దువ్వాడ శ్రీనివాస్ కేసులో బిగ్ ట్విస్ట్.. దివ్వెల మాధురిపై కేసు నమోదు
రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. ఇప్పటికే రోజుకో మలుపు.. పూటకో ట్విస్ట్ ఈ కేసులో వెలుగు చూస్తుండగా.. ఇప్పుడు.. దివ్వెల మాధురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఆదివారం రోజు పలాస జాతీయ రహదారిపై దివ్వెల మాధురికి ప్రమాదం జరిగిన విషయం విదితమే.. ఈ యాక్సిడెంట్ లో మాధురి కారు నుజ్జునుజ్జైంది.. అయితే, తను కావాలనే ఆత్మహత్య యత్నంలో భాగంగా యాక్సిడెంట్ చేశానని.. తనకు ఎలాంటి చికిత్స అవసరం లేదంటూ ఆస్పత్రిలో మాధురి హంగామా చేసింది.. కానీ, నెగ్లిజన్స్ తో పాటు ఇతురుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించారంటూ చట్టం ప్రకారం ఆమెపై కేసు నమోదు చేశారు.. నూతన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం దివ్వెల మాధురిపై కేసు నమోదైంది.. మరోవైపు.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దివ్వెల మాధురికి విశాఖలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యసేవలు అందిస్తారు డాక్టర్లు.. తలకు తగిలిన గయానికి స్కానింగ్ తీశారు వైద్యులు.. చిన్న చిన్న బ్లడ్ క్లాట్ వున్నట్టుగా గుర్తించారు.. తీవ్రమైన తలనొప్పితో మాధురి ఇబ్బంది పడుతున్నారని వ్యక్తిగత సహాయకుల నుంచి అందుతోన్న సమాచారం.. కాగా, టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో వివాదానికి దివ్వెల మాధురి సెంటర్ పాయింట్‌గా మారిపోయిన విషయం విదితమే.. దువ్వాడ ఇంటి దగ్గర నాలుగు రోజులుగా భార్యాకూతుళ్లు ఆందోళన చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ దువ్వాడ వాణి.. మరోవైపు మాధురిగా కత్తులు దూసుకుంటున్నారు.. ఈ సమయంలో మాధురి రోడ్డు ప్రమాదానికి గురికావడం సంచలనంగా మారింది.. ఆగి ఉన్న కారును ఆమె కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధురికి గాయాలవడంతో ముందుగా పలాస ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే..
అక్కాచెల్లెళ్ల కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
రాజమండ్రిలో సంచలనం కలిగించిన ఇద్దరు బాలికల కిడ్నాప్ కేసును తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు.. కిడ్నాపర్ మారోజు వెంకటేష్ పోలీసులకు చిక్కాడు. కిడ్నాప్ కు గురైన అక్కాచెల్లెళ్లైన ఇద్దరు బాలికలు సేఫ్‌గా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.. అయితే, 20 రోజుల క్రితం జులై 22వ తేదీన రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో బాలికలు అపహరణకు గురయ్యారు. కిడ్నాప్ చేసిన విజయనగరం జిల్లాకు చెందిన మారోజు వెంకటేష్ ను. అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులకు వచ్చిన సమాచారం ఆధారంగా నాలుగు ప్రత్యేక బృందాలతో విజయనగరం, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ లో గాలింపు చర్యలు చేపట్టారు.. మొత్తంగా కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని.. ఆ ఇద్దరు చిన్నారులకు విముక్తి కల్పించారు.. మరికొద్ది గంటల్లో కిడ్నాపర్‌ను పోలీసులు అరెస్టు చూపించే అవకాశం ఉంది.. మరోవైపు, కిడ్నాపర్ పట్టుబడటంతో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.. విజయనగరం జిల్లాకు చెందిన మారోజు వెంకటేష్ మోసగాడని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.. విజయనగరంలో ఒక యువతిని వివాహం చేసుకున్న వెంకటేష్.. భార్య ఉండగానే మరో మైనర్ బాలికతో ప్రేమాయణం నడిపాడట.. ఇక, ప్రియురాలును చెల్లిగా పరిచయం చేసి 3 నెలల క్రితం ధవళేశ్వరంలో ఓ ఇంట్లో కాపురం పెట్టాడట.. ప్రియురాలును గత నెల 22వ తేదీన రాజమండ్రిలో బస్సు ఎక్కించి విజయనగరం జిల్లాలోని ఆమె ఇంటికి పంపించిన మోసగాడు.. ధవళేశ్వంలో తాను ఉంటున్న ఇంటిలోనే అద్దెకు ఉన్న ఒడిశాలోని బరంపూర్ కు చెందిన ఇద్దరు మైనర్లను అపహరించాడు..
తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదు.. మంత్రి వార్నింగ్
తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదు అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.. తిరుపతిలో వకుళామాత అమ్మవారిని మంత్రి గోట్టిపాటి రవితో కలిసి దర్శించుకున్న మంత్రి అనగాని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులున్నారని పేర్కొన్నారు.. అయితే, తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదన్న ఆయన.. మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ వేగంగా జరుగుతోందన్నారు.. పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో భూములకు సంబంధించిన వందల ఫైళ్లు దొరికాయి.. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.. ఇక, పెద్దిరెడ్డి బాధితులు వేలసంఖ్యలో ఉన్నారని తెలిపారు మంత్రి సత్యప్రసాద్.. పెద్దిరెడ్డి కుటుంబం వందల ఎకరాల భూకబ్జాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయన్న ఆయన.. తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో బాధితులు ఉన్నారని తెలిపారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను బయటపెడతాం.. ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు.. ఇక, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెవిన్యూ సదస్సులు పెట్టామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్..
విద్యుత్ ఛార్జీల పెంపునకు అదే కారణం.. తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం..
కొత్త విద్యుత్ ఉత్పత్తి తీసుకురాక పోవడం వల్ల గతంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి.. అంతేకాదు 6 నుంచి 7శాతం విద్యుత్ వాడకం పెరుగుతోంది.. తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తోందన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 24 గంటల పాటు వినియోగదారులకు విద్యుత్ ను అందిస్తాం.. రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని స్పష్టం చేశారు.. ఒక్క మెగా వాట్ కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తిని తీసుకురాలేదు అంటూ గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఆయన.. నూతన విద్యుత్ ప్లాంట్లు, సోలార్ విద్యుత్, రైతులకు కుసుమ్ యోజన పథకాన్ని ఏ విధంగా అందించాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నాం అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.. మరోవైపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఆయన వ్యక్తిగతం.. మేమెక్కడా శ్రీనివాస్ ను విమర్శించడం లేదన్నారు మంత్రి గొట్టిపాటి.. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వైసీపీ ముఖ్య నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు.. వైసీపీ నేతలు మాపై బురదజల్లాలని చూస్తున్నారన్న ఆయన.. కేంద్రంలో మమ్మల్ని దోషులుగా చూపించాలని ప్రయత్నిస్తున్నారు అంటూ వైసీపీపై మండిపడ్డారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి అని స్పష్టం చేశారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. కూటమి అభ్యర్థి ఖరారు..!
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.. ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో గండి బాజ్జీ.. పీలా గోవింద్, బైరా దిలీప్ ముందు వరుసలో ఉన్నారు.. అయితే, ఈ రోజు సాయంత్రం లోగా టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కూటమి అభ్యర్థిని ప్రకటించనున్నారని తెలుస్తోంది.. మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దీంతో.. ఈ రోజు వైసీపీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ వేయనున్నారు. ఇక, వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 838 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో వైసీపీకి 598.. కూటమికి 240 వరకు సంఖ్యాబలం ఉంది. అయితే, ప్రతిపక్ష పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే అధికార పార్టీకి టచ్‌లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.. మ్యాజిక్ ఫిగర్ 425 కాగా.. కనీసం 500 ఓట్ల మద్దతు లభిస్తేనే ఈ ఎన్నికల్లో సునాయసంగా గెలుపు సాధ్యం అవుతుంది. కానీ, టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడంపై వైసీపీ మండిపడుతోంది.. సంఖ్యాబలం లేకపోయినా.. ఎన్నికల బరిలోకి దిగడం అంటే.. కచ్చితంగా ప్రలోభాలకు గురిచేయడం.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భయపెట్టడంలో భాగమేనని ఆరోపిస్తోంది వైసీపీ.. మరోవైపు రాజకీయంగా ఎదుర్కోవడానికి పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యింది.. మాజీ మంత్రులు, పార్టీ సీనియర్లు ఇప్పటికే తమ ఓటర్లను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు.
కవితకు నో బెయిల్.. విచారణ ఆగస్టు 20 కి వాయిదా..
నేడు సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరిగింది. కవిత పిటిషన్ పై ఈడి సీబిఐ లకు నోటీసులు సుప్రీం కోర్టు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ ఆగస్టు 20 కి వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. లిక్కర్ ఈడి, సీబిఐ బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత పిటిషన్ ను జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వ నాథన్ ల ధర్మాసనం విచారించింది. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి హాజరయ్యారు. రోహిత్గి మహిళ, రాజకీయ నాయకురాలు. అయితే ఇవాళ సుమారు 463 సాక్షులను సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించారు. ఐదు నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారు.
ఐఏఎస్ స్మితా సబర్వాల్ పై హైకోర్టులో పిటిషన్..
ఐఏఎస్ స్మితా సబర్వాల్ వాఖ్యల వ్యవహారం హై కోర్టు కు చేరింది. దివ్యాంగుల పై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వాఖ్యాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. సామాజికవేత్త వసుంధర పిటిషన్ దాఖలు చేశారు. యూపీఎస్సీ చైర్మన్ కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ పై హైకోర్టు విచారించింది. పిటిషనర్ కు ఉన్న అర్హతను హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ ఒక వికలాంగులారని అడ్వకేట్ తెలిపింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశింది.
ట్రిపుల్ స్పీడ్‌తో పని చేయండి… రైతులు కొత్త రకాలను అనుసరించాలని మోడీ సూచన
ఆగస్టు 11 ఆదివారం నాడు రైతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంలో రైతులకు ఆయన పెద్ద కానుకను అందించారు. ప్రధాని మోదీ పూసా ఇనిస్టిట్యూట్‌కు చేరుకున్నారు. అక్కడే రైతులతో మాట్లాడారు. ప్రధాన మంత్రి 109 కొత్త రకాల విత్తనాలను ప్రారంభించారు. ఇవి అధిక దిగుబడినిచ్చేవి. బయోఫోర్టిఫైడ్ విత్తనాలు కూడా. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. అయితే, రైతులతో మాట్లాడటానికి మోడీ పూసా ఇనిస్టిట్యూట్‌కు చేరుకున్నప్పుడు, భారీ వర్షం ప్రారంభమైంది. ఆ తర్వాత అధికారులు చర్చలను రద్దు చేయాలా ప్రధానమంత్రిని కోరారు. అయితే వర్షం ఉన్నప్పటికీ రైతులతో మాట్లాడాలని పీఎం మోడీ పట్టుబట్టారు. రైతులతో సంభాషించిన సందర్భంగా ప్రధాని మోడీ వ్యవసాయంలో పరిశోధనలు, ఆవిష్కరణల ప్రాముఖ్యతను ఎత్తిచూపారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన “జై జవాన్, జై కిసాన్”.. తరువాత అటల్ జీ జోడించిన “జై విజ్ఞాన్” నినాదాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూనే తాను నినాదానికి “జై అనుసంధాన్” ఎలా జోడించానో కూడా ప్రధాని నొక్కిచెప్పారు.
హర్ ఘర్ తిరంగ సర్టిఫికేట్ ఎలా పొందాలంటే..?
భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారం ఆగస్టు 9న ప్రారంభమైంది. ఇది ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రారంభించబడిన ఈ కార్యక్రమం విస్తృతంగా పాల్గొనడం ద్వారా జాతీయ ఐక్యతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ప్రచారంలో చెప్పుకోదగ్గ హైలైట్ ‘తిరంగా బైక్ ర్యాలీ’ ఆగస్టు 13న ఢిల్లీలో జరగనుంది. ర్యాలీలో పార్లమెంటు సభ్యులు పాల్గొంటారు. ఇంకా ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం నుండి ప్రారంభమై మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం వద్ద ముగుస్తుంది. ఈ మార్గం ఇండియా గేట్ వంటి ఐకానిక్ ల్యాండ్‌మార్క్ ల గుండా వెళుతుంది. ఇది దేశభక్తి ప్రదర్శనను చూపబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంలో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించారు. ఆగస్టు 9న, ‘హర్ ఘర్ తిరంగ’ను ఒక చిరస్మరణీయ కార్యక్రమంగా మార్చాలని పౌరులను కోరుతూ X లో పోస్ట్ చేశాడు. త్రివర్ణ పతాకంతో ప్రొఫైల్ చిత్రాలను అప్‌డేట్ చేయాలని, ప్రచారానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ harghartiranga.comలో సెల్ఫీలను షేర్ చేసుకోవాలని కూడా మోడీ సూచించారు.
సీబీఐ కేసులో త్వరగా విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరిన కేజ్రీవాల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఆరోపించిన కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్ట్, రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిబిఐ అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేశారు. దీంతో పాటు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీఎం కేజ్రీవాల్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై త్వరగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ సిఎం కేజ్రీవాల్ తరఫు న్యాయవాదిని తనకు ఇమెయిల్ పంపాలని కోరారు. సిఎం కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, సియు సింగ్‌లు సిబిఐ అరెస్టు, రిమాండ్‌పై సవాల్ చేస్తూ సిజెఐ ముందు వాదనలు వినిపించారు. జూన్ 26న తీహార్ జైలు నుంచి ఆయన్ను సీబీఐ అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని సీఎం పేర్కొన్నారు.
నీరజ్ చోప్రాతో మను బాకర్ పెళ్లి.. ఒట్టు వేయించుకున్న వీడియో వైరల్!
2024 పారిస్ ఒలింపిక్స్ పతక విజేతలు నీరజ్ చోప్రా, మను బాకర్‌లకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో మను, నీరజ్ చాలా సన్నిహితంగా మాట్లాడుకోవడం.. ఇద్దరిని ఫోటో తీస్తున్న తల్లి సుమేధను మను వద్దని చెప్పడం పలు సందేహాలకు తావిస్తోంది. నీరజ్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన మను తల్లి సుమేధ.. బల్లెం వీరుడితో తలపై ఒట్టు వేయించుకోవడం ఇక్కడ కొసమెరుపు. వీడియోలు చూసిన నెటిజెన్ల మదిలో నీరజ్ చోప్రా, మను బాకర్‌లు మంచి స్నేహితులా? లేదా రిలేషన్‌లో ఉన్నారా? అనే ప్రశ్నలు మెదులుతున్నాయి. కొందరు అయితే మను, నీరజ్ పెళ్లి ఎప్పుడు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కూతురిని పెళ్లి చేసుకోవాలని నీరజ్‌ను సమేధ కోరినట్లు మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా నీరజ్‌తో మను తల్లి సుమేధ ఏం మాట్లాడారు?, ఎందుకు ఒట్టు వేయించుకున్నారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నీరజ్, మనుల పేర్లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
దసరా – 2లో దడ పుట్టించే క్యారక్టర్ లో కనిపించబోతున్న నాని..
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. గతేడాది నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు భారీ విజయం సాధించాయి. దాంతో పాటుగా చిత్ర దర్శకులకు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం తెచ్చిపెట్టాయి ఆ రెండు సినిమాలు. ఆ జోష్ లోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. నానితో దసరా సినిమాను తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాగా నిలవనుంది. దాదాపు రూ.100 కోట్లతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు నిర్మాతగా సుధాకర్ చెరుకూరి. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. నాని ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ చేయనున్నాడని అందులో ఒక పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కథా నేపథ్యం 80వ దశకంలోని సికింద్రాబాద్ బ్యాడ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా భారీ, భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. నిజమైన నాయకుడికి ఐడెంటిటీ అవసరం లేదన్న స్లోగన్ ను ఈ సినిమా పోస్టర్ ను డిజైన్ చేశారు మేకర్స్. స్లోగన్ కు తగ్గట్టుగానే సినిమాలో చాలా వేరియేషన్స్ వుంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ అంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు. ప్రియాంకా మోహన్, SJసూర్య ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా సరికొత్త కథనంతో రానుంది. ఈ సినిమా ఆగష్టు 29న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.
బెజవాడలో సందడి చేసిన హీరో, హీరోయిన్..
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘తంగలాన్’. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించారు. హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రానున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్ ను పెంచుతున్నాయి. కాగా, తంగలాన్ ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న ప్రేక్షుకుల ముందుకు రానుంది . ఈ క్రమంలోనే విక్రమ్, మాళవిక విజయవాడలోని ఫేమస్ హోటల్ ‘బాబాయ్ హోటల్’ లో టిఫిన్ చేస్తూ ప్రేక్షకులతో సెల్ఫీలు దిగుతూ తంగలాన్ ను ప్రమోట్ చేస్తున్నారు. కర్ణాటకలోని గోల్డ్ ఫీల్డ్స్ లో కొందరు కార్మికుల జీవితాలలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం తంగలాన్. ఈ సినిమాలో కోలార్ ప్రాంతంలోని ఓ తెగకు నాయకుడిగా విక్రమ్ కనిపించనున్నాడు. విక్రమ్ తో సహా ఈ చిత్రంలోని నటీనటులందరూ కూడా డీగ్లామరైజ్డ్ గా కనిపించనున్నారు. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కు భారీ హిట్టు దక్కి చాలా కాలం అవుతోంది. ఈ సినిమాపై విక్రమ్ తో పాటు ఆయన అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర అలరిస్తుందో మరి కొద్ది రోజుల్లో తేలనుంది.