*ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ భూస్థాపితం కాబోతుంది..
ఎన్నికల ఫలితాల తరువాత BRS భూస్థాపితం కాబోతుంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పదవి పోయోందనే ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నాడు.. ముఖ్యమంత్రిని పట్టుకుని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్, జీరో కరెంట్ బిల్లు ఇవ్వడం తప్పా..! అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినం అని కేటీఆర్ అంటున్నాడు.. మీ ప్రభుత్వంలో ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారంటూ మండిపడ్డారు. మీ అయ్యా ఫామ్ హౌజ్ లో పడుకుంటే నువ్వే కదా రాష్ట్రాన్ని ఫలించినవు.. అధికారం చేపట్టగానే న్యాయ చిక్కులని తొలగించి ఉద్యోగాల భర్తీ చేపట్టం అని కోమటి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇక, దుర్గం చెరువు మీద ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి అది ఇది చేశామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ.. చంద్రబాబు అంతో ఇంతో హైటెక్ సిటీ కడితే.. కాంగ్రెస్ పరిశ్రమలు తెచ్చింది.. పరిశ్రమలు పోతున్నాయని జ్ఞానం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు.. మీ లెక్క తండ్రి పేరు చెప్పుకుని మా ముఖ్యమంత్రి రాజకీయాల్లోకి రాలేదు.. ఇండిపెండెంట్ ZPTC గా గెలిచి ప్రజల కోసం పోరాడి ఈ స్థాయికి వచ్చారు రేవంత్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకటి రెండు స్థానాల్లో మాత్రమే BRSకు డిపాజిట్ వస్తుంది.. మిగతా స్థానాల్లో డిపాజిట్ గల్లంతే.. కాంగ్రెస్ కు 12కు పైగా స్థానాలు వస్తాయి.. ఒక్క సీట్ కూడా రావడం లేదని కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడని మంత్రి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఇక, రింగ్ రోడ్ ను అమ్ముకున్నారు.. ఎంత దోచుకున్నారో విచారణ చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మీ మిత్ర పక్షం మోడీతో మాట్లాడి ఐటీఐఆర్ ఎందుకు తేలేదు కేటీఆర్?.. రిపేర్ చేసిన కూడా కాళేశ్వరంలోని మూడు డ్యాంలు ఉంటాయనే నమ్మకం లేదని రిపోర్ట్ వచ్చింది.. గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడుతున్నాడు.. ధనికులే కాదు పేదలు కూడా క్వాలిటీ అన్నం తినాలి.. నేను శ్రీధర్ బాబు అమెరికా పర్యటనకు వెళ్తున్నాం.. అమెరికాలోని కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతామన్నారు. అలాగే, టెట్ ఫీజు గురించి కేటీఆర్ బాధ పడుతున్నాడు.. కొందరు యువత ఉద్యోగాలు లేక అప్పులు తెచ్చుకుని వైన్స్ టెండర్లు వేశారు.. వైన్స్ టెండర్ కు రెండు లక్షల నాన్ రిఫండబుల్ డిపాజిట్ ను పెట్టి.. రక్తం పీల్చుకున్నారు.. పదేండ్లు అధికారంలో ఉన్న పార్టీ మూడు నెలల్లోనే ఇలా దిగజారిపోతుందా.. మీరు చేసిన అవినీతి, అక్రమాల వల్లే పార్టీ కూలిపోతుంది.. ఫలితాల తరువాత బీఆర్ఎస్ లో ఒక్కరు ఉండరు.. డిపాజిట్ రాని పార్టీలో ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
*బెంగుళూరు రేవ్‌పార్టీలో కీలక ట్విస్ట్.. నటి హేమ రక్తనమూనాల్లో డ్రగ్స్!
బెంగళూరు రేవ్‌పార్టీలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు స్పష్టం అయింది. హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు నార్కొటిక్ టీమ్ పేర్కొంది. దాంతో రేవ్‌పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్పిన మాటలు అన్ని అబద్దాలే అని తేలింది. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లో గత ఆదివారం రేవ్‌పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. రేవ్‌పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను ఇటీవల బెంగళూరు నార్కొటిక్ టీమ్ సేకరించింది. 103 మందిలో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. 59 మంది పురుషుల, 27 మంది మహిళల రక్త నమూనాలు పాజిటివ్ అని తేలింది. నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. రక్త నమూనాలు పాజిటివ్‌గా తేలిన వారందరికీ సీసీబీ సమన్లు జారీ చేసింది. రేవ్‌పార్టీ జరిగిన ఫామ్‌హౌస్‌లోనే హేమ ఉందని, ఆమె వీడియో అక్కడే రికార్డ్ చేసిందని బెంగళూరు పోలీసులు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తాను రేవ్‌పార్టీలో పాల్గొనలేదని, ఆ సమయంలో హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ ఓ వీడియో విడుదల చేశారు. అయితే రేవ్‌పార్టీకి తాను వెళ్లలేదంటూ రిలీజ్ చేసిన వీడియోలో ఆమె ఏ డ్రస్‌తో ఉన్నారో, బెంగళూరు పోలీసులు విడుదల చేసి ఫొటోలోనూ అదే డ్రస్‌లో ఉన్నారు. దాంతో హేమ చెప్పేది అబద్ధం అని అప్పుడే స్పష్టం అయింది. అయినా కూడా హేమ తాను హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ మరో వీడియో వదిలారు. చివరకు బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్‌గా రావడంతో ఆమె బండారం బయటపడింది.
*వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి..
జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పరిశీలించారు. ఆ తర్వాత రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యం యొక్క వివరాలను సేకరించారు. దీంతో పాటు జగిత్యాల జాయింట్ కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. వెంటనే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందేనని కోరారు. లేకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను స్తంభింప చేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. తెలంగాణ అసెంబ్లీలో రైతుల పక్షాన మేము కొట్లాడుతాం అని హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ బయట రైతులందరూ ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేయాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే 6 గారంటీలను అమలు చేస్తామన్నారు.. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు హామీలను తుంగలో తొక్కి రైతుల గుండెల మీద తన్నారు అంటూ హరీశ్ రావు మండిపడ్డారు. కాగా, అంతకుముందు కొండగట్టు అంజనేయ స్వామిని నేటి ఉదయం హరీశ్ రావు దర్శించుకున్నారు. తర్వాత ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు, ఆలయ సిబ్బంది మర్యాదాలతో స్వాగతం పలికారు. వేదపండితులు వేద ఆశీర్వచనలు అందించి.. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చిన హరీశ్ రావును స్థానిక నేతలు సన్మానించారు.
*పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత
పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు చలో మాచర్లకు పిలుపునిచ్చారు ఆ పార్టీ నేతలు. మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయినా సరే మాచర్లకు వెళ్తామంటూ టీడీపీ సీనియర్ నేతలు ప్రకటించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. మాచర్లకు వెళ్లకుండా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాను గృహనిర్బంధం చేశారు పోలీసులు. ఆయనతో పాటు ముందస్తుగా పలువురు టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. ఎక్కువ మంది ఒకే చోట చేరకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పల్నాడులో హై టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పల్నాడులో పదిరోజులుగా 144 సెక్షన్ కొనసాగుతోంది. పల్నాడు ప్రాంతంలోని సమస్యత్మక పట్టణాల్లో పదిరోజులుగా షాపులు మూసివేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికీ అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గ్రామాల్లో రాజకీయ పార్టీల కార్యకర్తలు కవ్వింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఘర్షణలో పాల్గొని, దాడులు చేసిన వారిపై కేసులు పెట్టారు పోలీసులు. నిందితులుగా ఉన్న వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
*ముఖ్యమంత్రికి రైతులకంటే.. ఎన్నికలే ముఖ్యంగా మారింది..!
యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ మండలం రాఘవపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పరిశీలించారు. కొనుగోలు ఆలస్యం కావడానికి గల కారణాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. 45 రోజులు గడుస్తున్న కొనుగోలు ప్రక్రియ పూర్తికాక పోవడం.. కొనుగోలు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని కిషన్ రెడ్డి దగ్గర రైతులు మొర పెట్టుకున్నారు. ఎప్పటికీ కొనుగోలు పూర్తి అవుతుందో తెలియడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 45 రోజులుగా IKP కేంద్రానికి ధాన్యం వస్తున్న.. కొనుగోలు ప్రక్రియ వేగంగా జరగడం లేదన్నారు. IKP కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవు.. కొనుగోలు ప్రక్రియలో ప్రతి దశకు కేంద్రం డబ్బులు చెల్లిస్తుంది.. అయినా కొనుగోలు సరిగ్గా జరగడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎంకు రైతులకంటే.. ఎన్నికలే ముఖ్యంగా మారింది అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుంది.. కేసీఆర్ వరి వేస్తే ఊరి అన్నారు.. రేవంత్ రెడ్డి దొడ్డు వడ్లు వేస్తే బొనస్ ఇవ్వము అంటున్నారు.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.. రుణమాఫీ లేదు.. బోనస్ లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. దేవుడి మీదు ఒట్టు పెడితే రైతుకు న్యాయం జరగదు.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి గింజ కొనడానికి సిద్ధంగా ఉంది అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
*ప్రజ్వల్ రేవణ్ణ పాస్‌పోర్ట్ రద్దు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్యలు
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దీనితో పాటు, వారు భారతదేశానికి తిరిగి రావడానికి తక్షణమే నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని అభ్యర్థన చేశారు. దీని తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తుంది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అతను దేశం విడిచి పారిపోయాడు. అతని అరెస్ట్ వారెంట్ తర్వాత, రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేయవచ్చు. ప్రజ్వల్ రేవణ్ణ తన దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి ఏప్రిల్ 27, 2024న దేశం విడిచి జర్మనీకి పారిపోయాడు. అతని కిరాతక చర్యల వార్తలు వెలుగులోకి వచ్చిన వెంటనే.. అతనిపై మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి కొన్ని గంటల ముందు సిద్ధరామయ్య తన లేఖలో రాశారు. మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేతపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలన్న అభ్యర్థనపై కేంద్రం స్పందించలేదని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర నిన్న తెలిపారు. అయితే లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి లోపం లేదని పరమేశ్వర అన్నారు. ఈ కేసును సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. జెడిఎస్ నాయకుడు హెచ్‌డి కుమారస్వామి కూడా కర్ణాటకకు తిరిగి వచ్చి విచారణలో పాల్గొనాలని ప్రజ్వల్ రేవణ్ణకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వం ఈ అంశాన్ని దుర్వినియోగం చేస్తోందని కుమారస్వామి ఆరోపించారు. ప్రజ్వల్ రేవణ్ణతో కుమారస్వామి మాట్లాడుతూ.. ‘మీరేమీ చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు పారిపోయారు? మీరు ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి’ అని అన్నారు.
*అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు నిక్కీ హేలీ మద్దతు
నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో తాను డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేస్తానని రిపబ్లికన్ పార్టీ మాజీ అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలీ బుధవారం చెప్పారు. అయితే, ఎన్నికల ప్రచారంలో తన మాజీ ప్రత్యర్థి ట్రంప్‌ను నెలల తరబడి తీవ్రంగా విమర్శించినప్పటికీ ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. నవంబర్ 5న జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ట్రంప్, డెమొక్రాటిక్ అధ్యక్షుడు జో బిడెన్ మధ్య జరిగే రీమ్యాచ్‌లో హేలీ మద్దతుదారుల ఓట్లు ఎవరికి దక్కుతాయనే దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే హేలీ మార్చిలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని వదులుకున్నారు. ఎన్నికల ప్రచారం చేయనప్పటికీ ఆమెకు ఇప్పటికీ 10శాతం కంటే ఎక్కువ ఓట్లు పొందే అవకాశం ఉంది. ఆ ఓట్లలో చాలా వరకు రిపబ్లికన్లు, స్వతంత్రులే.. వీరంతా ట్రంప్‌పై అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది డెమొక్రాట్లు కూడా ఆమెకు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు రెండేళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో నిక్కీ హేలీ అమెరికా రాయబారిగా పనిచేశారు. ట్రంప్ నామినేషన్ ను ఆమె ఎన్నడూ సవాలు చేయలేదు. తన ఎన్నికల ప్రచారాన్ని ముగించే ముందు ఒక రాష్ట్రం, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాను మాత్రమే గెలుచుకున్నారు. కానీ ఆమె ప్రచారం చివరి నెలల్లో ట్రంప్ వ్యతిరేక విభాగానికి హేలీని ప్రమాణం చేసింది. ఈ విధానాలపై ట్రంప్ సరైనది కాదని ప్రశ్నోత్తరాల సెషన్‌లో హేలీ ఓటర్లకు చెప్పారు. ఈ విషయాన్ని చాలాసార్లు స్పష్టం చేశాను. కానీ బిడెన్ వినాశకరమైనది, కాబట్టి బుధవారం ఆమె వాషింగ్టన్‌లోని సాంప్రదాయిక థింక్ ట్యాంక్ అయిన హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రంప్‌కు ఓటు వేస్తానని చెప్పారు. కార్యాలయం నుండి వైదొలగిన తర్వాత హేలీ మొదటిసారిగా బహిరంగంగా కనిపించడం ఇదే. తన ఎన్నికల ప్రచారాన్ని ముగించినప్పుడు ఆమె ట్రంప్‌కు మద్దతు ఇవ్వలేదు. తన మద్దతుదారులను చేరుకోవడానికి.. వారి ఓట్లను పొందాలని ఆమె ట్రంప్‌కు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యను ఆమె బుధవారం కూడా పునరావృతం చేశారు. తనకు ఓటేసిన లక్షలాది మంది ప్రజలకు చేరువయ్యేందుకు, తన మద్దతును కొనసాగించేందుకు ట్రంప్ తెలివిగా వ్యవహరిస్తారని హేలీ అన్నారు.
*మెక్సికోలో స్టేజ్ కూలి తొక్కిసలాట.. ఐదుగురు మృతి, 50మందికి పైగా గాయాలు
ప్రస్తుతం మెక్సికోలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జూన్ 2న దేశంలో ఓటింగ్ జరగనుంది. దీని కోసం అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి. దేశంలోని న్యూవో లియోన్ రాష్ట్రంలోని శాన్ పెడ్రో గార్సియాలో రాజకీయ పార్టీ సమావేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈదురుగాలులు, తుపాను కారణంగా ఎన్నికల సభ వేదిక కూలిపోయి సభకు హాజరైన పలువురిని చుట్టుముట్టింది. మెక్సికో అధ్యక్ష అభ్యర్థి జార్జ్ అల్వారెజ్ మెనెజ్ ప్రచార కార్యక్రమంలో వేదిక కూలి ఐదుగురు మరణించారని ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు. ట్విటర్‌లో ప్రమాదం గురించి సమాచారం ఇస్తూ.. అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఇలా వ్రాశారు, “బలమైన గాలుల కారణంగా, ఉత్తర మెక్సికోలోని శాన్ పెడ్రో గార్జా గార్సియా నగరంలో ప్రమాదం సంభవించింది.” ప్రమాదంలో ఐదుగురు మరణించారని.. 50 మందికి పైగా గాయపడ్డారని ఒబ్రాడోర్ ధృవీకరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అధ్యక్షుడు.. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం న్యూవో లియోన్ గవర్నర్ శామ్యూల్ గార్సియా సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. ప్రమాదాన్ని ఉదహరించారు. బలమైన తుఫాను కారణంగా నివాసితులు తమ ఇళ్లలో ఉండాలని కోరారు. వేదికపై ఉన్న ప్రెసిడెంట్ అభ్యర్థి జార్జ్ అల్వారెజ్ మెనెజ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆ తర్వాత అతను క్షేమంగా ఉన్నాడని.. ప్రమాద స్థలానికి తిరిగి వెళ్తున్నానని రేడియోతో చెప్పాడు. వారి బృందం సభ్యులు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెక్సికోలో ఓటు వేయడానికి కొన్ని రోజుల ముందు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం తర్వాత, పౌర ఉద్యమ పార్టీ ఎన్నికల సమావేశాలన్నీ వాయిదా పడ్డాయి. జూన్ 2న దేశంలో కొత్త ప్రభుత్వానికి ఓటింగ్ జరగనుంది.
*మగువలకు శుభవార్త.. తులం బంగారంపై ఏకంగా రూ.1000 తగ్గింది!
ఇటీవలి కాలంలో బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా రూ.75 వేల మార్క్‌కి చేరుకుంది. అయితే పెరుగుతూ పోయిన పసిడి ధరలు.. ఇటీవలి రోజుల్లో దిగొస్తున్నాయి. గత మూడు రోజులుగా స్వల్పంగా తగిన గోల్డ్ రేట్స్.. నేడు భారీగా తగ్గాయి. తులం బంగారంపై ఏకంగా రూ.1000 తగ్గింది. గురువారం (మే 23) బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరూ.67,300గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,420 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,450గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73570గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67300 కాగా.. 24 క్యారెట్ల 10 ధర రూ.73420గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.67500.. 24 క్యారెట్ల ధర రూ.73640గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67300 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,420గా నమోదైంది. నేడు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండిపై ఏకంగా రూ.3,300 తగ్గి.. రూ.92,500లుగా ఉంది. ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.92,500 ఉండగా.. ముంబైలో రూ.92,500గా ఉంది. చెన్నైలో రూ.97,000లుగా నమోదవగా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.97,000లుగా ఉంది. కిలో వెండి ధర బెంగళూరులో రూ.95,600గా ఉంది.