ఏపీలో భూముల ధరలకు రెక్కలు..! రేపటి నుంచే అమలు
ఆంధ్రప్రదేశ్‌లో భూముల విలువ భారీగా పెరగబోతోంది.. రేపట్నుంచి ఏపీలో పెరగనున్న భూముల ధరలు అమల్లోకి రాబోతున్నాయి.. భూముల మార్కెట్ ధరలను సవరించే దిశగా ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది.. భూముల ధరలను పెంచబోతున్నట్టు ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లకు.. సబ్ రిజిస్ట్రార్లకు అనధికారిక సమాచారం చేరవేసింది ప్రభుత్వం.. భూముల ధరల పెంపునకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.. అయితే, ఇది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. కొన్ని చోట్లే భూముల ధరలను పెంచాలనే సూచనలు ఉన్నాయి.. అంటే.. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైతే రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతాయో.. ఆ ప్రాంతాల్లో భూముల ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది.. ఈ సారి 10-15 శాతం మేర భూముల విలువను పెంచే అవశాలు ఉన్నాయని చెబుతున్నారు.. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఎదురు చూస్తోంది.. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఉత్తర్వులు విడుదల చేయనున్నారు అధికారులు.
మోసం చేసి తప్పించుకుంది.. 36 ఏళ్ల తర్వాత సీఐడీకి చిక్కింది..
మోసం కేసులో తప్పించుకు తిరుగుతున్న ఓ మహిళను 36 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు పోలీసులు.. ట్రావెన్‌కోర్ ఫైనాన్స్ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితురాలుగా ఉన్న మరియమ్మ అలియాస్ లీలమ్మ జోసెఫ్‌ను 36 ఏళ్ల తర్వాత కేరళలో అరెస్ట్ చేశారు.. ఆమె వయస్సు ఇప్పుడు 69 ఏళ్లు.. సోమవారం అరెస్టు చేసిన తెలంగాణ సీఐడీ పోలీసులు.. నిన్న కోర్టులో హాజరుపర్చారు. 1987లో నమోదైన ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. ఇప్పుడు కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా తుల్లపల్లికి చెందిన మరియమ్మను అరెస్ట్ చేశారు.. 1987లో ఆర్థిక మోసానికి సంబంధించిన కేసు సీసీఎస్‌లో నమోదైంది. తర్వాత ఇది సీఐడీకి బదిలీ చేశారు.. ఈ కేసులో 11వ నిందితురాలిగా ఉన్న మరియమ్మ పరారీలోనే ఉండడంతో.. ఆమెపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది.. అయితే, మహేష్ భగవత్ సీఐడీ అదనపు డీజీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెండింగ్ కేసులనీ ఫోకస్ పెట్టారు.. ఇందులో భాగంగా మరియమ్మపై కేసు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.. దాంతో సీఐడీ ఎస్పీ బి. రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. మరియమ్మ కేరళలో ఉన్నట్లు కనిపెట్టారు.. ప్రత్యేక బృందం కేరళ వెళ్లి ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు.. న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించారు.
అవినాష్‌రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట.. బెయిల్ వచ్చేసింది.. కానీ..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నాలు ఫలించాయి.. తెలంగాణ హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. వైఎస్ వివేకా కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డి.. పలుమార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు.. ఇక, తన తల్లి అనారోగ్యసమస్యలతో సీబీఐని సమయం కోరారు.. మరోవైపు.. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగించారు.. మొత్తంగా ఈ రోజు అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. ఇవాళ తుది తీర్పు వెలువరించిన హైకోర్టు వెకేషన్ బెంచ్.. అవినాష్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.. ఇక, ఇదే సమయంలో ప్రతి శనివారం సీబీఐ ముందు హాజరు కావాలని ఎంపీ అవినాష్‌రెడ్డిని ఆదేశించింది హైకోర్టు.. జూన్ చివరి వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల మధ్య సీబీఐ విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.. మరోవైపు, హై కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.. దర్యాప్తు సంస్థకు అవినాష్ రెడ్డి సహకరించాలని సూచించింది.. మరో అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదని వ్యాఖ్యానించిన హైకోర్టు.. ఐదు షరతులతో కూడి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.. రూ.5 లక్షల పూచీకత్తుతో రెండు షూరిటీలు ఇవ్వాలని పేర్కొంది..
74లో డిగ్రీ చదువు.. ఇంటర్ పాసైన మాజీ సైనికోద్యోగి
సాధారణంగా 15 ఏళ్లకు ఎస్‌ఎస్‌సీ.. 17 ఏళ్లకు ఇంటర్ చదువుతారు.. ఇంటర్ తరువాత డిగ్రీలో చేరుతారు. అయితే తెలంగాణ రాష్ర్టంలో లేటు వయస్సులో ఒకతను చదువుపై తనకున్న మక్కువను తీర్చుకోవాలనుకున్నాడు. అప్పుడెప్పుడో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేసిన వ్యక్తి ఇప్పుడు ఇంటర్, తరువాత డిగ్రీ చేయాలనుకున్నాడు. అతనే 74 సంవత్సరాల కల్లా నాగ్‌శెట్టి.. హైదరాబాద్‌లో ఉప్పుగూడ శివాజీనగర్ నివాసి అయిన కల్లా నాగ్‌శెట్టి. బీదర్ జిల్లాలో 1949లో జన్మించిన ఆయన ఎస్‌ఎస్‌ఎల్‌సీ(మెట్రిక్యులేషన్) వరకు అక్కడే చదివారు. ఉన్నత చదువులు చదవాలనుకున్నా కుటుంబ ఆర్థిక పరిస్థితులతో సాధ్యంకాలేదు. ఆ క్రమంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరై సిపాయిగా ఉద్యోగంలో చేరాడు. 21 ఏండ్లు ఆర్మీలో పనిచేసి జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా (జేసీవో) పదవీ విరమణ పొందాడు. 1971 ఇండో పాక్ యుద్ధం, 1984 ఆపరేషన్ బ్లూస్టార్‌లలో పాల్గొన్నాడు. శ్రీలంకకు పంపించిన శాంతిసేన సభ్యుడిగాను సేవలందించి పదవీ విరమణ చేశాడు. ఆ తర్వాత మరో 21 ఏండ్లు ప్రైవేట్ కంపెనీల్లో పలు ఉద్యోగాలు చేశాడు. అయితే, చిన్నప్పుడు ఆపేసిన చదువును మళ్లీ కొనసాగింగించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఇంటర్ బోర్డును సంప్రదించారు. ఇంటర్మీడియట్ చదవడానికి ఇంటర్‌బోర్డు నుంచి అనుమతి తెచ్చుకొన్నారు. సైదాబాద్‌లోని గోకుల్ జూనియర్ కాలేజీలో సీఈసీలో అడ్మిషన్ పొందాడు. ఈ ఏడాది మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు రాశాడు. ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఏకంగా 77.04 పర్సంటేజీతో ఇంటర్ పూర్తిచేశాడు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన నాగ్‌శెట్టి ఇప్పుడు డిగ్రీలో చేరడానికి దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. తనకు చదువుకునే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు, విద్యాశాఖ మంత్రి పీ సబితాంద్రారెడ్డికి నాగ్‌శెట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
వైసీపీలోకి కేశినేని నాని..? ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికలు వచ్చినట్టు పొత్తులు, చేరికలపై చర్చ సాగుతోంది.. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం పార్టీలో వివాదాస్పదంగా కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేపై కేశినేని ప్రశంసలు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయన చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం మొదలైంది. కొందరు టీడీపీ నేతలు కేశినేనిపై విరుచుకుపడుతున్నారు.. కేశినేని నాని వ్యాఖ్యలతో విజయవాడ ఎంపీ కేశినేని నాని వర్సెస్ స్థానిక టీడీపీ నేతలు అన్నట్లుగా మారిపోయింది.. అయితే, కేశినేని మాత్రం.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.. తాజాగా నందిగామ ఎమ్మెల్యేలను నాని ప్రశంసించడం అక్కడి టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న సమయంలో సొంత పార్టీ ఎంపీలే ప్రత్యర్థి పార్టీ నేతలను ఎలా పొగుడుతారని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకుంటే కేశినేని భవన్‌లో కూర్చుని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని కూడా వ్యాఖ్యానించి కాకరేపారు నాని.. అయితే, తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని వ్యవహారంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీ అయోధ్య రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి..? టీడీపీ ఎంపీ కేశినేని నాని మంచి మనిషి అని ప్రశంసలు కురిపించిన ఆయన.. నాకు మంచి మిత్రుడు కూడా అని గుర్తుచేసుకున్నాడు.. అంతేకాదు.. ఆయన వైసీపీలోకి వస్తే చాలా సంతోషం అని పేర్కొన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయోధ్య రామిరెడ్డి.. విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రజల కోసం పనిచేస్తాడని చెప్పారు. కష్టాల్లో ఉన్నవారి కోసం నాని ఎప్పుడూ పనిచేస్తాడన్నారు. వైసీపీలోకి కేశినేని వస్తే స్వాగతిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అనేది తల్లి తండ్రి లాంటిది.. ప్రజలకు మంచి చేద్దాం అనుకునే నాయకుల మాదిరి పిల్లలు ఉంటే వారికి అండగా ఉండేదే ప్రభుత్వం అన్నారు.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. కాగా, 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి కేశినేని నాని టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగి విజయం సాధించిన విషయం విదితమే.
భారత- మయన్మార్ సరిహద్దులో అమిత్‌షా.. మోరేలో పర్యటన..
మణిపూర్‌లో చెలరేగిన ఘర్షణలను కట్టడి చేసి.. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. గత రెండు రోజుల నుంచి పలు సంఘాలు, జాతుల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ప్రత్యేకంగా రాష్ర్ట మంత్రివర్గ సమావేశంలో కూడా హోం మంత్రి పాల్గొన్నారు. సంఘాలు, జాతులతో నిర్వహించిన సమావేశాల సారాంశాలను రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి రాష్ట్రంలో శాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 3వ రోజు పర్యటన సందర్భంగా భారత- మయన్మార్ సరిహద్దులో ఉన్న మోరేన్ పట్టణంలో అమిత్ పర్యటించనున్నారు. అక్కడ ఉండే కుకీలు.. కుకీ సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం అర్థరాత్రి ఇంఫాల్‌కు చేరుకున్న తర్వాత అమిత్ షా వివిధ కుకీ మరియు మెయిటీ నాయకులు, ఉన్నత భద్రతా అధికారులు మరియు మణిపూర్ క్యాబినెట్‌తో జాతి హింసకు పరిష్కారం కోసం వరుస సమావేశాలను నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం మంగళవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఘర్షణల మూలంగా మోరేన్ పట్టణం ఎక్కు్వగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో అమిత్ షా నేడు మోరేన్‌లో పర్యటించనున్నారు. అక్కడ కుకీ పౌర సమాజ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో కాంగ్‌పోక్పి జిల్లాకు వెళ్తారు. ఇది కుకీలు అధికంగా ఉండే ప్రాంతం. అక్కడ అనేక మెయిటీ గ్రామాలు కూడా ఉన్నాయి. రెండు వర్గాల మతపరమైన నిర్మాణాలు మరియు భవనాలు లక్ష్యంగా చేసుకున్న ఘర్షణల కారణంగా ఎక్కువగా ప్రభావితమైన జిల్లాల్లో కాంగ్‌పోక్పి ఒకటి.
పెళ్లి కుమారుడి గెటప్‌లో ఎలాన్ మస్క్.. వైరలవుతున్న ఫొటోలు
ఏడాదికేడాదికి టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. గత 10 ఏళ్ల క్రితం ఉన్న టెక్నాలజీకి.. గత 5 ఏళ్ల నాటి టెక్నాలజీకి.. నేటి టెక్నాలజీకి ఎంతో తేడా ఉంది. ప్రతి ఏడాది టెక్నాలజీలో కొత్త ధనం వస్తూనే ఉంది. అందులో భాగంగా బ్లాక్ చైన్ నుంచి ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) స్థాయికి ఎదిగాం. ఇక ఇప్పుడు ఏఐ సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ.. ఇన్నీ కావు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఏఐ సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. చాట్ జీపీటీకి ముందు.. ఆ తర్వాత అనే స్థాయిలో మనిషి జీవితంపై ఏఐ ప్రభావం చూపుతోంది. టెక్నాలజీ రంగంలోనే కాదు.. ఆర్టిస్ట్‌ల ఊహా శక్తికీ ఏఐ రెక్కలు తొడుగుతోంది. ఏఐ టెక్నాలజీ జనాలకు సరికొత్త అవతారాలను పరిచయం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కుబేరులు పేదవారు(బికారులు)గా మారితే ఎలా ఉంటారు.. స్టార్ క్రికెటర్లు, స్టార్ హీరోలు అమ్మాయిలైతే ఎలా ఉంటారో ఊహిస్తూ ఏఐ సాయంతో రూపొందించిన చిత్రాలు ఇప్పటికే నెట్టింట వైరలైన విషయం చూసిఉన్నాం. ఇప్పుడు తాజాగా ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ దేశీయ వరుడుగా అయితే ఎలా ఉంటాడో.. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్, ఏఐ ఆర్టిస్ట్ కళ్లకు కట్టినట్టు చూపించారు. ఫొటోల్లో మస్క్ సంప్రదాయ దుస్తులు ధరించి గుర్రంపై ఊరేగుతున్నట్లు కనిపించారు. మరికొన్ని ఫొటోల్లో అయితే నవ్వుతూ, వేడుకను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు.. అద్భుతం.. నమ్మలేకపోతున్నాం.. అంటూ కామెంట్లు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
జడ్జిలను సోషల్ మీడియాలో దూషిస్తే శిక్షే..
ఇకపై సోషల్ మీడియా వేదికగా జడ్జిలను దూషిస్తే శిక్షలు తప్పవు. తమకు అనుకూలంగా తీర్పు రాకపోయినా.. లేకపోతే తమకు ఇష్టంలేని తీర్పు చెప్పారనో జడ్జిలను సోషల్ మీడియాల ద్వారా దూషిస్తే .. అలా చేసిన వారు శిక్షకు గురికావల్సిందే. సామాజిక మాధ్యమాల ద్వారా న్యాయాధికారులను దూషించిన వారిని శిక్షించడం సబబేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జిల్లా జడ్జిపై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తికి పది రోజుల జైలు శిక్ష విధిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సమర్థించింది. తమరే అనుకూలంగా తీర్పు రానంత మాత్రాన జడ్జిని దూషించలేరని తెలిపింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత కలిగినదని .. అంటే కార్యనిర్వాహక వ్యవస్థ నుంచే కాకుండా బయట వ్యక్తుల నుంచి కూడా స్వతంత్రంగా ఉండాలన్న అర్థమని ధర్మాసనం స్పష్టం చేసింది. . న్యాయాధికారిపై ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుందని తెలిపింది. శిక్ష మరీ కఠినంగా ఉందని.. కనికరం చూపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. అలాంటి వాటిని క్షమించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దేవాలయానికి సంబంధించిన కేసులో తీర్పు చెప్పిన అదనపు జిల్లా జడ్జిపై ఆరోపణలు చేసినందుకు కృష్ణ కుమార్ రఘువంశి అనే వ్యక్తిపై హైకోర్టు సుమోటోగా క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. దీనిపై ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
OTT ప్లాట్‌ఫారమ్‌లకు కొత్త గైడ్‌లైన్స్.. పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరి
OTT ప్లాట్‌ఫారమ్‌లకు పొగాకు వ్యతిరేక హెచ్చరికలను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇకపై ఓటీటీలో ప్రదర్శితమయ్యే సినిమాలు, టెలివిజన్ ప్రోగ్రాంలలో పొగాకు వ్యతిరేఖ హెచ్చరికలను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఏదైనా ప్రోగ్రామ్ సమయంలో పొగాకు ఉత్పత్తులు, వాటి వినియోగానికి సంబంధించిన సీన్ వస్తే పొగాకుకు వ్యతిరేకంగా స్క్రీన్ దిగువన ఒక మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. పొగాకు వినియోగం వంటి సన్నివేశాలు మైనర్లపై కీలక ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీల్లో కూడా పొగాకుకు వ్యతిరేకంగా హెచ్చరికలను జారీ చేయాలని మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పొగాకు వల్ల వచ్చే వ్యాధుల తీవ్రత నానాటికి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సిగరేట్లు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులను(ప్రకటనల నిషేధం మరియు వాణిజ్యం మరియు వాణిజ్యం, ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీ నియంత్రణ) COTPA చట్టాన్ని 2004లో అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం ఓటీటీలో పొగాకు నియంత్రణకు తీసుకువచ్చిన గైడ్ లైన్స్ ద్వారా పొగాకు నియంత్రణలో భారత్ గ్లోబల్ లీడర్ అవుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
పవన్ కళ్యాణ్ సినిమాకు నిర్మాతగా యాంకర్ ప్రదీప్ ?
బుల్లితెరపై టాప్ మేల్ యాంకర్ లలో మొదటగా వినిపించే పేరు యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. తన కామెడితో కడుపుబ్బా నవ్విస్తూ, జనాలను అల్లరిస్తున్నాడు.. ఒక యాంకర్గా, యాక్టర్ గా రానిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.. అయితే ప్రదీప్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. ప్రదీప్ పవన్ కళ్యాణ్ సినిమాకు నిర్మాతగా వ్యవహారిస్తున్నారని టాక్.. ఇప్పటివరకు పలు టీవీ షోలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రదీప్ ఇప్పుడు సినిమాకు అంటే జనాలు ఆశ్చర్యపోతున్నారు.. సినిమా తియ్యడం అంటే అంత ఈజీ కాదు.. కొన్ని వందల కోట్ల పైమాటే.. అందులో పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాటలా.. అలాంటి సినిమాను ప్రదీప్ నిర్మించనున్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది..సినిమా తీసే రేంజులో ఒక యాంకర్ ఉన్నారు.. అంటే ప్రదీప్ ఒక షో ద్వారా ఎంత సంపాదిస్తున్నాడో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ప్రదీప్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాను అని చెప్పడం తో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురి అయ్యారు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..బుల్లితెరపై ప్రదీప్ ఎన్నో షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. జీ తెలుగు లో ప్రసారమయ్యే ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ అనే ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు.. ఆ షో తనకు మంచి పేరును తీసుకొని వచ్చింది. అంతేకాదు ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిత్రం ద్వారా హీరో గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించాడు.అలా హీరో గా,యాంకర్ గా మరియు నిర్మాతగా కూడా సక్సెస్ ని అందుకున్న ప్రదీప్ కు ఒక సినిమాని నిర్మించాలనే కోరిక ఉందని, తన మొదటి సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అని చాలా సందర్భాల్లో చెప్పాడు.. మరి ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడో.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే ప్రదీప్ క్లారిటి ఇచ్చేవరకు ఆగాల్సిందే..
హతవిధీ… వాట్ ఏ డ్యామేజీ…
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో యూత్ ని జానేజిగర్ గా మారిపోయాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. మోస్ట్ ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో, లేడీ సూపర్ స్టార్ గా పేరున్న స్వీట్ బ్యూటీ అనుష్క శెట్టితో కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటిస్తున్నారు. ఒక కొత్త బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ ఫీల్ గుడ్ సినిమాని పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రమోషనల్ కంటెంట్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ సినిమా నుంచి ఒక క్యాచీ బ్రేకప్ సాంగ్ ని రిలీజ్ చేసారు. బ్రేకప్ సాంగ్ అనగానే యూత్ అందరికీ ‘వై దిస్ కొలవెరి’, ‘నా మది’ లాంటి ధనుష్ సాంగ్స్ గుర్తొస్తాయి. ఒకప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే హార్ట్ టచింగ్ గా ఉండాలి, వినగానే ఏడిపించేయాలి అనేలా ఉండేవి. అలాంటి పాటలని ధనుష్ చాలా క్యాజువల్ గా, అందరూ పాడుకునే అంత క్యాచీగా మార్చేశాడు. అందుకే ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలోని లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కోసం ధనుష్ నే రంగంలోకి దించారు. ”హతవిధీ ఏందిదీ.. ఊహలో లేనిదీ.. బుల్లిచీమ బతుకుపై బుల్డోజరైనదీ..” అంటూ సాగే ఈ పాట వినగానే పాడుకునేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ చాలా క్యాచీగా, ప్రతిఒక్కరూ హమ్ చేసేలా ఉన్నాయి. ధనుష్ వాయిస్ లోని మ్యాజిక్, ఈ హతవిధీ సాంగ్ ని మరింత స్పెషల్ గా మార్చింది. లిరికల్ వీడియోలో నవీన్ పోలిశెట్టి లుక్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. ఈ సాంగ్ ఇంకొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం గ్యారెంటీ.