చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు.. మా సీఎం అభ్యర్థి చిరంజీవి..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం.. అంతే కాదు.. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చిరంజీవియే అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన చింతా మోహన్.. తిరుపతి నుండి ఎమ్మెల్యేగా చిరంజీవి పోటీ చేయాలని కోరనున్నట్టు తెలిపారు.. అంతేకాదు మా ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవియే ఉంటారని స్పష్టం చేశారు. కాపులకు ఇదే సరైనా సమయమని పిలుపునిచ్చారు. ఇక, చిరంజీవిని నేనే స్వయంగా పార్టీలో ఆహ్వానిస్తానని పేర్కొన్నారు.. చిరంజీవి 50 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నామినేషన్ వేసి వెళ్లిపోతే చాలు.. ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు.. ప్రజలు చిరంజీవికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్.
పట్నం వదిలి పల్లె బాట.. భారీగా పెరిగిన విమాన ఛార్జీలు
సంక్రాంతి పండుగ వరస సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లె బాటపడుతున్న ప్రజలు.. పక్క రాష్ట్రాల నుంచే కాదు.. విదేశాల నుంచి కూడా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఓవైపు.. విమానయాన సంస్థలు మరోవైపు.. భారీగా ధరలు పెంచేశాయి.. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి.. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ క్రమ క్రమంగా పెరుగుతుంది. దీనికి తగ్గట్టుగా టోల్ ప్లాజా అధికారులు విజయవాడ వైపు ఎక్కువ టోల్ బూతులను ఓపెన్ చేశారు.. ఫాస్టాగ్ ఉండడంతో త్వర త్వరగా వెళ్తున్న వాహనాలు.. అయితే, ఫాస్టాగ్ లేని వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రేపు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవులు ఉండడంతో వాహనాలపై మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు.. రాజమండ్రి ఎయిర్ పోర్టులో సంక్రాంతి రద్దీ నెలకొంది.. దేశ విదేశాల్లో ఉన్న గోదావరి జిల్లా వాసులు క్యూ కడుతున్నారు. దీంతో రద్దీ పెరిగింది.. సంక్రాంతికి సొంత ఊర్లకు వచ్చే ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. మరోవైపు విమాన చార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణ రోజుల్లో 3000 రూపాయలు ఉండే టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 12 వేలకు పైగా ధర పలుకుతుంది. విమాన చార్జీలు భారీగా పెరిగిపోయే పరిస్థితి నెలకొంది. దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.. ఇక, ప్రైవేట్ బస్సులు కూడా పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకుంటున్నాయి.. సాధారణం కంటే రెండు, మూడు రెట్లు బస్సు టికెట్ల ధరలను పెంచేశాయని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏదేమైనా పండుగకు ఊరికి వెళ్లాలన్న ఉద్దేశంతో ప్రయాణ ఛార్జీలు పెరిగినా.. పల్లె బాట పడుతున్నారు.
మోడీ వచ్చాక 30 మంది బ్యాంకులను ముంచేసి దేశాన్ని విడిచారు..!
నరేంద్ర మోడీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీ వచ్చాక 30 మంది బ్యాంకులను ముంచేసి దేశం విడిచి వెళ్లారని ఆరోపించారు.. నీరవ్ మోడీ చెప్పి వేళ్లారంటున్నారు.. అదానీ అవినీతిపై సెబీ విచారిస్తుంది.. సెబీ తీర్పు ఇచ్చే సమయంలో సుప్రీం కోర్టు ద్వారా విచారణకు మరో 3 నెలలు గడువు ఇచ్చారని.. సుప్రీం మరో 3 నెలలు గడువు ఇచ్చిన మూడు రోజులకే ప్రపంచ కుబేరుడుగా ఆధానిని ప్రకటించారు.. సెబీ తీర్పు వచ్చి ఉంటే అదానీ జైలుకు వెళ్లేవాడని విమర్శించారు. అదానీ ఓ గంజాయి స్మగ్లర్ అని మండిపడ్డారు. ఇక, కేంద్రానికి అనుకూలంగా ఉంటే సీబీఐ నుంచి ఇబ్బంది లేదు.. లేదంటే దాడులు చేస్తాయని దుయ్యబట్టారు.
సీఎం జగన్‌కు రుణపడి ఉంటా.. సర్వే రిపోర్ట్ ఆధారంగానే నాకు ఇంఛార్జ్ బాధ్యతలు
సీఎం వైఎస్ జగన్‌ను రుణపడి ఉంటాను అన్నారు ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ పిరియా విజయ.. శ్రీకాకుళంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె.. ఇచ్చాపురం సమన్వయ కర్తగా నియమించినందుకు జగన్ కు రుణపడి ఉంటాం… ఒక బీసీ మహిళగా, సర్వే రిపోర్ట్ ఆధారంగా నాకు ఇంచార్జ్ భాద్యతలు అప్పగించారని తెలిపారు. ఇక, టీడీపీ హాయంలో ఇచ్చిన అభివృద్ది, సంక్షేమం ఏమీలేదు.. రెండున్నరేళ్లు కరోనాతో ఇబ్బంది పడినా అభివృద్ది – సంక్షేమం అందించాం అన్నారు. ప్రతి గ్రామంలో ఊర్లలో జగనన్న అందించిన సంక్షేమం కనిపిస్తుంది. టీడీపీ హాయాంలో డయాలసిస్ చేయించుకునేందకు ఎలాంటి సౌకర్యాలు లేవు .. గతంలో ఉద్దానంలో కిడ్నీ రోగులు చనిపోయారనే వార్తలు వినిపించేవి. ఉద్దానంను పూర్తిస్థాయిలో ఆదుకున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. నేడు సీఎం వైఎస్ జగన్ కిడ్నీ రోగుల పెన్షన్లు పెంచారు. రీసెర్చ్ ఆస్పత్రి కట్టించారు. 805 గ్రామాలకు త్రాగునీటికి కోసం 700 కోట్ల రూపాయలతో ఉద్దానం డ్రింకింగ్ వాటర్ స్కిం తీసుకువచ్చారనరి ప్రశంసలు కురిపించారు పిరియా విజయ.. ఇక, ఇచ్చాపురంలో వైసీపీలో ఏ గ్రూపులు లేవు అని స్పష్టం చేశారు. రెడ్డీలకు జెడ్పీ చైర్మెన్, యాదవులకు ఎమ్మెల్సీ ఇచ్చి సీఎం జగన్ సామాజిక సమన్యాయం చేశారని తెలిపారు. వైఎస్ జగన్ ఇచ్చిన జిల్లా పరిషత్ చైర్మెన్ పదవిని సమర్థవంతంగా నిర్వహించాను. నేడు నన్ను తప్పించి వారికి ఆ స్థానం ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నానని తెలిపారు ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ పిరియా విజయ.
వైసీపీ సీటు ఇవ్వకుంటే ఏం చేద్దాం..? అనుచరులతో మాగుంట మంతనాలు..
ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయం వద్ద అభిమానుల హడావుడి కొనసాగుతూనే ఉంది.. ఇటీవలి వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మాగుంటను పరామర్శించేందుకు పలు నియోజకవర్గాల నుంచి తరలివస్తున్నారు పలువురు కార్యకర్తలు, అభిమానులు.. ఇక, విడివిడిగా ముఖ్య అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు మాగుంట.. మరోవైపు.. మాగుంట కార్యాలయానికి వచ్చి మర్యాద పూర్వకంగా కలిసి వెళ్లారు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. కాసేపు కరణం బలరాంతో ఆంతరంగికంగా మాగుంట చర్చలు కొనసాగాయి.. కానీ, మాగుంట, కరణం భేటీలకు రాజకీయ ప్రాధాన్యత లేదంటున్నారు ఆయన ముఖ్య అనుచరులు.. అయితే, ఇటీవలే మాగుంటకు సీటు లేదని స్పష్టం చేసింది వైసీపీ అధిష్టానం.. కానీ, మాగుంట సీటు కోసం మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పట్టుబట్టారు.. అధిష్టానంతో చర్చలు జరిపారు.. ఐప్యాక్ ప్రతినిధులతో సమావేశమై చర్చించారు.. అయినా.. ఇప్పటి వరకు మాగుంట సీటుపై ఎలాంటి క్లారిటీ రాలేదు.. దీంతో.. వైసీపీలో సీటు ఇవ్వకుంటే ఏం చేయాలనే అంశంపై అనుచరులతో మాగుంట మంతనాలు జరుపుతున్నారట.. అనుచరులతో సమావేశాల అనంతరం.. ఎంపీ మాగుంట.. తన కుటుంబ సభ్యులతో కూర్చుని ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.. వైసీపీ లేకుంటే పార్టీ మారే అవకాశం ఉందని.. టీడీపీ నేతలతో మాగుంట టచ్ లోనే ఉన్నారని ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
హైదరాబాద్-విజయవాడ హైవేపై జనసేన ఫ్లెక్సీలు.. శుభాకాంక్షలు చెబుతూనే సూచనలు..!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ హడావిడి మొదలైంది.. పట్నాన్ని వదిలి పల్లెటూరు బాట పట్టారు ప్రజలు.. ఏడాది ఓసారి వచ్చే పండుగను కుటుంబ సభ్యుల సమక్షంలో.. పుట్టిన ఊరిలో జరుపుకోవడానికి పల్లె బాట పడుతున్నారు.. దీంతో.. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే రహదారిపై రద్దీ పెరిగింది.. మరోవైపు.. పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు ఆసక్తికరంగా మారియి.. హైదరాబాద్-విజయవాడ రహదారిపై పెద్ద ఎత్తున జనసేన ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టింది.. నందిగామ వద్ద జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. వాటిలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూనే.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది జనసేన.. ఏపీలో రోడ్లు సరిగా లేవు జాగ్రత్త అంటూ వాహనదారులకు జనసేన సూచనలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. సొంతూరికొచ్చే సంతోషంలో జోరు పెంచొద్దు .. ఏపీ రోడ్లు బ్రేకులు వేస్తాయి.. జాగ్రత్తగా ఇంటికి చేరండంటూ సూచనలు చేస్తూనే.. ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్ల పరిస్థితి వివరిస్తూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది జనసేన పార్టీ. ఇక, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని టీడీపీ-జనసేన నిర్ణయానికి రావడం.. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతోన్న విషయం విదితమే కాగా.. జనసేన ఫ్లెక్సీలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటోలను కూడా పొందుపరిచారు.
పోలీసులు అదుపులో మర్రిగూడ చైన్ స్నాచర్.. వారిని ఎలా ట్రేస్ చేశారంటే ?
నల్లగొండ జిల్లాలో చైన్ స్నాచర్ ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. స్కూటీలో ఇద్దరు కలిసి ఓ మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు దొంగలించి అక్కడి నుంచి పరారైన దృష్యాలు సీసీ టీవీలో రికార్డు కావడంతో ఈ వార్త వైరల్ గా మారింది. కొందరు వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా జోట్ స్పీడ్ లో స్కూటీపై పరారైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బైక్ నెంబర్ సహాయంతో ఫోన్ నెంబర్ ను తెలుసుకుని చాకచక్యంగా వారిని అదుపులో తీసుకుని దొంగతనం చేసింది లవర్స్ కాదని.. నిందితులిద్దరు భార్యభర్తలని గుర్తించారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ చైన్స్ స్నాచర్ కు పాల్పడిన వారు ఇద్దరూ భార్య భర్తలుగా గుర్తించారు. హైదరాబాద్ లోని సంతోష్ నగర్ కు చెందిన వెంకటేష్ గా పోలీసులు గుర్తించారు. దొంగతనం చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు రూపంలోకి చైన్ స్నాచర్లు మార్చుకున్నట్లు తెలిపారు. నిన్న సునీత అనే మహిళను లిఫ్ట్ పేరుతో కొద్ది దూరం స్కూటీపై ఎక్కించుకొని వెళ్లిన జంట.. సునీత మెడలో ఉన్న ఏడు తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయారు. స్థానికులు వెంబడించడంతో.. అక్కడి నుండి హైదరాబాద్ కి పారిపోయారు. సంతోష్ నగర్ వద్ద స్కూటీ పై పారిపోతున్న జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ ఇద్దరు వెంకటేష్, అతని భార్య గా పోలీసులు గుర్తించారు. వ్యసనాల అలవాటై చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. బండి నెంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ గుర్తించారు. అనంతరం సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా నిందితులను ట్రేస్ చేసిన పోలీసులు నిందితులను అదుపులో తీసుకున్నారు. ఇంకా ఎక్కడైన దొంగతనానికి పాల్పడ్డారా? అనే దానిపై ఆరా తీస్తున్నారు.
ఆటో కార్మికులను రోడ్డున పడేసింది.. కాంగ్రెస్ ప్రభుత్వం పై హరీష్ రావ్ ఫైర్
ఆటో కార్మికులను రోడ్డున పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను హరీష్ రావు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోకార్మికులను రోడ్డున పడేసిందని మండిపడ్డారు. ఆటో డ్రైవర్ల కోసం ఆలోచన చేసి నెలకు 15వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే కానీ మారుమూల గ్రామాలకు మరిన్ని బస్ సౌకర్యాలు పెంచాలన్నారు. ప్రభుత్వం మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోకార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారని అన్నారు. కొద్దిరోజులుగా ఆటోకార్మికులు నిసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆటోకార్మికులను పట్టించుకుని వారికి తగిన న్యాయం చేయాలని కోరారు.
పాకిస్థాన్ లో బ్యాట్ సింబల్ గుర్తు కేటాయింపుపై వివాదం..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్– ఇ–ఇన్సాఫ్ (పీటీఐ)కు బ్యాట్ గుర్తు కేటాయింపు వివాదంపై ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం విధుల్లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోదని పాకిస్థాన్ సుప్రీం కోర్టు చీప్ జస్టీస్ క్వాజీ ఫయీజ్ ఇసా తెలిపారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించనందున పీటీఐకి ఎన్నికల గుర్తు బ్యాట్‌ను కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతుంది. ఇక, పీటీఐ పెషావర్ హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. ఇక, ఎన్నికల సంఘం నిర్ణయాన్ని పెషావర్ హైకోర్టు తప్పు పట్టింది. బ్యాట్ గుర్తును పునరుద్ధరించాలంటూ ఇటీవలే ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఆప్ పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ ఇసా పలు కీలక కామెంట్స్ చేశారు. రాజ్యాంగ, చట్టబద్ధమైన సంస్థ విధుల మధ్య చాలా స్పష్టమైన విభజన రేఖ ఉందని తెలిపారు. అయితే, ఈసీ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పుడు న్యాయవ్యవస్థకు అత్యున్నత ప్రతినిధిగా మేమెలా జోక్యం చేసుకోగలం? అదెలా సాధ్యమవుతుంది? ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ.. రాజకీయ పార్టీల వ్యవహారాలను నియంత్రించడం, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడం దాని బాధ్యత అని చీప్ జస్టీస్ క్వాజీ ఫయీజ్ ఇసా పేర్కొన్నారు.
గుజరాత్ లో డబ్బుల సునామీ.. 40వేల ప్రాజెక్టులు..రూ.26.3లక్షల కోట్ల పెట్టుబడులు
వైబ్రంట్ గుజరాత్ సదస్సుకు ఈసారి కూడా కంపెనీల నుంచి విశేష మద్దతు లభించింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో భారతీయ, విదేశీ కంపెనీలు గుజరాత్‌లో భారీ పెట్టుబడులకు సంబంధించి పలు ప్రకటనలు చేశాయి. అదానీ గ్రూప్, టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, డీపీ వరల్డ్ సహా అనేక చిన్న, పెద్ద కంపెనీలు పెట్టుబడి ప్రతిపాదనల కోసం 41299 అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా గుజరాత్‌లోని కంపెనీలు సుమారు రూ.26.33 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. వైబ్రంట్ గుజరాత్ 10వ ఎడిషన్‌లో గ్రీన్ ఎనర్జీ రంగంలో చాలా పెద్ద ఒప్పందాలు జరిగాయి. 2022లో గుజరాత్‌లో రూ.18.87 లక్షల కోట్ల విలువైన 57,241 ప్రాజెక్టుల కోసం కంపెనీలు ఎంవోయూలపై సంతకాలు చేశాయి. కోవిడ్ -19 కారణంగా 2021లో జరగాల్సిన సమావేశం రద్దు చేయబడింది. ఈ విధంగా గత రెండు ఎడిషన్లలో మొత్తం 98540 ప్రాజెక్టుల ఎంవోయూలు కుదిరి గుజరాత్‌కు దాదాపు రూ.45 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రాజీనామా
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు నజ్ముల్ హసన్ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంలో క్రీడా మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆయన 12 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నజ్ముల్ హసన్ కూడా ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక, ఈసారి మళ్లీ ఎంపీగా ఎన్నికైన ఆయనకు యువజన, క్రీడల శాఖ మంత్రి పదవి ఇచ్చారు. గురువారం నాడు ఆయన ఈ శాఖ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి నజ్ముల్ ఇప్పుడు క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవిని విడిచిపెట్టారు. ఇక, నజ్ముల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ.. నేను రెండు పదవులను ఒకేసారి నిర్వహించగలిగాను.. ఈ రెండు విషయాలను కలిపి నిర్వహించకూడదని చట్టంలో లేదు.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్‌కి క్రీడా మంత్రిత్వ శాఖ లభించడం వల్ల ఆ పదవిని వదులుకోవడంలో ఎలాంటి సంబంధం లేదన్నారు.. ఈ రెండు పదవులను ఏకకాలంలో నిర్వహించిన పలువురు మంత్రులు గతంలో కూడా ఉన్నారు అని ఆయన చెప్పారు. విదేశాల్లో కూడా ఇలాగే జరిగింది.. అయితే నేను ఈ రెండు పదవులు నిర్వహిస్తే క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాననే ఆరోపణలు వస్తాయి కాబట్టి.. బీసీబీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నజ్మల్ ప్రకటించారు.
సంక్రాంతి వేడుకల కోసం బెంగళూరుకి కూతురితో వెళ్తున్న రామ్ చరణ్, ఉపాసన..
తెలుగు హీరోలు ఏదైనా ప్రత్యేకమైన రోజు వస్తే చాలా స్పెషల్ గా జరుపుకుంటారు.. ముఖ్యంగా పండగలను ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారో మనం నిత్యం చూస్తూనే ఉంటాం.. అందులో మెగా ఫ్యామిలీ ముందు ఉంటుంది.. ఈసారి సంక్రాంతి వేడుకలను మెగా ఫ్యామిలీ బెంగుళూరు లో జరుపుకోనున్నారు.. ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకు పయనం అయ్యారు.. తాజాగా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, కూతురు క్లీంకారాతో బెంగళూరుకి బయలుదేరారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సాదారణంగా మెగా ఫ్యామిలీ ప్రతి ఏటా ఒకచోట చేరి సంక్రాంతి వేడుకలను జరుపుకుంటుంది. మెగా హీరోలంతా ఈ వేడుకల్లో పాల్గొంటారు. గతంలో బెంగళూరులోని ఫామ్ హౌస్‌లో సంక్రాంతి పండుగ జరుపుకున్న వీరంతా ఈ ఏడాది బెంగళూరులో పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రామ్ చరణ్ బెంగళూరు బయలుదేరారు.. ఉపాసన, క్లింకార తో కలిసి బెంగళూరుకు బయలు దేరారు… ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్నప్పుడు తీసిన వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
తాగడానికి ఇన్ని కారణాలు ఉన్నాయని ఈ పాట వినే వరకు తెలియదు బ్రో…
కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమాతో రేపు ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. పండక్కి వస్తున్నాం హిట్ కొడుతున్నాం అని కాన్ఫిడెంట్ గా ఉన్న నాగార్జున… నా సామిరంగ సినిమా ప్రమోషన్స్ తో అక్కినేని అభిమానుల్లో మంచి జోష్ తెచ్చాడు. ఇదే జోష్ లో రేపు థియేటర్స్ కి వెళ్లిపోవడానికి అభిమానులు రెడీగా ఉన్నారు. రిలీజ్ ముందు రోజు కూడా ప్రమోషన్స్ చేస్తున్న నా సామిరంగ చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ని రిలీజ్ చేస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి “సీసా మూత ఇప్పు” సాంగ్ బయటకు వచ్చింది. ఈ సాంగ్ వింటే అసలు ఒక మనిషి తాగడానికి ఇన్ని కారణాలు ఉన్నాయా అనిపించడం గ్యారెంటీ. సాంగ్ పేరుకి తగ్గట్లే సీసా మూత ఇప్పడానికి అవసరమైన కారణాలని చెప్తూ సాగిన ఈ పాట చాలా క్యాచీగా ఉంది. అల్లరి నరేష్, నాగార్జున, రాజ్ తరుణ్… తాగుతూ పాడుకున్న ఈ పాటని రాబోయే రోజుల్లో మందుబాబుళ్లంతా పాడుకుంటారు. డీజే మిక్స్ కొడితే “సీసా మూత ఇప్పు” సాంగ్ ట్రెండ్ కూడా అవుతోంది. చంద్రబోస్ ఇంత క్యాచీగా లిరిక్స్ ని రాస్తే… కీరవాణి వినగానే కనెక్ట్ అయ్యే ట్యూన్ ని ఇచ్చాడు. సింగర్స్… మల్లికార్జున్, రేవంత్, సాయి చరణ్, లోకేష్, అరుణ్ కౌండిన్య, హైమత్ లు సాంగ్ కి తగ్గ వోకల్స్ ఇచ్చి పాటని మరింత ఎలివేట్ చేసారు. ఈ సాంగ్ కొంచెం ముందు రిలీజ్ అయ్యి ఉంటే నా సామిరంగ సినిమాకి ఇంకా బజ్ జనరేట్ అయ్యేది.
రెబల్ ఫ్యాన్స్ కి థమన్ భయం?
సూపర్ స్టార్ మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన మూడో సినిమా గుంటూరు కారం. సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందించాడు. థమన్ గుంటూరు కారం సినిమాని ఏ టైమ్ లో ఒప్పుకున్నాడో కానీ అప్పటి నుంచి థమన్ ట్రోలింగ్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు. ఓ మై బేబీ సాంగ్ కైతే సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. కుర్చీ మడతపెట్టి సాంగ్ విషయంలో కూడా థమన్ ట్రోలింగ్ ఫేస్ చేసాడు కానీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు “నేను త్రివిక్రమ్ అడిగి ఈ పాట చేయించుకున్నాం” అనే మాటని చెప్పడంతో థమన్ పై కాస్త కామెంట్స్ తగ్గాయి. అలా అనుకునేలోపే గుంటూరు కారం సినిమా రిలీజై థమన్ ని పూర్తిగా ఇరికించేసింది. గుంటూరు కారం సినిమాని చూసిన ఆడియన్స్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. థమన్ స్కోర్ సరిగ్గా కొట్టలేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ థమన్ పై దృష్టి పెట్టారు. ప్రభాస్-మారుతీ కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఇలాంటి సమయంలో ఈ ప్రాజెక్ట్ కి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అనగానే రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా యాక్టివ్ అయ్యి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ మారుతీ సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా ఫ్యాన్స్ ఇలానే చేశారు. మరి అభిమానులని దృష్టిలో పెట్టుకోని మేకర్స్ థమన్ కాకుండా ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కి వెళ్తారా లేక థమన్ తోనే కంటిన్యూ అవుతారా అనేది చూడాలి.
డే 1 కలెక్షన్స్… రీజనల్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ ఇండియా రికార్డ్
మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట… మహేష్ నటించిన ఈ మూడు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ సినిమాలు రిలీజ్ కి ముందు వింటేజ్ ని మహేష్ ని చూపిస్తాం అని చెప్పి హైప్ పెంచాయి, రిలీజ్ అయిన తర్వాత డివైడ్ టాక్ ని తెచ్చుకున్నాయి. కొందరికి నచ్చినా మరికొందరికి నచ్చకపోయినా ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాత్రం సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టాయి. ఇవి సాధించిన కలెక్షన్స్ చూస్తే అసలు ఇవి యావరేజ్ సినిమాల్లా కనిపించవు. ఆ రేంజ్ కలెక్షన్స్ ని ఫుల్ ఆఫ్ చేసాయి. ఇది కంప్లీట్ గా మహేష్ బాబు చరిష్మా కారణంగానే జరిగింది. ఇప్పుడు గుంటూరు కారం కూడా ఇదే దారిలో నడుస్తోంది. డే 1 మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది గుంటూరు కారం సినిమా. భారీ అంచనాలతో థియేటర్స్ కి వెళ్లిన వాళ్లు కాస్త డిజప్పాయింట్ అయ్యి బయటకి వస్తున్నారు. వింటేజ్ మహేష్ బాబుని కంప్లీట్ గా ఓపెన్ అప్ అయ్యి చూపించడంలో, ఇరగదీసే డాన్స్ లు వేయించడంతో థియేటర్స్ లో మహేష్ ని చూసిన ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమాలో మహేష్ చూపించిన ఎనర్జికి కాస్త త్రివిక్రమ్ మార్క్ కూడా తోడై ఉంటే ఘట్టమనేని అభిమానులు ర్యాంపేజ్ అంటే ఎలా ఉంటుందో చూపించే వాళ్ళు. త్రివిక్రమ్ మార్క్ మిస్ అయినా కూడా మహేష్ మ్యాజిక్ బాక్సాఫీస్ దగ్గర వర్క్ అవుతోంది. డే 1 అన్ని సెంటర్స్ కలిపి గుంటూరు కారం సినిమా 85-90 కోట్ల వరకూ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది ఇండియాలో ఏ రీజనల్ సినిమాకైనా ఆల్ ఇండియా రికార్డ్ అనే చెప్పాలి. ప్రొడ్యూసర్స్ నుంచి ఫైనల్ ఫిగర్స్ బయటకు వస్తే డే 1 గుంటూరు కారం సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.