భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన.. విశేషాలు ఇవే..
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఆ తర్వాత రూ. 23.73కోట్లతో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ సాగర ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నాం. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్‌గా మారుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.. చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను ప్రారంభించాం. అదానీ డేటా సెంటర్‌తో ఉత్తరాంధ్ర ముఖచిత్రమే మారుతుందన్నారు సీఎం జగన్.. భోగాపురం ఎయిరోపోర్టును 2026లో మళ్లీ మీ బిడ్డే వచ్చి ప్రారంభిస్తాడు. ఎయిర్‌పోర్టు తీసుకురావడానికి చిత్తశుద్ధితో పనిచేశాం అన్నారు.. కేవలం ఎన్నికలకు రెండు నెలల ముందే ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేశామని చెప్పుకున్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరు. కోర్టులో కేసు వేసి అడ్డుకోవాలని చూశారు. 2026 నాటికి రెండు రన్‌వేలతో ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.. మొదటి ఫేజ్‌లో 60 లక్షల జనాభాకు సదుపాయాలు సమకూరుస్తాం. చివరి దశకు వచ్చే సరికి 4కోట్ల ప్రజలకు సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఏ380 డబుల్ డెక్కర్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ఏర్పాట్లు చేస్తాం అన్నారు.. ఇక, ఉద్ధానంలో కిడ్నీ రీసర్చ్ సెంటర్ పనులను పూర్తి చేశాం. జూన్ నెలలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను జాతికి అంకితం ఇస్తామని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్.
దుర్గగుడి సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.. అయితే, ఆలయ అధికారులు వివాదాల్లో ఇరుకున్న సందర్భాలు అనేకమే.. తాజాగా, దుర్గగుడి సూపరింటెండెంట్ నగేష్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు.. ఆదాయానికి నుంచి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నాయి.. దుర్గగుడి కార్యాలయంతో పాటు విజయవాడలోని నగేష్ నివాసంలో సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.. ఇదే సమయంలో నగేష్ బంధువులు, సోదరుల ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేస్తోంది.. తూర్పు గోదావరితో పాటు పశ్చిమగోదావరి జిల్లాలో కూడా సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.. కాగా, నిన్నే సెలవు పెట్టారట దుర్గగుడి ఉద్యోగి నగేష్.. నేటి నుంచి 4 రోజుల పాటు సెలవు తీసుకున్నారు.. అయితే, నేటి ఉదయం నుంచి నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి.. నగేష్ కు ముందస్తు సమాచారం ఉన్న కారణంగానే సెలవులో వెళ్లాడనే ప్రచారం సాగుతోంది.. మరోవైపు నిన్నటి నుంచి సెలవులో ఉన్నారు పటమట సబ్ రిజిస్ట్రార్ రాఘవ రావు.. నిన్నటి నుంచి ఆయన నివాసంలోనూ ఏసీబీ సోదాలు సోదాలు జరుగుతున్నాయి.. నగేష్, రాఘవరావు ఇద్దరూ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లాయట.. సోదాలు మొదలు కాక ముందే ఇద్దరు సెలవుపై వెళ్లటంతో.. వారికి ఏసీబీ సోదాలపై ముందస్తు సమాచారం ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఏపీ సర్కార్‌కు ఊరట.. సిట్‌పై హైకోర్టు స్టే కొట్టివేత..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన “సిట్” పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.. గత ప్రభుత్వ అవినీతిపై ‘సిట్’ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటుపై ‘స్టే’ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.. హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయగా.. ఇప్పటికే వాదనలు విన్న జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ రోజు తీర్పు ఇచ్చింది.. ఈ సందర్భంగా హైకోర్టు తప్పుగా అన్వయించుకుందని వ్యాఖ్యానించింది ధర్మాసనం. కాగా, చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.. ఈ క్రమంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. అయితే.. “సిట్” ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు. అయితే, ఆ పిటిషన్‌పై విచారణ జరిపి హైకోర్టు.. సిట్ ఏర్పాటుపై స్టే విధించింది.. ఇక, సిట్ ఏర్పాటుపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం… ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపి ఈ రోజు తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు… ఈ సందర్భంగా హైకోర్టు తీర్పును, తీరును తప్పుబడుతూ వ్యాఖ్యలు చేసింది జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదని.. సీబీఐ , ఈడీ దర్యాప్తునకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదని పేర్కొంది. సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదని, జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదని సుప్రీం బెంచ్ ప్రస్తావించింది. ఇక, ఏపీ హైకోర్టును తీర్పును పక్కనపెడుతున్నట్లు జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
ఐస్‌క్రీం తింటున్నారా? బీ కేర్ ఫుల్!
రాష్ట్రంలో కల్తీ కేటుగాళ్లు పెరిగిపోతున్నారు. దేన్నీ వదలకుండా కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వంటనూనె, పాలు వంటి నిత్యావసర పదార్థాలే కాకుండా చిన్న పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కూడా కల్తీ చేస్తు సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో నకిలీ చాక్లెట్ల కేసు మరువకముందే మరో నకిలీ బాగోతం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో నాణ్యతా ప్రమాణాలు లేకుండా నకిలీ ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న కంపెనీలను పోలీసులు గుర్తించారు. అపరిశుభ్రమైన పరిసరాల్లో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నారు. వాటిని బండ్ల వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అంతే కాకుండా బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్ ను ఐస్ క్రీమ్ లకు అతికించి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రెండు ఐస్‌క్రీమ్ తయారీ పరిశ్రమలపై దాడులు నిర్వహించారు. అక్కడ ఐస్ క్రీం తయారీ విధానం చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఈగలు, దోమలు స్వైరవిహారం చేస్తున్న అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్రీమ్ లు తయారవుతున్నాయి. మురుగు నీటి పక్కనే రసాయనాలు, రంగుల నీరుతో ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. చిన్న పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న పరిశ్రమ నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు రెండు ఐస్ క్రీమ్ తయారీ కంపెనీలను మూసివేశారు.
కాకినాడలో మహిళపై అత్యాచారం.. వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. కాకినాడలోని కోటనందూరులో గుర్తు తెలియని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.. గత శుక్రవారం ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుండగా.. ఆ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో అందరూ చేస్తుండగానే మెయిన్ రోడ్డు పై ఉన్న మార్కెట్ షెడ్‌లో దారుణానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.. బాధితురాలు గిరిజన మహిళగా.. మతిస్థిమితం లేని మహిళగా అనుమానిస్తున్నారు.. మతిస్థిమితం లేని మహిళను తీసుకొచ్చి.. మార్కెట్ షెడ్‌లో అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది.. మద్యం, గంజాయి మత్తులో యువకులు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.. అయితే, ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోవడంతో.. కోటనందురులో విచారణ చేపట్టారు పోలీసులు.. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.. ఆ ఘటన తర్వాత భాదితురాలు ఏమైంది..? ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారు..? అసలు ఆ యువకుడు ఎవరు..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. వైరల్‌గా మారిన వీడియో ప్రకారం.. రోడ్డు పక్కనే ఉన్న షెడ్‌లో కొన్ని బైక్‌లు పార్క్ చేసి ఉన్నాయి.. ఆ బైక్‌ల వెనుకాల మహిళపై దారుణానికి పాల్పడ్డాడు ఆ యువకుడు.. ఓ వ్యక్తి వీడియో తీయాలని చెబుతుందా.. తీస్తున్నాను.. నిన్న ఒకటి.. ఈ రోజు మరొకటి అంటూ మరో వ్యక్తి మాటలు వినిపిస్తున్నాయి.. అయితే, వీడియో చివర్లో ఓ వ్యక్తి.. ఘటనా స్థలానికి దగ్గర వెళ్లినట్టుగా కనిపిస్తోంది.. ఆ తర్వాత ఏమైంది.. వాళ్లు ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది.
గే కమ్యూనిటీ సమస్యలపై కమిటీ ఏర్పాటు.. సుప్రీంకు తెలియజేసిన కేంద్రం
సెమ్ సెక్స్ మ్యారేజ్ అంశాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. సేమ్ సెక్స్ మ్యారేజ్ అంశంపై కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య వాడీవేడీ వాదనలు జరుగున్నాయి. స్వలింగ వివాహాల విషయంలో ఆ జంటలు తమ హక్కులను కోల్పోతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే LGBTQIA+ కమ్యూనిటీ ఆందోళనల్ని పరిశీలించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు ఈ రోజు తెలిపింది. ఈ రోజు విచారణలో కేంద్రం తరుపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..కేంద్రం ఏర్పాటు చేయబోయే కమిటీకి కేబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారని తెలిపారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. ఈ అంశంపై గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ కేసులో కొన్ని రోజుల క్రితం కేంద్రానికి సుప్రీంకోర్టు పలు కీలక సూచనలు చేసింది. స్వలింగ జంటల ప్రాథమిక, సామాజిక హక్కులను కల్పించే విషయంలో ప్రభుత్వం ఏదో ఒక మార్గాన్ని కనుక్కోవాలని కోరింది. గే జంటలకు ఉమ్మడి బ్యాంక్ అకౌంట్స్ కల్పించడం, బీమా పాలసీల్లో భాగస్వామిని నామినేట్ చేసే అంశాలపై కేంద్ర స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలపింది. దీంతో పాటు స్వలింగ వివాహాల చట్టబద్ధతపై పార్లమెంట్ లో చర్చ జరగడం కీలకం అని గతంలో సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే సేమ్ సెక్స్ వివామాల్లో చట్టబద్ధత కల్పించకుండా వాళ్ల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని ఏప్రిల్ 27న విచారణలో ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది.
చేపలు పట్టేందుకు వెళ్తే.. వ్యక్తిని చంపి తిన్న మొసళ్లు..
ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది. కాలక్షేపం కోసం చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తిపై మొసళ్లు దాడి చేశాయి. మొసళ్లు చంపి తిన్నాయి. ఈ ఘటన ఉత్తర క్వీన్స్ ల్యాండ్ లో జరిగింది. 65 ఏళ్ల బాధితుడిని కేవిన్ దర్మోడీ అని గుర్తించారు. శనివారం రినియిర్రు (లేక్‌ఫీల్డ్) నేషనల్ పార్క్‌లోని కెన్నెడీ బెండ్ వద్ద చేపలు పట్టేందుకు వెళ్లిన అతను మొసళ్ల దాడిలో చిక్కుకున్నాడు. అక్కడే సమీపంలో ఉన్న మరికొంత మంది చేపలు పట్టే వ్యక్తులు కెవిన్ అరుపులు విన్నారు. అయితే ఆ ప్రాంతానికి వెళ్లి చూసే సరికి పెద్ద ఎత్తున నీటిలో అలజడి కనిపించినట్లు తెలిపారని కైర్న్స్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మార్క్ హెండర్సన్ చెప్పారు. తరువాత సంఘటన స్థలానికి చేరుకున్న రేంజర్లు రెండు మొసళ్లను కాల్చి చంపేశారు. మొసళ్లలో ఒకటి 14 అడుగులు, మరొకటి 9 అడుగులు ఉంది. పరీక్షిస్తే ఈ రెండు మొసళ్లలో మానవ అవశేషాలు కనిపించాయని పోలీసులు వెల్లడించారు. పోలీస్ అధికారి హెండర్సన్ దీన్ని విషాదకరమైన సంఘటనగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా మొసళ్లు ఎక్కువగా ఉండే దేశం అని, ముఖ్యంగా మీరు మొసళ్ల సంరక్షణ ప్రాంతాల్లో ఉండే చెరువుల్లో ఉంటే జాగ్రత్తగా ఉండాలని, అందులో మొసళ్లు ఉండే అవకాశాలు ఎక్కువని వన్యప్రాణి అధికారి మైఖైల్ జాయిస్ వెల్లడించారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ అన్వేషణ.. దరఖాస్తులకు ఆహ్వానం
భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం అన్వేషణ ప్రారంభించింది బీసీసీఐ.. దీనికోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు రమేష్ పొవార్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి బదిలీ చేయబడ్డారు.. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. అయితే, టీ20 ప్రపంచకప్‌కు బ్యాటింగ్ కోచ్ హృషికేష్ కనిట్కర్‌ను జట్టుకు ఇంఛార్జ్‌గా నియమించారు, ఇక్కడ సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైన విషయం విదితమే. అయితే, మహిళల క్రికెట్ జట్టుకు పూర్తిస్థాయిలో హెడ్‌కోచ్‌ను నియమించాలని భావిస్తోన్న బీసీసీఐ.. ఇప్పుడు దరఖాస్తులు ఆహ్వానించింది.. బీసీసీఐ ప్రకటన ప్రకారం, దరఖాస్తుదారు తప్పనిసరిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడాలి, లేదా కనీసం ఎన్‌సీఏ స్థాయి సీ- సర్టిఫైడ్ కోచ్ అయి ఉండాలి లేదా ఒక ప్రసిద్ధ సంస్థ నుండి ఇలాంటి ధృవీకరణ కలిగి ఉండాలి. అలాగే అంతర్జాతీయ జట్టుకు కనీసం ఒక్క సీజన్‌కైనా శిక్షణ ఇచ్చిన అనుభవం ఉండాలి. ఇందులో ఏ ఒక్క అర్హత ఉన్నా ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.. హెడ్ కోచ్ ఒక బలమైన జట్టును ఏర్పాటు చేయడం, మహిళల కోచింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడం మరియు ఫిట్‌నెస్, పనితీరు ప్రమాణాలను పర్యవేక్షించడంతో పాటు “అప్పటికప్పుడు బీసీసీఐ సూచించిన విధంగా నడుచుకునే విధంగా ఉండాలని భావిస్తున్నారు.
మా తల్లే.. ఉతికితే చిరిగిపోద్దని 18ఏళ్లు ఒకటే జీన్స్ వేసుకున్నావా
జీన్స్ ప్యాంట్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ధరిస్తున్నారు. అనేక బ్రాండెడ్ జీన్సులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి చావు దగ్గరపడ్డ ముసలోళ్లదాకా జీన్స్ వేయని వారు చాలా అరుదు. జీవితంలో ఒక్క సారైనా జీన్స్ వేసే ఉంటారు. అలాంటి జీన్స్ ప్యాంట్లు బరువుగా ఉంటాయి. ఉతికితే తొందరగా ఆరిపోవు. అందుకే జీన్స్ ప్యాంట్లను ఒకటి రెండు సార్లు వేసుకున్నాకే ఉతుకుతాం. కానీ ఓ మహిళ 18ఏళ్లుగా ఉతకకుండానే వేస్కుంటుందట. వామ్మో ఆ గబ్బును పక్కన వాళ్లు ఎలా భరిస్తున్నారో అని ఆలోచిస్తున్నారా.. నిజమండి బాబు. 18 సంవత్సరాలుగా ఒకే జీన్స్ ధరిస్తోందంట. దానిని ఆమె కొన్న తర్వాత ఒక్కసారి కూడా ఉతకలేదట. దీనిలో ట్విస్ట్ ఏంటంటే ఆ జీన్స్ పై కనీసం ఒక్క మరకగానీ, దుమ్ము కానీ ఏమీ లేవట. తాను కొన్నప్పుడు కొత్తలో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందంట. ఈమె మన దగ్గర ఆమె కాదండోయ్ లండన్ మహిళ.
అందరూ కలిసిరావడం బాగుంది.. గోల్డెన్ డేస్ వచ్చినట్లే
మణిరత్నం దర్శకత్వం వహించిన తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, సోపిత, శరత్‌కుమార్, పార్తీబన్, జయరామ్, విక్రమ్ ప్రభు, ప్రభు, రఘుమాన్ తదితరులు కలిసి నటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. పొన్నియన్ సెల్వన్ మొదటి భాగంలాగే రెండో భాగానికి కూడా మంచి స్పందన వచ్చింది. నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును దాటేసింది. సినిమా ప్రారంభంలో నటుడు కమల్ హాసన్ రెండు భాగాలకు గాత్రదానం చేశారు. ఈ సందర్భంలో పొన్నియిన్ సెల్వన్ 2ను ప్రదర్శించి కమల్‌కు చూపించారు. మణిరత్నం, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆయనతో కలిసి సినిమాను వీక్షించారు. అనంతరం మీడియాతో కమల్ మాట్లాడుతూ.. మంచి సినిమాలు చూడాలన్నది నా కోరిక. పొన్నియిన్ సెల్వన్ 2కి అలాంటి కోవలోకే వస్తుంది. నేను దీన్ని ఎపిక్‌గా సినిమాగా చూస్తాను. సినిమాపై అనేక అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ప్రజలు దానిని హిట్ చేశారు. తమిళ ప్రజల గర్వాన్ని చాటి చెప్పే ఈ సినిమా తీయాలంటే ప్రత్యేక ధైర్యం కావాలి. దానిని మణిరత్నం చేశారు. స్టార్లంతా కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో మణిరత్నానికి సాయం చేశారు. ఇలా ఎందరో తారలు కలిసి రావడం చూసి చాలా కాలం అయ్యింది. తమిళ ఇండస్ట్రీకి మంచి స్వర్ణయుగం ప్రారంభమైందని భావిస్తున్నాను. ఇది మెచ్చుకోవాల్సిన విజయం” అని అన్నారు.