2 నెలల్లో జగన్ పాలన ముగుస్తుంది..! టీడీపీకి నేనొక పిల్లర్.. పార్టీ మారడమేంటి..?
మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ పాలన ముగుస్తుందని జోస్యం చెప్పారు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నీతి, నిజాయితీతో పుట్టిన టీడీపీకి నేనొక పిల్లర్ లాంటి వాడిని.. అలాంటి నేను పార్టీ మారతాను అని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. తాను పార్టీ మారతానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. వైసీపీ ప్రజాస్వామ్యం లేని పార్టీ.. అలాంటి పార్టీలోకి వెళ్లినవాళ్లే పారిపోతున్నారు.. నాపై తప్పుడు ప్రచారం చేస్తే తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. తల్లినీ, చెల్లిని కాపాడలేని జగన్ ఈ రాష్ట్రంలో మహిళలను కాపాడతాడా? అని ప్రశ్నించారు. ఏపీలో అంబేడ్కర్ రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని కామెంట్ చేశారు యరపతినేని.. విశాఖ ఋషి కొండను బోడిగుండు చేశారు.. రూ.500 కోట్ల ప్రజల సొమ్ముతో ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ యంత్రాంగం నిర్వీర్యం అయ్యింది.. జగన్ అంతులేని అహంకారంతో చంద్రబాబు పై అక్రమ కేసులు పెట్టారు.. సాక్ష్యాలు లేని కేసుల్లో చంద్రబాబు ను ఇరికించారు… నకిలీ లిక్కర్ తో లక్షలాది మంది అవయవాలు పనిచేయకుండా చేశారు. నీ ధన దాహానికి వేల మంది ప్రాణాలు కోల్పోయారు.. ప్రకృతి జగన్ మీద పగ పడుతుంది.. ఆ కోపం ముందు జగన్ నిలవలేడు అని వ్యాఖ్యానించారు.
ఎల్లుండి అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ఆయన ఆలోచనలు భారతావనికి దిక్సూచి
విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం అవుతోంది.. ఎల్లుండి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరగనుంది.. ఈ సందర్భంగా విజయవాడలో బీఆర్ అంబేద్కర్ ఒకరోజు కాంక్లేవ్ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానాకి మయన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ఏపీలో అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. ముళ్ల కంపల్లో పెట్టడానికి సిద్ధమైంది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.. తమ ప్రభుత్వం మాత్రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిమను ప్రపంచం గౌరవించేలా ఏర్పాటు చేశాం అన్నారు. ఎల్లుండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారని తెలిపారు మంత్రి నాగార్జున. రాజ్యాంగం దేశంలో అసమానతలు పోవడానికి ఉపయోగపడుతోందన్న ఆయన.. అంబేద్కర్ అనేక అవమానాలు పొందారు.. కానీ, ఇప్పుడు అంబేద్కర్ ఆలోచనలు భారతావనికి దిక్సూచిగా ఉండటానికి పనికొస్తాయి అన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని భుజానికి ఎత్తుకుని పరిపాలన చేయాలని చూపిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. మేం చదువుకున్న రోజుల్లో ఇంగ్లీషు చదవాలంటే భయపడే వాళ్లం.. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలోనూ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు రాణిస్తున్నారని తెలిపారు మంత్రి మేరుగు నాగార్జున.
విద్య, వైద్యం తప్ప.. ఏదీ ప్రజలకు ఫ్రీగా ఇవ్వద్దు..
ఏదీ ప్రజలకు ఫ్రీగా ఇవ్వకూడదు.. విద్య, వైద్యం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి అన్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంగ్లీష్ నేర్చుకోండి.. కానీ, తెలుగుని మర్చిపోవద్దు అన్నారు. ప్రతి మనిషి, ప్రతి రోజు తెలుగులో మాట్లాడితే బాగుంటుంది.. ప్రతి వ్యక్తికి మొదటి మన దైవం కన్న తల్లిదండ్రులే అనేది గుర్తించాలన్నారు. మాతృభాషను మొదట చదువుకోని ఆర్వాత ఇంగ్లీష్ భాషపై మక్కువ పెట్టుకోవాలన్నారు. ఇక, ఏ ప్రభుత్వాలు అయినా సరే పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం మంచి పద్దతి కాదు.. ప్రజలకు ఏదీ ఫ్రీగా ఇవ్వొద్దు.. విద్య, వైద్యం తప్ప అన్నారు వెంకయ్య.. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి అని సూచించారు. మనం పోయిన తర్వాత మనల్ని నలుగురు గుర్తుంచుకోవాలి అంటే కచ్చితంగా మంచి పనులు చేయాలన్నారు. శారీరకంగా దృడంగా ఉంటేనే, మానసికంగా ధృఢంగా ఉంటారు.. ప్రతిరోజూ యోగ చేయడం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు మనదేశంలో ఉన్నన్ని రుచులు దేశంలో మరెక్కడా లేవు అన్నారు.. ఇంట్లో వంట రూమ్, పూజా రూమ్ తప్పకుండా ఉండాలన్నారు. ఇటీవల ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ కి బాగా అలవాటు పడుతున్నారు.. అది ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.
అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట.. చంద్రబాబుకు ఆహ్వానం
ఈ నెల 22వ తేదీన అయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతోంది.. ఈ కార్యక్రమానికి శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందుతున్నాయి.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, సీనియర్ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు.. ఇలా చాలా మందికి ఆహ్వానలు అందుతున్నాయి.. ఇక, రామాలయంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానాకి తాజాగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం వచ్చింది. ఈనెల 22న అయోధ్య రామజన్మభూమి దేవాలయంలో ప్రాణప్రతిష్ట వేడుక జరుగనుంది.. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు.. చంద్రబాబుకు ఆహ్వానం పంపించారు.
వాహనదారులు అలర్ట్.. 45 రోజులపాటు కృష్ణ బ్రిడ్జి బంద్..!
నారాయనపేట జిల్లా కృష్ణా మండల రాష్ట్ర సరిహద్దులో కృష్ణా నదిపై నిర్మించిన కృష్ణా వంతెనపై నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేయనున్నారు. కృష్ణా వంతెన మీదుగా వెళ్లే జాతీయ రహదారి-167ను మరమ్మతులు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఇవాల్టి (జనవరి 17వ) ఉదయం 5 గంటల నుంచి 45 రోజుల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేస్తూ రాయచూర్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటకలోని రాయచూర్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్‌కు వెళ్లే వాహనదారులు ఆంక్షలు పాటించాలని కోరారు. ఎన్‌హెచ్-167పై వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. రాయచూర్ వెళ్లే వారు మరికల్ సబ్ స్టేషన్ నుంచి చిత్తనూరు, అమరచింత జూరాల డ్యామ్, గద్వాల్ మీదుగా కేటీదొడ్డి రాయిచూర్ మీదుగా మళ్లించారు. వాహనదారుల అవగాహన కోసం కృష్ణా, మక్తల్, మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. పాత రోడ్డు ఉన్నప్పుడే బాగుండేదని కొత్త సీసీ రోడ్డు వేసినప్పటి నుంచి ఈ సమస్య ఎక్కువైందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పుడు 45 రోజుల పాటు బ్రిడ్జిపై వాహనాలు నిలిపివేసి మళ్లీ మునుపటిలా మరమ్మతులు చేసినా ప్రయోజనం ఉండదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్లు నాణ్యమైన రోడ్డు మరమ్మతులు చేయాలన్నారు. రాయచూరు-హైదరాబాద్ మధ్య రద్దీ పెరగడంతో ఈ మార్గంలో వాహనాల రద్దీ కూడా పెరిగింది. వంతెన వెడల్పు 20 అడుగుల వెడల్పు మాత్రమే ఉండడంతో భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న వంతెనకు మరమ్మతులు చేయడంతో పాటు కొత్త వంతెన నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తమిళిసై ఎక్స్ ఖాతా హ్యాక్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎక్స్ అకౌంట్ హ్యాక్ కు గురైంది. తమిళిసై సౌందరరాజన్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్ అయినట్లు రాజ్ భవన్ అధికారులు గుర్తించారు. దీంతో వారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళిసై సౌందర రాజన్ సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో కొంతకాలంగా తమకు తెలియకుండా పోస్టింగ్‌లపై రాజ్‌భవన్ వర్గాలు ఆరా తీశాయి. ఎక్స్ ఖాతాను తెరిచే సమయంలో, పాస్‌వర్డ్ తప్పు అని సూచించిందని అన్నారు. మరోవైపు ఈ ఖాతాలో పోస్ట్ చేయని అంశాలను కూడా సిబ్బంది గుర్తించామన్నారు. దీంతో ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించామన్నారు. ఈవిషయమై రాజ్ భవన్ సిబ్బంది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. హ్యాకింగ్ కు పాల్పడింది ఎవరు? రాజ్ భవన్ లోని వారేనా లేక ఇతరుల అనే దానిపై ఆరా తీస్తున్నారు. పాస్ వర్డ్ కూడా తప్పు చూపిస్తుందంటే ఇది ఖచ్చింతంగా రాజ్ భవన్ లోని వారే అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశంలో అత్యంత కాలుష్య నగరాలు ఏవో తెలుసా?
దేశంలో కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది.. మనం పీల్చే గాలిలో ఎన్నో విషపూరీత వాయువులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. వాహనాల నుంచి వచ్చే పొగతో పాటు పంట పొలాల్లోని వ్యర్థాలను తగలబెట్టడం వంటి చర్యలతో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోందని తెలిపింది.. ఈ ఏడాది అత్యంత కాలుష్యం నగరాల లిస్ట్ లోకి బాలాసోర్ నిలిచింది.. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ ఉంది.. బాలాసోర్ గాలి నాణ్యత (ఏక్యూఐ) 406 పాయింట్లకు చేరిందని కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికలో పేర్కొంది. దీని తర్వాతి స్థానంలో ఢిల్లీ (371), బాలాపూర్ (359), బరిపద( 355), భీవాడి (349), ఛండీఘర్ (348), శ్రీ గంగానగర్ ( 346), రాజ్ఘర్ (339), హనుమాన్ ఘర్( 328), చప్రా (323), గురుగ్రామ్ (317), నోయిడా(318), ఘజియాబాద్(304) నగరాలు ఉన్నాయని తెలిపింది. ఇక, బెగుసరాయ్, బల్లాబ్ గఢ్, ఫరీదాబాద్, కైతాల్, గ్వాలియర్ నగరాలు కూడా అత్యంత కాలుష్య నగరాలని ఈ నివేదిక తేల్చింది.
పదివేల సీసీ కెమెరాలు, డ్రోన్లు.. గల్లీ గల్లీకి పోలీసులు.. ఆయోధ్యలో భారీ నిఘా
అయోధ్య రాములోరి ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరిగే ఈ వేడుకకు దాదాపు 8000 మంది వీఐపీ అతిథులు హాజరుకానున్నారు. అందుకే ఆకాశం నుంచి భూమి వరకు కట్టుదిట్టమైన నిఘా, భద్రతా ఏర్పాట్లు చేశారు. పైన డ్రోన్ల నుండి భద్రతా పర్యవేక్షణ ఉంటుంది. 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి సందు, మూలను పర్యవేక్షిస్తాయి. 22 జనవరి 2024న శ్రీరాముని నగరంలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయో తెలుసుకుందాం. జనవరి 22న అయోధ్యపై పక్షులు కూడా రాకుండా డ్రోన్లు, సీసీటీవీలతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన భద్రతా సిబ్బందిని పెద్ద సంఖ్యలో మోహరిస్తారు. వారు ఆటోమేటిక్ ఆయుధాలను కలిగి ఉంటారు. ఈ సైనికులలో SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) నుండి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) వరకు ప్రత్యేక కమాండోలను మోహరిస్తారు. ప్రాణ ప్రతిష్ఠా తేదీ సమీపిస్తున్న కొద్దీ అయోధ్యలో రామభక్తుల రద్దీ పెరుగుతోంది. రామ మందిర నిర్మాణం కోసం 500 సంవత్సరాలకు పైగా నిరీక్షణ ఉంది, కాబట్టి రామ భక్తులు ఈ క్షణాన్ని తమ కళ్లారా చూడాలనుకుంటున్నారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏజన్సీలు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండి అడుగడుగునా చర్యలు తీసుకుంటున్నారు.
జియో బంపరాఫర్.. 31 వరకు మాత్రమే అవకాశం..
అన్ని ఫ్రీ అంటూ టెలికం మార్కెట్‌లో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన జియో.. ఆ తర్వాత చౌక ధరలకే టారీఫ్‌లను తీసుకొచ్చి క్రమంగా తన యూజర్లను పెంచుకుంటూ పోయింది.. డేటా స్పీడ్‌లో ఇప్పటి వరకు జియోను కొట్టే సంస్థ లేకుండా పోయింది.. ఇక ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లలో తన యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది జియో.. ‘రిపబ్లిక్ డే’ సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. రూ. 2999తో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో ఏడాది పాటు అన్‌లిమిటెడ్ కాల్స్. ఇంటర్నేట్ సౌకర్యంతో పాటు.. కూపన్లు కూడా అందించనున్నట్టు ప్రకటించింది. రూ.2,999తో రీఛార్జ్‌పై 365 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు 2.5 జీబీ డేటా చొప్పున.. ఈ ప్లాన్ కింద మొత్తం 912.5 జీబీ డేటా పొందవచ్చు. ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఈ ప్లాన్ కింద రిలయన్స్ డిజిటల్, స్విగ్గీ కూపన్‌లు, ఇక్సిగో కూపన్ మరియు అజియో డిస్కౌంట్ కూపన్‌లు కూడా అందించనుంది. జియోకు సంబంధించి వివిధ OTT సబ్‌స్క్రిప్షన్ వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్రత్యేక ప్లాన్ సబ్‌స్క్రైబర్‌లకు 2.5 జీబీ 4జీ డేటా మరియు అపరిమిత కాలింగ్‌తో పాటు 365 రోజుల పాటు అపరిమిత 5జీ డేటాను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ యొక్క సగటు నెలవారీ ధర రూ. 230, ఇది వినియోగదారులకు తక్కువ ఖర్చుతో కూడుకున్నది.
చివరి ఓవర్లో మాథ్యూస్ చెత్త బౌలింగ్.. శ్రీలంకపై జింబాబ్వే స్టన్నింగ్ విక్టరీ!
శ్రీలంకకు పసికూన జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా శ్రీలంకతో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో జింబాబ్వే ఊహించని విజయాన్ని అందుకుంది. సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ లంక ఓటమికి కారణమయ్యాడు. చివరి ఓవర్‌లో ఏకంగా 24 పరుగులిచ్చి లంక ఓటమికి కారకుడయ్యాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. నిర్ణయాత్మక మూడో టీ20 జనవరి 18న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చరిత్ అసలంక (39 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (51 బంతుల్లో 66 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. లంక బ్యాటర్లలో పాతున్ నిస్సంక (1), కుశాల్ మెండిస్ (4), కుశాల్ పెరీరా (0), సమరవిక్రమ (16), దాసున్ షనక (9) పరుగులు చేసి ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, లూక్ జాంగ్వే చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 174 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే చివరి ఓవర్‌లో లూక్ జాంగ్వే మెరుపులు (25 నాటౌట్; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిపించడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. క్రెయిగ్ ఎర్విన్ (70) హాఫ్ సెంచరీ చేయగా.. బ్రియాన్ బెన్నెట్ (25) పర్వాలేదనిపించాడు. సికందర్ రజా (8) ఐదు మ్యాచ్‌ల తర్వాత తొలిసారి విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ చివరలో క్లైవ్ మదండే (15 నాటౌట్) సాయంతో జాంగ్వే జింబాబ్వేను గెలిపించాడు. లంక బౌలర్లలో తీక్షణ, చమీరా తలో 2 వికెట్లు పడగొట్టారు.
ఎంఎస్ ధోనీపై పరువు నష్టం దావా!
క్రికెట్ అకాడమీ విషయంలో మాజీ వ్యాపార భాగస్వాములు తనను రూ. 15 కోట్ల మేర మోసం చేశారంటూ టీంఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్స్ మిహిర్ దివాకర్, సౌమ్య దాస్‌లు తాజాగా మహీపై పరువు నష్టం దావా వేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని, తమ పరువుకు భంగం వాటిల్లినందుకు ధోనీ నష్టపరిహారం చెల్లించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమపై అవాస్తవాలను ప్రచారం చేయకుండా.. సోషల్ మీడియా, మీడియా సంస్థలను నిలువరించాలని కోరారు. దివాకర్, సౌమ్యల అభ్యర్థనపై హైకోర్టు జనవరి 18న విచారణ జరపనుంది. ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సంస్థ 2017లో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు ఎంఎస్ ధోనీతో ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం… ఫ్రాంఛైజీ ఫీజు, లాభాల్లోని వాటాను ధోనీకి చెల్లించాల్సి ఉంటుంది. అయితే షరతులను పాటించడంలో కంపెనీ విఫలమవడంతో ధోనీ వైదొలిగాడు. ఆపై తనకు రావాల్సిన చెల్లింపులపై కోర్టును ఆశ్రయించాడు. కంపెనీ డైరెక్టర్స్ మిహిర్ దివాకర్, ఆయన భార్య సౌమ్య దాస్‌పై క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
స్ట్రీమింగ్ పార్ట్నర్ అనౌన్స్మెంట్ వచ్చేసింది…
తల అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడ ముయార్చి’. మగిళ్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. అజిత్ నుంచి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న విడ ముయార్చి సినిమాపై కోలీవుడ్ సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు అందుకునే పనిలో ఉన్న చిత్ర యూనిట్, ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్డేట్ కోసం రచ్చ చేస్తున్నా కూడా మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ బయటకి రావట్లేదు. ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్ అనే కాదు కనీసం షూటింగ్ ఎక్కడి వరకు జరిగింది? ఎంత పార్ట్ బాలన్స్ ఉంది? ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనే ఏ ప్రశ్నకి మేకర్స్ నుంచి సమాధానం లేదు, అభిమానుల దగ్గర క్లారిటీ లేదు. ఈ కారణంగానే అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నెగటివ్ ట్రెండ్ కూడా చేస్తున్నారు. అయితే ఇన్ని రోజుల తర్వాత విడ ముయార్చి సినిమాకి సంబంధించిన అప్డేట్ బయటకి వచ్చింది. అయితే అది స్ట్రీమింగ్ పార్టనర్ గురించి మాత్రమే. విడ ముయార్చి సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది. సంక్రాంతి సంధర్భంగా సినీ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్తూ తమ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్టుని అనౌన్స్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్, విడ ముయార్చి అప్డేట్ కూడా ఇచ్చేసింది. విడ ముయార్చి సినిమా థియేట్రికల్ రిలీజ్ కంప్లీట్ అయిన 8 వారల గ్యాప్ తర్వాత విడ ముయార్చి ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది.