ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దూకుడు.. ఏ-1గా చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో చంద్రబాబు పేరును సీఐడీ ఏ1గా చేర్చింది. ఏ2గా వేమూరి హరికృష్ణ, ఏ3గా కోగంటి సాంబశిరావును చేర్చారు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కాగా ఏపీ పైబర్ నెట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఏపీ సీఐడీ 2021లో కేసు నమోదు చేసింది. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఈ కేసులో 25వ నిందితుడిగా చేర్చారు. రూ.114 కోట్లు దుర్వినియోగం చేశారని సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఆ తర్వాత జరిగిన విచారణలో భాగంగా చంద్రబాబు పేరును ఏ1గా చేర్చారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. కాగా, గత ఏడాది ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ.. ఆ తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో 50 రోజులకు పైగా రిమాండ్‌లో ఉన్నారు.. ఆ తరువాత మధ్యంతర బెయిల్ పొందారు.. అనంతరం హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు చంద్రబాబు.. ఇటువంటి పరిస్థితులలో వరుసగా చంద్రబాబుపై కేసులు నమోదు కావడం ఏపీ రాజకీయాల్లో చర్చ నీయాంశంగా మారింది. మరోవైపు, స్కిల్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సీఐడీ.. సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం విదితమే.
లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక.. తుది దశకు వైసీపీ కసరత్తు..
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు వైసీపీ పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఇప్పటికే 11 లోక్‌సభ నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు నియోజకవర్గాలకు కొత్త ముఖాలను ప్రకటించింది వైసీపీ. మిగిలిన స్థానాలకు గానూ నాలుగింటిలో సిట్టింగ్ ఎంపీలను మార్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మిగిలిన నియోజక వర్గాలకు అభ్యర్థులుగా ఎవరికి అవకాశం దక్కుతుంది అన్న చర్చ జరుగుతోంది.. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ నేతగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరు ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఇక నంద్యాల లోక్‌సభ నియోజకవర్గము నుంచి మైనార్టీనీ బరిలోకి దింపాలని వైసీపీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కడప మైనార్టీ నేత అంజద్ పాషా, నటుడు అలీ పేరు పరిశీలనలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటు నెల్లూరు లోక్‌సభ నుంచి బొమ్మిరెడ్డి సురేష్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. అనకాపల్లి నుంచి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి పై క్లారిటీ వచ్చిన తర్వాత అభ్యర్థిని ఖరారు చేయాలని వైసీపీ ఆలోచనగా ఉందని ఆపార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఇక బాపట్ల నుంచి రావెల కిషోర్ బాబు తనయుడు పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. బాపట్ల సిట్టింగ్ ఎంపీని తప్పించేందుకు వైసీపీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇక అమలాపురం, విజయనగరం నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు చివరి దశలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
4 నెలల్లో.. నాలుగు రాకెట్ ప్రయోగాలు-ఇస్రో చైర్మన్
4 నెలల్లో.. మరో నాలుగు రాకెట్ ప్రయోగాలు ఉంటాయని తెలిపారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. ఈరోజు శ్రీహరికోట నుంచి ప్రయోగించే GSLV-F14 రాకెట్ విజయవంతం కావాలని శ్రీ చెంగాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. GSLV F14 ద్వారా INSAT -3DS ఉపగ్రహన్ని ఈ రోజు సాయంత్రం 5.35 కి ప్రయోగిస్తున్నాం. ఈ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాం.. ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ సాఫీగా సాగుతోందని తెలిపారు. ఈ ఉపగ్రహం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణ పరిస్థితులు, తుఫాన్ లాంటి విపత్తులు, వర్షాభావ పరిస్థితులు, మేఘాల గమనాలు, సముద్ర ఉపరితల మార్పులపై స్పష్టమైన సమాచారం అందజేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న సమాచార ఉపగ్రహాలలో కొన్నింటికి కాలం చెల్లడంతో వాటి స్థానంలో అత్యధిక పరిజ్ఞానం కలిగిన ఉపగ్రహాలను పంపిస్తున్నాం అన్నారు డాక్టర్ సోమనాథ్.. ఈ ఉపగ్రహం ఐదు నుంచి పది సంవత్సరాలు పనిచేస్తుందన్న ఆయన.. ఇలాంటి కమ్యూనికేషన్ సాటిలైట్లు రాబోయే కాలంలో మరిన్ని ప్రయోగిస్తాం.. రాబోయే నాలుగు నెలల్లో నాలుగు రాకెట్ ప్రయోగాలు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక, GSLV F15 ద్వారా NISSAR ఉపగ్రహ ప్రయోగం జూన్ లో ఉంటుందని ప్రకటించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.
టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం పనిచేశారు.. సమాచారం మొత్తం చేరవేశారు..!
మరోసారి తన సోదరుడు, బెజవాడ ఎంపీ కేశినేని నానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని.. కేశినేని నాని ఊసరవెల్లి.. టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం కేశినేని నాని పని చేశాడు.. ఢిల్లీలో నారా లోకేష్ ఏయే లాయర్లను కలిశారు.. ఎవరెవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని వైసీపీకి చేరవేశారంటూ ఆరోపించారు. చంద్రబాబు కోసం పూజలు చేసిన కేశినేని నాని.. ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. విజయవాడ వెస్టులో టిక్కెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని.. ఇద్దరి దగ్గర నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారు. తామిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని నానిపై ఒత్తిడి తెస్తున్నారు. కేశినేని నాని కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయన్నారు. కేశినేని నాని వసూలు రాజా.. నన్ను పిట్టల దొర అంటున్న కేశినేని నాని విషయాన్ని త్వరలో ప్రజలే తేలుస్తారని హెచ్చరించారు కేశినేని చిన్ని.. సీఎం వైఎస్ జగన్ వద్ద.. వైసీపీ ఇన్చార్జుల వద్ద కేశినేని నాని పాలేరు పని చేస్తున్నారని మండిపడ్డారు. కేశినేని నానిది సైకో మనస్తత్వం. విజయవాడ ఎంపీ టిక్కెట్ కేశినేని నానికి ఇవ్వడం కూడా వైఎస్ జగన్‌కు ఇష్టం లేదు అన్నారు. దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి వారికి కేశినేని నాని అసిస్టెంట్ పని చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని. కాగా, గతంలోనూ కేశినేని బ్రదర్స్ మధ్య వివిధ అంశాలపై మాటల యుద్ధం సాగుతోన్న విషయం విదితమే.
ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఎన్నికల్లో చూసుకుందాం..!
ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఎన్నికల్లో చూసుకుందాం అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్‌పై సోమిరెడ్డి నానా హడావిడి చేశారు.. నిన్న వెజల్ వచ్చి కంటైనర్లను అన్ లోడ్ చేసింది.. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లాం.. కానీ, సోమిరెడ్డి మాత్రం అఖిలపక్షం పేరుతో ఆందోళనలు చేశారు.. గతంలో సెంబ్ కార్ప్ విద్యుత్ ప్లాంట్ లో ప్రజలతో కలిసి ఆందోళన చేశారని.. టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబుతో ప్రారంభించారు.. సోమిరెడ్డి తన స్వార్ధ ప్రయోజనాల కోసం.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని ఆరోపించారు. ఇక, పోర్టు యాజమాన్యంతో పాటు పరిశ్రమల ప్రతినిధులను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటూ సోమిరెడ్డిపై విమర్శలు చేశారు కాకాణి.. తానేమో అధికారంలోకి వస్తామని.. రెండు నెలలు ఆగమని చెబుతున్నారన్న ఆయన.. ఎన్నికల్లో పోటీకి సోమిరెడ్డి పనికిరారని భావించే చంద్రబాబు.. సర్వే చేయిస్తున్నారు.. ఆ సర్వేకి సంబంధించిన కాల్ నాకు కూడా వచ్చిందన్నారు. సైదాపురంలో అక్రమ మైనింగ్ లో నాకు వాటా ఉందని ఆరోపించారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీశారు. సోమిరెడ్డి వాటా ఆయనకు వచ్చిందన్నారు. ఇక, ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఎన్నికల్లో చూసుకుందాం.. నేను గెలుస్తానని అంటున్నారు.. దానిని ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. ఇప్పటికైనా సోమిరెడ్డి సోమిరెడ్డి తన ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
టీడీపీలో బుజ్జగింపుల పర్వం..! వారికి నో టికెట్స్..!
ఆంధ్రప్రదేశ్‌లో బుజ్జగింపుల పర్వానికి అన్ని పార్టీలు తెరలేపాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు.. నేతల్లో కొంత అసంతృప్తిగా కారణం కాగా.. సీట్లు ప్రకటించకముందే.. టీడీపీ.. తమ పార్టీ నేతలను బుజ్జగింపులు, లాలింపులు చేస్తోంది.. ఇప్పటికే జనసేనతో కలిసి వెళ్లాలని నిర్ణయానికి రాగా.. బీజేపీతో పొత్తు వ్యవహారం తేలాల్సి ఉంది. దీంతో.. కీలక స్థానాల్లోనూ నేతలు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట.. సుమారు 50-60 సెగ్మెంట్లల్లో నేతలకు టిక్కెట్ల అంశమై సర్దిచెప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎదురవుతోందట..ముఖ్యంగా 25-30 స్థానాల్లో సిట్టింగ్ ఇన్ఛార్జీలకు ఈసారి నో టిక్కెట్ అని చెప్పే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది. జనసేన, బీజేపీలకు 25-30 స్థానాలను కేటాయించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే కొందరికి క్లారిటీ ఇచ్చేస్తోన్నారు టీడీపీ ముఖ్యులు. ఇక, టిక్కెట్ డైలమాలో ఉన్న కీలక నేతల విషయానికి వస్తే.. గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, వర్మ, దేవినేని ఉమ, బుచ్చయ్య చౌదరి.. కొనకళ్ల, మండలి బుద్ద ప్రసాద్, ముద్రబోయిన, బుద్దా వెంకన్న, బోడె ప్రసాద్, జవహర్, చాంద్ బాష ఇలా చాలా మందే ఉన్నారట.. వీరితో పాటు పీతల సుజాత, మాగంటి బాబు, ఆనం, సోమిరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆలపాటి రాజా, కోడెల శివరాం, కొమ్మాలపాటి శ్రీధర్ కూడా ఉన్నారనే చర్చ సాగుతోంది.. మరోవైపు.. రెండు టిక్కెట్ల కోసం పట్టు బడుతున్న కీలక కుటుంబాలకు కూడా క్లారిటీ ఇస్తోందట టీడీపీ అధిష్టానం.. ఒకే టిక్కెట్ ఇస్తామని స్పష్టం చేస్తున్నారు.. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నారట సీనియర్ నేత అశోక్ గజపతి రాజు. మరోవైపు.. తమకు పూర్తి క్లారిటీ ఉందని.. తామే పోటీ చేస్తామంటున్నారు గోరంట్ల, బండారు, సోమిరెడ్డి.. తాజా ప్రచారాలతో అలకపాన్పు ఎక్కారట ఆనం..? అయ్యన్నను ఎలా డీల్ చేయాలోనని హైకమాండ్ తర్జన భర్జన పడుతోందట.. కీలక నేతలు దృష్టి సారించడంతో.. కొన్ని స్థానాలపై ఏటూ తేల్చుకోలోకపోతోందట టీడీపీ. ఇక, లోక్ సభ స్థానాల నుంచి పోటీకి కాల్వ, పార్దసారథి నేతలు నిరాకరించడం కూడా టీడీపీ తలనొప్పిగా మారిందనే చర్చ సాగుతోంది.
ఎంపీ ఎంవీవీకి టీడీపీ ఎమ్మెల్యే ఓపెన్ ఛాలెంజ్..! రెడీయా..?
విశాఖపట్నంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం, మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను టార్గెట్ చేసి.. టీడీపీ, జనసేన నేతలు ఆరోపణలు చేస్తున్నారు.. ఇక, వాటికి ధీటుగా కౌంటర్ ఎటాక్ దిగుతున్నారు ఎంపీ ఎంవీవీ.. తాజాగా, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు బహిరంగ సవాల్ విసిరారు.. దమ్ముంటే రంగా కేసు రీ ఓపెన్ చెయించి.. నేను హత్య చేసినట్లు నిరూపించగలవా..? అని నిలదీశారు. కోర్టు కొట్టేసిన కేసులో ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం దావా వేస్తాను అంటూ హెచ్చరించారు. ఎంపీ ఎంవీవీ భూ భక్షకుడు.. ఓ దిక్కు మాలిన బిల్డర్ అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీలో ఎమ్మెల్సీ వంశీకృష్ణని ఇబ్బంది పెట్టారు కాబట్టి మీ పార్టీ నుండి ఆయన బయటికి వచ్చేశాడని వ్యాఖ్యానించారు వెలగపూడి.. ఎంపీ ఎంవీవీ వైజాగ్ భూ కుంభకోణాల్లో వున్న వ్యక్తి.. ఆ విషయం వైసీపీ ముఖ్య నేతే చెప్పారన్నారు. లిక్కర్ వ్యాపారంలో నా మీద ఒక్క కేసు కూడా లేదు.. భూ కబ్జాలు చేసినట్టు నీ మీద బోలెడన్ని కేసులున్నాయి.. నీ కుంభకోణాలు చెప్పాలంటే రెండు రోజులు సరిపోదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా నాలుగున్నర సంవత్సరాల నుండి ఎప్పుడైనా.. ఎక్కడైనా నువ్వు వైజాగ్ లో కనిపించావా..? అని నిలదీశారు. నేను నీ వెంట్రుక పీకలేనన్నావు, ప్రజలే నిన్ను వచ్చే ఎన్నికల్లో సముద్రంలో పడేస్తారు అంటూ.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు వార్నింగ్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు.
హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ.. ఉత్తమ్ వర్సెస్ హరీశ్ రావు మాటల యుద్ధం..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ఇచ్చింది. దీనిపై దీర్ఘకాలిక చర్చలో భాగంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మేము మాట్లాడుతుంటే ఇంకో సభ్యులకు అనుమతి ఇవ్వకండి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యదూరమైన విషయాలు బుక్ లో పొందుపరిచారు అని పేర్కొన్నారు. ఆయకట్టు రెండు చోట్ల రెండు రకాలగా చెప్పారు.. వాస్తవం మాత్రం ఇంకోలా ఉందన్నారు. ఇక, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2014కి ముందు అంటే నిజాంకి ముందు ఆ తర్వాత అని చెప్పుకొచ్చారు. ఇక, నిజాం అప్పటి నుంచి నిధులు ఖర్చు పెట్టారా?.. రాయలసీమ లిఫ్ట్ గురించి అబద్ధాలు రాశారు అంటూ హరీశ్ రావు అన్నారు.. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇస్తూ.. హరీష్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అని పేర్కొన్నారు. కేసీఆర్, జగన్ అనేక సందర్భాల్లో నీటి వాటాపై చర్చ చేశారు.. కేంద్రం నుండి లేఖ వచ్చింది అపెక్స్ లో పాల్గొనండి అని అన్నారు. అప్పుడు అభ్యంతరం చెప్తే రాయలసీమ ప్రాజెక్టు ఆగేది.. మీటింగ్ కి పోకుండా టెండర్ అయిపోయే వరకూ చుశారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు రీకౌంటర్ ఇచ్చారు.. వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్ ఇది అంటూ విమర్శించారు. ఎన్నికల్లో గోబెల్స్ ప్రచారం చేశారు.. సభలో కూడా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులు అప్పగిస్తామని మినిట్స్ మీటింగ్ లో ఉంది.. ఫిబ్రవరి 1వ తేదీ జరిగిన మీటింగ్ లో కూడా ఒప్పుకున్నారు.. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి చెప్పారు అని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.
కుల గణన ఎప్పటి వరకు పూర్తి చేస్తారు.. దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పలేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బీసీ కుల గణన బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కాగా, బీసీ జనగణన కోసం ప్రభుత్వం బిల్లు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎప్పుడు కుల జన గణన చేస్తారు.. ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పలేదు అని ఆమె ప్రశ్నించారు. కానీ కంటి తుడుపు చర్య లాగా తీర్మానం చేసి వదిలి వేసింది ఈ ప్రభుత్వం అన్నారు. దీనిని భారత జాగృతి తీవ్రంగా ఖండిస్తుంది.. తీర్మానంలోనే క్లారిటీ లేదు, బీసీ సబ్ ప్లాన్ కు చట్ట బద్ధత చేయాలి అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీలు ఇప్పుడే గుర్తు వచ్చారా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.. మేము కూడా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాం.. మీకు ఇన్ని రోజులు బీసీలు ఎందుకు గుర్తు లేరు.. గతంలో మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అని ఆమె ప్రశ్నించారు. అలాగే, తన తండ్రికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది. ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మహనీయుడన్నారు. కారణ జన్ముడైన కేసీఆర్ చిరస్మరణీయుడిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు.
భక్తులకు గుడ్ న్యూస్.. మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు
మేడారం వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 21న మహాజతర జరుగనున్న నేపథ్యంలో ప్రత్యేక జన సాధారణ రైళ్లు నడపనున్నట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ఐదు రోజుల పాటు, అలాగే నిజామాబాద్ నుంచి వయా సికింద్రాబాద్, వరంగల్ మధ్య 4 రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటుగా కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు మరో ప్రత్యేక రైలు అందుబాటులో ఉందన్నారు. రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మేడారానికి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతున్నందున భక్తులకు ప్రయాణం సుగమం అవుతుందని.. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని క్షేమంగా దర్శనం చేసుకుని ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైల్వే అధికారులు కోరారు.
కోర్టుకు హాజరైన అరవింద్ కేజ్రీవాల్.. ఇన్ని రోజులు ఎందుకు రాలేదంటే ?
ఆరు సమన్ల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం (ఫిబ్రవరి 17) ఈడీ కోర్టు విచారణకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో ఆయన పాల్గొన్నారు. ఫిబ్రవరి 17న కోర్టుకు హాజరు కావాలని కేజ్రీవాల్‌ను కోర్టు ఆదేశించింది. అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది హాజరు నుంచి మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్, విశ్వాస తీర్మానం కారణంగా తాను హాజరు కాలేకపోయానని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈరోజు కోర్టుకి హాజరుకావాలని ఉన్నా బడ్జెట్ సమావేశాలు, విశ్వాస పరీక్ష ఉన్నందున కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకు కేజ్రీవాల్ మినహాయింపును కోరారు. మార్చి 16న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతానని కేజ్రీవాల్ కోర్టుకు తెలిపారు. ఈరోజు ఢిల్లీ అసెంబ్లీలో కూడా విశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారని అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది రమేష్ గుప్తా తెలిపారు. తదుపరి తేదీ మార్చి 16వ తేదీకి ఇవ్వబడింది. ఈ అంశంపై కేజ్రీవాల్ హాజరుకానున్నారు. అంతా కుదిరితే మార్చి 16న కేజ్రీవాల్ స్వయంగా కోర్టుకు హాజరుకానున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రూ.3వేల కోట్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. న్యూయార్క్ కోర్టు జడ్జి ఆర్థర్ అంగోరాన్ ట్రంప్, అతని కంపెనీలను మోసం చేసిన కేసులో సుమారు 355 మిలియన్ డాలర్లు అంటే రూ. 3వేల కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. దానిపై ట్రంప్ జరిమానా మొత్తంగా మిలియన్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ కార్పొరేషన్‌లో అధికారి లేదా డైరెక్టర్‌గా వ్యవహరించడాన్ని కూడా కోర్టు నిషేధించింది. ట్రంప్ మూడేళ్లపాటు రాష్ట్రంలోని ఏ ఇతర చట్టపరమైన సంస్థలలో ఎలాంటి పదవిని నిర్వహించలేరు. అలాగే తన రిజిస్టర్డ్ కంపెనీల కోసం ఏ ఆర్థిక సంస్థ నుండి రుణం కోసం దరఖాస్తు చేయకూడదని కోర్టు తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ రుణదాతలను మోసం చేశారని.. అతని కంపెనీల ఆస్తుల విలువను అతిశయోక్తి చేశారని కోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. మాన్‌హట్టన్ కోర్టు ఈ 90 పేజీల నిర్ణయం కారణంగా, డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం ప్రమాదంలో పడింది. ఈ కేసు విచారణ దాదాపు మూడు నెలలుగా కోర్టులో సాగింది. 2017 నుంచి ట్రంప్ ఆర్గనైజేషన్‌కు నాయకత్వం వహిస్తున్న ట్రంప్ ఇద్దరు కుమారులు డొనాల్డ్ జూనియర్, ఎరిక్‌లకు కూడా కోర్టు జరిమానా విధించింది. మోసం ద్వారా వ్యక్తిగత లాభాలు పొందారనే ఆరోపణలపై ఇద్దరు కుమారులు 4 మిలియన్ డాలర్లు లేదా రూ. 33.19 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. దీంతోపాటు ట్రంప్ ఆర్గనైజేషన్‌లో అధికారులుగా పని చేయకుండా వారిద్దరూ రెండేళ్లపాటు నిషేధం విధించారు.
ఆండ్రాయిడ్ 15 వచ్చేసింది.. ఏ ఫోన్ లలో సపోర్ట్ చేస్తుందంటే
ఆండ్రాయిడ్ వినియోగదారులకు శుభవార్త. Google Android 15 మొదటి డెవలపర్ ప్రివ్యూ వెర్షన్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. ఇందులో చిన్న సెక్యూరిటీ డెవలప్ మెంట్స్, కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇది డెవలపర్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినందున, ఇది రోజువారీ డ్రైవింగ్‌కు తగినది కాదు. కాబట్టి మీరు దీన్ని మీ Pixel పరికరంలో ప్రయత్నించాలనుకుంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే. మార్చి – ఏప్రిల్ మధ్య పబ్లిక్ బీటా వెర్షన్‌ను విడుదల చేయవచ్చని గూగుల్ ప్రకటించింది. Android 15 ప్రకటనలపై మరింత నియంత్రణను కలిగి ఉండటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. సెట్టింగ్‌లలోని “ప్రైవసీ & సెక్యూరిటీ” విభాగంలో “యాడ్స్” అనే కొత్త మెను జోడించబడింది. ఇక్కడ మీకు ప్రకటనలను చూపడానికి మీ ఫోన్‌లో మీ యాక్టివిటీని ఏ యాప్‌లు ట్రాక్ చేస్తున్నాయో మీరు తనిఖీ చేయవచ్చు.
టీమిండియాకు బిగ్ షాక్.. అర్ధాంతరంగా టెస్ట్ మ్యాచ్ నుంచి తప్పుకున్న అశ్విన్..
ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడో టెస్ట్ జరుగుతోన్న సమయంలో టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది.. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్.. రాజ్‌కోట్ టెస్ట్ నుండి వైదొలిగాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లితో ఉండటానికి అశ్విన్ రాజ్‌కోట్ నుండి చెన్నైకి తిరిగి వెళ్లాల్సి వచ్చింది.. మూడో టెస్ట్‌లో 37 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్న అశ్విన్.. అత్యవసర పరిస్థితి కారణంగా టెస్ట్ జట్టు నుండి వైదొలిగినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.. “రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ జట్టు నుండి వైదొలిగాడు, కుటుంబ సభ్యుల వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా వెంటనే ఇది అమలులోకి వచ్చింది. ఈ సమయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరియు జట్టు పూర్తిగా అశ్విన్‌కు మద్దతు ఇస్తుందని పేర్కొంది. “చాంపియన్ క్రికెటర్ మరియు అతని కుటుంబానికి బీసీసీఐ తన హృదయపూర్వక మద్దతును అందిస్తుంది అని పేర్కొన్నారు.. క్లిష్ట పరిస్థితుల్లో ఇండియన్ టీమ్‌తో పాటు బీసీసీఐకూడా అతడికి అండగా ఉంటుందని తెలిపింది. అశ్విన్ ప్రైవసీకి భంగం కలగకుండా అభిమానులు సంయమనం పాటించాలని తెలిపింది.. ఈ కఠిన సమయంలో అశ్విన్‌కు అన్ని విధాలుగా సాయం అందించేందుకు బోర్డ్ సిద్ధంగా ఉందని పేర్కొంది.. తన తల్లికి సీరియస్‌గా ఉండటంతోనే అశ్విన్.. చెన్నై వెళ్లినట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, మూడో టెస్టు రెండో రోజు.. రాజ్‌కోట్‌లో అశ్విన్ బ్యాట్ మరియు బాల్ రెండింటితో అద్భుతంగా రాణించారు.. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడిన సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్.. ధృవ్ జురెల్‌తో కలిసి 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు, భారత్ 400 పరుగుల మార్కును దాటేలా చేశాడు.. అశ్విన్ 37 పరుగులు చేయడంతో భారత్ ఇన్నింగ్స్ 445 పరుగులకు ఆలౌటైంది.
దుమ్ము దులిపేసిన ‘ఊరు పేరు భైరవకోన ‘ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.. అయితే ఈ హీరో ఖాతాలో హిట్ పడి చాలా కాలం అయ్యింది.. తాజాగా ‘ఊరు పేరు భైరవకోన ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఈ సినిమా నిన్న విడుదలైంది.. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా ఈ మూవీని నిర్మించారు.. ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీగానే లభించింది. దీంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మరి సందీప్ ‘ఊరు పేరు భైరవకోన’ తొలి రోజు కలెక్షన్లను ఎంత రాబాట్టిందో చూద్దాం.. ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఊరి పేరు భైరవకోన’ ఎలా ఉంది? సందీప్ ఖాతాలో హిట్ పడిందా లేదా? అనేది ట్విట్టర్ ద్వారా నెటిజన్లు చర్చిస్తున్నారు..సూపర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఊరు పేరు భైరవ కోన’లో కొన్ని సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్ నెమ్మదిగా సాగినప్పటికీ.. కథ ఆకట్టుకునేలా ఉంటుంది. సెకండాఫ్ కొంత సమయం తర్వాత ట్రాక్ నుండి బయటపడి ఊహాజనిత మోడ్‌లోకి వెళుతుంది. మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటివరకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈరోజు కూడా ఇదే టాక్ తో దూసుకుపోతుంది.. ఇక మొదటి రోజు కలెక్షన్ల విషయానికొస్తే.. సినిమాకు నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 4.40 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 19.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 1.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది.. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాకు 6 కోట్లకు పైగా రాబట్టింది.. ఈ వీకెండ్ ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది..
తల్లి కాబోతున్న కియారా అద్వానీ..పిక్స్ వైరల్…
బాలివుడ్ బ్యూటీ కియారా అద్వాని అటు హిందీ, ఇటు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది.. ఇటీవల తాను ప్రేమించిన సిద్ధార్థ్ మల్హోత్రా ను పెళ్లి చేసుకుంది.. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ అస్సలు ఖాళీ లేదని చెప్పాలి.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులను పలకరిస్తూ వస్తుంది.. తన పర్సనల్ విషయాలు లేటెస్ట్ ఫొటోలతో పాటు సినిమా విషయాలను షేర్ చేస్తుంది.. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు తల్లి కాబోతుందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. ఈ అమ్మడు ఐదారేళ్ళ పాటు సీక్రేట్ గా ప్రేమించుకున్నారు సిద్ధార్థ్, కియారా. కానిఎక్కడా అఫీషియల్ గా బయటపడలేదు. ట్రోల్స్ పై కూడా పెద్దగా రియాక్ట్ అయ్యేవారు కాదు. తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకునేవారు. ఇక సడెన్ గా పెళ్ళి చేసుకుని షాక్ ఇచ్చారు కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా. పెళ్ళి తరువాతా వారు తమ బంధాన్నిఅఫీషియల్ గా అనౌన్స్ చేశారు.. పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్ళి రాజస్తాన్ లోని ప్యాలస్ లో రంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు, బందువులు మాత్రమే హాజరయ్యారు.. పెళ్లి అయిన అందాల షో చెయ్యడం తగ్గించలేదు.. అయితే తాజాగా కియారా అద్వానీ తల్లి కాబోతుంది అంటూ కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే చాలాసార్లు కియరా అద్వాని ప్రెగ్నెంట్ అంటూ వైరల్ న్యూస్ వినిపించినప్పటికీ ఇందులో ఏది నిజం కాలేదు.కానీ ఇటీవల తన భర్తతో దిగిన ఫోటోలలో పొట్ట కాస్త ఎక్కువగా ఉండటంతో ఆమె ప్రగ్నెంట్ అని తెగ ట్రెండ్ చేస్తున్నారు.. మరి దీనిపై కియారా క్లారిటి ఇవ్వాల్సి ఉంది.. సినిమాల విషయానికొస్తే.. తాజాగా రామ్ చరణ్ కి జంటగా గేమ్ ఛేంజర్ మూవీలో కియారా నటిస్తున్నారు. రామ్ చరణ్ కి జంటగా మరోసారి కియారా నటిస్తుంది.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఇక బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..