హరీష్ రావు వ్యాఖ్యలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి..
తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు ఎందుకు ఆచరించలేదు? అని ప్రశ్నించారు.. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామన్న విషయం ఏమైంది? అని నిదీశారు.. విభజన చట్ట హామీల అమలు, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి నిధుల సంగతేమైంది?.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు జరగలేదు?.. కేంద్రంపై ఒత్తిడి పెంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోయారు?.. ‘మాట తప్పి, మడమ తిప్పటం’ తప్ప జగన్ ఈ నాలుగేళ్లలో ఏం సాధించారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు రామకృష్ణ..
ఆపరేషన్ చేశాడు కడుపులో క్లాత్ మరిచాడు.. 16 నెలల తర్వాత చూస్తే..
జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగిత్యాల ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. 16 నెలల క్రితం నవ్యశ్రీ అనే మహిళ ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న తర్వాత ఇంటికి పంపించారు. అయితే ఆపరేషన్ సమయంలో మహిళ కడుపులోని గుడ్డను వైద్యులు మరిచిపోయారు. వైద్యులు గుడ్డను లోపల ఉంచి మహిళకు కుట్లు వేశారు. నవ్యశ్రీ ఏడాది నుంచి విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతూ ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంది. అక్కడి వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసిన డాక్టర్లు షాక్ కు గురయ్యారు. ఆమె కడుపులో గుడ్డ ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు వెంటనే వైద్యం చేయాలని లేదంటే ప్రాణానికే ముప్పని తెలుపడంతో కుటుంబ సభ్యులు సరే అన్నారు. దీంతో వైద్యులు వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసి గుడ్డను తొలగించారు. గుడ్డ బయటకు తీస్తుండగా వీడియో తీశారు. మహిళ పరిస్థితి ఆరోగ్యంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉత్తర్వులు జారీ
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గతంలో ఉద్యోగాలు పొందిన వారికి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2020 సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరు ప్రస్తుతం రూ.15 వేల గౌరవ వేతనంతో పనిచేస్తుండగా.. ప్రొబేషన్ ఖరారు తర్వాత దాదాపు రెట్టింపు జీతం అందుకోనున్నారు.. కాగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్వర్వుల ప్రకారం.. ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మిని్రస్టేటివ్ సెక్రటరీలు ఇప్పుడు కనీస బేసిక్ వేతనం రూ.23,120 కాగా, డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకున్న తర్వాత రూ. 29,598 అందుకోనున్నారు.. మిగతా 17 విభాగాల ఉద్యోగులు ఇప్పుడు కనీస బేసిక్ వేతనం రూ.22,460కు డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకొని రూ. 28,753 అందుకుంటారని అధికారులు చెబుతున్నమాట.. ఇక, పెరిగిన వేతనం మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయిన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ఉత్తర్వుల్లో పేర్కొంది.
రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం పర్యటన.. గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేటకు వెళ్లనున్న ఆయన.. మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్నారు. ఇక, మూలపేట పర్యటన కోసం.. బుధవారం ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరనున్నారు సీఎం.. ఉదయం 10.30 గంటలకు మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు.. గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్ధాపన చేయనున్నారు ఏపీ సీఎం.. ఇక, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన చేస్తారు.. మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్ జగన్.. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.. శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకుని తిరిగి మధ్యాహ్నం 3.25 గంటలకు తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.
‘ఎకో ఇండియా’తో ఏపీ సర్కార్ ఒప్పందం.. టార్గెట్ ఇదే..
ఎకో ఇండియా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఎకో ప్రాజెక్డ్ పై రెండు రోజుల సదస్సు జరుగుతోంది.. ఈ సదస్సులో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె. నివాస్, ఎకో ప్రాజెక్ట్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డా.సందీప్ భల్లా తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ.. ఎకో ఇండియా సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకున్నట్లు వెల్లడించారు.. ఎకో ప్రాజెక్ట్ ద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ సంస్ధ పలు వైద్య కార్యక్రమాలపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తుందని తెలిపారు.. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని విజయవంతం చేయడానికి వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ప్రతీ 6 నెలలకి ఒకసారి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఎన్సీపీకి షాక్ ఇవ్వనున్న అజిత్ పవార్.. 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి..?
మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గతేడాది శివసేనను చీల్చి ఏకంగా ఏక్ నాథ్ షిండే బీజేపీ సహకారంలో సీఎం అయ్యారు. ఈ రాజకీయ వేడి చల్లారకముందు ఎన్సీపీ నేత అజిత్ పవార్, సీనియర్ లీడర్ శరద్ పవార్ కు షాకిచ్చేలా కనిపిస్తోంది. ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా సమచారం. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న రాజకీయ పరిణామాల్లో, అక్కడి ప్రజల్లో ఇదే చర్చ నడుస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు బీజేపీ అగ్రనేతలు ఢిల్లీకి హుటాహుటిన వెళ్లడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల కాలంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నేత అజిత్ పవార్ పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోదీని పొగిడారు. ఈ పరిణామాలు ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన(ఉద్ధవ్) మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిని ఇరకాటంలో పడేశాయి. వరసగా రెండు సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చి దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లిందని అజిత్ పవార్ అనడం సంచలనంగా మారింది. ఇది మోదీ మ్యాజిక్ కాకుంటే ఇంకేంటంటూ..? ప్రతిపక్షాలను ప్రశ్నించారు.
నేడు ముంబైతో హైదరాబాద్ ఢీ.. ఉప్పల్ స్టేడియానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఉప్పల్ స్టేడియంలో తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌ను చూసేందుకు నగరవాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి.. నిన్న వర్షం కురవడంతో.. పిచ్ తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.. మరోవైపు.. మ్యాచ్‌కి వచ్చే అభిమానులకు ట్రాన్స్‌పోర్ట్ ఇబ్బంది లేకుండా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.. మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.. ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా, సురక్షితంగా ఉప్పల్ స్టేడియానికి, తిరిగి గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు టీఎస్ఆర్టీ ఎండీ వీసీ సజ్జనార్.
రిటైర్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ధోని
మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ చరిత్రలో ఓ ధృవతార. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి మూడేళ్లు పూర్తయింది. అతను ఐపిఎల్ నుండి రిటైర్మెంట్ అవుతున్నాడంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అతని అభిమానులు ధోని ఆట గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లోనూ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. చెన్నైలో ప్రేక్షకుల ముందు ఆడిన తర్వాతే రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నట్లు ధోనీ గతేడాది చెప్పాడు. ధోనీ ఈ సీజన్‌లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కూడా ఆడాడు. అయితే ఇప్పుడు ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటాడా ? అన్న చర్చ కొనసాగుతున్న తరుణంలో రిటైర్మెంట్‌పై ధోనీ స్వయంగా ఓ విషయం చెప్పాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించిన ఒక ఈవెంట్‌లో ధోని ఐపిఎల్ నుండి రిటైర్మెంట్ గురించి ఒక ప్రశ్న అడిగారు. దీనిపై ధోనీ మాట్లాడుతూ, దీనిపై (రిటైర్మెంట్) నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతానికి తాను IPL 2023లో చాలా మ్యాచ్‌లు ఆడవలసి ఉంది. ఇప్పుడు తాను ఏదైనా చెబితే కోచ్ ఒత్తిడికి లోనవుతారని చెప్పారు.
క్రికెటర్లకు గుడ్ న్యూస్.. ప్రైజ్ మనీ డబుల్
ప్రస్తుతం ఐపీఎల్ రసవత్తరంగా నడుస్తోంది. ఈ సమయంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ క్రికెట్ టోర్నీల్లోని ఆటగాళ్లకు ఇచ్చే ప్రైజ్ మనీని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ ప్రారంభం కాగానే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆటగాళ్లకు ఈ భారీ బహుమతిని అందజేసింది. కొత్త నిర్ణయం ప్రకారం ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఐదు కోట్ల నగదు బహుమతి ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు రంజీ ట్రోఫీ టోర్నీ విజేతలకు రూ.2 కోట్లు బహుమతిగా ఇచ్చేవారు. ఇప్పుడు దానిని పెంచాలని నిర్ణయించారు. బిసిసిఐ సెక్రటరీ జై షా ఒక ట్వీట్‌లో, “దేశీయ క్రికెట్.. భారత క్రికెట్‌కు వెన్నెముక అ, అన్ని దేశీయ పోటీలకు ప్రైజ్ మనీని పెంచుతున్నట్లు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశవాళీ క్రికెట్‌లో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తాం. రంజీ విజేతలకు ఇప్పుడు రూ. 5 కోట్లు (రూ. 2 కోట్ల నుంచి), సీనియర్ గ్రూప్ మహిళా విజేతలు రూ. 50 లక్షలు (రూ. 6 లక్షల నుంచి) అందుకుంటారు. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది.
RFCలో ఫారిన్ ఫైటర్స్ తో ‘పుష్పరాజ్’ ఫైట్…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా ‘పుష్ప ది రైజ్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా హిట్ అయ్యింది. పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ అయ్యిందని చెప్పడానికి కలెక్షన్ల కొలతలు ఉన్నాయి కానీ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని చెప్పే మీటర్ మాత్రం లేదు. అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని అమలాపురం నుంచి ఆస్ట్రేలియా వరకూ ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యారు అంటే పుష్ప ది రైజ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రేజ్ ని కాష్ చేసుకుంటూ పుష్ప ది రూల్ సినిమాని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే అల్లు అర్జున్ బర్త్ డే రోజున సూపర్బ్ వీడియో రిలీజ్ చేసి, సాలిడ్ హైప్ ని రాబట్టాడు. వేర్ ఈజ్ పుష్ప అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం’ అనే డైలాగ్ ని ఫాన్స్ ఫిదా అయ్యారు. యుట్యూబ్ లెక్కలు మారుస్తున్న ఈ వీడియో పుష్ప 2 సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో క్లియర్ కట్ గా చెప్పేసింది. అంచనాలని మించే రేంజులో పుష్ప సినిమాకి గ్లోబల్ టచ్ ఇచ్చిన సుకుమార్, ఎర్ర చందనం స్మగ్లింగ్ ని చైనాతో లింక్ చేశాడు. టైటిల్ ఫాంట్ లో చైనీస్ డిజైన్ ఉండడంతో, సుకుమార్ ఏం ప్లాన్ చేశాడో అనే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరిగింది. పోస్టర్ లో ఇచ్చిన చైనా హింట్ ని నిజం చేస్తూ సుకుమార్, రామోజీ ఫిల్మ్ సిటీలో ఫారిన్ ఫైటర్స్ లో భారి యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నాడు. అల్లు అర్జున్, ఫారిన్ ఫైటర్స్ మధ్య తెరకెక్కిస్తున్న ఈ ఫైట్ సినిమాకే హైలైట్ గా ఉండబోతుందని సమాచారం. మరి మన స్మగ్లర్ పుష్పరాజ్, ఫారిన్ ఫైటర్స్ తో ఎలాంటి యాక్షన్ చేస్తున్నాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
షూటింగ్ లో జాయిన్ అయిన ఒరిజినల్ గ్యాంగ్ స్టర్…
ఒక సినిమా ప్రమోషన్స్ ని ఏ రేంజులో చెయ్యాలో, ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే ఎక్స్పెక్టేషన్స్ ని ఎలా సెట్ చెయ్యాలో మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకే నేర్పిస్తున్నారు ‘OG’ మేకర్స్. డీవీవీ దానయ్య ప్రొడక్షన్ లో సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ‘OG’. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీ అఫీషియల్ గా అనౌన్స్ అయిన రోజు నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. బజ్ జనరేట్ చెయ్యడం ఎలానో నేర్పిస్తున్న ‘OG’ చిత్ర యూనిట్ రీసెంట్ గా ఒకే ఒక్క వీడియోతో ఎవరూ ఊహించని అంచనాలను పెంచేశారు. పవన్ కళ్యాణ్‌ని సింగిల్ ఫ్రేమ్‌లో కూడా చూపించకుండా, స్క్రిప్ట్ రైటింగ్ షాట్స్ తోనే రెడీ చేసిన ఈ వీడియో ‘OG’ సినిమాకి హ్యూజ్ హైప్ ని తెచ్చి పెట్టింది. సుజిత్ బేసిక్ గానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి అతను పవన్ ని ఏ రేంజులో చూపిస్తాడు అనే ఆలోచనలో ఫాన్స్ అంతా ఎవరికి వాళ్లు లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ అయిన హరీష్ శంకర్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన హిస్టరీ, ఫాన్స్ దగ్గర సాక్ష్యంగా ఉంది. ఇప్పటికే ముంబైలో ఓజి షూటింగ్ షూటింగ్ స్టార్ట్ అయింది, పవన్ కళ్యాణ్ లేకుండానే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాడు సుజిత్. ముంబైలో జరుగుతున్న షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ‘OG’ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని రివీల్ చేస్తూ మేకర్స్ నుంచి స్పెషల్ అప్డేట్ బయటకి వచ్చింది.
ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పి షాక్ ఇచ్చిన గోవా బ్యూటీ…
ఇలియానా తను ప్రెగ్నెంట్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. “Coming soon. Can’t wait to meet you my little darling” అని కోట్ చేసి ఇలియానా ఒక చిన్నపిల్లలు వేసుకునే టీషర్ట్ ని, ‘మామ’ అని ఉన్న లాకెట్ ని పోస్ట్ చేసింది. ఇలియానా పోస్ట్ చేసిన టీషర్ట్ పైన ‘And so the adventure begins’ అనే క్యాప్షన్ ఉంది. ఇలియానా పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలియానా పోస్ట్ కింద, వాళ్ల అమ్మ సమీరా డి’క్రూజ్… “Welcome soon to the world my new grand baby (heart emoticon) can’t wait” అని కామెంట్ చేసింది. సమీరా నుంచి రిప్లై రాగానే ఇలియానా పెట్టిన పోస్ట్ ప్రాంక్ కాదు అనే విషయం అర్ధమవుతుంది. ఇలియానా ప్రెగ్నెన్సీ న్యూస్ కి ఫాన్స్ కంగ్రాట్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాలు, వెల్ విషర్స్ ఇలియానాకి అభినందనలు తెలుపుతున్నారు.