Saad Rizvi Missing: పాకిస్థాన్‌లో ఇటీవల తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP) మద్దతుదారులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో TLP ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనల ఫలితంగా పౌరులు, పోలీసు అధికారులు మరణించారు. ఇది జరిగిన తరువాత TLP చీఫ్ సాద్ రిజ్వి అదృశ్యం అయినట్లు సమాచారం. వాస్తవానికి ఆయన కోసం ప్రస్తుతం దాయాదీ పోలీసులు అన్వేషణలో నిమగ్నమై ఉన్నారు. ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారు..?
READ ALSO: YS Jagan: చంద్రబాబు గారూ.. ఒక్క దీపం అయినా వెలిగిందా?
పీఓకేకు పారిపోయిన టీఎల్‌పీ ఛీప్..
పాకిస్థాన్‌కు చెందిన డాన్ న్యూస్ ప్రకారం.. పంజాబ్ అధికారులు తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్థాన్ (TLP) చీఫ్ సాద్ రిజ్వీ, ఆయన సోదరుడు అనాస్‌లను గుర్తించినట్లు చెబుతున్నారు. మురిడ్కేలో పోలీసుల అణిచివేత తర్వాత వాళ్లు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)కి పారిపోయినట్లు సమాచారం. పంజాబ్ పోలీసులు ఈ సమాచారాన్ని పీఓకే అధికారులతో పంచుకున్నారని, టీఎల్‌పీ నాయకులను పట్టుకోవడంలో వారి సహాయం కోరారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ వార్తలకు ముందు పార్టీ చీఫ్ అదుపులో ఉన్నారని కొంతమంది టీఎల్‌పీ ప్రముఖులు చేసిన వాదనలతో దేశంలో పుకార్లు వేగంగా వ్యాపించాయి.
పలువురు పాక్ అధికారులు మాట్లాడుతూ.. పంజాబ్ పోలీసులు, ఇతర బృందాలకు చెందిన అనేక బృందాలు సాద్ రిజ్వి, ఆయన సోదరుడిని గుర్తించే పనిని ఉన్నాయని పేర్కొన్నారు . వీళ్లిద్దరూ మొదట మురిడ్కేలోని నిరసన శిబిరం నుంచి నడుచుకుంటూ వెళుతూ కనిపించారని, ఆ తర్వాత వాళ్లు మోటార్ సైకిళ్లపై పారిపోయారని వాళ్లు చెప్పారు. ఆ సమయంలో TLP చీఫ్, ఆయన సోదరుడు మోటార్ సైకిల్ పై సమీపంలోని రోడ్ల వైపు వెళుతున్నారని ప్రత్యేక బృందాలకు అత్యవసర సందేశం వచ్చిందన్నారు. అయితే వాళ్లిద్దరూ ఈ ప్రత్యేక బృందాల నుంచి తప్పించుకున్నట్లు సమాచారం.
ఎవరు.. సాద్ రిజ్వీ?
TLP అధ్యక్షుడు సాద్ రిజ్వీ. ఆయనకు 31 సంవత్సరాలు ఉంటాయి. ఆయన తన తండ్రి మరణం తర్వాత 2020లో మౌలానా సాద్ పార్టీ నాయకత్వాన్ని చేపట్టారు. పాకిస్థాన్ దైవదూషణ చట్టాలను, ప్రవక్త గౌరవాన్ని కాపాడే వ్యక్తిగా సాద్ తనను తాను దేశంలో ప్రచారం చేసుకున్నారు. ఇటీవల TLP పాకిస్థాన్‌లో ప్రకంపనలు సృష్టించింది. TLPకి చెందిన వేలాది మంది సభ్యులు లాహోర్ వీధుల్లోకి వచ్చి ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు చేపట్టారు. గాజా శాంతి ఒప్పందం పాలస్తీనాకు ద్రోహం అని, అందులో పాకిస్థాన్ పాల్గొనకూడదని TLP నిరసనకారులు పేర్కొన్నారు. ఇదే సమయంలో పంజాబ్ ప్రభుత్వం అధికారికంగా TLP పై నిషేధాన్ని సిఫార్సు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదనను సమర్పించింది. ఇంతలో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) TLP చీఫ్ సాద్ రిజ్వికి చెందిన సుమారు 95 బ్యాంకు ఖాతాలను గుర్తించింది. వీటిలో 15 వడ్డీ ఖాతాలు, FIA సంబంధిత బ్యాంకుల నుంచి ఈ ఖాతాల గురించి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం.
READ ALSO: China – US: అమెరికాను దెబ్బ కొట్టిన చైనా.. ఏడేళ్లలో మొదటి సారి.. !