*మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది..
మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆధ్వర్యంలో టూరిజం ప్లాజాలో నిర్వహించిన వెండర్స్ డెవలప్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. MSME ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించిన ఆయన వాటిని పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడానికి ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి వ్యవసాయం నుంచి పారిశ్రామికీకరణ వైపు నడిపించడానికి గత ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రణాళికలు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయన్నారు. సువిశాలమైన భారతదేశంలో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికిని ఉత్పత్తి రంగాలన్నింటినీ పంచవర్ష ప్రణాళికలు గానీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు దేశ పురోగతిలో కీలక పాత్రను పోషిస్తున్నాయన్నారు. ప్రపంచీకరణ సరళీకరణ వచ్చిన తర్వాత దేశంలోకి వచ్చిన తర్వాత మల్టీ నేషనల్ కంపెనీలు మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ ను మింగేశాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. వెల్త్ ఒకే చోట ఉండటం ప్రజాస్వామ్యానికి, సమాజానికి ప్రమాదకరం.. మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ ను ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది.. ఉద్యోగ ఉపాధి కల్పన సమానత్వం సామాజిక న్యాయం వృద్ధిరేటు పెరగడానికి ఎంఎస్ఎంఈ తోడ్పాటు అవుతుంది అని భట్టి విక్రమార్క తెలిపారు. భూతద్దంలో పెట్టి వెతికిన మల్టీ నేషనల్ కంపెనీల వల్ల సామాజిక న్యాయం సమానత్వం ఉద్యోగ ఉపాధి కల్పన కనిపించదు అని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. మల్టీ నేషనల్ కంపెనీలతోనే అభివృద్ధి సాధ్యం అన్నది గ్లోబల్స్ ప్రచారం మాత్రమే.. ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ను పెంచుతాం ప్రభుత్వ పరంగా ప్రోత్సహకాలు ఇస్తాం.. ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పెంచి యువ పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా, మేధోపరంగా సహకారం అందిస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పన పెరుగుతుంది. దీని వల్ల దేశ వృద్ధిరేటు పెరగడానికి దోహదపడుతుంది అని ఆయన పేర్కొన్నారు. వనరులు సమానంగా పంచి, సంపద సృష్టించే రంగాల్లో అందరిని భాగస్వాములు చేయడం వల్లనే సమ సమాజ స్థాపన జరుగుతుంది.. సంపద సృష్టించే రంగాల్లో అందరిని భాగస్వామ్యం చేయకుంటే దేశంలో అసమానతలు పెరిగిపోవడం ఈ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ యువ పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ప్రోత్సాహకాలు అందిస్తుంది.. సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి రాయితీలు ప్రోత్సాహకాలు కావాలని కోరారు.. రాష్ట్రానికి సమాజానికి నష్టం లేనప్పుడు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగానే ఉంటుంది అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
*చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని తాజాగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఐఆర్ఆర్ కేసులో జనవరి 10న చంద్రబాబుకు బెయిల్ హైకోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఈ నెల 29వ విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్‌పై బయటికి వచ్చారు.
*ఏపీ సర్కారుపై మరోసారి షర్మిల ఫైర్!
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అభ్యర్ధుల కోసం దరఖాస్తుల స్వీకరణను ఏపీ కాంగ్రెస్ ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణను ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. బీజేపీతో టీడీపీ, వైసీపీలు రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని ఆమె విమర్శించారు. బీజేపీతో చంద్రబాబు తెర ముందు పొత్తులు పెట్టుకుంటే… వైసీపీ తెరవెనుక ఒప్పందాలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. జగనన్న ఒక్క సారైనా ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. వైజాగ్ ఉక్కును సర్వనాశనం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుందని ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి దక్కాల్సిన గంగవరం పోర్టును 600కోట్లకు ఆదానీకి జగన్మోహన్ రెడ్డి అమ్మేశారని ఆమె ఆరోపణలు చేశారు. కుమ్మక్కు కోసం, స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను రాష్ట్రంను తాకట్టు పెట్టేశారని విమర్శలు గుప్పించారు. మరో వైపు.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అభ్యర్ధులకు అప్లికేషన్లను మాణిక్కం ఠాకూర్ ప్రారంభించారు. మొదటి అప్లికేషన్ మడకశిర నుంచి సుధాకర్.. రెండవ అప్లికేషన్ గుంటూరు తూర్పు నుంచీ మస్తాన్ వలీ.. మూడవ అప్లికేషన్ బద్వేల్ నుంచీ కమలమ్మ నుంచి స్వీకరించారు. ఈ సందర్భంగా మాణిక్కం ఠాకూర్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాలకు అభ్యర్థులను నిర్ణయిస్తుంది. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్లు మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తారు. నిజమైన కాంగ్రెస్‌లోకి మాజీలు రావాలని పిలుస్తున్నాం. ఆర్కే పోటీ చేసే స్ధానం త్వరలో తెలుస్తుంది. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. క్యాష్ బేస్డ్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ త్వరలో ఏపీలో పర్యటన చేస్తుంది. పార్టీ లీడర్స్ ఎవరైనా ఎన్నికలో పోటీ చేసే ఆసక్తి ఉంటే చెయ్యొచ్చు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి అడుగులు వెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేసే నేతలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. కాంగ్రెస్ భావజాలం కలిగిన అన్ని పార్టీలలో ఉన్న నేతలను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నా. ” అని మాణిక్కం ఠాకూర్ పేర్కొన్నారు.
*సర్పంచుల పెండింగ్ బిల్లుల నిధులు రిలీజ్ చేయాలి..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం అని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచుల పెండింగ్ బిల్లులను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన మీరు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం శోచనీయం అని బీజేపీ ఎంపీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దారిమళ్లించింది అని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో పెండింగ్ బిల్లుల కారణంగా రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులను కూడా ప్రభుత్వ అధికారులు రికార్డు చేయకుండా సర్పంచులను ఇబ్బంది పెడుతున్నారు.. గ్రామాభివృద్ధికి సర్పంచులు చేసిన పనులను వెంటనే రికార్డు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం సర్పంచులతో సహా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం పెంచాలి.. అలాగే, మాజీ సర్పంచులు, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులకు పెన్షన్ మంజూరు చేయాలి అని బండి సంజయ్ కోరారు.
*పార్టీ మారే ఆలోచన లేదు.. సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తప్పా..?
బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యే నిన్న ( మంగళవారం ) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వ్యాఖ్యలపై ఇవాళ నలుగురు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇస్తున్నారు.. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగానే కలిశాం.. మాపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారు.. ప్రజా సమస్యలపై చర్చించేందుకే రేవంత్‌రెడ్డిని కలిశాం అని ఆమె తెలిపారు. అభివృద్ధి అంశాల్లో సహకరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశాం.. పార్టీ మారే ఆలోచన మాకు లేదు.. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తామని సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. పార్టీ మారుతారనే ప్రచారాన్ని ఖండిస్తున్నాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మా పరువుకు భంగం కలిగేలా మాట్లాడితే న్యాయపరంగా ముందుకెళ్తాం.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తాం అని తెలిపారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ సమస్యలు వస్తున్నాయి.. ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లాం అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రోటోకాల్, భద్రత సమస్యలు వస్తున్నయని ఇప్పటికే చెప్పాం.. దీనిపై అడిషనల్ డీజీ శివధర్ రెడ్డిని మేము నలుగురం కలిశామని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేయడం లేదు.. వాటికి స్పష్టత లేదు.. పరిపాలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. అలాగే, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తప్పా..? అని ప్రశ్నించారు.. మళ్ళీ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి కలుస్తాం.. వంద సార్లు.. వందసార్లు కలుస్తామని ఆయన చెప్పుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇతర సమస్యలు కోసం ప్రభుత్వంలో ఉన్న వారిని కలుస్తునే ఉంటాన్నారు. అనవసర ప్రచారం చేసి మమ్మల్ని బద్నాం చేయడం కరెక్ట్ కాదన్నారు. మేం ఎవరితోనూ చర్చలు జరపడం లేదు అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ లో చేరే అవసరం మాకు లేదు.. బీఆర్ఎస్ ఉన్నంత కాలం కేసీఆర్ ను విడిచి పెట్టే ప్రసక్తి లేదన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఎందుర్కొంటున్న ప్రోటోకాల్ సమస్యపై సీఎంకు తెలియజేశామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.
*లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం: మమతా బెనర్జీ
ప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు దీదీ వెల్లడించారు. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆమె తెలిపారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని దీదీ పేర్కొనింది. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోసం రాష్ట్రాల వారీగా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ తాజాగా ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
*మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్
తమిళనాడులోని మధురై జిల్ల అలంగనల్లూరు సమీపంలోని కీలకరైలో నూతనంగా నిర్మించిన జల్లికట్టు స్టేడియాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్మించిన స్టేడియం ఇదే కావడం గమనార్హం. స్టేడియంలో తొలిసారిగా ఆరువందల ఎద్దులు పోటీలకు సిద్ధమయ్యాయి. నాలుగు వందలమంది యువకులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. కొత్త జల్లికట్టు స్టేడియానికి మాజీ ముఖ్యమంత్రి, దివంగత డీఎంకే నేత ఎం.కరుణానిధి పేరు పెట్టారు. ఈ గ్రామంలో రూ.44 కోట్ల అంచనా వ్యయంతో 5 వేల మందికి పైగా సీటింగ్ కెపాసిటీతో ప్రపంచస్థాయి జల్లికట్టు స్టేడియాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గతంలో ప్రకటించారు. ఈ స్టేడియంలో ఆటగాళ్లు, ప్రేక్షకులు, మీడియాకు అవసరమైన సౌకర్యాలతో పాటు త్వరిత ప్రథమ చికిత్స, నిరంతర వైద్య సహాయాన్ని అందించేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీ సీటింగ్, మ్యూజియం, బుల్ షెడ్, వెటర్నరీ డిస్పెన్సరీ, ఆరోగ్య సహాయక కేంద్రాలు ఈ స్టేడియంలో ఉన్నాయి.
*అమిత్ షాకు ఖర్గే లేఖ.. రాహుల్ గాంధీకి భద్రత కల్పించాలని వినతి..
రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడో న్యాయ యాత్రకు భద్రత కల్పించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. గౌహతి నగర సరిహద్దులో అస్సాం పోలీసు సిబ్బందితో రాహుల్ సహా కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణ పడిన తర్వాత ఈ లేఖ రాశారు. అయితే, నిన్న (మంగళవారం) భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను తొలగించి గౌహతిలోకి ప్రవేశించినప్పుడు కాంగ్రెస్- బీజేపీ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. ఈ ఘటనలో బారికేడ్‌ను బద్దలు కొట్టేందుకు ప్రజలను ప్రేరేపించినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జీపీ సింగ్‌ను ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ఆదేశించారు. ఆ తర్వాత రాహుల్ సహా పలువురు కాంగ్రెస్ సభ్యులపై కేసు నమోదు చేశారు. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు గౌహతి ప్రధాన రహదారుల్లోకి రాకుండా హైవేపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను తొలగించిన కాంగ్రెస్ మద్దతుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేన్ బోరా, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా గాయపడ్డారు. ఇక, అసోం పోలీసులు తగిన భద్రత కల్పించడంలో విఫలం అయ్యారని హోం మంత్రికి రాసిన లేఖలో ఖర్గే పేర్కొన్నారు. రాహుల్ గాంధీ Z+ భద్రతకు అర్హుడని తెలిపారు. ఇది కాకుండా, కాంగ్రెస్ పోస్టర్లను చింపివేయడంతో పాటు జనవరి 21న బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పర్యటనను అడ్డుకోవడంతో పాటు రాష్ట్ర పార్టీ చీఫ్ భూపెన్ బోరాపై దాడిని గురించి ప్రస్తావించారు. పోలీసుల పర్యవేక్షణలోనే ఈ పని జరిగిందని ఖర్గే ఆరోపించారు. రాహుల్ గాంధీ కాన్వాయ్ దగ్గరికి వచ్చేందుకు పోలీసులు బీజేపీ కార్యకర్తలకు పర్మిషన్ ఇచ్చారు అని మల్లికార్జున మండిపడ్డారు.
*రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు.. రెండు రోజులు భారత్ లోనే మకాం..
గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రేపు (గురువారం) భారత్‌కు రానున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌కు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకాబోనున్నారు. కవాతులో రెండు రాఫెల్ యుద్ధ విమానాలు, ఫ్రెంచ్ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బస్ A330 మల్టీ-రోల్ ట్యాంకర్ విమానాలు కూడా ఉంటాయి. ఫ్రాన్స్‌కు చెందిన 95 మంది సభ్యుల మార్చింగ్ స్క్వాడ్ తో పాటు 33 మంది సభ్యుల బ్యాండ్ స్క్వాడ్ కవాతులో పాల్గొననుంది. ఇక, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రేపు (జనవరి 25న) జైపూర్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అమెర్ ఫోర్ట్, జంతర్ మంతర్, హవా మహల్‌లను అధ్యక్షుడు మాక్రాన్ సందర్శిస్తారు. జైపూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కలవనున్నారు. దీని తర్వాత అధ్యక్షుడు మాక్రాన్ అర్థరాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌కు అధ్యక్షుడు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ఇచ్చే ‘ఎట్ హోమ్’ రిసెప్షన్‌లో పాల్గొంటారు. అయితే, రాబోయే గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని అతిథిగా రావాలని భారత ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ, బైడెన్ నిరాకరించడంతో చివరి క్షణంలో ఫ్యాన్స్ అధ్యక్షుడి కార్యాలయంతో చర్చలు జరిగాయి.. ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను చూసిన మాక్రాన్ ఈ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ఆరు నెలల్లో ఆరోసారి ప్రధాని మోడీ- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మధ్య సమావేశం జరగనుంది. భారతదేశం యొక్క మొదటి వ్యూహాత్మక భాగస్వామి దేశం ఫ్రాన్స్.
*కెనడాలో విమాన ప్రమాదం.. ఆరుగురి మృతి!
కెనడాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులతో వెళ్తున్న చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:50 గంటలకు నార్త్‌వెస్ట్ టెరిటరీస్‌లో జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కుప్పకూలిన విమానం ఛార్టర్ ఫ్లైట్ అని విమానయాన సంస్థ నార్త్‌వెస్టర్న్ ఎయిర్ పేర్కొంది. వివరాలు ప్రకారం… రియో టింటో మైనింగ్ సంస్థకు చెందిన దియావిక్ వజ్రాల గని వద్దకు కార్మికులతో పోర్ట్‌స్మిత్ నుంచి ఓ చిన్న విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమానంకు సంబంధాలు తెగిపోయాయి. రన్‌వే చివర నుంచి కిలోమీటర్ పరిధిలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంతో పోర్ట్‌స్మిత్ నుంచి బయలుదేరే అన్ని విమానాలు బుధవారం వరకు నిలిచిపోయాయి. విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదాన్ని పరిశీలించేందుకు కెనడా రవాణా భద్రతా బోర్డు ఒక బృందాన్ని నియమించింది. ఈ ప్రమాదంపై విమానయాన సంస్థ నార్త్‌వెస్టర్న్ ఎయిర్ స్పందించింది. కుప్పకూలిన విమానం ఓ ఛార్టర్ ఫ్లైట్ అని పేర్కొంది. ఆర్జె నార్త్‌వెస్ట్ టెరిటరీస్ ప్రీమియర్ సింప్సన్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు.