*నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ..
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఒక్కసారిగా మేఘావృతంగా మారడంతో నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అధికారులు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ వుందని పేర్కొన్నారు. నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు అధికారులు. ఎల్లుండి యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ జంటనగరాల్లో నేడు వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కురుస్తున్న వానకు ఒక్కసారిగ వాతావరణం చల్లబడింది. పాతబస్తీ, సికింద్రాబాద్, కోటి, నాంపల్లి, ముషీరాబాద్, కబడిగూడ, గాంధీనగర్, చిక్కడపల్లి, లంఘార్ హౌస్, షేక్ పెట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగీ, గండిపేట్, హిమాయత్ సాగర్, పుప్పాల్ గూడ, మణికొండ పలు ప్రాంతాలలో వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరుతుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ మాన్ సూన్ టీమ్స్ రోడ్లపై వర్షపు నీరు క్లియర్ చేస్తున్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, నాంపల్లి, కోటి, తదితర ఏరియాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.
*ఏం తాగార్రా నాయనా.. 18 రోజులు 23 లక్షల కేసుల బీర్లు..
ఒకవైపు సూరీడు మండిపోతున్నాడు. తెలంగాణలో ఎండలు ఏ రేంజ్‌లో విజృంభిస్తున్నాయో తెలియంది కాదు.. ఉదయం 9 గంటలు దాటితే నిప్పుల కొలిమిలా తయారైంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. సాయంత్రం 07 గంటల వరకు కూడా వేడి ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రజలు కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలకు అతుక్కుపోతున్నారు. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉక్కపోత.. వీటి నుంచి సేద తీరేందుకు మద్యం ప్రియులు చిల్డ్ బీర్ కావాలంటున్నారు. గత కొన్నాళ్ళుగా ఎండలు ఎక్కువవటంతో బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ సారి ఏకంగా 90 శాతం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. తాజాగా ఎక్సైజ్ అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు మందు బాబులు రూ.670 కోట్లు విలువైన 23 లక్షల కేసుల బీర్ రాష్ట్రవ్యాప్తంగా తాగేశారు. ఇది ఆల్ టైమ్ రికార్డు అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే బీర్ల విక్రయాలు 28.7% పెరిగాయని చెబుతున్నారు. గత 15 రోజులుగా బీర్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో అమ్మకాలు మరింత తగ్గాయని.. లేదంటే పెరిగేదని చెబుతున్నారు. వర్షం ప్రభావం లేకపోవడంతో బీర్ల కొరత ఏర్పడిందని వాపోతున్నారు. ఈ నెలలోనే ఇలా ఉంటే వచ్చే నెలలో బీర్ల విక్రయాలు మరింత ఎక్కువగా ఉంటాయని లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా తెలంగాణలో మద్యం విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. ఎండాకాలం అయితే మరీ.. కాకపోతే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో బీర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది.
*ఏపీలో ఎన్నికల వేళ ఈసీకి ఫిర్యాదుల వెల్లువ.. పార్టీల పరస్పర ఫిర్యాదులు
ఏపీలో ఎన్నికల వేళ.. ఈసీ వద్ద వివిధ పార్టీల ఫిర్యాదులతో పంచాయతీ నెలకొంది. ప్రతి ఎన్నికల్లోనూ ఉండే తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ ఒకరిపై ఒకరు ఈసీకి అధికార-ప్రతిపక్ష పార్టీలు పరస్పర కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు. షెడ్యూల్ విడుదల కాక ముందు నుంచి వైసీపీ – టీడీపీ పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. చంద్రబాబు, పవన్ సహా ఇతర టీడీపీ నేతల కామెంట్లు, సోషల్ మీడియా ట్రోలింగ్స్‌పై వైసీపీ ఫిర్యాదులు చేస్తోంది. ఇప్పటి వరకు 150కు పైగా వైసీపీ ఫిర్యాదులు ఇచ్చింది. దొంగ ఓట్లు మొదలుకుని.. అధికార దుర్వినియోగం వరకు టీడీపీ వరుస ఫిర్యాదులు చేస్తోంది. దొంగ ఓట్ల వ్యవహరంలో ఐఏఎస్ సహా.. కొందరు అధికారుల సస్పెన్షన్ వరకు వ్యవహరం వెళ్లింది. వాలంటీర్లు మొదలుకుని సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ మీద టీడీపీ వరుస ఫిర్యాదులు చేసింది. కూటమి ఫిర్యాదులతో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఈసీ వేటు వేసింది. త్వరలో సీఎస్, డీజీపీలు కూడా బదిలీ అవుతారని ప్రచారం జరుగుతోంది. .జగన్ సహా మంత్రులు, ఇతర వైసీపీ నేతల కామెంట్లపై టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు 200కి పైగా టీడీపీ ఫిర్యాదులు చేసింది. ఫిర్యాదులపై ఎన్నికల సంఘం వివరణలు కోరుతోంది. సీఎస్, డీజీపీలపై వచ్చిన ఫిర్యాదులపై ఈసీ వివరణ తీసుకుంది. సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు వివరణ కోరుతూ ఈసీ కూడా వందకు పైగా నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
*ఇచ్చిన డబ్బులు తీసుకోండి.. వైసీపీకి ఓటు వేయండి..
జనసేనలో అనుభవం ఉన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి వైసీపీలోకి రావడం హర్షణీయమని నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి వైసీపీలోకి రావడాన్ని చూస్తే జనసేన ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలనేది మా లక్ష్యమన్నారు. నెల్లూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి రూ.1000 కోట్లు ఖర్చు.. నారాయణ రూ. 500 కోట్లు ఖర్చు పెడతారంట అంటూ ఆయన ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత విధంగా డబ్బుతో కూడిన రాజకీయాలను తీసుకువచ్చిన ఘనత టీడీపీ నేతలు.. చంద్రబాబుకే దక్కిందన్నారు. నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తున్న టీడీపీ నేతల్లో పలువురు వైసీపీకి చెందినవారేనన్నారు. నిన్ననే వందమంది వాలంటీర్లను టీడీపీలో నారాయణ చేర్చుకున్నారన్నారు. వారికి నారాయణ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ వారి మనసు మాత్రం వైసీపీలో ఉందన్నారు. అందుకే వాళ్ళు మళ్లీ వైసీపీలోకి వచ్చారన్నారు. టీడీపీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని.. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోండి.. వైసీపీకి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామే కానీ ఎవరితోనూ జతకట్ట లేదన్నారు. బీజేపీ త్వరలో కామన్ సివిల్ కోడ్ తీసుకురానుందని.. మైనార్టీ లైన ముస్లిం.. క్రిస్టియన్లు దీనిపై ఆందోళన చెందుతున్నారన్నారు. దీనిపై టీడీపీ తన వైఖరిని ఇప్పుడే చెప్పాలన్నారు. చంద్రబాబు సమాధానం ఇవ్వకపోతే వాళ్లకు వ్యతిరేకంగానే పనిచేసినట్టుగానే భావించాలన్నారు. మైనార్టీల మనోభావాలను దెబ్బతీసే పార్టీ టీడీపీ అని ఆయన ఆరోపించారు. ఏ చట్టాన్ని తీసుకురావాలన్నా ఏకాభిప్రాయం తీసుకోవాలన్నారు. ఇదే విషయాన్ని జగన్ పలుమార్లు చెప్పారని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
*యువరాజుకి వయనాడ్లో కూడా ఓటమి భయం పట్టుకుంది: ప్రధాని మోడీ
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈరోజు జరిగిన ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వైఖరి వల్ల ఇక్కడి రైతులు పేదలుగా మారారని తెలిపారు. పరిశ్రమలకు సంబంధించిన అవకాశాలు నాశనం అయ్యాయని తెలిపారు. దీంతో లక్షల మంది యువత వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పాడింది అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, రాహుల్ గాంధీ మొదట అమేథీని వదిలి కేరళలోని వయనాడ్‌కు వెళ్లారని ప్రధాని మోడీ చెప్పారు. ఇప్పుడు వయనాడ్‌లో కూడా ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ప్రిన్స్ ( రాహుల్ గాంధీ ) ఇప్పుడు వయనాడ్‌ని వదిలి మరో సురక్షిత సీటు కోసం వెతుకుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా టార్గెట్ చేశారు.. కొంత మంది నాయకులు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.. కానీ, ఈసారి రాజ్యసభ ద్వారానే ప్రవేశించారని పీఎం దుయ్యబట్టారు. అయితే, విభజన బాధితుల కోసం సీఏఏ తీసుకొచ్చింది మన ప్రభుత్వమేనని ప్రధాని అన్నారు. CAA లేకపోతే మన సిక్కు సోదరులు, సోదరీమణులు ఏమై ఉండేవారు? అని ప్రశ్నించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది.. 1984 నాటి ఘటన వల్ల సిక్కులపై కాంగ్రెస్ ఇప్పటికీ ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది అని తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.
*ఘోర పడవ ప్రమాదం.. 8 మంది మృతి
రాయ్‌గఢ్ జిల్లాలోని మహానదిలో పడవ మునిగి ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయారు. ఏడుగురి మృతదేహాలు లభ్య మయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరి మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. మహానదిలో ఉదయం 6 గంటల నుంచి రెస్క్యూ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు చెబుతున్నారు. భువనేశ్వర్‌కు చెందిన స్కూబా డైవర్ల బృందం, డైవర్‌లతో కలిసి ఉదయం 8:30 గంటల ప్రాంతంలో మొదటగా చిన్నారి పింకు రథియా మృతదేహాన్ని వెలికితీశారు. వీరంతా అంజోరిపాలి ఖర్సియా గ్రామ నివాసితులని చెబుతున్నారు. ఒడిశా ODRF, ఫైర్ ఎమర్జెన్సీకి చెందిన స్కూబా డైవర్లు రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తుండగా ఇప్పటివరకు 7 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. రాయ్‌గఢ్ జిల్లా సరిహద్దులో ఉన్న ఒడిశాలోని పంచగావ్‌లో ఉన్న పథర్సేని ఆలయాన్ని సందర్శించడానికి దాదాపు 50 మంది ప్రజలు పడవలో వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో వీరంతా పడవలో ప్రయాణిస్తుండగా, ఈలోగా బోటు బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మునిగి మరణించిన వారిలో రాధిక రథియా, కేసర్‌బాయి రథియా, లక్ష్మీ రథియా, చిన్నారి కునాల్ రథియా, చిన్నారి నవీన్ రథియా మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో 8 మందిలో 7 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. అదే వ్యక్తి కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. వీరంతా ఛత్తీస్‌గఢ్‌లోని ఖర్సియా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు. ఈ ఘటన తర్వాత ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి, రాయ్‌గఢ్ ఎమ్మెల్యే ఓపీ చౌదరి మాట్లాడుతూ.. రాయ్‌గఢ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 7 మంది మరణించారు. ఈ ఘటన ఒడిశాలో నమోదవుతున్నట్లు ఆయన తెలిపారు. రాయ్‌గఢ్ ప్రాంతానికి చెందిన 50 మంది బోటులో ఉన్నారు. ఈ సమయంలో, ఒకరి కోసం అన్వేషణ కొనసాగుతుండగా పడవ బోల్తా పడటంతో 7 మంది మరణించారు. అధికారులు, ఉద్యోగులు అందరూ అక్కడికక్కడే ఉన్నారని మంత్రి చౌదరి తెలిపారు. ఒడిశా ప్రభుత్వం సహాయం అందజేస్తుందని హామీ ఇచ్చిందని తెలిపారు.
*అయోధ్య వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ సౌకర్యాన్ని పునరుద్ధరించిన ఆలయ ట్రస్ట్..
అయోధ్య రామ్ లల్లా భక్తులకు ఆలయ ట్రస్ట్ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. శ్రీ రామ నవమి సందర్భంగా కొంత కాలంగా నిలిపి వేసిన వీవీఐపీ సౌకర్యాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని చెప్పుకొచ్చారు. రామ నవమి ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే ఛాన్స్ ఉండటంతో.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏప్రిల్ 18 వరకు వీఐపీ దర్శనంతో పాటు పాస్‌ల ద్వారా దర్శనాన్ని నిషేధించింది. దీని వల్ల ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు స్లాట్‌లు బుక్ చేసుకున్న వారి పాస్‌లు సైతం క్యాన్సిల్ అయ్యాయి. ఈ తరుణంలో రామ నవమి ఉత్సవాలు ముగియడంతో వీవీఐపీ దర్శనాన్ని మళ్లీ పునరుద్దరిస్తున్నట్లు ట్రస్టు సభ్యులు స్పష్టం చేసింది. ఇక, విశిష్ట దర్శన్, సుగం దర్శన్ అనే రెండు కొత్త మార్గాలను ఏర్పాటు చేసినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ కేటగిరీలో ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య రెండు గంటల చొప్పున ఆరు వేర్వేరు స్లాట్‌లలో దర్శన సౌకర్యం కల్పిస్తున్టన్లు పేర్కొన్నారు. ప్రత్యేక దర్శనం కోసం ప్రతి స్లాట్‌లో 100 పాస్‌లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో 20 పాస్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండగా మిగతా 80 పాస్‌లను ట్రస్ట్ ద్వారా అందిస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. బాల రాముడి మంగళ, భోగ్, శయన్ ఆరతిలో పాల్గొనడానికి ప్రతి ఆరతికి హాజరయ్యేందుకు 100 పాస్‌లు జారీ చేయనున్నారు. ఇవి ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో అందుబాటులో ఉంటాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు వెల్లడించారు.
*మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈరోజు విచారణ జరగగా కోర్టు తన నిర్ణయాన్ని ఏప్రిల్ 30వ తేదీకి రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా, ఈడీ తరపు న్యాయవాది ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజాతో మాట్లాడుతూ.. సిసోడియాను ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా సుప్రీంకోర్టు- హైకోర్టు పరిగణించింది.. ఆయన బయటకు వెళ్తే ఈ కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సిసోడియా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసి.. వెనక్కి తీసుకున్నాడు. కాగా, మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీష్ తీహార్ జైలులో ఉన్నాడు. సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2023 ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. అలాగే, సీబీఐ ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సిసోడియాను 2023 మార్చి 9వ తేదీన ఈడీ అరెస్టు చేసింది. ఇక, 2023 ఫిబ్రవరి 28న సిసోడియా ఢిల్లీ కేబినెట్ పదవికి రాజీనామా చేశారు. అయితే, మనీష్ సిసోడియా ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ప్రతిసారీ అతని పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. మార్చి 2024లో, సిసోడియా మళ్లీ ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉంది.
*నా భార్యకు టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారు..
పాకిస్థాన్ టెహ్రీక్ ఈ ఇన్సాఫ్ వ్యవస్థాప అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలు అధికారులు, సిబ్బందిపై సంచలన ఆరోపణలను చేశారు. తన భార్య బుష్రా బీబీకి జైలులో టాయ్ లెట్ క్లీనర్ కలిపిన విషా ఆహారాన్ని ఇచ్చేవారిని పేర్కొన్నారు. అందుకే ఆమె కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్ తో బాధపడుతోందని ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఓ అవినీతి కేసు విచారణ కోసం శుక్రవారం నాడు రావుల్పిండీలోని అదియాలా జైల్లోని కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జైలు అధికారులు, సిబ్బందిపై విమర్శలు గుప్పించారు. కాగా, జైలు అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. తన భార్యకు షౌకత్ ఖానుమ్ ఆసుపత్రి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఆసిమ్ యూసఫ్ ఇస్లామాబాద్ లోని షిఫా అంతర్జాతీయ హస్పటల్ లో వైద్య పరీక్షలు చేయాలని తెలిపింది.. కానీ, జైలు అధికారులు మాత్రం పాకిస్థాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్) లోనే వైద్య పరీక్షలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తన భార్య బుష్రా బీబీ జైలుకెళ్లేందుకు ప్రత్యక్ష కారణం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కారణమని ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేశారు. ఆయన నుంచి తన భార్య బుష్రా బీబీకి ముప్పు ఉందని తెలిపారు. ఆమెకు ఏమైనా జరిగితే అతడిని వదిలి పెట్టనని.. తాను ఎంతకైనా తెగిస్తానని ఇమ్రాన్ హెచ్చరించాడు.