ఏపీ పేపర్ మిల్లు ఆకస్మిక లాకౌట్.. ఉన్నట్టుండి ఎందుకు..?
ఉన్నట్టుండి ఆకస్మాత్తుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఏపీ పేపర్ మిల్‌కు లాకౌట్ ప్రకటించింది యాజమాన్యం.. గత 23 రోజులుగా సమ్మెలో ఉన్నారు పేపర్ మిల్ కార్మికులు.. బీ-షిప్ట్ నుంచి కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు నోటీసు బోర్డులో ఓ లేఖ పెట్టారు.. ఈ నేపథ్యంలో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పేపరు మిల్లు వద్దకు చేరుకుంటున్నారు.. దీంతో, అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, వేతన ఒప్పందం చేయాలని ఈ నెల 2వ తేదీ నుంచి పేపరు మిల్లులోని 11 కార్మిక సంఘాలు శాంతియుతంగా సమ్మెను కొనసాగిస్తున్నాయి.. కొత్త వేతన ఒప్పందం కోసం సుమారు 2,800 మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే, ఉన్నట్టుండి లాకౌట్ ప్రకటించింది యాజమాన్యం.. అర్థంతరంగా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించడంపై కార్మికులు, కార్మిక సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వైఎస్ భారతికి పులివెందుల బాధ్యతలు..
సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో హీట్ పెంచుతున్నాయి.. ఇప్పటికే ప్రచార పర్వంలో నేతలు దూసుకుపోతుండగా.. ఇవాళ్టితో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుండడంతో.. మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.. ఇక, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానం బాధ్యతలను.. ఆయన సతీమణి వైఎస్ భారతికి అప్పగించారు.. నేటి నుండి వారం రోజులపాటు పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు వైఎస్ భారతి.. రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్న నేపథ్యంలో పులివెందుల బాధ్యతలు భారతి చేపట్టనున్నారు.. 2014, 2019 ఎన్నికలలో కూడా పులివెందులలో ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు భారతి.. ఇక, పులివెందులతోపాటు కడప పార్లమెంట్ పరిధిలోనూ పలు నియోజకవర్గాలలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారట.. ఈ నేపథ్యంలో.. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో కలిసి పులివెందులకు చేరుకున్నారు భారతి.. సీఎస్ఐ చర్చ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముగిసిన తర్వాత ఉదయం 11:25 గంటలకు పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు సీఎం జగన్.. ఈ కార్యక్రమంలో వైఎస్ భారతి పాల్గొనే అవకాశం ఉండగా.. ఇక, ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు వైఎస్ భారతి ప్లాన్ చేసుకున్నారు.
ఎందరు కలిసివచ్చినా జగన్‌ను టచ్ చేయలేరు..!
2019లో ఏ విధంగా ఆదరించారో.. 2024లో కూడా అదే విధంగా ఆదరించాలి.. సంక్షేమ రాజ్యాన్ని ముందుకు సాగించేలా ప్రజలు దీవించాలి అన్నారు కడప లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి.. పులివెందులలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల జగనన్న పాలనలో పులివెందుల ఎంతో అభివృద్ధి చెందింది.. నాలుగు సార్లు సీబీఆర్ కు ఫుల్ కెపాసిటీ నీటిని నింపారని తెలిపారు. చంద్రబాబు పులివెందులకు వచ్చి పోయిన తర్వాత వర్షం లేకుండా పోయిందన్న ఆయన.. ఈ 16 నెలల కరువు కాలంలో లింగాల, పీబీసీ కాలుల ద్వారా అరటి రైతులకు నీళ్లు ఇచ్చాం అని గుర్తుచేశారు. 2014 నుంచి 2019 వరకు జిల్లా యంత్రాంగానికి 750 కోట్ల రూపాయలు వ్యవసాయ భీమా వస్తే, జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 24 మధ్యలో 1900 కోట్లు పంటలు బీమా మంజూరు అయ్యిందన్నారు. వైసీపీ అభివృద్ధి చేస్తూ ఉంటే, ప్రతిపక్షాలు చేసేది లేక గుంపులు కట్టుకొని వస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పాటు, ప్యాకెట్ స్టార్, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్ ఎందరు కలిసి వచ్చిన జగన్ ను టచ్ చేయలేరని స్పష్టం చేశారు. 2019లో వైసీపీని ఏ విధంగా ఆదరించారో 2024లో కూడా అదే విధంగా ఆదరించాలి… సంక్షేమ రాజ్యాన్ని ముందుకు సాగించేలా ప్రజలు దీవించాలని కోరారు. ఇక, సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు. ఎంత మంది కలిసివచ్చినా.. ఎన్ని హామీలు ఇచ్చినా ఏమీ చేయలేరన్నారు. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే అది నిజమవుతుందనేది చంద్రబాబు సిద్ధాంతం.. వాళ్ల ట్రాప్‌లో పడవద్దు అని విజ్ఞప్తి చేశారు కడప ఎంపీ, వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి.
నా ప్రాణానికి ప్రాణం పులివెందుల.. ఏమీ లేదో చెప్పండి..?
తన సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. పులివెందుల సిద్ధమేనా…? అంటూ ప్రశ్నించిన ఆయన.. నా ప్రాణానికి ప్రాణమైన నా సొంత గడ్డ పులివెందుల.. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీగా అభివర్ణించారు. పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణం.. పులివెందులలో ఏముంది అని చెప్పండి అని అడిగితే, ఏమీ లేదో చెప్పండి అని అడిగే పరిస్థితి తీసుకొచ్చా అన్నారు. మాట ఇస్తే మడమ తిప్పమని తెలుగు నేలపై ఆడుగడుగునా నింపింది మీ పులివెందుల బిడ్డే.. రాయలసీమ మంచితనం మాటపై నిలబడే గుండె ధైర్యం చూసి ప్రతి గ్రామంలో వైసీపీని ఆదరిస్తున్నారని తెలిపారు. వైయస్సార్ పైన జగన్ పైన లేనిపోని బురద చల్లడానికి చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, ఓ వదినమ్మ వీరంతా దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు.. వీరికి తోడు వైయస్సార్ వారసులమని మీ ముందుకు వస్తున్నారు వారి కుట్రలో భాగంగానే.. వైయస్సార్ వారసులని చెప్పాల్సింది ఎవరు ప్రజల కాదా..? అని ప్రశ్నించారు.
వైఎస్ వివేకా కేసు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పులివెందులలో నామినేషన్‌కు ముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు.. మా వివేకం చిన్నానను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో, ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు సీఎం జగన్.. మా ఇద్దరి చెల్లెమ్మలను ఎవరు పంపించారో ప్రజలందరికీ తెలుసు.. వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి బహిరంగంగా తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు..? అని ప్రశ్నించారు. నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా, అధికార బలంతో ఓడించిన వారితోనే చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నది ఎవరు..? చిన్నానకు రెండవ భార్య ఉన్నమాట వాస్తవమా కాదా..? రెండవ భార్యకు కొడుకు ఉన్నాడా లేడా ఉన్నది వాస్తవమా కాదా..? అని బహిరంగ సభలో ప్రశ్నించారు జగన్.. ఇక, నోటా కు వచ్చిన ఓట్లు కూడా రాని కాంగ్రెస్‌తో.. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ తో రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌లో చేరి వైయస్సార్ పేరును ఛార్జిషీట్‌లో పెట్టిన వారికి ఓటు వేయడం ఎవరికి లాభం..? అంటూ పరీక్షంగా వైఎస్ షర్మిలను నిలదీశారు సీఎం జగన్.. ఓట్లు చీల్చడం వల్ల ఎవరికి లాభం బాబుకు కాదా…? ఓట్లు చీల్చి కూటమిని గెలిపించాలని చూడడం కాదా…? ఇలాంటివారు వైయస్సార్ కు వారసులా లేక, చంద్రబాబుకు వారసులా ప్రజలే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. నా కుటుంబ సభ్యులను డబ్బు సంపాదించడం కోసం కాదు.. భగవంతుడు మీ బిడ్డకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది.. జగన్ సీఎం అయినంక కుటుంబ సభ్యులను పక్కన పెట్టాడని అంటున్న కుటుంబ సభ్యులకు చెబుతున్న వైఎస్ అవినాష్ తప్పు చేయలేదని టికెట్ ఇచ్చాను అని స్పష్టం చేశారు జగన్.. వైఎస్ అవినాష్ జీవితం నాశనం చేయాలని కుట్రలో భాగమవుతున్నారు అని మండిపడ్డారు.
పులివెందులలో సీఎం జగన్ నామినేషన్..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఈ రోజు కీలక ఘట్టం ముగియనుంది.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుండడంతో.. ఉదయమే తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు సీఎం వైఎస్ జగన్.. ఈ రోజు తాడేపల్లిలోని ఇంటి నుంచి తన భార్య వైఎస్ భారతితో కలిసి బయల్దేరిన సీఎం జగన్.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.. ఇక, కడప నుంచి హెలికాప్టర్‌లో పులివెందులలో దిగారు.. మొదట సీఎస్‌ఐ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగసభలో పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడారు.. ముఖ్యంగా తమ ప్రాంత నేతలపై, వైఎస్ వివేకా కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు.. అనంతరం పులివెందుల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి . బహిరంగ సభ ముగియగానే సీఎస్‌ఐ గ్రౌండ్ నుంచి నేరుగా మినీ సెక్రటేరియట్‌లోని ఆర్వో ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. మరోవైపు.. ఈ ఎన్నికల్లో పులివెందులలో ఎన్నికల ప్రచార బాధ్యతలను తన సతీమణి వైఎస్ భారతికి అప్పజెప్పారు సీఎం జగన్.. నేటి నుంచి వారం రోజుల పాటు పులివెందులతో పాటు కడప లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు వైఎస్ భారతి.
చంద్రబాబుతో బీజేపీ జాతీయ నేతల భేటీ.. ఏం చేద్దాం..?
బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులో ఎన్నికలకు వెళ్తుండగా.. ఇప్పటికే పలుమార్లు బీజేపీ కేంద్ర పెద్దలు చంద్రబాబుతో సమావేశమై.. సీట్ల సర్దుబాటు, ప్రచారంపై చర్చించారు.. ఇక, ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. మరికొందరు బీజేపీ పెద్దలు సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రముఖంగా చర్చించారు.. సీఎం వైఎస్ జగన్‌పై రాయి దాడి ఘటన సహా ఇతర అంశాలపై కూడా సుదీర్ఘ చర్చ సాగింది.. కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రస్తావన వచ్చిందట.. ఇక, పెన్షన్ల పంపిణీలో వైసీపీ రాజకీయం చేస్తోందని పీయూష్ గోయల్ కి వివరించారు చంద్రబాబు నాయుడు.. మరోవైపు వచ్చే (మే నెల) నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలపై కూడా చర్చించారట.. చంద్రబాబుతో భేటీ అయిన వాళ్లల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్, జాతీయ సంయుక్త కార్యదర్శి శివ్ ప్రకాష్ తదితర నేతలు ఉన్నారు. కాగా, ఇప్పటికే బీజేపీ-టీడీపీ-జనసేన నేతలు ఉమ్మడిగా ప్రచారం చేస్తూ.. కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తోన్న విషయం విదితమే.
రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కి.. వద్దు అనుకుంటే బీజేపీ కి ఓటు వేయండి
రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కి.. వద్దు అనుకుంటే బీజేపీ కి ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. దీన్ని అడ్డుకోవాలని కుట్ర జరుగుతోందన్నారు. రాహుల్ గాంధీ ఓబీసీ పక్షాన నిలబడ్డారు అని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని అనుకుంటున్నారని.. బీజేపీ కి వేసే ప్రతీ ఓటు.. రిజర్వేషన్లు రద్దుకు తోడ్పాటని అన్నారు. వర్గీకరణ కోరుకునే వాళ్ళు… బీజేపీ కి ఎలా మద్దతు ఇస్తారో అర్థం కావడం లేదన్నారు. రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కి… వద్దు అనుకుంటే బీజేపీ కి వేయాలని సూచించారు. ఇదే రెఫరెండం అంటూ రేవంత్ అన్నారు. పదేళ్ళలో ఎన్డీఏ వైఫల్యం ప్రజలకు వివరించే బాధ్యత మాదన్నారు. మోడీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందన్నారు. పదేళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు.. కానీ 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు.. ఏం చేశారు ? అని ప్రశ్నించారు. నల్లచట్టాలు తెచ్చి రైతులను బానిసలు చేసే కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో .. మోడీ క్షమాపణ చెప్పారన్నారు. స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనం తీసుకువచ్చి పేదల అకౌంట్ లో వేస్తా అన్నారు. ఒక్కటి ఖాతాలోకి ఇవ్వలేదు మోడీ అని తెలిపారు. సిలిండర్ 1200 కి పెంచాడు, పప్పు ధర పెరిగిందన్నారు.
అరుణాచల్‌లో విరిగిన కొండచరియలు.. చైనాతో తెగిపోయిన సంబంధాలు
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని దిబాంగ్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే జాతీయ రహదారి 33లో కొంత భాగం కొట్టుకుపోయింది. దిబాంగ్ వ్యాలీ చైనాకు ఆనుకుని ఉన్న ప్రాంతంగా ఉంది. హైవేలో కొంత భాగం తెగిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది.. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం, నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక బృందం అక్కడ మరమ్మతులు చేస్తుంది. కాగా, జాతీయ రహదారి మరమ్మతుల కోసం అవసరమైన అన్ని వస్తువులను పంపినట్లు అధికారులు తెలిపారు. ఆహార పదార్థాలతో సహా అన్ని వస్తువులు సంఘటన స్థలంలో సరఫరా చేయబడుతున్నాయి. వాస్తవానికి జిల్లా ప్రజలకు, సైన్యానికి ఈ రహదారి జీవనాడి లాంటిది.. ఈ హైవే కనెక్షన్ తెగిపోవడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అలాగే, చైనా సరిహద్దుకు చేరుకోవడానికి సైన్యం కూడా ఈ రహదారిని ఉపయోగిస్తుంది. హైవే దెబ్బతినడంతో రాష్ట్ర ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు ఈ ప్రదేశం గుండా ఎవరూ వెళ్లొద్దని సూచించింది. ఈ రహదారి మరమ్మతులకు కొన్ని రోజులు పడుతుందని అధికారులు చెప్పుకొచ్చారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా జియో..
టెలికం రంగంలోకి అడుగు పెట్టి సంచలనం సృష్టించి దేశంలోనే అతి పెద్ద టెలికం నెట్‌వర్క్‌గా అవతరించిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద టెలికం నెట్‌వర్క్‌గా జియో నిలిచింది. మొబైల్ డేటా ట్రాఫిక్ విషయంలో చైనా మొబైల్‌ను జియో దాటేసింది. 2024 తొలి త్రైమాసికంలో చైనా మొబైల్ 38 ఎగ్జాబైట్స్ ట్రాఫిక్ నమోదు చేయగా.. అదే టైంలో 40. 9 ఎగ్జాబైట్స్ జియో డేటా వినియోగమైనట్టు గ్లోబల్ అనలటిక్స్ సంస్థ టెఫిసియెంట్ వెల్లడించింది. అలాగే, జియో ఖాతాలో మరో రికార్డును కూడా దక్కించుకుంది. 108 మిలియన్ మంది సబ్ స్క్రైబర్లతో జియో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద 5 సబ్ స్క్రైబర్ బేస్‌ను కలిగి ఉన్న ఘనతను సొంతం చేసుకుంది. ఇక, జియో మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్‌లో ఇప్పుడు 28 శాతం 5జీ యూజర్ల నుంచే నమోదు అవుతుంది. జియో భారత్ వాల్యూ ప్లాన్లు, అన్ లిమిటెడ్ 5జీ ఆఫర్లతో కూడి ప్రమోషనల్ ప్యాక్‌ల కారణంగా జియో సబ్ స్కైబర్లు వేగంగా పెరిగిపోతున్నారు.
ఆర్బీఐ చర్య.. కుప్పకూలిన కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు
ప్రైవేట్ రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) చర్య ప్రభావం నేరుగా బ్యాంక్ షేరు ధరపై కనిపిస్తుంది. గురువారం స్టాక్ మార్కెట్ ప్రారంభమైనప్పుడు, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా పడిపోయాయి. 12 శాతం వరకు నేరుగా క్షీణత నమోదైంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు క్షీణతతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో రూ.1675 వద్ద ప్రారంభమయ్యాయి. కానీ త్వరలోనే లోతైన సంక్షోభం కనిపించడం ప్రారంభమైంది. 12 శాతం పడిపోయి రూ.1620కి చేరింది. ఈ విధంగా చూస్తే, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ఒక్కరోజులో రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. అయితే కొంత కాలం తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లలో మెరుగుదల కనిపించి రూ.1689కి చేరుకుంది. ఉదయం 11:30 గంటలకు, దీని ధర 10 శాతం క్షీణతతో రూ. 1658.20 వద్ద ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త ఖాతాలను తెరవడాన్ని, కొత్త క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడాన్ని నిషేధించింది. ఇది కోటక్ మహీంద్రా బ్యాంక్ గురించి మార్కెట్‌లో ప్రతికూల అవగాహనను సృష్టించడమే కాకుండా, వ్యాపారంపై కూడా ప్రభావం చూపుతుంది. బ్యాంక్ కొత్త కస్టమర్‌లను జోడించకపోయినా లేదా క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయకపోయినా, అది దాని వృద్ధిని ప్రభావితం చేస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది దాని వడ్డీ ఆదాయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి, అనేక బ్రోకరేజ్ సంస్థలు కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ల లక్ష్య ధరను తగ్గించడం ప్రారంభించాయి. కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆన్‌లైన్ మాధ్యమంపై ఎక్కువగా ఆధారపడటం దీనికి ఒక కారణం. ఏది ఏమైనా, ఆర్‌బిఐ చర్య కోటక్ షేరు ధర స్వల్పకాలిక , మధ్యకాలిక అవకాశాలను ప్రభావితం చేసింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ల టార్గెట్ ధర ఇప్పుడు రూ.2050 నుంచి రూ.1970కి తగ్గించబడింది. కొన్ని రూ.1750కి కూడా తగ్గించాయి. అయితే, దీర్ఘకాలంలో కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు అవకాశాలు ఉన్నాయి.
పాన్ కార్డ్ హోల్డర్స్ జాగ్రత్త.. మే 31 వరకు ఈ పని చేయకుంటే చిక్కుల్లో పడతారు
పాన్ కార్డ్ హోల్డర్లకు సంబంధించి ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. అందులో పాన్ వినియోగదారులు తమ ఖాతాను నిర్ణీత సమయానికి ముందే ఆధార్‌తో లింక్ చేయకపోతే, అప్పుడు చర్య తీసుకోబడుతుందని చెప్పబడింది. మే 31లోగా పన్ను చెల్లింపుదారులు తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానిస్తే, టీడీఎస్ తగ్గింపుపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, బయోమెట్రిక్ ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయకపోతే, వర్తించే రేటు కంటే రెట్టింపు టీడీఎస్ తగ్గించబడుతుంది. TDS/TCS ‘షార్ట్ డిడక్షన్/వసూళ్లు’లో డిఫాల్ట్ అయినట్లు పన్ను చెల్లింపుదారుల నుండి తమకు అనేక ఫిర్యాదులు అందాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBTD) తెలిపింది. ఐటీ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్‌తో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) లింక్ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్ మినహాయింపులుంటాయి. కాగా, లావాదేవీ సమయంలో పాన్ ఇన్‌ఆపరేటివ్‌లో ఉన్న ట్యాక్స్‌పేయర్లకు టీడీఎస్/టీసీఎస్ షార్ట్ డిడక్షన్/కలెక్షన్ ఎగవేతకు పాల్పడ్డారన్న నోటీసులు వస్తున్నట్టు సీబీడీటీ తెలిపింది. ఈ మేరకు తమకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొన్నది. అయితే అలాంటి కేసుల్లో మే 31కల్లా ఆధార్‌తో పాన్ అనుసంధానం కాకపోయినా సాధారణ రేటుకే టీడీఎస్/టీసీఎస్ వసూలుంటుందని సీబీడీటీ స్పష్టం చేసింది. కాగా, 2022 జూన్ 30 వరకు ఆధార్‌తో పాన్ అనుసంధానం ఉచితంగానే జరిగింది. జూలై 1 నుంచి 2023 జూన్ 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో అనుమతించారు. అప్పటికీ లింక్ అవ్వని పాన్ జూలై 1 నుంచి ఇన్‌ఆపరేటివ్‌లోకి వెళ్లింది. దీన్ని ఆపరేషన్‌లోకి తేవాలంటే రూ.1,000 ఫైన్ కట్టాల్సిందే.
బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. టీ20 ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోనీ!
ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం అవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. కప్పే లక్ష్యంగా 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. సొంత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023ని తృటిలో చేజార్చుకున్న భారత్.. పొట్టి కప్‌ను అయినా సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం బలమైన జట్టును ఎంపిక చేయాలని సెలక్టర్లకు బీసీసీఐ ఇప్పటికే సూచనలు చేసింది. అయితే ప్రపంచకప్‌కు ముందు బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఎలాగైనా భారత జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని భాగం చేయాలని బీసీసీఐ తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టు మెంటార్‌గా ధోనీకి బాధ్యతలు అప్పగించాలని చూస్తోందట. డ్రెస్సింగ్ రూమ్‌లో మిస్టర్ కూల్ ఉంటే జట్టుకు అదనపు బలం చేకూరుతుందని భావిస్తోందట. ధోనీ అనుభవం, సూచనలను వాడుకోవాలని బీసీసీఐ ప్రయత్నిస్తోందని సమాచారం. మరి బీసీసీఐ ఆఫర్‌ను మహీ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ధోనీ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.
ఎస్‌ఆర్‌హెచ్ కీలక నిర్ణయం.. ఇంపాక్ట్ ప్లేయర్‌పై వేటు!
ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లతో రెచ్చిపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మరో పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో నేడు తలపడనుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్లు తలపడగా.. హోరాహోరీగా మ్యాచ్ సాగింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీపై ఎస్‌ఆర్‌హెచ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యంతో ఛేదనకు వచ్చిన ఆర్‌సీబీ 262 పరుగులు చేసి ఓడింది. దాంతో ఈరోజు ఉప్పల్ మైదానంలో మరోసారి పరుగుల వరద పారే అవకాశం ఉంది. మ్యాచ్ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 ఓసారి చూద్దాం. ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా ఆడుతున్నారు. పవర్ ప్లేలో బౌండరీలు బాదుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి చెలరేగిపోతున్నారు. ఐడెన్ మార్‌క్రమ్, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్ భారీ స్కోర్లు నమోదు చేస్తుంది. బ్యాటింగ్ విభాగం మరోసారి చెలరేగాలని అందరూ కోరుకుంటున్నారు. మరోవైపు పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో రాణిస్తున్నారు.
వారి విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు..
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్ తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించాడు .కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు .ఈ సినిమాలో సుహాస్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .ఆ తరువాత సుహాస్ రైటర్ పద్మ భూషణ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు.అలాగే ఇటీవల సుహాస్ నటించిన “అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్” మూవీ సూపర్ హిట్ అయింది..ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాలో సుహాస్ అద్భుతంగా నటించాడు.ఇలా వరుసగా కంటెంట్ బేస్డ్ కథలను ఎంచుకుంటూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు.ఇదిలా ఉంటే సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రసన్న వదనం’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది.మే 3వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.ప్రస్తుతం సుహాస్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుహాస్ మాట్లాడుతూ “ఒకసారి నేను కథ వినేసి ఓకే చెప్పిన తరువాత ఇంక నేను దాని గురించి పట్టించుకోను.పూర్తిగా దర్శకుడినే నమ్ముతాను.కొత్త దర్శకులతో సినిమాలు చేసేటప్పుడు నేను భయపడను. ఎందుకంటే తమని తాము నిరూపించుకోవాలని ఒక పట్టుదల వారికి ఉంటుంది.సినిమా బాగా రావాలని వాళ్ళు ఎంతగానో కష్టపడతారు. అందువలన కొత్త దర్శకుల విషయంలో నాకు ఎటువంటి టెన్షన్ లేదు” అని సుహాస్ తెలిపాడు.అలాగే సుహాస్ తన రెమ్యూనరేషన్ గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసారు.నేను 3 కోట్లకి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.నా రెమ్యూనరేషన్ ఎంతో చెప్పను గానీ, మొదట్లో నాకు ఇచ్చిన పారితోషికం కంటే ఇప్పుడు బాగానే వస్తుంది అని సుహాస్ తెలిపారు.