? ఇప్పటికే స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు రద్దు చేయడం వల్ల 16,800 పదవులను బీసీలు కోల్పోయారు. బీసీలకు పీజీ చదువులకు రియంబర్స్మెంట్ రద్దు చేశారు.. విదేశీ విద్య దూరం చేశారు. కార్పొరేషన్లు నాశనం చేసి బీసీలను రోడ్డున పడేసారు. 74 మంది బీసీలను హత్య చేశారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు భౌగోళిక పరిమితులు రద్దు చేసి మరో అన్యాయానికి ఒడిగట్టారు. ఇందుకేనా నా బీసీలు అంటూ వేదికలపై ఉపన్యాసాలు..? ఇస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకేనా కుల గణన అంటూ నాటకాలు? బీసీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న జగన్ రెడ్డికి రాజకీయంగా బీసీలే సమాధి కడతారు.. బీసీల సత్తా ఎలా ఉంటుందో వైసీపీకి చూపిస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
పురంధేశ్వరికి సాయిరెడ్డి కౌంటర్.. ‘జాతీయ నేత’గా ఉండి ‘జాతి నేత’గా ఎందుకు మారారు?
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. తీరికి దొరికితే చాలు ట్వీట్ పెడతాను అనే విధంగా.. వరుసగా ట్వీట్లతో పురంధేశ్వరిపై విరుచుకుపడుతున్నారు.. తాజాగా చేసిన ట్వీట్ల విషయానికి వెళ్తే.. ”చెల్లీ! చిన్నమ్మా పురందేశ్వరి! మీరు ‘జాతీయ నేత’గా ఉండి ‘జాతి నేత’గా ఎందుకు మారారు? అంటూ ప్రశ్నించారు సాయిరెడ్డి.. మీ సొంత ఊరు ప్రకాశం జిల్లా కారంచేడులో మీరు ఇప్పుడున్న పార్టీ బీజేపీ నుండి గత ఎన్నికల్లో సర్పంచ్ లేదా మీ సొంత మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఎందుకు పోటీ పెట్టలేదు? అప్పటికి మీరు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కదా! రాష్ట్రంలో మీ పార్టీలో చిన్న చిన్న నేతలు కూడా నిజాయతీగా అన్ని చోట్ల పోటీ చేశారు. మరి మీరెందుకు ఆ పని చేయలేదు? అంటూ నిలదీశారు. మీ కార్యకర్తలు ఈ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెబుతారు? అంటూ పురంధేశ్వరిని నిలదీశారు సాయిరెడ్డి.. కొంపదీసి ‘మా బావ కళ్లల్లో ఆనందం కోసం’ అని నిజం చెబుతారా? అని ఎద్దేవా చేశారు. ఇదే కదా మీకు బీజేపీ పట్ల ఉన్న చిత్తశుద్ధి! వెనకటికి ఒకామె.. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అన్నదట! అంటూ పురందేశ్వరిపై సెటైర్లు వేశారు. ఇక, మరో ట్వీట్‌లోకి వెళ్తే.. ”కారంచేడు 145వ పోలింగ్ బూత్ లో బీజీపీకి పడిన 6 ఓట్లలో అసలు పురంధేశ్వరి ఓటు ఉందా? మీ సొంత బీజేపీ అభ్యర్థికి రాష్ట్ర అధ్యక్షులు ఓటు వేయలేదా? మీ బావ పక్షాన పక్షపాతివై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీకు కంటగింపు అయిపోయింది. బీజేపీ లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలో సిద్ధాంతాలు గాలికి వదిలేసే మీరు ఎన్ని రోజులు ఉంటారు? గట్టిగా మాట్లాడితే మా ఓటు అక్కడ లేదు, వైజాగ్ లోనో రాజంపేటలోనో ఉండిపోయింది అని బొంకుతారు మళ్లీ..! అంటూ మరో ట్వీట్లో ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక, తన ట్వీట్లకు కారంచేడులో వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లకు సంబంధించిన లిస్ట్‌ను కూడా జత చేశాడు విజయసాయిరెడ్డి.
వైసీపీ సింగిల్‌గానే పోటీచేస్తుంది.. మళ్లీ జగనే సీఎం..
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.. సార్వత్రిక ఎన్నికలతో పాటు.. ఏపీ అసెంబ్లీకి కూడా ఒకేసారి పోల్ నిర్వహించనున్నారు.. అయితే, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరోసారి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. గతంలో ఏ ప్రభుత్వం అందించిన విధంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని అన్నారు. టీడీపీ-జనసేన కలిసికట్టుగా వచ్చినా.. వైసీపీకి ఢోకా లేదన్నారు.. టీడీపీ-జనసేన ఎన్నికల్లో గెలవడానికి వైఎస్ జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణ చేస్తున్నాయని మండిపడ్డారు.. రాజమండ్రిలో 50 లక్షల రూపాయలు వ్యయంతో చేపడుతున్న జైళ్ల శాఖ ప్రాంతీయ శిక్షణ కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆమె.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.. ఖైదీలను అర్థం చేసుకునే విధంగా జైలు సిబ్బందికి శిక్షణ ఉంటుందని అన్నారు.
బురదజల్లే పనిలో జనసేన.. వారి విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు..!
జనసేన నాయకుల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పని లేదని కొట్టిపారేశారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలపై, కార్యక్రమాలపై బురద జల్లే పనిలో జనసేన ఉంది.. వారి విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.. ఇక, సాధికారిక బస్సు యాత్ర తొలి విడత విజయవంతం అయ్యింది.. 175 నియోజక వర్గాల్లో ఈ రోజు నుంచి నవంబర్ 30వ తేదీ వరకు రెండో విడత బస్సు యాత్రలు సాగుతాయన్నారు.. ఈ రోజు నరసన్నపేట నుంచి రెండో విడత యాత్ర మొదలవుతుందని వెల్లడించారు. నాలుగున్నర ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్తాం.. 70 శాతం పథకాలు, బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వం అందించిందన్నారు. మరోవైపు ఈ నెల 23వ తేదీన సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పర్యటిస్తారని వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి.. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర తొలి దశలో పెద్ద ఎత్తున ప్రజలు నీరాజనం పలికారు. సామాజిక సాధికారిక యాత్రలో నాడు నేడు పనులను పరిశీలిస్తున్నాం.. ఎక్కడైనా లోపాలుంటే సరి చేయాలని చెబుతున్నాం. కానీ, నాడు-నేడుపై బురద జల్లే పనిలో జనసేన పార్టీ ఉంది.. జనసేన నాయకుల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పని లేదన్నారు.. ఇక, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. పొత్తులు పెట్టుకున్నా.. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం.. మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సేవలు కొనసాగిస్తారు.. సంక్షేమ పథకాలను అందిస్తారని తెలిపారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.
ఓటర్ల టైం.. పిలవని పేరంటానికైనా నాయకులు పోవాల్సిందే..
పెళ్లిళ్లంటే హడావుడి మామూలుగా ఉండదు. వాళ్లకు ఉన్న స్థాయిని బట్టి పెళ్లికి పెద్దవాళ్లను పిలిచి గ్రాండ్ గా పెళ్లిళ్లు చేస్తుంటారు. అదే రాజకీయ నాయకులు వస్తే ఆ పెళ్లిలో సందడే వేరబ్బా.. మా పెళ్లికి ఫలానా రాజకీయ నాయకుడు వచ్చాడంటూ కొన్నేళ్ల పాటు గొప్పలు చెప్పుకుంటారు. కానీ.. ప్రస్తుతం ట్రెండ్ మారింది. పెళ్లిళ్లకు నాయకులు వెళ్లడం తగ్గిపోయింది. తెలిసిన వాళ్లు , బంధువులు పిలిచిన పేరంటాలకు, పెళ్లిళ్లకు నాయకులు వెళ్లడం మానేశారు. కానీ.. ఇప్పుడు ఎలక్షన్స్ సీజన్ ఓటరే ఇప్పుడు వారికి బాస్ అయిపోయాడు. తనకు ఓటు వేయాలంటే నాయకుడు ఓటరు దగ్గరకు వెళ్లాల్సిందే. పిలవని పేరంటమైనా హాజరవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. ఇంటింటికి వెళ్లి ఓటువేయాలని అడగాల్సిన పరిస్థితి ఏమోగానీ పేరంటమైనా.. పెళ్లైనా నాయకులు హాజరు అయితే అక్కడే వందల మందిని ఒకే సారి కలిసే వీలు కూడా ఉంటుంది. ఇన్ని రోజులు పేరంటాలకు రావాలని, పెళ్లిళ్లకు హాజరు కావాలని నాయకుల ఇంటికి వెళ్లి పిలిచినా బిజీ బిజీగా గడిపిన నాయకులు ఇప్పుడు ఓటు కోసం తగ్గాల్సిన పరిస్థితి దాపురిచింది. దీంతో అటు సభలు, సమావేశాల్లో పాల్గొంటూ ప్రచారం చేసుకుంటూనే.. ఇటు పెళ్లిళ్లు, పేరంటాలకు కూడా హాజరవుతున్నారు నాయకులు. అయితే మరోవైపు ఎన్నికల వేళ పెళ్లిళ్ల రద్దీతో రాజకీయ పార్టీలను కలవరపెడుతోంది. వివాహానికి కార్తీకమాసం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ఈ నెల 16, 19, 21, 22, 23, 24, 26, 29 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తరువాత డిసెంబర్ నెలాఖరులో ఉంటాయి. ఈ తేదీల్లో జంటనగరాల్లో 50 వేల నుంచి లక్షకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 30న శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. అంటే ఓటు వేయడానికి 10 రోజుల ముందు వివాహ వేడుకలు ప్రారంభమవుతాయి. అభ్యర్థుల ప్రచారం, పెళ్లిళ్లు ఒకేసారి జరగనుండటంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు, నేతలు మండపాలలో సందడి చేయనున్నారు. అంతకుముందు ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి వార్తాపత్రికలు అందజేసి పెళ్లికి రావాలని పదే పదే అడిగేవారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున ఆహ్వానం అందని అభ్యర్థులు కూడా కళ్యాణ మండపాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నెల 29న జరిగే వివాహాలు ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే పెళ్లి కోసం దూర ప్రాంతాలకు వెళ్లే వారిని ఎలా ఆకర్షించాలనేది అభ్యర్థులకు ప్రశ్నగా మారింది. పెళ్లయిన మరుసటి రోజు తీసుకువస్తేనే ఓటు వేయగలరు. కావున ద్వితీయ శ్రేణి నాయకులు వాటిపై దృష్టి సారించి జాగ్రత్తగా ఉండాలని పోటీలో పాల్గొనే అభ్యర్థులు సూచిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా పోలింగ్ రోజు వచ్చేలా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదైతేనేం పెళ్లిళ్లలకు అయితే రాజకీయ నాయకులు హాజరు అయ్యేందుకు సిద్దమయ్యారు కానీ.. మరి ఓటరును మళ్లీ ఇక్కడకు రప్పించి ఎలా ఓటు వేయించాలనే ఆలోచనలో పడ్డారు.
ఫామ్ హౌస్ కే పరిమితమైన వ్యక్తికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి.
ఫామ్ హౌస్ కే పరిమితమైన వ్యక్తికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్‌తో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని అన్నారు. కానీ కేసీఆర్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ఉందని తెలిపారు. రాష్ట్రం సంపదను పదికోక్కుల్లా దోచుకొని కాంగ్రెస్ పార్టీ ని విమర్శించడానికి సిగ్గుండాలని తెలిపారు. ప్రజలపక్షాన పోరాడేందుకే రాష్ట్రలో తిరిగానని అన్నారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన వ్యక్తికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించారు. సంపద కలిగిన రాష్ట్ర కనుక 6 గ్యారంటీలు ప్రకటించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజల కోసం అలోచన చేసే.. పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ,అభివృద్ధి పథకాలు తిరిగి అమలు చేస్తామన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎర్రుపాలెం మండలంలో నిధులు పారించామన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో గెలవడం ఖాయమని తెలిపారు. ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ తెలంగాణ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీపై రాజస్థాన్ సీఎం ఆగ్రహం
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సుక్జిందర్ సింగ్ రంధావా సమక్షంలో రాజస్థాన్ మైనారిటీ మోర్చా, హజ్ కమిటీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అమీన్ పఠాన్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ‘మూర్ఖుల ప్రభువు’ ప్రకటనపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఇలాంటి విమర్శలు ప్రధానిగా గౌరవప్రదమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడితే మంచిది కాదు.. ఎంత తక్కువ విమర్శలు చేస్తే అంత మంచిది అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు పర్యటనలు చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాంతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
అంతా తూచ్ అలాంటిదేమీ లేదు.. పరీక్షలలో హిజాబ్ నిషేధంపై రచ్చ
కర్ణాటకలో పరీక్షల సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు డ్రెస్ కోడ్ జారీ చేసింది. అందులో అన్ని రకాల హిజాబ్‌లను నిషేధించారు. కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ (కేఈఏ) ఈ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే రాజకీయ వర్గాల్లో పెను దుమారం చెలరేగింది. ఈ నిర్ణయంపై ఒమర్ అబ్దుల్లా నుంచి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వరకు పలువురు నేతలు కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.పెరుగుతున్న వివాదం చూసి కర్ణాటక ప్రభుత్వం పరీక్షలో హిజాబ్‌పై నిషేధం లేదని ప్రకటన విడుదల చేసింది. బోర్డు, కార్పొరేషన్ పరీక్షల్లో హిజాబ్‌పై నిషేధం లేదని కర్ణాటక ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్ తెలిపారు. ఒవైసీ, అబ్దుల్లాలు గళం లేవనెత్తిన తర్వాత సుధాకర్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. పరీక్ష గదిలో బ్లూటూత్, ఇతర పరికరాలను ఉపయోగించడం ద్వారా మోసం జరగకుండా నిరోధించడానికి తలపై క్యాప్ లేదా ఏదైనా ఇతర దుస్తులు ధరించడం నిషేధించబడిన డ్రెస్ కోడ్‌ను జారీ చేసినట్లు పరీక్షల మండలి (కెఇఎ) తెలిపింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షల సమయంలో హిజాబ్‌ను నిషేధించిందని, రాష్ట్రంలో గత భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం విధించిన నిషేధాన్ని రద్దు చేయడానికి చర్యలు తీసుకోలేదని ఒవైసీ విమర్శించారు.
జైల్లో నిషేధిత వస్తువులను వాడితే మూడేళ్లు శిక్ష..
తప్పు చేసిన వ్యక్తులు జైల్లో శిక్ష అనుభవిస్తుంటారు. అయితే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో పాటుగా అక్కడ విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి, అలానే ఖైదీలను చూడడానికి వచ్చే సందర్శకులకు కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. అయితే ఇక పై ఎవరైనా ఆ నిబంధనలను ఉల్లంగిస్తే నిబంధలను ఉల్లగించిన వాళ్లకు 3 సంవత్సరాలు శిక్ష విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వివరాల్లోకి వెళ్తే.. జైల్లో ఉన్న ఖైదీలు, సందర్శకులు, చివరికి జైల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు అయినా చట్ట విరుద్ధంగా జైల్లో మొబైల్ ఫోనులు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించిన, అలానే నిషేధిత వస్తువులను ఆధీనం లో ఉన్నచుకున్న, ఉపయోగించేందుకు ప్రయత్నించిన, జైల్లో ఉన్న వాటిని తొలిగించిన.. జైల్లో ఉన్న ఖైదీలకు నిషేధిత వస్తువులను సరఫరా చెయ్యాలని చూసిన.. చట్ట విరుద్ధమైన పనులను చేసేందుకు ప్రయత్నించినా 3 సంవత్సరాల జైలు శిక్ష తో పాటుగా 25 వేల జరిమానాను విధించేందుకు ప్రతిపాదనలను రూపొందించింది.
గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం.. సౌదీ అరేబియా మిలియన్ డాలర్ల సాయం
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కారణంగా గాజాలో విధ్వంసం నెలకొంది. ఇజ్రాయిల్ నిరంతర దాడుల కారణంగా గాజా శ్మశాన వాటికగా మారుతోంది. అనేక నగరాల పేర్లు, జాడలు చెరిగిపోయాయి. ప్రజల ఇళ్లు చెత్తకుప్పలుగా మారాయి. ఎంత మంది నిరాశ్రయులయ్యారో తెలియని పరిస్థితి నెలకొంది. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా, గాజా ప్రజలకు సౌదీ అరేబియా ఆపన్న హస్తం అందించింది. సౌదీ ప్రెస్ ఏజెన్సీ, కింగ్ సల్మాన్ గాజాకు ఐక్యరాజ్యసమితి సహాయ ప్రణాళిక మొదటి దశ కింద సెంటర్ ఫర్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ (కెఎస్‌ఆర్‌రిలీఫ్) తరపున 15 మిలియన్ డాలర్లు ఇచ్చారని తెలిపింది. పాలస్తీనా శరణార్థుల కోసం మానవతా ప్రతిస్పందన ప్రణాళిక కింద ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ప్రారంభించింది. దీని కింద శరణార్థులకు ఆహార పదార్థాలు, మందులు, నివసించేందుకు ఇళ్లు వంటి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తారు. రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం ద్వారా మానవతా ప్రతిస్పందన ప్రణాళిక అమలు చేయబడుతోంది. తద్వారా గాజా ప్రజలకు సహాయం చేయవచ్చు. దీంతో వారి పరిస్థితులు మెరుగుపడతాయి. కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో ఈ నెలలో ఈ పథకం ప్రారంభించబడింది. ఇప్పటివరకు, పాలస్తీనియన్లకు సహాయం చేయడానికి రాజ్యం 131 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులను సేకరించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటి వరకు 11,000 మందికి పైగా మరణించారు. ప్రజలకు ఆహారం, నీరు, విద్యుత్ వంటి అన్ని కనీస సౌకర్యాలు లేకుండా చేశారు. దీని కారణంగా ప్రజలు అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఆకలితో, దాహంతో ప్రాణాల కోసం పోరాడుతుంటే, అమాయక పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. సౌదీతో సహా అనేక దేశాలు ఈ ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. అంతకుముందు, భారతదేశం కూడా పాలస్తీనియన్లకు సహాయక సామగ్రిని పంపింది.
భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్.. విరాట్ కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్!
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో 9 మ్యాచ్‌ల్లో గెలిచి ఊపుమీదున్న భారత్.. సెమీస్‌లోనూ అదే జోరును కొనసాగించి ఫైనల్ చేరాలని చూస్తోంది. మరోవైపు మరోసారి టీమిండియాను సెమీస్‌లో ఓడించి ఫైనల్ చేరాలని కివీస్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో సెమీస్ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయనున్నాడా? అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు కారణం కోహ్లీకి సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడమే. భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లో విరాట్ కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు. మంగళవారం వాంఖెడే స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ సమయంలో కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ సాధన చేశాడు. స్విచ్ షాట్లను ట్రై చేశాడు. అంతేకాదు రివర్స్ స్వీప్ షాట్లు కూడా ఆడాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడా? అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్విచ్ షాట్స్ ట్రై చేస్తాడేమో అని మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు. సెమీస్ రికార్డ్స్ అస్సలు బాలేవు, ప్రయోగాలు చెయ్యొద్దంటూ ఇంకొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
ఆరు ఫైట్స్… అందులో ఒకటి అండర్ వాటర్ ఎపిసోడ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య… సౌత్ మార్కెట్ ని సొంతం చేసుకోని ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల సూర్య, సిరుత్తే శివ దర్శకత్వంలో ‘కంగువ’ సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్ వార్ యాక్షన్ డ్రామాగా కంగువ మూవీ పది భాషల్లో, 2D-3D వెర్షన్స్ లో, ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానుంది. 2024 సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ మూవీపై కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ మరింత పెంచుతున్నారు మేకర్స్. ఈ భారీ బడ్జట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ చెన్నైలో జరుగుతోంది. సూర్య, బాబీ డియోల్, దిశా పఠాని… ఇతర కాస్ట్ పైన ఒక హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కిస్తున్నాడు శివ. ఇదిలా ఉంటే కంగువా సినిమాలో మొత్తం ఆరు ఫైట్స్ ఉంటాయని సమాచారం. అండర్ వాటర్ ఫైట్, ఫారెస్ట్ ఫైట్, ఫ్లైట్ లో ఫైట్, బీచ్ ఫైట్, బోట్ ఫైట్, జిమ్ ఫైట్… ఇలా మొత్తం ఆరు అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ కంగువ సినిమాలో ఉంటాయట. ఈ ఫైట్స్ లో అండర్ వాటర్ లో షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటుందట. ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఆ సమయంలో సినిమాలు మానేద్దాం అనుకున్నాను.. కానీ
రీ ఎంట్రీ సందర్భంగా సోషల్ మీడియా ఛానల్స్ కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది స్వాతి. ఆ ఇంటర్వ్యూలలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటుంది. రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన కొత్తలో తనకు ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.డేంజర్ సినిమా చేస్తున్న సమయం లో అల్లరి నరేష్ గారు నాతో కంగారు గా నీకు సంబంధించి ఎదో యం.యం.ఎస్ వచ్చింది చూసావా అని ఒక వీడియో ను నాకు చూపించాడు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు మనుషుల మీద విరక్తి కలిగింది. ఛీ ఛీ ఇండస్ట్రీ అంటే ఇంత వరస్ట్ గా ఉంటుందా అని బాధపడ్డానుఅంతే కాదు అది చూసి సినిమాలు అప్పటికప్పుడే మానేద్దాం అనుకున్నాను.. కానీ నా స్నేహితులు ధైర్యం చెప్పడం వల్ల మళ్ళీ సినిమాలను కొనసాగించాను’ అంటూ చెప్పుకోచ్చింది కలర్స్ స్వాతి. ప్రస్తుంతం సోషల్ మీడియా లో ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.