Thummala Nageswara Rao: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. పయనంపై ఆసక్తి రేపుతోంది. గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. గులాబీ బాస్ కేసీఆర్.. పాలేరు సీటుని కందాల ఉపేందర్ రెడ్డికి ఇచ్చారు. తుమ్మలకు మొండిచేయి చూపించారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పై తుమ్మల అనుచర వర్గం రగిలిపోతోంది. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్న తుమ్మల నాగేశ్వరరావు.. రేపు ఖమ్మం జిల్లాకి రానున్నారు. తుమ్మల రాక సందర్భంగా భారీ కార్లతో ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బల ప్రదర్శన చేయనున్నారు.
Read Also: YouTube: మ్యూజిక్ లవర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో కొత్త ఫీచర్..
తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకొస్తే స్వాగతిస్తామన్నారు కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద సముద్రం లాంటిదన్న ఆమె.. అందరూ ఇక్కడి నుంచి ఎదిగిన వారేనన్నారు. మోసపు మాటలతో గద్దెనెక్కిన కేసీఆర్ 9 సంవత్సరాలుగా.. రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని ఆయన అనుచరవర్గం ఒత్తిడి చేస్తోంది. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి బలంగా లేకపోవడంతో.. తుమ్మల హస్తం పార్టీ నుంచి పోటీ చేస్తారని ఆయన వర్గం భావిస్తోంది. పాలేరు లేదా ఖమ్మం నుంచి.. ఎక్కడి నుంచయినా సరే పోటీ చేయాలని కోరుతుంది. దీనిపై తుమ్మల నాగేశ్వరరావు మాత్రం నోరు మెదపలేదు. తాను ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని.. తన అనుచర వర్గానికి చెప్పేశారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న దానిపై తుమ్మల క్లారిటీ ఇవ్వలేదు. తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీ వైపు వెళ్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.