చంద్రబాబు ఫస్ట్, పవన్ సెకండ్.. హరిరామ జోగయ్య ఆస్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో.. వరుసగా లేఖలు విడుదల చేస్తూ వస్తున్నారు మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య.. కొన్ని సందర్భాల్లో పవన్ కల్యాణ్ అడుగులను తప్పుబట్టిన ఆయన.. మరోసారి ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులతో పాటు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలని కూడా పిలుపునిస్తున్నారు. ఇక, తాజాగా జనసేన, తెలుగు దేశం పార్టీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందా? అంటూ చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ విడుదల చేశారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీలు ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి.. కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలు హోరెత్తిస్తుంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీలు చతికిలబడ్డాయని విమర్శించారు.. ఇక, ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 100, జనసేన 16, బీజేపీ 5 స్థానాల్లో నెగ్గించుకోవటం ఖాయంగా కనబడుతుందన్నారు.. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు మొదటి స్థానంలో పవన్ కల్యాణ్ రెండో స్థానంలో అధికార హోదాలో ఉంటారని తన లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య..
ఎన్నికల ప్రచారం.. మాజీ మంత్రి భార్య తీవ్ర ఆవేదన..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది.. పార్టీల అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తుంటే.. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.. ప్రతీ గ్రామాన్ని, ప్రతీ గడపను టచ్ చేస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.. ఇంకా కొన్ని చోట్ల అభ్యర్థుల తరపున వారి కుటుంబ సభ్యులు అంటే.. అభ్యర్థి భార్య, కొడుకులు, కూతుళ్లు, కోడళ్లు, అల్లుళ్లు, తమ్ముళ్లు, అన్నయ్యలు.. ఇలా చాలా మంది ప్రచారానికి దిగుతున్నారు.. అయితే, పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎన్నికల ప్రచారంలో భాగంగా తీవ్ర ఆవేదనకు గురయ్యారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకట కుమారి.. తనపై, తన భర్తపై అసత్య ప్రచారం చేసి, 2019లో ఓడించారని, 2024లో ప్రజలు నిజం తెలుసుకొని ఓటు వేయాలని మహిళలను కొంగు పట్టి అభ్యర్థించారు.. 2019 నుండి నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోయిందని, ఒక్క అవకాశం అంటూ గత ఎన్నికల్లో గెలిచినవారు నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరంగా నిలిపారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రతి మహిళను, ప్రతి తల్లిని అడుగుతున్నా, వేడుకుంటున్నా , చిలకలూరిపేట అభివృద్ధి జరగాలంటే, తన భర్త పుల్లారావును గెలిపించాలి అంటూ కొంగు పట్టి ఓట్లను అడిగారు ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకట కుమారి.
రంగంలోకి మెగాస్టార్.. పవన్‌ను గెలిపించండి..
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.. అయితే, మెగా ఫ్యామిలీ హీరోలు, బుల్లితెర, వెండితెర నటీనటులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.. ఇక, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడి కోసం రంగంలోకి దిగారు.. తన గురించి కంటే.. జనం గురించే ఎక్కవగా ఆలోచించే తన తమ్ముడు పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు.. తన వీడియోను ట్విట్టర్ (ఎక్స్) ద్వారా వదిలారు చిరంజీవి.. జనమే జయం అని నమ్మే జనసేనానిని గెలిపించండి.. అమ్మ కడుపున ఆఖరివాడు.. అందరికి మేలు కోరే విషయంలో మొదటి వాడు.. నా తమ్ముడు పవన్ కల్యాణ్.. తన గురించి కంటే.. జనం గురించే ఎక్కువ ఆలోచిస్తాడు అని పేర్కొన్నారు చిరంజీవి.. అధికారంలోకి రాక ముందే తన సొంత సొమ్ముతో కౌలు రైతులకు సాయం చేశాడు.. జవాన్లకు అండగా నిలిచాడని గుర్తుచేసిన ఆయన.. పవన్ లాంటి నాయకుడే కావాలని సూచించారు. ఇక, పవన్ సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడు.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాడని తెలిపారు చిరంజీవి.. పవన్ ఎంతో మందితో మాటలు పడుతుంటే మా అమ్మ బాధ పడుతోంది.. అన్నగా నేనూ బాధ పడుతున్నాను. ఎంతో మంది తల్లుల గురించి పవన్ పోరాటం చేస్తున్నాడు.. బాధ పడొద్దని మా అమ్మకు చెప్పాను అన్నారు..
ఏకపక్షంగా ఈసీ వ్యవహారం.. మేం ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలేవి..?
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ దూకుడు చూపిస్తోంది.. డీజీపీ సహా పోలీసు విభాగంలోని కీలక అధికారులను బదిలీ చేస్తోంది.. అయితే, ఈ పరిణామాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మల్లాది విష్ణు.. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.. ఇక, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పై ఒత్తిడి ఉందన్న ఆయన.. మేం ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు లేవు అని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ కంప్లైంట్ ఇస్తే ప్రతిపక్ష నేతపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుందన్నారు. ఇక, నిబద్ధతతో పనిచేసే అధికారులను ఎలక్షన్ కమిషన్ బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు సీఎస్ ను బదిలీ చేయించేందుకు ప్రతిపక్షాలు కంప్లైంట్లు ఇస్తున్నాయన్న ఆయన.. 2019లో పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు ఎందుకు పాత పథకంగా కనిపించలేదు? అని నిలదీశారు. విద్యార్ధులకు, రైతులకు సకాలంలో నిధులు అందనివ్వకుండా పథకాలు నిలిపేశారని మండిపడ్డారు. డీబీటీ ద్వారా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని పథకాలనూ ప్రజలకు నేరుగా అందించిందని గుర్తుచేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.
చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ రద్దు.. మళ్లీ పోలింగ్ ఎప్పుడంటే..?
చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రద్దు అయిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌పై కీలక ప్రకటన విడుదల చేశారు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్.. చిలకలూరిపేట నియోజకవర్గంలో రద్దయిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను ఈ నెల 8, 9 తేదీల్లో జరిపేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు.. 5వ తేదీ గణపవరం జడ్పీ పాఠశాలలో, ఎన్నికల్లో పాల్గొన్న పోస్టల్ బ్యాలెట్ ఓటర్లందరూ తిరిగి ఈనెల 8, 9 తేదీల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.. అయితే, అధికారుల పొరపాటుతో పోస్టల్ బ్యాలెట్ లో రీపోలింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.. పోస్టల్ బ్యాలెట్ కు బదులు ఈవీఎం బ్యాలెట్ ను పొరపాటున ఇచ్చారని వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ఆర్‌వోకు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్.
మే 13, జూన్ 4న వేతనంతో కూడిన సెలవులు.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 13న ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. ఎన్నికల ఫలితాల తేదీ అయిన జూన్ 4న వేతనంతో కూడిన సెలవును కూడా మంజూరు చేసింది. కాగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వేతనంతో కూడిన సెలవులను అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఎన్నికల అధికారులు సెలవులు ఇచ్చారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13, 2024న ఒకే దశలో జరుగుతాయి. మొత్తం ఏడు దశల్లోని ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. రాష్ట్రంలో వేడిగాలుల కారణంగా 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గంట వరకు పొడిగించబడింది.
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు దగ్గర పడింది..
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు దగ్గర పడిందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్ లో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఆంధ్రాలో చంద్రబాబు గెలిస్తే తన శిష్యుడితో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేస్తాడన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు దగ్గర పడిందన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తాడన్నారు. బీజేపీ ఆలోచనలు కూడా హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్నట్టుగానే సాగుతున్నాయన్నారు. పార్లమెంట్ లో గళం విప్పాలంటే నేను గెలువాలన్నారు. బండి సంజయ్ బీజేపీ కుర్చోమంటే కూర్చుంటూ.. లెమ్మంటే లేచే వ్యక్తి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రభుత్వం వచ్చిందన్నారు. ఇది కొత్త ప్రభుత్వం కాదన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతుందన్నారు. రేవంత్ రెడ్డి గెలిస్తే పథకాలు అమలు చేస్తానన్నాడు. మళ్లీ గెలిస్తే అమలు చేయడన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకే పడుతుందన్నారు. అభివృద్ధి కావాల్నా విధ్వంసం కావాలా ప్రజలు తేల్చుకోవాలన్నారు. నేను గెలిచిన తరువాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నారు. నేను చెప్పింది చేసి చూపించానని తెలిపారు. కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ లు అని మండిపడ్డారు. అంతేకాకుండా.. బీఆర్‌ఎస్ పాలనలో కరెంటు ఎందుకు పోలేదు.. ఇప్పుడు ఎందుకు పోతున్నదని ప్రశ్నించారు. దీంతో ఇండ్లలో మళ్లీ ఇన్వర్టర్లు కొంటున్నారని అన్నారు.
తమ్ముడిని డాక్టర్ చేయాలని నీట్ పరీక్ష రాసిన ఎంబీబీఎస్ విద్యార్థి.. కానీ?
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసి అడ్డంగా దొరికిపోయిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ యూజీపరీక్షలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన నీట్ పరీక్షలో రాజస్థాన్‌లో ఓ విద్యార్ధికి బదులు మరొక విద్యార్ధి పరీక్షకు హాజరై పట్టుబడ్డాడు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ్ముడు నీట్ పరీక్ష రాయాల్సి ఉండగా.. అతని అన్నయ్య హాజరయ్యాడు. అసలు అభ్యర్ధికి బదులు డూప్లికేట్ అభ్యర్థి పరీక్షకు హాజరైనట్లు పరీక్ష నిర్వహణ అధికారులు గుర్చింటి. వెంటనే పోలీసులను పిలిపించగా.. సోదరులిద్దరినీ అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. నీట్ యూజీ పరీక్ష కోసం బార్మర్‌లో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన అంత్రిదేవి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చోటుచేసుకుంది. అతడి హాల్ టికెట్, ధ్రువపత్రాలను తనిఖీ చేయగా.. పరీక్ష రాసే అభ్యర్థి వేరని తేలింది. దీంతో ఇన్విజిలేటర్ పోలీసులకు ఫోన్ చేసి నిందితుడిని వారికి అప్పగించాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అతడిని అదుపులోకి విచారించగా.. నిజం అంగీకరించాడు. తన పేరు భగీరథ్ రామ్ అని.. తన తమ్ముడు గోపాల్ రామ్ స్థానంలో డమ్మీ అభ్యర్థిగా పరీక్ష రాసేందుకు వచ్చినట్లు పోలీసులకు వెల్లడించాడు. కాగా భగీరథ్ రామ్ గతేడాదే నీట్ యూజీ పరీక్షను క్లియర్ చేశాడు. అనేక ప్రయత్నాల తర్వాత అతడు నీట్ పరీక్షలో విజయం సాధించాడు. ప్రస్తుతం జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో భగీరథ్ రామ్ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని సహించబోం.. కర్ణాటక సర్కారుపై ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు
ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని అస్సలు సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జేడీఎస్ ఎంపీని దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించిందని, అభ్యంతరకర లైంగిక వీడియోలను విడుదల చేసిందని ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య ఉన్నందున ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన మోడీ.. వేల సంఖ్యలో వీడియోలు ఉండడం చూస్తే ఇవి జేడీఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉన్న నాటివని తెలుస్తోందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ వీడియోలను సేకరించారు. కానీ, వొక్కలిగ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఓటింగ్ ముగిసిన తర్వాత వీటిని విడుదల చేశారు. ఈ పరిణామాన్ని అత్యంత అనుమానాస్పదంగా అభివర్ణించిన ప్రధాని.. తాను దేశం విడిచి వెళ్లిన తర్వాత ఈ వీడియోలను విడుదల చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంటే, దానిపై నిఘా ఉంచాలి. విమానాశ్రయాన్ని కూడా పర్యవేక్షించాలన్నారు.
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో మంగళవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్‌లోని రెడ్‌వానీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు సోమవారం అర్థరాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిసింది. అయితే, సెర్చ్ ఆపరేషన్ మంగళవారం వరకు కొనసాగింది. ఉగ్రవాదుల మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది. మే 1న, ఏప్రిల్ 28న ఉగ్రవాదులతో జరిగిన క్లుప్త ఎన్‌కౌంటర్‌లో గ్రామ రక్షణ గార్డు (VDG) మరణించిన తర్వాత రెండు గ్రూపుల ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతా సంస్థలు కథువా జిల్లాకు సెర్చ్ ఆపరేషన్ పరిధిని విస్తరించాయి. చొచ్రు గాలా ఎత్తులోని మారుమూల పనారా గ్రామంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఏప్రిల్ 29న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జమ్మూ జోన్) ఆనంద్ జైన్ మాట్లాడుతూ, ఇటీవల సరిహద్దు దాటి చొరబడిన తర్వాత రెండు గ్రూపుల ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఉన్నారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
మరో భారీ ఆఫర్ అందుకున్న శ్రీ లీల..?
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .’పెళ్ళి సందD’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ సినిమాతోనే యూత్‌లో భారీగా క్రేజ్ తెచ్చుకుంది.ఆ తరువాత రవితేజతో నటించిన ‘ధమాకా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది .ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు సాధించింది. ఈ సినిమాలో శ్రీలీల డాన్స్ కు పిచ్చ క్రేజ్ వచ్చింది.ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో శ్రీలీల కు వరుస ఆఫర్స్ వచ్చాయి. కానీ శ్రీలీల కు కాలం కలిసి రాలేదు .ఆమె చేసిన వరుస సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి.గత ఏడాది 4 సినిమాలు రిలీజైతే.. భగవంత్ కేసరి మినహా మిగిలిన మూడు చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో శ్రీలీలకి ఎదురు దెబ్బ తగిలింది. దీనితో శ్రీలీల కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయింది. అయితే ఈ ఏడాది ఆమె నటించిన గుంటూరు కారం సినిమా మంచి విజయ్ సాధించింది .కానీ ఈ సినిమాలో కూడా శ్రీలీల పాత్రకు స్కోప్ లేదు. దీంతో కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ తీసుకుని స్టడీస్‌పై ఫోకస్ చేయాలని ఫిక్సయ్యింది.టాలీవుడ్ లో ఈ భామకు ఆఫర్స్ కరువవడంతో ఇక ఈ భామకు ఆఫర్స్ రావని అంతా భావించారు. కానీ కోలీవుడ్ నుంచి ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరోస్ విజయ్, అజిత్ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి.ఇదిలా ఉంటే శ్రీలీలకు ఇప్పుడు మరో భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. కార్తీ హీరోగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో తమిళంలో శ్రీలీల క్రేజ్ పెరగడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.