చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులపై కేసులు
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచర్లపై ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.. కష్టడిలో ఉన్న ముద్దాయిని దౌర్జన్యంగా తీసుకెళ్లారంటూ చింతమనేని, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు.. చింతమనేని , అతని అనుచరులపై Cr. No. 189/2024 u/s 224, 225, 353, 143 r/w 149 IPC కేసులు పెట్టారు.. అయితే, పెదవేగి పోలీస్ స్టేషన్‌లో నిన్న పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు చింతమనేని.. కొప్పులవారిగూడెంలో ఎలక్షన్ రోజున బూత్ లో కత్తెరతో దాడి చేసిన రాజశేఖర్ అనే టీడీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. దాడిలో గాయపడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రవి పోలీసులకు ఫిర్యాదు మేరకు అతన్ని స్టేషన్‌లో ఉంచారు సీఐ.. అయితే, విషయం తెలుసుకుని పెదవేగి పోలీస్ స్టేషన్‌లో ఉన్న టీడీపీ కార్యకర్తను బయటకు తీసుకొచ్చి తనకారులో చింతమనేని ప్రభాకర్ తీసుకెళ్లారట.. స్టేషన్‌లో ఉన్న వ్యక్తిని తన అనుమతి లేకుండా ఎలా తీసుకెళ్తారు అంటూ చింతమనేనితో వాగ్వాదానికి దిగారు సీఐ కొండవీటి శ్రీనివాస్.. అయినా.. అతడిని చింతమేని ప్రభాకర్ తీసుకెళ్లడంతో.. ఇప్పుడు కేసులు నమోదు చేశారు.. విడియో సాక్షాలు ఆధారంగా త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామన్న డీఎస్పీ లక్ష్మయ్య పేర్కొన్నారు.
ఏపీలో హింసాత్మక ఘటనలు.. రంగంలోకి సిట్
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతర చెలరేగిన హింసపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలకు పూనుకుంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు అందజేసిన నివేదిక ఆధారంగా అధికారులపై వేటు వేసింది.. మరోవైపు.. ఈ హింసాత్మక ఘటనలపై రంగంలోకి దిగనుంది స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీవ్ (సిట్).. ఎందుకంటే.. ఆ ఘటనలపై సిట్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం సిట్ ఏర్పాటు చేస్తున్నారు.. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటన పైనా నివేదిక ఇవ్వనుంది సిట్.. పల్నాడు, మాచర్ల, నరసరావు పేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై దర్యాప్తు చేయనున్న సిట్.. అసలు అల్లర్లు చెలరేగింది ఎక్కడ? వాటికి బీజం వేసింది ఎవరు? హింసాత్మకంగా మారడానికి కారణాలు ఏంటి..? తదితర అంశాలపై అధ్యయనం చేయనుంది.. ఇక, తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఘటననూ సిట్ పరిధిలోకి తేవాలా..? వద్దా..? అనే అంశంపై మల్లగుల్లాలు పడుడుతున్నారట అధికారులు.. మరోవైపు.. తాడిపత్రి ఘటనలో డీఎస్పీ చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని భావిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉందంటున్నారు.. ప్రతి ఘటన పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఇప్పటికే ఎన్నిలక కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.. వివిధ ఘటనల్లో పోలీస్ అధికారుల వైఫల్యం కన్పించడంతో ఇప్పటికే.. బాధ్యులపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) వేటు వేసిన విషయం విదితమే.
ఏపీలో మళ్లీ అల్లర్లు..! కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి.. ఇక, పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.. ఇప్పుడు అంతా ప్రశాంతంగా కనిపిస్తోన్నా.. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది.. అల్లర్లకు అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ కొందరిపై ఎన్నికల కమిషన్ వేటు కూడా వేసిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం చేసిన హెచ్చరికలు మళ్లీ కలవరపెడుతున్నాయి. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత అంటే జూన్ 4వ తేదీ తర్వాత గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది ఇంటెలిజెన్స్.. ఈ నేపథ్యంలో జూన్ 19వ తేదీ వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరం అయితే కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూలహా ఇచ్చింది. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించింది ఇంటెలిజెన్స్.. ఇదే విషయంపై ఇప్పటికే కేంద్ర హోంశాఖను హెచ్చరించింది ఎన్నికల కమిషన్.. ఏపీలో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత 15 రోజుల వరకు 25 కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని ఆదేశించింది.
తాడిపత్రి అల్లర్లపై స్పందించిన వైసీపీ..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం విదితమే.. అయితే, ఆ ఘటనలపై మీడియాతో మాట్లాడిన వైసీపీ నేతలు.. టీడీపీపై మండిపడ్డారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రిలో టీడీపీ హింసా రాజకీయాలను ఖండిస్తున్నాం.. ఎస్పీ అమిత్ బర్దర్ సమక్షంలోనే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్ పై దాడి జరిగింది.. ఎస్పీ అమిత్, ఏఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరించారు.. పోలీసుల సహకారంతోనే తాడిపత్రి లో వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు జరిగాయి.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దౌర్జన్యం అమానుషం.. ఏఎస్పీ రామకృష్ణని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.. ఇక, ఉరవకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే టీడీపీ హింస రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.. చంద్రబాబు డైరెక్షన్లో ఇష్టారాజ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం వల్లే ఎన్నికల్లో హింస చెలరేగిందన్న ఆయన.. రౌడీషీటర్లు, ఖూనీకోర్లను పయ్యావుల కేశవ్ పోలింగ్ ఏజెంట్లు గా పెట్టారని ఆరోపించారు. తాడిపత్రిలో టీడీపీ అరాచకాలకు పోలీసులే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. వైఎస్సార్ సీపీ శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు మాట్లాడుతూ.. టీడీపీ – జనసేన – బీజేపీలకు ఓటమి భయం పట్టుకుందన్నారు.. అందుకే వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి పిరికిపంద చర్యగా భావిస్తున్నాం అన్నారు శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు.
నెల్లూరులో దారుణం.. పెళ్లికి నిరాకరించిన యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి
నెల్లూరు జిల్లా వింజమూరులోని పాతూరు యాదవ పాలెంలో దారుణం చోటు చేసుకుంది. వింజమూరు గ్రామానికి చెందిన నాగార్జున అనే యువకుడు యాదవ పాలెంలో ఉంటున్న ఓ యువతి వెంట పడుతున్నారు.. తనను వివాహం చేసుకోవాలని బలవంతం చేస్తూ.. చాలా రోజుల నుంచి వెంటపడుతున్నాడు. ఇరువురికీ బంధుత్వం ఉండటంతో యువకుడిని వివాహం చేసుకునేందుకు సదరు యువతి నిరాకరించింది. అయినా వెనక్కి తగ్గని యువకుడు.. పలుమార్లు వెంటపడుతూనే ఉన్నాడు.. ఆమె స్పందించలేదు. దానికి తోడు ఆ యువతికి వేరే సంబంధాలు చూస్తుండటంతో తీవ్రంగా ఆగ్రహించిన నాగార్జున… ఆ యువతి ఇంటికి వెళ్లి ఆమె పై కత్తితో దాడి చేశాడు. కూతురిని జరుగుతోన్న దాడిని గమనించిన తల్లి.. తన కూతురును కాపాడేందుకు ప్రయత్నించింది.. దీంతో.. ఆ యువతి తల్లిపై కూడా దాడి చేయడంతో ఇరువురికీ తీవ్ర గాయాలయ్యాయి. అయితే, బాధితులు గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు అక్కడికి రావడంతో నాగార్జున పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన తల్లీ.. కూతుళ్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. నిందితుడు నాగార్జున కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆస్తికోసం తల్లి అంతక్రియలు ఆపేసిన కొడుకు.. మూడు రోజులుగా ఫ్రీజర్ లోనే డెడ్ బాడీ
సూర్యపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారి గూడెం లక్ష్మమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఓ కుమారుడు చాలా కాలం క్రితమే మృతి చెందగా.. కూతుళ్ళ వద్దే ఉంటుంది లక్ష్మమ్మ. వీరి కోసం బాగానే ఆస్తులు సంపాదించింది. అయితే ఈ ఆస్తులే ఆమె అంత్యక్రియలకు అడ్డుగా మారాయి. కొద్దిరోజుల క్రితం తన కూతురు ఇంటికి వెళ్లిన లక్ష్మమ్మ ప్రమాదవశాత్తు జారీ పడింది. దీంతో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మమ్మను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితమే మృతి చెందింది. అయితే అనారోగ్యంతో చికిత్స పొందుతూ లక్ష్మమ్మ మృతి చెందడంతో కొడుకు, కూతుళ్లు ఆస్తి పంపకాలు పూర్తయ్య వరకు అంబులెన్స్ ను తరలించేది లేదని తేల్చిచెప్పారు దీంతో లక్ష్మమ్మ వద్ద ఉన్న 21 లక్షల రూపాయల్లో ఆరు లక్షలు వైద్య ఖర్చులకు ఖర్చు చేయగా మిగిలిన 15 లక్షల రూపాయలను కొడుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతురాలి వద్ద ఉన్న 20 తులాల బంగారాన్ని ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. పంపకాలు సమానంగా.. సమస్య లేకుండా ముగిసినా.. అంత్యక్రియలు చేయాల్సిన కొడుకు చివరి క్షణంలో కొర్రీ పెట్టడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి.
వాతావరణ శాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
కొన్ని రోజులు కురుస్తున్న వాలతో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. గురువారం సాయంత్రం ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు కురిశాయి. భాగ్యనగరంలో కురిసిన వర్షానికి ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు అంటే శుక్రవారం వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదన్నారు. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 – 50 కి.మీ. వేగంతో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు గంటకు 30 – 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, యాదాద్రి భువనగిరిలో మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
చార్‌ధామ్ యాత్రలో భక్తుల రద్దీ.. ఈనెల31 వరకు వీఐపీ దర్శనాలు బంద్
చార్‌ధామ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యాత్రకు భక్తులు పోటెత్తారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. చార్‌ధాయ్ యాత్ర ఈ నెల 10న ప్రారంభమైన విషయం తెలిసిందే. యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 వరకు వీఐపీలు ఆలయాలకు రావొద్దని సూచించింది. చార్‌ధామ్‌కు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాధా రాతురి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆలయాల 50 మీటర్ల పరిధిలో ఎలాంటి వీడియోలు తీయడం గానీ, రీల్స్ చేయరాదని తెలిపారు. యాత్రలో ఇప్పటికే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో కంటే అధికంగా జనాలు పోటెత్తుతున్నారు. అందుకే యాత్రకు వెళ్లాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టంచేసింది. రద్దీ రవాణా సదుపాయాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్ తేదీ కన్నా ముందుగా ప్రయాణం పెట్టుకోవద్దని భక్తులకు సూచించింది. ఈ వివరాలను సీనియర్ పోలీసు అధికారి అర్పణ్ యదువంశీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధ రాటూరి మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ చేయించుకోని భక్తులను యాత్రకు అనుమతించబోమని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలను పంపిస్తున్నామని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని వాహనాలకు కూడా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ పవిత్ర పుణ్య క్షేత్రాలలో 200 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లను వాడేందుకు అనుమతి లేదని, చార్‌ధామ్ యాత్ర గురించి తప్పుదోవ పట్టించే వీడియోలు, రీల్స్ అప్‌లోడ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. కేవలం రూ.500 పెట్టుబడితో రూ. 4లక్షలు ఆదాయం..
ఎటువంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని ఇచ్చే ఎన్నో పథకాలను ప్రభుత్వం అందిస్తుంది.. అందులో పోస్టాఫీస్ అందిస్తున్న ఫథకాలకు మంచి ఆదరణ ఉంది.. ఇప్పటివరకు ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది.. అవన్నీ కూడా మంచి రాబడిని అందిస్తున్నాయి.. అందులో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి.. ఈ పథకం బెనిఫిట్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం… ఇక ఈ పథకంలో సంవత్సరానికి కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఇలా దాదాపు 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. మీకు కావాలంటే, మెచ్యూరిటీ తర్వాత, మీరు 5 సంవత్సరాల బ్లాక్‌లో ఖాతాను పొడిగించవచ్చు. ఈ పథకంలో వడ్డి ఎక్కువ అసలు వడ్డి కలిపి మొత్తం 14 లక్షలు వరకు ఆదాయం పొందవచ్చు.. ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలో ఇప్పుడు వివరంగా ఒకసారి చూద్దాం.. ఉదాహరణకు ఈ పథకంలో మీరు నెలకు రూ.500 పెట్టుబడి పెట్టాలి. అలా ఇన్వెస్ట్ చేస్తే మీరు ఏటా రూ. 6,000 ఇన్వెస్ట్ చేస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. అటువంటి పరిస్థితిలో, ఈ పథకంలో ప్రతి నెలా రూ. 500 డిపాజిట్ చేయడం ద్వారా, మీరు 7.1 శాతం వడ్డీతో 15 సంవత్సరాలలో రూ. 1,62,728 జోడించవచ్చు. అలాగే మరో 5.5 ఏళ్లు పొడిగిస్తే 20 ఏళ్లలో రూ.2,66,332, 25 ఏళ్లలో రూ.4,12,321వరకు మీరు చివరకు పొందవచ్చు.. ఇంకా పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి..
సూర్య 44లో పూజా హెగ్డే.. అండమాన్‌లో షూటింగ్!
‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డేకు ఇటీవలి కాలంలో సరైన హిట్ లేదు. తెలుగులో ఆచార్య, రాధేశ్యామ్.. తమిళంలో బీస్ట్ నిరాశపరిచాయి. వరుస ఫ్లాప్స్ పడుతుండడంతో ఆ మధ్య గుంటూరు కారం నుంచి తప్పించారు. దాంతో ఒకప్పుడు చేతినిండా సినిమాతో బిజీగా ఉన్న పూజా.. ఇప్పుడు అవకాశాల్లేక అల్లాడుతోంది. సౌత్‌లో సినిమాలు లేకపోవడంతో హిందీలో సినిమాలు చేస్తున్నారు. అయితే పూజా ఎప్పటినుంచో సౌత్ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తోంది. తాజాగా బుట్టబొమ్మకు ఆ అవకాశం దక్కింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ సూర్య హీరోగా ‘సూర్య 44’ వస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుందట. పూజా హెగ్డే, సూర్య కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి. పూజా చివరగా తమిళంలో దళపతి విజయ్ బీస్ట్ సినిమాలో నటించింది. హిందీలో సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో బుట్టబొమ్మ నటించింది. ‘సూర్య 44’ షూటింగ్ జూన్ 2న అండమాన్ దీవులలో ప్రారంభమవుతుంది. అండమాన్ దీవులు, ఊటీ, తమిళనాడులోని ఇతర ప్రదేశాలలో 40 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌ను టీమ్ ప్లాన్ చేసింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు జోజు జార్జ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చనున్నారు.
బాలయ్య బర్త్ డే రోజు.. ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్..
నందమూరి నట సింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది.ఇటీవలే ఈ సినిమా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్ లో ద్విశతదినోత్సవం జరుపుకుంది.ఇదిలా ఉంటే బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “NBK109 “ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ,సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా కు సంబంధించి గ్లింప్సె వీడియోను రిలీజ్ చేసారు.ఈ గ్లింప్సె లో బాలయ్య మాస్ లుక్, పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల జరుగుతున్న కారణంగా బాలయ్య సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఫుల్ ఫోకస్ రాజకీయాలపై పెట్టారు.ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో బాలయ్య మళ్ళి షూటింగ్ కు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.ఇదిలా ఉంటే “జూన్ 10 ” బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే వారు ఊహిస్తున్నట్లుగానే బాలయ్య బర్త్ డే కి ఫ్యాన్స్ కు మేకర్స్ స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారు.NBK109 మూవీకి సంబంధించి టైటిల్ మరియు టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.త్వరలోనే దీనికి సంబంధించి మేకర్స్ అధికారక ప్రకటన చేయనున్నారు.
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా?
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. దేవర చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. అదే విధంగా బాలీవుడ్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టింది.. ఈ రెండు సినిమాలు అవ్వగానే ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చెబోతున్నాడు.. ఆ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ 31 పేరిట మొదలుకానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.. ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చెయ్యనున్నట్లు ఓ వార్త షికారు చేస్తుంది. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఇప్పటివరకూ తన చిత్రాలన్నింటికీ కాస్త వెరైటీ టైటిల్స్‌యే పెట్టారు నీల్. కేజీఎఫ్, సలార్ ఇలా ఈ పేర్లను పెట్టారు. అలాగే డ్రాగన్ అనే పేరుకు సినిమా స్టోరికి ఏదైన లింక్ ఉందేమో చూడాలి.. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం సలార్ 2 షూటింగ్ మొదలుపెట్టేందుకు నీల్ రెడీగా ఉన్నారు. ఈ నెలాఖరులో సలార్ 2 షూటంగ్ మొదలవబోతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళాలనే ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్.. ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తున్నాడో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
అటల్ సేతు వంతెనపై రష్మిక మందన్న వీడియో.. స్పందించిన మోడీ
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సౌత్ సినిమాలోనే కాకుండా హిందీ ప్రేక్షకులలో కూడా బాగా పాపులర్ అయ్యింది. రష్మిక గత కొన్నేళ్లుగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తోంది. ఆమె చివరిగా రణబీర్ కపూర్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘యానిమల్’లో కనిపించింది. ఇప్పుడు రష్మిక అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రంలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రష్మిక మందన్న అటల్ సేతు వంతెనను పొగుడుతూ కనిపించింది. ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి 2 గంటల సమయం పట్టేదని.. ఇప్పుడు వారు కేవలం 20 నిమిషాల్లో అక్కడికి చేరుకోవచ్చని వివరించింది. బ్రిడ్జి విశేషాలను వివరిస్తూ.. సముద్రంపై 22 కిలోమీటర్ల పొడవున నిర్మించిన అతి పొడవైన వంతెన ఇదేనని చెప్పింది. ‘ఎవరూ దాని గురించి ఆలోచించలేదు. ఇంజినీరింగ్‌లో ఇదో అద్భుతం. అద్భుతమైన మౌలిక సదుపాయాలను చూస్తే గర్వంగా అనిపిస్తుంది.” అచి వీడియోలో చెప్పారు. ఈ వీడియోలను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన ఆమె “దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు… పశ్చిమ భారతదేశం నుంచి తూర్పు భారతదేశం వరకు… ప్రజలను కలుపుతోంది. హృదయాలను కలుపుతోంది!” అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ వీడియోపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. రష్మిక పోస్ట్‌ను తన “ఎక్స్” ఖాతాలో పంచుకున్నారు. “ఖచ్చితంగా!” అని రాశారు. “ప్రజలను కనెక్ట్ చేయడం, జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైనది మరొకటి లేదు.” అని రాసుకొచ్చారు.