China – US: యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తన సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో అమెరికాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అగ్రరాజ్యాన్ని ఇంతలా దెబ్బ కొట్టిన దేశం ఏంటో తెలుసా? చైనా.. అవును డ్రాగన్ దేశం అమెరికాను దెబ్బ కొట్టింది.. ఏ విధంగా అనుకుంటున్నారు.. ప్రపంచంపై వాణిజ్యం విషయంలో ఒత్తిడి తెస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు చైనా మామూలు దెబ్బ కొట్టలేదు. గత ఏడు ఏళ్లలో మొదటిసారిగా డ్రాగన్ దేశం అగ్రరాజ్యం నుంచి సోయాబీన్‌లను కొనుగోలు చేయలేదు. సెప్టెంబర్‌లో చైనా – యుఎస్ నుంచి సోయాబీన్‌లను దిగుమతి చేసుకోలేదు. వాస్తవానికి నవంబర్ 2018 తర్వాత యూఎస్ నుంచి చైనాకు సోయాబీన్ దిగుమతులు సున్నా కావడం ఇదే మొదటిసారి.
READ ALSO: YCP ZPTC Murder: వైసీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్య!
ఏం జరిగిందంటే..
సెప్టెంబర్‌లో అమెరికా నుంచి దిగుమతులు 1.7 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి సున్నాకి పడిపోయాయని చూపించే డేటాను చైనా తాజాగా పంచుకుంది. అమెరికా దిగుమతులపై చైనా అధిక సుంకాలు విధించడం వల్ల, గతంలో పండించిన యుఎస్ సామగ్రిని, అంటే ఓల్డ్-క్రాప్ బీన్స్‌ను ఇప్పటికే వర్తకం చేయడం వల్ల ఎగుమతులు తగ్గాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. వాస్తవానికి ప్రపంచంలోనే అతిపెద్ద సోయాబీన్ దిగుమతిదారు దేశం చైనా అని క్యాపిటల్ జింగ్డు ఫ్యూచర్స్ నిపుణుడు వాన్ చెంగ్జీ పేర్కొన్నారు. కానీ అమెరికా నుంచి దిగుమతులు తగ్గడానికి ప్రధానంగా సుంకాలు కారణంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధారణ సంవత్సరంలో పాత పంట నుంచి కొన్ని బీన్స్ ఇప్పటికీ మార్కెట్‌లోకి వస్తున్నాయి.
కస్టమ్స్ డేటా ప్రకారం.. గత నెలలో బ్రెజిల్ నుంచి దిగుమతులు 29.9% పెరిగి 10.96 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి, ఇది చైనా మొత్తం నూనెగింజల దిగుమతుల్లో 85.2%, అలాగే అర్జెంటీనా నుంచి దిగుమతులు 91.5% పెరిగి 1.17 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి, ఇది మొత్తం దిగుమతుల్లో 9% అని నివేదికలు వెల్లడించాయి.
అగ్రరాజ్యానికి బిలియన్ల డాలర్ల నష్టం!
చైనా సోయాబీన్ దిగుమతులు సెప్టెంబర్‌లో 12.87 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. ఇది ఇప్పటివరకు రెండవ అత్యధిక స్థాయి అని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ సంఖ్యలో అమెరికన్ సోయాబీన్ల వాటా లేవు. చైనా, పలు ఇతర దేశాలు US నుంచి సోయాబీన్‌లను కొనుగోలు చేయడానికి బదులుగా బ్రెజిల్, అర్జెంటీనా దేశాల నుంచి కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో చైనా, ఇతర దేశాలతో తమ వాణిజ్య ఒప్పందం విఫలమైన కారణంగా అమెరికన్ రైతులు బిలియన్ల డాలర్ల నష్టాలను మూటగట్టుకుంటున్నారు.
బీజింగ్‌కు చెందిన అగ్ద్రదార్ కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు జానీ జియాంగ్ మాట్లాడుతూ.. యూఎస్-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోతే వచ్చే ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య చైనాలో సోయాబీన్ సరఫరా తక్కువగా ఉండవచ్చని అంచనా వేశారు. అగ్రరాజ్యం సుంకాల బెదిరింపులు, ఎగుమతి నియంత్రణల తర్వాత, బీజింగ్ – వాషింగ్టన్ మధ్య వాణిజ్య చర్చలు మళ్లీ ఊపందుకున్నట్లు సమాచారం. మళ్లీ సోయాబీన్‌లపై ఒప్పందం కుదురుతుందని ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
READ ALSO: BrahMos 800km Missile: పాకిస్థాన్‌కు భారత్ అదిరిపోయే దీపావళి షాక్ .. కొత్త బ్రహ్మోస్ రానుంది!