కొడంగల్‌లో మెడికల్ కాలేజీ.. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభం!
సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ తెలిపారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కొడంగల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు కూడా ప్రారంభిస్తున్నామన్నారు. ఆరోగ్య రంగానికి సంబంధించి శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ ఏడాది 8 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించామని మంత్రి గుర్తు చేశారు. ఒక్కో కాలేజీలో 50 సీట్లు అందుబాటులోకి ఉంటాయని మంత్రి దామోదర రాజ నర్సింహ తెలిపారు. అన్ని కాలేజీల్లో ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఫాకల్టీని నియమించామన్నారు. అన్ని హాస్పిటల్స్‌లో కలిపి 2,500లకు పైగా డయాగ్నస్టిక్స్ యంత్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ యంత్రాల మెయింటనన్స్, రిపేర్లకు స్పెషల్ సెల్స్ ఏర్పాటు చేశామన్నారు. అవసరాన్ని బట్టి అవసరమైన చోట ఎంఆర్‌ఐ స్కానింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. యంత్రాలు నడిపేందుకు అవసరమైన హెచ్‌ఆర్‌ను కూడా రిక్రూట్ చేస్తామన్నారు. కేన్సర్ స్క్రీనింగ్ కోసం మొబైల్ స్క్రీనింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే రీజనల్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లకు ప్రజలే యజమానులు అని మంత్రి దామోదర రాజ నర్సింహ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే హైదరాబాద్‌లో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న కొంతమంది సీనియర్ డాక్టర్లను జిల్లాలకు ట్రాన్స్‌ఫర్ చేశామన్నారు. రాబోయే రోజుల్లో 90 శాతం ట్రీట్‌మెంట్ జిల్లాల్లోనే అందేలా చర్యలు తీసుకుంటామన్నామని మంత్రి చెప్పుకొచ్చారు.
బలపడిన తీవ్ర అల్పపీడనం.. రానున్న 3 రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం పైపు దూసుకొస్తోంది. ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు,ఏపీ తీరం పైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 3 రోజుల్లో కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. తీరం వెంబడి 30-35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
డిసెంబర్19న :
* శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
డిసెంబర్ 20న :
• శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కెనడాలో గాజువాక యువకుడు అనుమానాస్పద మృతి
ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లిన విశాఖ యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విశాఖలోని గాజువాకకు చెందిన పిల్లి నాగప్రసాద్, గీతాబాయి దంపతుల కుమారుడు అయిన ఫణికుమార్(33) ఇటీవల ఎంబీఏ పూర్తి చేసి.. ఎంఎస్ చదివేందుకు కెనడాకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 14న నాగప్రసాద్‌కు ఫణికుమార్ రూమ్‌మేట్ ఫోన్ చేసి అతడు నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి మంగళవారం తీసుకెళ్లారు. ఆయన జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎంపీ శ్రీభరత్‌లకు పరిస్థితిని వివరించగా.. అక్కడి అధికారులతో మాట్లాడిస్తామని చెప్పడంతో తల్లిదండ్రులు ఊరట చెందారు. కుమారుడి మృతతో ఫణికుమార్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
జగిత్యాల సబ్ జైలులో గుండెపోటుతో ఖైదీ మృతి!
జగిత్యాల సబ్ జైలులోని ఓ ఖైదీ గుండెపోటుతో మృతి చెందాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశంకు బుధవారం మధ్యాహ్నం గుండె నొప్పి వచ్చింది. సబ్ జైల్ నుండి హుటాహుటిన అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. నిన్నటి నుంచి చికిత్స పొందుతున్న మల్లేశం ఆసుపత్రిలోనే ఈరోజు కన్నుమూశాడు. 15 రోజుల క్రింతం రేప్ కేసులో నిందితుడుగా క్యాతం మల్లేశం జగిత్యాల సబ్ జైలుకు వచ్చాడు. మల్లేశం రామన్న పేట మాజీ ఉప సర్పంచ్. తప్పుడు కేసుతో మల్లేశంను జైలుకు పంపించారని కుటుంబ సభ్యులు ముందునుంచి ఆరోపిస్తున్నారు. ఇక మల్లేశంను ఆస్పత్రిలో అడ్మిట్ చేసి.. చనిపోయేంత వరకు తమకు విషయం చెప్పలేదని కుటుంబ సభ్యులు పోలీసులపై మండిపడుతున్నారు. ఈ విషయంలో కోర్టుకు వెళతామని కుటుంబ సభ్యులు అంటున్నారు. కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఎంపీని తోసేసిన రాహుల్ గాంధీ.. తలకు గాయం..
అమిత్ షా రాజ్యసభ స్పీచ్‌పై పార్లమెంట్ ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన జరుగుతోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌కి చెందిన ఎంపీలు అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని, ఎడిటెడ్ వీడియోను ప్రచారం చేస్తోందని, నిజానికి అంబేద్కర్‌ని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీనే అని బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఇదిలా ఉంటే, గురువారం పార్లమెంట్ కమర్ దావర్(గేటు) వెలుపల జరిగిన గొడవలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగిని తోసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎంపీ సారంగి తలకు గాయమైన వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే, ఈ ఆరోపణలపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. నిజానికి బీజేపీ ఎంపీల బృందమే తమను తరిమికొట్టి, బెదిరింపులకు పాల్పడిందని, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేను కూడా బెదరించారని రాహుల్ గాంధీ విలేకరులతో అన్నారు. ‘‘నేను లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాను. కానీ బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించాను. వారు నన్ను దూరంగా నెట్టివేసి, బెదిరించారు. తమకు పార్లమెంట్‌లోకి వెళ్లే హక్కు ఉంది’’ అని ఆయన అన్నారు. తనపైకి ఓ వ్యక్తిని రాహుల్ గాంధీ నెట్టాడని, అతను తనపై పడటంతో తలకు గాయమైనట్లు బీజేపీం ఎంపీ సారంగి చెప్పారు. ‘‘నాపై పడిన ఎంపీని రాహుల్ గాంధీ నెట్టారు. ఆ తర్వాత నేను కింద పడిపోయాను. నేను మెట్ల వద్ద నిలబడి ఉండగా రాహుల్ గాంధీ వచ్చిన నాపైకి ఎంపీని తోసేశాడు.’’ అని ఆయన చెప్పారు. గాయపడిన ఎంపీని అధికారులు ఆస్పత్రికి తరలించారు.
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. మరో ఇద్దరిని ప్రాణాలతో పట్టుకుంది సైన్యం. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల కథనం ప్రకారం, కుల్గాం జిల్లాలోని కద్దర్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ మొదలైందని, సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఐదుగురు ఉగ్రవాదులను సైనికులు మట్టుపెట్టారని, అలాగే ఇద్దరిని ప్రాణాలతో పట్టుకున్నారని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా బెహిబాగ్ ప్రాంతంలో ఉన్న కద్దర్ గ్రామంలో భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయని పోలీసు ప్రతినిధి తెలిపారు. గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు 5 మంది ఉగ్రవాదులను హతమార్చగా.. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరికొంత మంది ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం ఉంది. ఆ తర్వాత భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహించాయి. ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందం ఈ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చింది. ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట నిఘా ఇన్‌పుట్ ఆధారంగా, భారత సైన్యం కుల్గామ్‌లో జాయింట్ ఆపరేషన్ ప్రారంభించిందని చెప్పారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించబడ్డాయని, ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. ఆర్మీ ప్రతీకారం తీర్చుకుందని తెలిపారు.
కేఫ్‌లో గొడవ.. 11 మంది సజీవదహనం
వియత్నాం రాజధాని హనోయిలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వియత్నాం పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ గురువారం ఈ ఘటనను ధృవీకరించింది. మూడు అంతస్తుల కేఫ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేఫ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉద్యోగులతో గొడవపడి, పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కక్షతోనే ఈ పని చేశానని నిందితుడు అంగీకరించాడని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం తర్వాత ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్కడి మంత్రిత్వ శాఖ ప్రకారం, రెస్క్యూ బృందాలు మంటల మధ్య నుంచి ఏడుగురిని రక్షించారు. వీరిలో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, హనోయ్‌లో ఇలాంటి ఘటన ఇది మొదటిసారి కాదు. కొద్ది నెలల క్రితం ఓ అపార్ట్‌మెంట్ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనల తర్వాత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం, ప్రమాదం సమయంలో పేలుడు శబ్దాలు వినిపించాయని తెలిపారు. వెంటనే బయటకు పరుగెత్తగా మంటలు ఎగిసిపడుతూ కనిపించాయి. ఇది హనోయిలో అగ్నిప్రమాదాల పెరుగుదలను, భవిష్యత్తులో మెరుగైన భద్రతా చర్యల అవసరాన్ని స్పష్టం చేస్తోంది.
మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర!
భారతదేశంలో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. పెరిగిన పసిడి ధరలు కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై వరుసగా రూ.150, రూ.650 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.160, రూ.710 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (డిసెంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,700గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,130గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో ఇవే రేట్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు వరుసగా నాలుగు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర.. నేడు తగ్గింది. కిలో వెండిపై రూ.1,000 తగ్గి.. రూ.91,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 99 వేలుగా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.91,500గా ఉంది.