సీఎం నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభం.. పదేళ్లలో ఇదే తొలిసారి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది.. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కలెక్టర్ల సమావేశం ఇదే.. ఈ భేటీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.. 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వడానికి సిద్ధమైంది సర్కార్.. ప్రభుత్వ ప్రాధాన్యతలను కలెక్టర్లకు వివరించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.. ప్రజలకు సేవలందించే విషయంలో నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టొద్దని స్పష్టం చేయనున్నారు.. ఫేక్ వార్తలు, తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడే తిప్పి కొట్టాలని కలెక్టర్లకు చంద్రబాబు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉందంటున్నారు.. తాను జిల్లాల పర్యటనలకు వచ్చేటప్పుడు అవసరానికి మించి జాగ్రత్తలు తీసుకోవద్దని.. ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని మరోసారి స్పష్టం చేయబోతున్నారు సీఎం.. అయితే, ఈ కలెక్టర్ల సమావేశానికి ఓ ప్రత్యేకత ఉంది.. విభజన జరిగిన పదేళ్ల కాలంలో తొలిసారి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది.. 2014-19 మధ్య కాలం తొలి రోజుల్లో హోటళ్లల్లో, ఆ తర్వాత ప్రజా వేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించేవారు.. ఇక, గత ప్రభుత్వంలో కేవలం ఒక్కసారి మాత్రమే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు అప్పటి సీఎం.. గత ప్రభుత్వంలో తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను ప్రజా వేదికలో నిర్వహించిన నాటి సీఎం జగన్. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే ప్రజా వేదికను కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణకు సచివాలయంలో సరైన వేదిక లేకున్నా ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.. ఫంక్షన్ హాళ్లు.. హోటళ్లల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి అంగీకరించని సీఎం చంద్రబాబు.. అనవసరపు ఖర్చు వద్దని స్పష్టం చేశారు.. సచివాలయంలోనే సర్దుకుని కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిద్దామని సీఎం చెప్పడంతో.. సచివాలయంలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు..
సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతోన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వ్యవస్థలను గత ప్రభుత్వం బొమ్మల్లా చేసిందన్నారు.. గత ఐదేళ్లల్లో ఎలాంటి పాలన ఉందో అందరికీ తెలుసు. గతంలో ఏపీలో పని చేసేందుకు ఐఏఎస్‌లు పోటీ పడేవారు. కానీ, గత ఐదేళ్ల కాలంలో ఏపీలో పని చేయడానికి ఐఏఎస్‌లు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఓ రాష్ట్రం ఎలా ఉండాలో గతంలో ఏపీ వైపు చూసేవారు.. కానీ గత ఐదేళ్ల కాలంలో ఓ రాష్ట్రం ఎలా ఉండకూడదో చూపించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రజలు మాకు అద్భుతమైన విజయం అందించారు. ఎన్నో అవమానాలను.. ఆంక్షలను ఎదుర్కొని కష్టపడి అధికారంలోకి వచ్చాం. ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు చాలా కష్టాలు పడ్డాం అన్నారు పవన్ కల్యాణ్. ఇక, ఉపాధి హామీ పథకంపై గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలన్నారు డిప్యూటీ సీఎం పవన్… ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పాలనానుభవం, పాలనా దక్షత నేర్చుకోవడానికి సిద్దంగా ఉన్నాం. పాలనా వ్యవస్థను గత ప్రభుత్వం చిధ్రం చేసింది. అనుభవంతో పని చేసేందుకు చంద్రబాబు, నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాం అన్నారు.. ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించేందుకే మేం ఇక్కడ ఉన్నాం. మా వైపు నుంచి ఏమైనా తప్పులు ఉంటే మా దృష్టికి తీసుకురండి. ప్రజలకు సేవ చేసే విషయంలో మా వల్ల మీరు ఓ అడుగు ముందుకు వేసేలా ఉంటుందే తప్ప.. అడుగులను ఆపే పరిస్థితి ఉండకూడదన్నారు. విభజన తర్వాత నుంచి చాలా కష్టాలు పడ్డాం. గత ఐదేళ్ల కాలంలో ఏపీ బోర్డర్ దాటి రావాలన్నా.. ఇబ్బందులు పడ్డాం. స్కిల్ సెన్సస్ చాలా కీలకమైందని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ప్రతి మూడు నెలలకు కలెక్టర్ల కాన్ఫరెన్స్.. ప్రజలను సంతృప్తి పరిచేలా పాలన..
సీఎం, డిప్యూటీ సీఎంలే కాదు.. క్షేత్ర స్థాయిలో పని చేసే వాళ్ల వల్ల కూడా ప్రభుత్వ పనితీరును ప్రజలు అంచనా వేస్తారు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సచివాలయం వేదికగా జరుగుతోన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇక, ప్రతి మూడు నెలలకొసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం.. ప్రజలను సంతృప్తి పరిచేలా పాలన చేయాలన్నారు.. ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం పాలన ప్రారంభించింది. ఏపీ బ్రాండ్ దెబ్బ తీసే విధంగా గత పాలకులు వ్యవహరించారు. ఐఏఎస్ అధికారుల మనో ధైర్యాన్ని గత ప్రభుత్వం దెబ్బ తీసే విధంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఆంధ్ర ఆఫీసర్లు అంటే గతంలో జాతీయ స్థాయిలో కీలక పదవుల్లోకి వెళ్లారు. ఏపీలో పని చేసిన వాళ్లు ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. కానీ, గత పాలన వల్ల ఏపీ బ్రాండ్ దెబ్బతిందన్నారు.. ఏపీ ఆఫీసర్లు అంటే అంటరాని వాళ్లను చూసినట్టు చూస్తున్నారు. ఏపీ అధికారులంటే ఏం చేయలేరు.. చేతకాని వాళ్లు అన్నట్టు ఢిల్లీలో అభిప్రాయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని పునర్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చాం.. రాష్ట్ర పునర్ నిర్మాణానికి ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ నాంది పలకాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రజా వేదిక ఉంటే అక్కడే కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టేవాళ్లం. కలెక్టర్ల కాన్ఫరెన్స్ బయట పెట్టడం ఇష్టం లేక.. ప్రజా వేదిక కట్టాం. కానీ, దాన్ని కూల్చేశారని మండిపడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎంలే కాదు.. క్షేత్ర స్థాయిలో పని చేసే వాళ్ల వల్ల కూడా ప్రభుత్వ పనితీరును ప్రజలు అంచనా వేస్తారన్న సీఎం.. ఐఏఎస్‌లుగా ఉన్న వాళ్లకి కలెక్టర్లుగా చేయడం ఓ కల. పని చేయకుంటే గ్యారెంటీ లేదు. ప్రజల కోసం పని చేయాలనుకుంటే కలెక్టర్లకే చాలా చక్కటి అవకాశం. బెస్ట్ కలెక్టర్ అనిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విభజన కంటే ఎక్కువ నష్టం గత ఐదేళ్ల పాలనలో ఏపీకి జరిగింది. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో 50 శాతం ఫిర్యాదులు భూ సమస్యలే ఉన్నాయి. రీ-సర్వేను హోల్డులో పెట్టాం. సర్వే రాళ్లను గెలాక్సీ గ్రానైట్ రాళ్లతో వేశారు. తన ఫొటో వేసుకోవడం కోసం గెలాక్సీ గ్రానైట్ రాళ్లు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.. ఫేక్ ప్రచారాలను కౌంటర్ చేయండి..
ఏపీ సచివాలయం వేదికగా జరుగుతోన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇకపై ప్రతీ మూడు నెలలకు ఓసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్న ఆయన.. అధికారుల బాధ్యతలను గుర్తు చేస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.. పొలిటికల్ గవర్నెన్సే ఉంటుందని కలెక్టర్లకు స్పష్టం చేశారు.. ప్రజా సమస్యల పరిష్కారం గురించి వచ్చిన ఎమ్మెల్యేలను గౌరవించాల్సిందేనని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.. ఇకపై ఆకస్మిక తనిఖీలకు వస్తానని అధికారులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. 1995లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ లను డ్రైన్లలోకి దింపానని నాటి విషయాలను గుర్తు చేసిన సీఎం. పాలనలో నిబంధనల వైపే కాకుండా మానవత్వ కోణంలో పనిచేయాలని సూచించారు. ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047ను అక్టోబరు 2 తేదీన విడుదల చేస్తామన్నారు. 2047 కోసం జిల్లాలకూ విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలని సూచనలు చేశారు. ఫేక్ ప్రచారాలను కౌంటర్ చేయాలని కలెక్టర్లకు, అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఐఏఎస్‌ల వ్యవస్థను దిగజార్చేలా గత ఐదేళ్లలో పాలన సాగిందన్న సీఎం చంద్రబాబు.. వైసీపీ పాలన వల్ల ఢిల్లీలో ఐఎఎస్సులను అంటరానివారుగా చూశారన్నారు.. ఒకప్పుడు ఏపీ అధికారులంటే ఎంతో గౌరవం ఉండేది, కీలక పదవుల్లోకీ వెళ్లారన్న చంద్రబాబు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కలెక్టర్లదే కీలక బాధ్యత అన్నారు.. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని వెంటనే ఖండించాలన్నారు.. కొందరు ఫేక్ ఫెలోస్ ఉన్నారు.. వారి ఆటలు కట్టిపెట్టాలి. రాజకీయ కక్ష సాధింపు ఉండదు కానీ.. తప్పు చేస్తే వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు.. 36 రాజకీయ హత్యలు చేశారని అసత్య ప్రచారం చేశారు. 36 రాజకీయ హత్యల వివరాలు ఇవ్వమంటే ఇవ్వలేదు అని మండిపడ్డారు. అక్టోబర్-2వ తేదీన ఏపీ విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేస్తున్నాం. జిల్లాల్లో కూడా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సూచించారు.. ఇక, సూపర్-6కు కట్టుబడి ఉన్నాం. ఈ నెల 15వ తేదీన అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేస్తున్నాం. ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తాం అన్నారు.
బోనాల ఉత్సవాలు.. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన చేసిన వారిపై కేసు నమోదు..
ఆకతాయిల ఆగడాలకు హైదరాబాద్ పోలీసులు చెక్ పెడుతున్నారు. బోనాల ఉత్సవాల్లో మహిళ పట్ల అసభ్య ప్రవర్తన చేసిన వారిపై కేసు నమోదు చేశారు. ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టారు. నగరంలో ఇటీవల జరిగిన బోనాల ఉత్సవాల సందర్భంగా.. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని అరెస్ట్ చేసేందుకు షీ టీమ్స్ రంగంలోకి దిగింది. 305 మంది వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. వీరిలో 289 మంది పెద్దలు, 16 మంది మైనర్లు ఉండటం గమనార్హం. 173 మందికి వారి కుటుంబ సభ్యులతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చిన షీ టీమ్స్. ఐదుగురు వ్యక్తులను షీ టీమ్స్ పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మూడు రోజుల జైలు శిక్ష, రూ. 1050 జరిమానా విధించారు. జూలైలో మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన 115 కేసులను స్వీకరించారు. వీటిలో 19 ఎఫ్‌ఐఆర్‌లు హైదరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో నమోదు చేశారు. 4 కేసులు పోక్సో చట్టం కింద నమోదు చేశారు. మరో 22 కేసులు వ్యక్తులు, వారి కుటుంబాల సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. షీ టీమ్స్ ఫిర్యాదులలో ఎక్కువ కేసుల్లో అత్యాచారం, మోసం,వివాహం చేసుకుంటానుటూ మాయ మాటలు చెప్పడం వంటివి ఉండటం గమనార్హం.
తెలంగాణలో పెట్టుబడి పెట్టండి.. న్యూజెర్సీలో ప్రవాసులతో సీఎం రేవంత్ రెడ్డి..
రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఆదివారం జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళానికి వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా దారిపొడవునా భారీ ర్యాలీతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్ గా లభిస్తుంది..’ అని ఎన్నారైలలో ఉత్సాహం నింపారు. “గత సంవత్సరం టీపీసీసీ అధ్యక్షుని హోదాలో అమెరికాకు వచ్చాను. పదేండ్ల పాటు సాగిన దుష్పరిపాలనకు, విధ్వంసాలకు విముక్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ వస్తానని చెప్పాను. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను” అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఇప్పటికే రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం, అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీతో పాటు, ఇన్ పుట్ సబ్సిడీగా రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు వంట గ్యాస్ సిలిండర్, నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు, ఉపాధ్యాయులకు పదోన్నతులు, విద్యార్థులకు నాణ్యమైన విద్య పథకాలను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది ప్రారంభం మాత్రమే అని.. భవిష్యత్తు ప్రణాళికలతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.
తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ న్యాయపోరాటం..
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది. అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఇవ్వాళ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్ కు సంబంధించి ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు చెట్పట్ ఆర్యమా సుందరం పార్టీ బృందానికి తెలిపారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్చలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్ తో పాటు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పులతోపాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగాన్ని నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
వరంగల్ ఆసుప్రతిలో మరమ్మత్తులు జరపించండి.. కొండ సురేఖ ఆదేశం..
వరంగల్ లోని ప్రాంతీయ కంటి ఆసుపత్రిని మంత్రి కొండా సురేఖ సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పనితీరును ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తో కలిసి ఆస్పత్రిలోనీ పలు రికార్డులను మంత్రి కొండా సురేఖ పరిశీలించారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది షోకాజ్ నోటీసులు అందించాలని కలెక్టర్ కి సూచించారు. ఆస్పత్రి ఆవరణలో నిలిచిన నీటిని చూసి తక్షణమే తిషేయాలని మంత్రి ఆదేశించారు. లీకేజీలను మరమ్మత్తులు జరపాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛదనం.. పచ్ఛదనం కార్యక్రమాన్ని మంత్రి సురేఖ ప్రారంభించారు. మరోవైపు వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయం నుండి ఎంజీఎం కూడలి వరకు కార్పోరేషన్ సిబ్బంది, మహిళ సంఘాల ప్రతినిధులు , వివిధ శాఖల అధికారులు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మంత్రి కొండా సురేఖ, వరంగల్, హన్మకొండ కలెక్టర్లు మేయర్ సుధారాణి, ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు.
అమెజాన్‌లో మరో సేల్.. డేట్స్, ఆఫర్స్ ఇవే!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ మరో సేల్‌కు సిద్ధమైంది. ఇటీవల ప్రైమ్ మెంబర్ల కోసం ‘ప్రైమ్ డే’ సేల్ నిర్వహించిన అమెజాన్.. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించనుంది. ఆగస్టు 6 నుంచి 11వ వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. ప్రైమ్ మెంబర్లకు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి.. సాధారణ కస్టమర్లకు మధ్యాహ్నం నుంచి ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో అన్ని వస్తువులపై భారీగా ఆఫర్స్ ఉన్నాయి. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో మొబైల్స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ పేర్కొంది. దీనికి సంబంధించి వెబ్‌సైట్‌లో అమెజాన్ బ్యానర్‌లను ఉంచింది. స్మార్ట్‌టీవీలు, ప్రొజెక్టర్లు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లపైనా భారీగా డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఉత్పత్తుల వారీగా ఆఫర్ల వివరాలు త్వరలో రివీల్ కానున్నాయి. సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బచాత్ సేల్’ నేటితో ముగియనుంది. ఆగష్టు 15, రాఖీ సందర్భంగా మరో సేల్ వచ్చే అవకాశం ఉంది.
భారత జట్టుకు ఒలింపిక్ కమిటీ షాక్.. సెమీస్ నుంచి కీలక ప్లేయర్ ఔట్!
పారిస్ ఒలింపిక్స్ 2024లో సెమీస్‌కు చేరిన ఆనందంలో ఉన్న భారత హాకీ జట్టుకు ఒలింపిక్ కమిటీ భారీ షాక్ ఇచ్చింది. కీలక ప్లేయర్ అమిత్ రోహిదాస్‌పై కమిటీ ఓ మ్యాచ్ వేటు వేసింది. దాంతో మంగళవారం జర్మనీతో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌కు అతడు దూరం అయ్యాడు. ఆదివారం జరిగిన క్వార్టర్స్‌లో ఉద్దేశపూర్వకంగానే బ్రిటన్ ఆటగాడికి స్టిక్ తగిలించాడని డిఫెండర్ రోహిదాస్‌పై ఓ మ్యాచ్ నిషేధం విధించింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గోల్ కోసం బ్రిటన్ ప్లేయర్ విల్ కాల్నాన్‌తో అమిత్ రోహిదాస్ పోటీ పడ్డాడు. ఈ క్రమంలో రోహిదాస్ హాకీ స్టిక్.. కల్నాన్ ముఖానికి తాకింది. ఆన్-ఫీల్డ్ రిఫరీ దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించడంతో రోహిదాస్ ఎర్ర కార్డు అందుకుని బయటకు వెళ్లాల్సి వచ్చింది. భారత్ 10 మందితోనే బ్రిటన్‌ను ఎదుర్కొని అద్భుత విజయం సాధించింది.తాజాగా రోహిదాస్‌పై వేటు పడటంతో భారత హాకీ సంఘం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనలతో ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది. క్రీడ సమగ్రతను నిలబెట్టడానికి, భవిష్యత్‌లో జరగబోయే మ్యాచ్‌లనైనా సరిగ్గా జరిగేలా సమీక్షించాలని కోరింది.
బన్నీ, నాని మధ్య ఆసక్తికర సంభాషణ.. నెట్టింట వైరల్!
69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో ‘దసరా’ చిత్రానికి ఏకంగా ఆరు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ పరిచయ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. దసరా సినిమాలోని నటనకు గాను ‘నేచురల్ స్టార్’ నాని ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా అవార్డుతో దిగిన ఓ ఫొటోను నాని ఎక్స్‌లో షేర్ చేయగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్స్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అవార్డుతో దిగిన ఫొటోను నాని ఎక్స్‌లో షేర్ చేయగా.. దీనిపై అల్లు అర్జున్ స్పందించారు. ‘కంగ్రాట్స్ నాని. ఈ అవార్డుకు నువ్వు పూర్తి అర్హుడివి’ అని బన్నీ పేర్కొన్నారు. దీనికి నాని స్పందిస్తూ.. థ్యాంక్యూ బన్నీ. వచ్చే ఏడాది రూల్ చేసే వ్యక్తి మరెన్నో అవార్డులను ఇంటికి తీసుకువెళ్తాడని ఆశిస్తున్నా’ అని పుష్ప ది రూల్‌ను ఉద్దేశించి రిప్లై ఇచ్చారు. ఈ పోస్ట్‌పై అల్లు అర్జున్ స్పందించారు. ‘అది నిజమవుతుందని నేను ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. బన్నీ, నాని మధ్య ఆసక్తికర సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ సినిమా పూర్తి చేశారు. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఫిల్మ్ నెల 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా నటించగా.. ఎస్‍జే సూర్య కీలక పాత్ర చేశారు. మరోవైపు ‘పుష్ప ది రూల్’తో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. డిసెంబర్‌లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
పుష్ప నుండి అదిరిపోయే అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా..?
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సినిమాలలో పుష్ప -2 ఒకటి. అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఊహించిన దాని కంటే విజయం సాధించడం, నేషనల్ వైడ్‌గా సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్..తగ్గేదేలే అనే డైలగ్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ‘పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న ‘పుష్ప 2: ది రూల్’ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు హీరో, దర్శకుడు. ముందుగా అనుకున్న కథ లో చాలా మార్పులు చేర్పులు చేసి పుష్ప -2ను తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. పుష్ప -2 ఫస్ట్ విడుదల చేయగా రికార్డు స్థాయి వ్యూస్ తో టాలీవుడ్ ని షేక్ చేసింది. ఈ చిత్రం నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా ఎలాంటి ప్రమోషన్ కంటెంట్ విడుదలైన రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్లింది. కాగా ఇటీవల పుష్ప సినిమాపై అనేక రూమర్స్ వినిపించాయి. హీరో , దర్శకుడికి మధ్య విభేదాలు వచ్చాయని షూటింగ్ ఆపేశారని, డిసెంబరులో ఈ సినిమా రాదు అంటూ రక రకాల పుకార్లు షికార్లు చేసాయి. అవేవి నిజం కాదని, ప్రస్తుతం పతాక సన్నివేశాలు అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో ఉన్నారని. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు షూటింగ్ లో పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయి. అంతేకాదు రేపు థియేటర్‌లో ఈ పతాక సన్నివేశాలు గూజ్ బంప్స్ వచ్చే విధంగా ఉండబోతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు మరో బ్లాక్‌బస్టర్ కోసం వెయిట్ చేయడమే తరువాయి అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
సాయంత్రం సంచలనం సృష్టించబోతున్న దేవర.. మీరు రెడీనా..?
నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర. ‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీయార్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్య డిజాస్టర్ తర్వాత ఈ దఫా ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో పలు హిట్ సినిమాల దర్శకుడు కొరటాల శివ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాడు. భారీ యాక్షన్ చిత్రంగా రానున్న ఈ సినిమా ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా ఇటీవల కాలంలో దేవర సినిమా నుండి ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఒకింత నిరుత్సహానికి గురయ్యారు. ఏదైనా అప్ డేట్ ఇవ్వాలని నిర్మాణ సంస్థను టాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. దీంతో దేవర థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, దేవర నిర్మణ సంస్థ ఎన్టీయార్ ఆర్ట్స్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేసారు. దేవర నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. కాగా దేవర సెకండ్ సింగిల్ ను ఈ రోజు సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయబోతున్నట్టు తారక్, జాన్వీలతో కూడిన పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ‘మెల్లగా కొల్లగొట్టడం అంటే ఇది..ఇక తేలిపోవడమే మన వంతు’ అంటూ దేవర సెకండ్ సింగిల్ ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో ఈ పాటపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.