IND vs AUS: ఈనెల 23న విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ-20 మ్యాచ్ జరగనుంది. టీ-20 మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల అమ్మకాలు 15, 16 తేదీల్లో పేటీఎం (ఇన్‌సైడర్.ఇన్) ద్వారా ఉ. 11.00 గం. నుంచి జరుగుతాయని ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథరెడ్డి తెలిపారు. అలాగే 17, 18 తేదీల్లో ఆఫ్‌లైన్‌లో ఏసీఏ-వీడీసీఏ స్టేడియం, ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలలో ఉదయం పది గంటల నుంచి ఆఫ్‌లైన్ టికెట్లు విక్రయిస్తారని ఆయన తెలిపారు. ఆఫ్ లైన్‌లో ఒక్కొరికి రెండు టిక్కెట్లు మాత్రమే ఇస్తామన్నారు. కలెక్టర్ అనుమతితో రెవెన్యూ అధికారులు సమక్షంలో పారదర్శకంగా టికెట్లు విక్రయిస్తారన్నారు. రేపటి నుంచి రెండు రోజులు ఆన్ లైన్‌లో పేటిఎం ఇన్‌సైడర్.ఇన్ వెబ్ సైట్‌లో 10,500 వరకూ టిక్కెట్లు విక్రయాలు జరుపుతామన్నారు.17,18 తేదీల్లో ఆఫ్ లైన్‌లో 11,500 టిక్కెట్లు విక్రయాలు జరుగుతాయన్నారు. బీసీసీఐ షరతులు ప్రకారం కాంప్లిమెంటరిగా 5,300 టికెట్లు జారీ చేస్తామన్నారు.
Also Read: MP Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి..
ఈ మ్యాచ్‌కోసం 1500 మంది పోలీసులతో బందోబస్తు సిద్ధం చేశామని డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇతర జిల్లాలకు చెందిన పోలీసులు, స్పెషల్ ఫోర్స్ పోలీసులు ఉంటారని ఆయన తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టేడియంలో సీట్లలోకి చేరుకోవాలని క్రీడాభిమానులకు సూచించారు. మ్యాచ్ పూర్తయ్యాక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సహకరించాలన్నారు. టికెట్స్ కలర్ జిరాక్స్‌లు తీసి ఎవరికైనా విక్రయిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించామని ఆయన చెప్పారు. బౌన్సర్లకి అనుమతి ఇచ్చే ముందు వారి క్రిమినల్ డేటా పరిశీలించి అనుమతి ఇస్తామన్నారు. బయట వ్యక్తులకు స్టేడియంలో అనుమతి కావాలంటే స్పెషల్ బ్రాంచ్ అధికారులతో ఎంక్వయిరీ చేసి ఐడీ కార్డు జారీ చేస్తామని డీసీపీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.