కోర్టు దఫేదార్ పట్ల ఆత్మీయ చూపిన సీజేఐ
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం సౌమ్యుల నైజం.. అది కొందరికే సాధ్యం.. అందులో ఒకరు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అని చెప్పాలి.. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో క్రింది స్థాయి చిరు ఉద్యోగి పట్ల చూపిన ఆత్మీయ పలకరింపు అందరిని ఆశ్చర్య చకితులను చేసింది. తిరుపతి, తిరుమలలో నిన్న, ఈ రోజు రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు సీజేఐ దంపతులు.. అయితే, మంగళవారం ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో న్యాయ శాస్త్ర దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అధితిగా సీజేఐ హాజరైయ్యారు. ఈ సందర్భంగా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో తిరుపతిలో 3వ అదనపు సెషన్ జడ్జి దఫేదార్‌గా ఎం. దొరై రాజు అనే వ్యక్తి ప్రస్తుతం పని చేస్తున్నారు.. అయితే, సీజేఐ డీవై చంద్రచూడ్ తండ్రి.. అప్పటి సీజే వైవీ చంద్రచూడ్.. 1982 నుంచి తిరుమలకు అనేకసార్లు శ్రీవారి దర్శనం కోసం వస్తూ ఉండేవారు.. అప్పటి నుంచి తండ్రికి పరిచయం అయిన అతను తిరుపతికు వచ్చిన ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్‌కు కనిపించారు.. ఆ వెంటనే దఫేదార్ గురుంచి తన కుటుంబ సభ్యులకు పరిచయం చేసారు చీఫ్ జస్టిస్.. కుటుంబ సభ్యుల గురుంచి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. ఇలా సుమారు 5-10 నిమిషాలు ఒక చిన్న స్థాయి ఉద్యోగి పట్ల సీజేఐ చూపిన ఆప్యాయత మరువలేనిది అంటూ అక్కడనున్న రాష్ట్ర, హైకోర్ట్, జిల్లా జడ్జిలు, న్యావాదులు మంత్ర ముగ్ధులయ్యారు.
భానుడి భగభగలు.. మూడు రోజులు మరింత హీట్..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. తెల్లవారుతూనే సూర్యుడు సెగలుగక్కుతున్నాడు. భానుడి భగభగలకు ఉదయం 9 గంటలకే మాడు బద్దలవుతోంది. బయటకు రావాలంటేనే జనం ఆలోచించాల్సిన పరిస్థితి.. దంచికొడుతోన్న ఎండలు.. రాబోయే మూడు రోజులూ మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోనూ సన్ సెగ పెరిగింది. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు మరింత పెరగనున్నాయి. దీంతో వివిధ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో విపరీతమైన ఎండలు ఉంటాయని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పెరుగవచ్చని చెప్పింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లిలో నేడు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు వాతావవరణ శాఖ అధికారులు.. ఇక, రేపు వేడిగాలులు కొనసాగుతాయని, తూర్పు, దక్షిణ తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ చెప్పింది. వచ్చే ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉదని హెచ్చరిస్తున్నారు.
మూడు రోజుల్లో జనంలోకి జనసేనాని..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే.. పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.. ఇక, షెడ్యూల్ వచ్చిన తర్వాత అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి.. రాష్ట్రంలో ప్రచార పర్వం నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఓవైపు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోవైపు.. నేటి నుంచే ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో.. ప్రతీ నియోజకవర్గాన్ని టచ్ చేసేలా.. ఆఖరి వ్యక్తి వరకు తమ సందేశం చేరేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు పార్టీల నాయకులు. మరోవైపు.. మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తెరలేపనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నేటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. ప్రజాగళం పేరుతో సభలు, సమావేశాలు, రోడ్ షోలు చేయనున్నారు. ఇప్పటికే తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రచారం సాగిస్తున్నారు చంద్రబాబు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. నేటి నుంచి చంద్రబాబు ప్రజాగళం ప్రచార యాత్ర కూడా రాయలసీమ నుంచే ప్రారంభం అవుతుంది. 31 వరకు ఆయన ప్రచార షెడ్యూల్ ఖరారైంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు. ఇక, ఈ నెల 30వ తేదీ నుంచి జనంలోకి వెళ్లనున్నారు జనసేనాని పవన్ కల్యాణ్… తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గంలోనే మూడు రోజులు మకాం వేయనున్నారు. 30 నుంచి మూడు రోజుల పాటు పిఠాపురంలోనే పవన్ కల్యాణ్ పర్యటన సాగనుంది. 30న నియోజకవర్గ నేతలతో సమీక్ష ఉంటుంది. 31న ఉప్పాడలో సెంటర్‌లో బహిరంగసభలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. ఏప్రిల్ 1న పిఠాపురంలో మేధావులతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచార షెడ్యూల్ ఖరారు చేయనుంది జనసేన పార్టీ.
చంద్రబాబును ఓడిస్తాం.. కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇస్తాం
రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం.. కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇస్తాం అని ప్రకటించారు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్.. చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఇద్దరు నేతలు.. తెలుగుదశం పార్టీకి ఓటు వేయకపోతే మీ భర్తలకు అన్నం పెట్టవద్దు అని చిచ్చులు పెడుతున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు ఎప్పుడు నిజాలు మాట్లాడడు అని దుయ్యబట్టారు. గత 5 ఏళ్లలో కుప్పంలో అనేక అభివృద్ధి పనులు చేశాం.. మేం అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు అడుగడుగునా అడ్డు పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన ఉణికిని కాపాడుకోవడానికి కుప్పంలో టీడీపీలో పలువురు చేరారు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా బాపట్ల నుండి తీసుకొచ్చారు అని దుయ్యబట్టారు ఎంపీ రెడ్డప్ప.. వైసీపీని చూసి చంద్రబాబు భయపడి.. డబ్బున్న వ్యక్తులకు టిక్కెట్లు ఇస్తున్నారన్న ఆయన.. టీడీపీలో ఎవరైనా మాకు ఓట్లు వేయండి అని అడిగేవారు ఉన్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు సమావేశాలకు కర్ణాటక, క్రిష్ణగిరి, చిత్తూరు వాళ్లే పాల్గొన్నారు.. కానీ, కుప్పం వాళ్లు లేరని విమర్శించారు. ఇక, వాలంటీర్ల పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు.. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం.. కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇస్తాం అన్నారు. చిత్తూరు జిల్లా అన్ని విధాలా వెనుకబడింది.. కుప్పంలో 35 ఏళ్లుగా చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు? అని నిలదీశారు. అసలు చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్..
గ్రూప్-1 పరీక్ష రద్దు పిటిషన్.. విచారణ 18కి వాయిదా
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష రద్దు విషయంలో ఏపీ ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది ఏపీపీఎస్సీ.. అయితే, ఈ పిటిషన్‌పై ఈ నెల 21వ తేదీక కీలక ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు.. ఈ రోజు విచారణ జరపాల్సి ఉండగా.. తదుపరి విచారణను వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది.. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కొనసాగుతారని గతంలోనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే.
ఆ కంటైనర్‌లో వెళ్లింది ఫర్నిచర్..! వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు..
విశాఖపట్నం డ్రగ్స్ కంటైనర్ కేసు తీవ్ర కలకలం రేపింది.. అయితే, ఈ కేసులో సీబీఐ స్పీడ్ పెంచి విచారణ చేస్తోంది.. మరోవైపు.. కంటైనర్ ఎటు వెళ్లినా.. దానిపై రకరకాల ప్రచారం సాగుతోంది.. విమర్శలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. సీఎం క్యాంప్ ఆఫీస్ లోకి వెళ్లిన కంటైనర్‌పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నిచర్ వెళ్తే దుష్ప్రచారం చేయడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వైజాగ్ పోర్ట్ కు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ నారా లోకేష్ బంధువులదే అని ఆరోపించారు.. అందుకే ఏ కంటైనర్ చూసినా వారికి అనుమానం వస్తుందని దుయ్యబట్టారు.. దొడ్డి దారిలో మంత్రి అయిన నారా లోకేష్ కు ఇంతకుమించి సంస్కారం ఉంటుందని అనుకోలేమని హాట్ కామెంట్లు చేశారు. బీసీల అడ్డా అయిన ఉత్తరాంధ్రలో ఎంపీ అభ్యర్థులుగా ఓసీలు అయిన శ్రీ భరత్, సీఎం రమేష్‌లకు టికెట్లు ఇచ్చి కూటమి ఏం మెసేజ్ ఇచ్చిందో చెప్పాలి? అని నిలదీశారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక బీసీలకే పోటీ చేసే అవకాశం ఇచ్చిందని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర లో ఇతర ప్రాంత ఎంపీ ఓసీ అభ్యర్థుల ఆధిపత్యాన్ని ప్రచారంలో ఎండగడతాం అన్నారు వైవీ సుబ్బారెడ్డి..
రాజమండ్రిలో వాలంటీర్ల సామూహిక రాజీనామాలు..
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పలు వార్డులకు చెందిన వాలింటీర్లు సామూహిక రాజీనామాలు చేశారు. రాజమండ్రి క్వారీ మార్కెట్ సమీపంలో ఉన్న 1వ వార్డు, 47, 48, 49, 50 వార్డులకు చెందిన 28 మంది వాలంటీర్ల తమ పదవులకు రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. 2019 నుంచి నిస్వార్ధంగా ఎలాంటి లంచాలు తీసుకోకుండా పనిచేస్తున్న మమ్మల్ని… ప్రతిపక్షాలైన తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీలు మాటలతో హింసిస్తున్నారు.. అందుకే మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నామని ప్రకటించారు వాలంటీర్లు.. మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో సిబ్బంది సరిపోనప్పుడు.. కరోనా సమయంలో మాకు అప్పజెప్పిన 50 కుటుంబాలకు మేం మెడిసిన్ అందించాం.. విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా పనిచేసిన మాపై ఇలాంటి విమర్శలు చేయడం బాధ కలిగిస్తోంది అంటున్నారు వాలంటీర్లు.
వాళ్లు.. చేవెళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యం
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపైన ఆయన ఘాటైన కామెంట్స్ చేశారు. రంజిత్ రెడ్డి ఎవరో కూడా ఇక్కడి ప్రజలకు తెలియదు.. కానీ, మన పార్టీ సీటు ఇచ్చి గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసిందన్నారు. 2019లో రాజకీయాలకు కొత్త అయినా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారు.. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చాం.. నియోజక వర్గంలో స్వేచ్చ ఇచ్చాం.. ఈ ఎన్నికల్లో పోటీ చేయనని పార్టీ ముందు అవశక్యతను వ్యక్త్యం చేసి.. రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి.. కేవలం అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటూ కేటీఆర్ విమర్శించారు. పార్టీ సీనియర్ నాయకురాలు రంజిత్ రెడ్డి తన సోదరి అని చెప్పుకున్న ఎమ్మెల్సీ కవిత పైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో దాడి చేసి.. అరెస్టు చేసిన రోజే.. ఆయన నవ్వుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరిన స్వార్థపరుడు అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా రంజిత్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందో చెప్పాలన్నారు. గత ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కంటే.. తానే ఎక్కువ అనుకొని వేరే పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసు అని ఆయన చెప్పుకొచ్చారు. ఒక పార్టీ కంటే తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఎక్కువ రోజులు ఉండలేరంటూ విమర్శించారు.
హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు
హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. ఇవాళ ( బుధవారం ) ఉదయం 10.40 నుంచి దాదాపు 25 నిమిషాల పాటు మెట్రో రైల్ సేవలు ఆగిపోయాయి. దీంతో జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర దాదాపు 15 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నాగోల్ టు మియాపూర్ మెట్రో రూట్ లో మెట్రో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 15 నిమిషాల తర్వాత తిరిగి మెట్రో రైలు ప్రారంభమైంది. అయితే, హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను తప్పించుకునేందుకు చాలా మంది టైం సేఫ్ కోసం.. తొందరగా వెళ్లేందుకు చాలా మంది మెట్రో రైళ్లులో వెళ్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులు చేసే వాళ్లు చాలా మంది మెట్రోలోనే ప్రయాణం చేస్తుంటారు. అయితే, అపుడపుడు సాంకేతిక లోపంతో మెట్రో రైళ్లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.
బీఆర్ఎస్ ఓడింది ఊర్లలో మాత్రమే.. హైదరాబాద్లో కాదు..
మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మేము గెలుస్తాం అని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. వాళ్ళు చేసిందేమీ లేదు.. స్వాత్యంత్రం వచ్చి 75 ఏళ్లైన ఏ రంగం బాగుపడలేదు.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదు.. మల్కాజ్ గిరి పార్లమెంట్ లో వాళ్ళకి క్యాడర్ లేదు.. ఏం మొహం పెట్టుకొని వాళ్లు ఓట్లు అడుగుతారు అని ఆయన మండిపడ్డారు. గ్యాస్ సిలెండర్ ధర 1200 రూపాయలకు పెంచి పేదలను దోచుకుంటున్నారు.. దేశ ప్రజలను జాతీయ పార్టీలు మోసం చేశాయని మల్లారెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు.. ఎట్లా గెలుస్తుంది!.. మొన్న ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ కు ఓటు వేశామో అని ప్రజలు అనుకుంటున్నారు అని మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్, మల్కాజ్ గిరిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు.. ఊర్లలో మాత్రమే బీఆర్ఎస్ ఓడిపోయింది.. హైదరాబాద్ లో గెలవడానికి కారణం కేటీఆర్ చేసిన అభివృద్ది.. ప్రతిపక్షాలకు ఓటు బ్యాంక్ లేదు.. ఎండాకాలం వస్తే నిండు కుండల చెరువులు, ప్రాజెక్టులు ఉండే.. కానీ ఇప్పుడు ఎండిపోయినాయి.. మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావాలి, ప్రాజెక్టుల్లో నీళ్ళు రావాలి అని ఆయన పేర్కొన్నారు. గెలుపు మనదే.. మళ్లీ గెలిచేది కేసీఆరే అని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
హైకోర్టులో దానం నాగేందర్కి వ్యతిరేకంగా పిటిషన్
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఎమ్మెల్యే దానం నాగేందర్ కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు అయింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై గెలుపొందిన దానం.. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.. గత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున దానం నాగేందర్ బరిలో ఉన్నారు. అయితే, ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా దానం నాగేందర్ పోటీ చేయడం చట్ట విరుద్ధం.. ఇది రాజ్యాంగ విరుద్ధం అని పిటిషనర్ రాజు యాదవ్ పేర్కొన్నారు. వెంటనే దానం నాగేందర్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. ఇక, దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. అయితే, దీనిపై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
దూకుడు పెంచిన ఈడీ.. పలు ప్రాంతాల్లో దాడులు..!
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత దీపక్ సింగ్లా, చండీగఢ్ లోని ఆ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజం నివాసాలతో సహా పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడులు కొనసాగుతున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుతో ముడిపడి ఉన్నాయా అనేది స్పష్టంగా లేనప్పటికీ., జామ తోటల పరిహారం స్కామ్ సంబంధించి లింక్డ్ మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఫెడరల్ ఏజెన్సీ దాడులు నిర్వహిస్తోందని తెలుస్తోంది. అంతకుముందు మార్చి 23న దేశ రాజధానిలోని ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ నివాసంలో ఈడీ దాడులు నిర్వహించడం గమనార్హం. మరోవైపు ఎక్సైజ్ పాలసీ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోంది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు త్వరలో ప్రజల ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ సోదాలని చూస్తే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దూకుడును పెంచినట్లుగా అర్థమవుతుంది.
శుభ్‌మాన్ గిల్‌కు భారీ షాక్.. 12 లక్షల జరిమానా!
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతడికి 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ను నమోదుచేసినందుకు గాను గిల్‌కు ఈ ఫైన్ విధించారు. ఈ విషయాన్ని ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ 2024లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. ‘ఐపీఎల్ 2024లో భాగంగా మార్చి 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా విధించాం. ఐపీఎల్ నియమావళి మినిమమ్ ఓవర్ రేట్ రూల్స్ ప్రకారం.. గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించాం’ అని ఐపీఎల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సీజన్‌లో గుజరాత్ జట్టు చేసిన మొదటి నేరం కావడంతో గిల్‌కి రూ. 12 లక్షల జరిమానాతో బయటపడ్డాడు. రెండోసారి ఇలానే జరిగితే రూ. 24 లక్షల జరిమానా, జట్టు సభ్యుల వేతనంలో కోత పడుతుంది. మూడోసారి కూడా ఇదే రిపీట్ అయితే.. జరిమానాతో పాటు కెప్టెన్ ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఓటీటీలోకి వచ్చిసిన డబల్ ఇంజిన్ సినిమా.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!
2024 జనవరి 5న థియేటర్లలో రిలీజ్ అయిన డబల్ ఇంజన్ మార్చి 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సినిమాల కంటే బయట అనేక వివాదాలతో బాగా ఫేమస్ అయిన గాయత్రి గుప్తా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కించారు. రోహిత్ పెనుమాత్స ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శశి, రోహిత్ లి కథనం పొందుపరిచారు. కేవలం 12 రోజుల్లోనే 30 లక్షల బడ్జెట్ తో ప్రయోగాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో గాయత్రి గుప్తా, అజిత్ కుమార్, రోహిత్ నరసింహ, ముని, రాజు లు ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈ సినిమా తెలంగాణ యాసతో రియల్ ఎస్టేట్ గా రూపొందించారు. ఇక ఈ సినిమాను రెండు తలల పామును పట్టుకొని భారీగా డబ్బు సంపాదించాలన్న బ్యాక్ డ్రాప్ కథతో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా జనవరి 5, 2024 అతి తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. అదేరోజున అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ కావడంతో ఈ సినిమా థియేటర్లోకి వచ్చి పోయినట్లు కూడా చాలామందికి తెలియదు.
తండ్రికి తగ్గ తనయుడిగా.. రామ్ చరణ్ మరింత విజయాలు అందుకోవాలి: పవన్ కళ్యాణ్
ఈరోజు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ పుట్టినరోజు. నేటితో ఆయన 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా చరణ్-ఉపాసన దంపతులు ఈ రోజు ఉదయం కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇక పుట్టినరోజు సందర్భంగా చరణ్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెష్ చెప్పారు. రానున్న రోజుల్లో చరణ్ మరింత విజయాలు అందుకోవాలని కోరుకున్నారు. ‘ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్‌కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందాన్ని, సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్.. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞుల పట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడు. అవే అతడికి శ్రీరామ రక్షగా నిలుస్తాయి, మరింత ఉన్నత స్థాయికి ఎదగటానికి దోహదపడతాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్.. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.